అదో మధుర జ్ఞాపకం: మహేష్ బాబు
హైదరాబాద్ : తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, జీవితంలో తండ్రి కావడం మధురమైన జ్ఞాపకమని ప్రముఖ సినీహీరో, ప్రిన్స్ మహేష్‌బాబు అన్నారు. తాను తండ్రినైన క్షణంలో మరచిపోలేని అనుభూతులు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గౌతమ్ పుట్టినప్పుడు చేతుల్లోకి వాడిని తీసుకున్న క్షణాలను మాటల్లో వర్ణించలేనన్నారు. మన చేతుల్లో చిన్నారులు కేరింతలు కొడుతుంటే ఆ ఆనందానికి వెల కట్టలేమన్నారు.
రెయిన్‌బో ఆస్పత్రిలో గౌతం, కూతురు సితార పుట్టినప్పుడు తాను పది రోజుల వరకు అక్కడి నుంచి ఇంటికి వెళ్లలేకపోయానన్నారు. సినిమా జీవితాన్ని కాసేపు పక్కనబెట్టి పిల్లలే లోకంగా ఆ సమయాన్ని ఆస్వాదిస్తుంటానని చెప్పారు. తాను పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంట్లోని పిల్లలతో గడుపుతానని, ఆ క్షణంలో తాను కూడా పిల్లాడినైపోతానని మహేష్‌బాబు అన్నారు.
ఆ క్షణంలో మానసిక, శారీరక ఒత్తిడి ఒక్కసారిగా పోతుందన్నారు. పిల్లలతో గడిపేందుకు తండ్రికి ప్రత్యేకంగా తండ్రుల దినోత్సవం అవసరం లేదన్నారు. 'శ్రీమంతుడు' చిత్రం బాగా వచ్చిందని, ఇందులో శృతిహాసన్ చాలా బాగా నటించిందని ప్రశంసించారు. తన కొత్త సినిమా మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందని, తనకు బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదన్నారు.