’శ్రీమంతుడు’కి కోర్టు సమన్లు
హైదరాబాద్: హిట్ చిత్రంగా పేరొంది.. మహేశ్ బాబు కెరీర్‌లోనే గొప్ప చిత్రంగా నిలిచిన ‘శ్రీమంతుడు’కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తాను రాసిన నవలను ఆధారంగా శ్రీమంతుడు చిత్రంగా మలిచారని శరత్ చంద్ర అనే నవలాకారుడు వేసిన పిటిషన్‌ను ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సువర్ణ రాజు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి సమన్లు జారీ చేశారు.
ఎంబీ క్రియేషన్ అధినేత, మైత్రిమూవీస్ అధినేత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివకు మంగళవారం కోర్టుల సమన్లు పంపించింది. గతంలో ఇదే కేసు విషయంలో సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశారు. హిందీలో ఇదే చిత్రాన్ని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తీయబోతున్న విషయం తెలిసి ఇంజక్షన్ ఆర్డర్ కోసం సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు.
ఇదిలా ఉండగానే తాజాగా క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. స్వాతి మాస పత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే శీర్షికతో రాసిన నవలను శ్రీమంతుడు చిత్రంగా మలిచారని ఆరోపిస్తూ కుట్రపూరిత నేరం ఐపీసీ 120బి కింద కేసు నమోదు చేయాలని కోరుతూ క్రిమినల్ కోర్టులో శరత్‌చంద్ర కేసు వేశారు. దీని ప్రకారమే తాజాగా సమన్లు జారీ చేశారు.