criminal court
-
TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు. -
ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాసకర్త, సౌదీ అరేబియా విమర్శకుడు జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్ పోస్ట్‌లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది. -
వారి కేసులపై జిల్లాకొక స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల విచారణకు బిహార్, కేరళ రాష్ట్రాల్లో జిల్లాకొకటి చొప్పున ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విధించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిల్‌ను కోర్టు విచారించింది. తమ ఉత్తర్వులకు సమ్మతి తెలుపుతూ 14లోపు నివేదికలు పంపాలని కేరళ, బిహార్ హైకోర్టులను ఆదేశించింది. ఇప్పటికే స్పెషల్ కోర్టుల్లో ఉన్న కేసులను ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసే కోర్టులకు పంపాలని కోరింది. జిల్లాల్లో అవసరమైనన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఈ రెండు రాష్ట్రాల హైకోర్టులకు కల్పించింది. దీంతోపాటు ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తెలపాలంటూ అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తన వద్ద ఉన్న వివరాలను కోర్టు ముందుంచారు. దీని ప్రకారం.. ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలపై దేశ వ్యాప్తంగా 4,122 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2,324 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించినవి కాగా 1,675 మంది మాజీలపై ఉన్నవి. ట్రయల్ కోర్టుల విచారణలో ఉన్న 264 కేసులపై హైకోర్టులు స్టే విధించాయి. పెండింగ్ కేసులున్న ప్రముఖుల్లో పంజాబ్, కర్ణాటక సీఎంలు అమరీందర్, కుమారస్వామితోపాటు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేరళ మంత్రి ఎంఎం మణి, ఎన్సీపీకి చెందిన గుజరాత్ ఎమ్మెల్యే కేఎస్ జడేజా ఉన్నారు. సీఎం కుమారస్వామిపై ఆరోపణలు రుజువైతే యావజ్జీవ కారాగారం ఖాయం. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై ఉన్న 9 కేసుల్లో 8 కేసులు రుజువైతే జీవిత కాల జైలు శిక్ష, ఒక కేసులో ఏడేళ్ల కారాగారం విధించే అవకాశముంది. యడ్యూరప్పపై ఉన్న 18 కేసుల్లో 14 కేసులు యావజ్జీవానికి అవకాశమున్నవే. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కోర్టుల్లో ఉన్న 109 కేసుల్లో 38, తెలంగాణలోని 99 కేసుల్లో 66 కేసులు స్పెషల్ కోర్టులకు బదిలీ అయ్యాయి. వీటిని సెషన్స్ జడ్జి స్థాయి న్యాయాధికారి విచారిస్తున్నారు. ఈ కేసుల సత్వర విచారణకు అదనంగా 51 స్పెషల్ కోర్టులు అవసరమవుతాయి. -
‘అడ్డు’పడ్డారో బుక్కయ్యారే!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పాదచారులకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లపై నడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అసలు ఫుట్‌పాత్‌లనేవి ఉండాలి కదా! గ్రేటర్లో ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న కాలిబాటలను వ్యాపారులు, దుకాణదారులు ఆక్రమించుకున్నారు. మరికొందరు తమ ఆస్తి అన్నట్టు చిరు వ్యాపారులకు అద్దెకు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. పాదచారులతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారాలకు అద్దెకిస్తూ అక్రమార్జన పొందుతున్న వాణిజ్య సముదాయాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న వాణిజ్య సముదాయాల ముందున్న ప్రభుత్వ భూమిని, ఫుట్‌పాత్‌ను హాకర్లకు కిరాయికి ఇస్తుండడంటో చాలా ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఐటీ కారిడార్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. దీంతోఇక్కడ ప్రయాణికులు నడిచే దారిలేక నిత్యం నరకం చూస్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నిత్యం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలను జేసీబీ యంత్రాలతో శని,ఆదివారాల్లో కూల్చివేశారు. రోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతా చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఐఐటీ కూడలి వరకు ఫుట్‌పాత్‌ల అక్రమణతో రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతోపాటు వాహన ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అందుకే ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పారు. ఇందిరానగర్‌లో చాలా మంది వాణిజ్య సముదాయాల యజమానులు తమ భవనం ముందున్న ఉన్న ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని వీధి వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారని, దీంతో ఆక్రమణలు మితిమీరాయని గుర్తించామన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా రహదారులు, ఫుట్‌పాత్‌లు అక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తమ దృష్టికి వచ్చిన వాటితో పాటు స్థానికులు, వాహనచోదకుల నుంచి అందే ఫిర్యాదులతో ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడతామన్నారు. వాహనదారులతో పాటు పాదచారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రహదారుల వెంట వీధి వ్యాపారాలు చేసే వారు పద్ధతి మార్చుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సూచించారు. ఐటీ ప్రాంతంలోనే ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండడంతో తొలుత ఈ ప్రాంతంపై దృష్టి పెట్టామన్నారు. శంషాబాద్, బాలానగర్ జోన్లలోనూ సాఫీ ట్రాపిక్కు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నామని వివరించారు. -
పీపీల కొరతతో విచారణకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని క్రిమినల్ కోర్టుల్లో తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) లేకపోవడం నేర విచారణ ప్రక్రియకు విఘాతంగా మారుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మూడు నాలుగు కోర్టులకు ఇన్‌చార్జీలుగా నియమిస్తుండటం వల్ల పీపీలపై పనిభారం పెరిగి కేసుల విచారణపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న క్రిమినల్ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో క్రిమినల్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడమేనని గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ వ్యవహారాన్ని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా సిద్ధం చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఓ నోట్ పంపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల నిందితుల హక్కులను పరిరక్షించడం సాధ్యం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి తన నోట్లో పేర్కొన్నారు. నిందితుల హక్కుల ఉల్లంఘన జరగకూడదంటే కేసుల సత్వర పరిష్కారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, కేసుల విచారణలో నాణ్యత కూడా దెబ్బతింటోందని ఆయన తన నోట్లో ఆందోళన వ్యక్తం చేశారు. సీజే నోట్‌తో హైకోర్టు రిజిస్ట్రీ పీపీల కొరత వ్యవహారంపై వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను సిద్ధం చేసింది. ఒక దానిలో తెలంగాణ, మరొక దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల కింది కోర్టుల్లో కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. వీలైనంత త్వరగా పీపీల కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ధర్మాసనం, ఈ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
సాక్ష్యాలు రుజువు చేయాల్సిందే..
జగిత్యాలజోన్: చాలామం దివివిధ సమస్యలపై కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. కానీ ఆ సమస్యకు సంబంధించిన సరైన సాక్ష్యం సమర్పించలేకపోవడంతో కేసులు కొట్టుడుపోతుంటాయి. ఈ నేపథ్యంలో సాక్ష్యానికి సంబంధించిన విషయాల గురిం చి జగిత్యాల బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది కటుకం చంద్రమోహన్(94400 08494) ఇలా వివరించారు. రుజువు చేసుకోవాల్సిందే ఒక వ్యక్తి తనకు అందాల్సిన చట్టబద్ధమైన హక్కులు లేక బాధ్యతల గురించి తీర్పును ఇవ్వవలసిందిగా కోర్టును కోరినప్పుడు, ఆ వ్యక్తి సదరు విషయాలకు సంబంధించిన సాక్ష్యాలను రుజువు చేయవలసి ఉంటుంది. సాక్ష్యాన్ని రుజువు చేయడమనేది సివిల్, క్రిమినల్ కేసులకు వర్తిస్తుంది. అయితే ఒకే విధంగా ఉండదు. ఒక విషయం వాస్తవమేనని రుజువు చేయడమే రుజువుభారం(బర్డెన్ ఆఫ్ ప్రూప్)గా పిలుస్తారు. ఎవరు ముందుగా కోర్టును ఆశ్రయిస్తారో.. తాను న్యా యాన్ని పొందుటకు అర్హుడనని సదరు వ్యక్తి రు జువు చేసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో రుజువుభారం పూర్తిగా ప్రాసిక్యూషన్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ వరకట్నపు హింస, వరకట్నం హత్య మొదలగుకేసుల్లో తాము నిర్దోషులమని నిరూపించుకోవలసిన బాధ్యత ముద్దాయిలపై ఉంటుంది. సివిల్ కేసుల్లో వాది దాఖలు చేసిన కేసు చెల్లదని రుజువు చేయవలసిన భారం ప్రతివాదిపై ఉంటుంది. రుజువుభారం అంటే కేసు లోని ప్రతి అంశాన్ని రుజువు చేయాలని కాదు. ఇరువర్గాలు అంగీకరిస్తే.. ఉభయ పార్టీలు అంగీకరించిన అంశాలను రుజు వు చేయాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని కక్షిదారుడు ప్రస్తావించినప్పుడు, దానిని ప్రత్యర్థి నిరాకరిస్తే.. ఆ విషయాన్ని కక్షిదారుడు నిరూపించుకోవాలి. కోర్టు నిర్ధారించే విచారణీయ అంశం ఎవరిపై రుజువుభారం మోపితే వారే ఆ అంశాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసులలో ముద్దాయి సాక్ష్యం చెప్పనవసరం లేదు. నేను నేరం చేయలేదు అని అంటే చాలు. పూర్తి ఆధారాలతో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ముద్దాయి చేసిన నేరాన్ని ప్రాసిక్యూషన్ రుజువు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి తాను నిర్దోషినని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూషన్ వారి కథనంలో ఏ మాత్రం పొంతన లేకపోయినా, అనుమానం ఉన్న సందేహ స్పదంగా(బెనిఫిట్ ఆఫ్ డౌట్) కేసు కొట్టివేయుదురు. క్రిమినల్ కేసుల్లో, నేరం జరిగినప్పుడు తాను అక్కడ లేనని, మరోచోట ఉన్నానని ముద్దాయి వాదన చేసినప్పుడు ఆ విషయాన్ని రుజువు చేసుకోవాల్సిన భారం ముద్దాయిపై ఉంటుంది. భారతీయ సాక్ష్యం చట్టంలోని సెక్షన్–101 ఈ విషయాలను సూచిస్తుంది. రుజువు చేయలేకపోతే.. భారతీయ సాక్ష్య చట్టంలోని సెక్షన్–102 ప్రకారం.. ఒక సివిల్ దావా లేదా ప్రొసీడింగ్‌లలో ఇరువర్గాలు(వాది, ప్రతివాది) సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేనప్పుడు, తీర్పు ఎవరికీ వ్యతిరేకంగా వచ్చునో రుజువు భారం ఆ కక్షిదారుడిపై ఉంటుంది. ఉదాహరణకు.. రామయ్య, రాజయ్యకు రూ.10 వేలు ప్రామిసరీ నోటుపై అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. అప్పుడు రాజయ్య తాను అసలు నోటు రాయలేదని, తనకు డబ్బు ఇవ్వలేదని వాదన చేసినచో, రాజయ్య నోటు రాశాడని రుజువు చేయాల్సిన భారం రామయ్యపై ఉంటుంది. ఆ ప్రామిసరీ నోటును రాజయ్య రాసిచ్చినట్లుగా రామయ్య సాక్ష్యం చెబితే, తాను ఆ నోటు రాయలేదని రాజయ్య సాక్ష్యంను చెప్పవలెను. రామయ్య సాక్ష్యం చెప్పనిచో, రాజయ్య కూడా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు సాక్ష్య ం చెప్పకపోతే కేసు కోట్టివేయుదురు. అప్పుడు రామయ్య నష్టపోతాడు. కాబట్టి, రుజువు భారం రామయ్యపై ఉండును. దీన్నిబట్టి రుజువు భారం ఎవరిపై ఉండునో వారే ముందుగా సాక్ష్యంను చెప్పాల్సి ఉంటుంది. వాస్తవమేనని నిరూపించుకోవాలి భారతీయ సాక్ష్యం చట్టం సెక్షన్–103 ప్రకారం ఒక నిర్ధిష్ట విషయం వాస్తవమేనని రుజు వు చేయాల్సిన బాధ్యత, అది వాస్తవమేనని నమ్మిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు..రాజు దొంగతనం చేసినట్లుగా రాము కే సును దాఖలు చేశాడు. రాజు తన నేరాన్ని రాజారావు వద్ద ఒప్పుకున్నాడని రాము వాదన. ఆ వి షయాన్ని రాజారావు చేత సాక్ష్యా న్ని చెప్పించుట ద్వారా రాము రు జువు చేయాల్సి ఉంటుంది. ఇదే చట్టంలోని సెక్షన్–105 ప్రకారం ఒక వ్యక్తిపై నేరారోపణ చేయబడినప్పుడు, ఆ నేరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చే యబడిన ఎడల, ఆ ప్రత్యేక పరిస్థితులను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నేరారోపణ చేయబడిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు..రమేశ్‌పై హత్యానేరం మోపబడింది. విచారణలో రమేశ్ తనకు మతిస్థిమితం లేదని, తాను ఏమి చేయుచున్నాడో తనకే తెలియడం లేదని వాదించాడు. ఆ నేరం జరిగినప్పుడు తనకు మతిస్థిమితం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత రమేశ్‌పై ఉంటుంది. బుద్ధిపూర్వకంగా నేరం చేయలేదని, క్షణికావేశంలో చేశానని ముద్దాయి రుజువు చేసుకోగలిగితే శిక్ష తగ్గుతుంది. సీనియర్ న్యాయవాది కటుకం చంద్రమోహన్ -
’శ్రీమంతుడు’కి కోర్టు సమన్లు
హైదరాబాద్: హిట్ చిత్రంగా పేరొంది.. మహేశ్ బాబు కెరీర్లోనే గొప్ప చిత్రంగా నిలిచిన ‘శ్రీమంతుడు’కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తాను రాసిన నవలను ఆధారంగా శ్రీమంతుడు చిత్రంగా మలిచారని శరత్ చంద్ర అనే నవలాకారుడు వేసిన పిటిషన్‌ను ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సువర్ణ రాజు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి సమన్లు జారీ చేశారు. ఎంబీ క్రియేషన్ అధినేత, మైత్రిమూవీస్ అధినేత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివకు మంగళవారం కోర్టుల సమన్లు పంపించింది. గతంలో ఇదే కేసు విషయంలో సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశారు. హిందీలో ఇదే చిత్రాన్ని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తీయబోతున్న విషయం తెలిసి ఇంజక్షన్ ఆర్డర్ కోసం సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఇదిలా ఉండగానే తాజాగా క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. స్వాతి మాస పత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే శీర్షికతో రాసిన నవలను శ్రీమంతుడు చిత్రంగా మలిచారని ఆరోపిస్తూ కుట్రపూరిత నేరం ఐపీసీ 120బి కింద కేసు నమోదు చేయాలని కోరుతూ క్రిమినల్ కోర్టులో శరత్చంద్ర కేసు వేశారు. దీని ప్రకారమే తాజాగా సమన్లు జారీ చేశారు. -
నాంపల్లిలో యుద్ధ వాతావరణం
హైదరాబాద్: న్యాయవాదుల రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంది. న్యాయవాదులను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో పోలీసులను మొహరిచడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కోర్టు ఎదుట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో.. తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. -
కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇస్తారా?
♦ సుజనా ఎండీపై న్యాయస్థానం ఆగ్రహం ♦ పెర్జురీ కేసు పెట్టాలంటూ సిబ్బందికి జడ్జి ఆదేశం ♦ సుజనా చౌదరి- మారిషస్ బ్యాంకు కేసులో మరో మలుపు సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసరాజుపై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి (పెర్జురీ) కోర్టును తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టింది. ఇందుకు ఐపీసీ 191, 193, 199, 200, 206 సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని 11వ అదనపు చీఫ్ జడ్జి తన సిబ్బందిని ఆదేశించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ సంస్థ.. మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రూ.100 కోట్లకు పైగా రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా నిందితుడు కావటం గమనార్హం. దీనిపై మారిషస్ కమర్షియల్ బ్యాంకు తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సుజనా సంస్థ ఎండీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు మాకు తెలియగానే కోర్టుకు ఫిర్యాదు చేశాం. న్యాయస్థానం దీనిపై ప్రాథమిక విచారణ జరిపింది. మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చింది. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చీఫ్ మెజిస్ట్రీరియల్ అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు’’ అని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవలే మారిషస్ బ్యాంకు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి సుజనా చౌదరికి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. -
హోస్నీ ముబారక్‌కు మూడేళ్ల జైలు
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్(86)కు భారీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఇక్కడి క్రిమినల్ కోర్టు బుధవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన ఇద్దరు తనయులు అలా, గమాల్ను కూడా దోషులుగా తేల్చి నాలుగేళ్ల జైలుశిక్ష వేసింది. అధ్యక్ష భవన నవీకరణకు ఉద్దేశించిన 1.79 కోట్ల డాలర్లను వీరు కాజేశారని నిర్ధారించిన కోర్టు 1.76 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. 29 లక్షల డాలర్లను ప్రభుత్వ ఖజనాకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
‘మైనర్ కీచకుడి పై క్రిమినల్ కోర్టులో విచారణ జరపండి’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిర్భయ అత్యాచార ఉదంతానికి సంబంధించిన కేసులో మైనర్ అయినందువల్ల మూడేళ్ల శిక్షతోనే తప్పించుకున్న దోషిపై క్రిమినల్ కోర్టులో విచారణ జరిపించాలంటూ నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జువెనైల్స్పై క్రిమినల్ కోర్టు విచారణను నిషేధిస్తూ ఉన్న చట్టాన్ని రద్దుచేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అతనికి 18 ఏళ్లకు ఆరు నెలలు తక్కువ వయసున్నం దున గత ఆగస్టులో జువెనైల్ లా ప్రకారం.. అతడికి గరిష్టంగా మూడు ఏళ్ల జైలు శిక్ష మాత్రమే జువెనైల్ జస్టిస్ బోర్డు విధించింది. జువెనైల్ జస్టిస్ చట్టానికి రాజ్యాంగబద్ధతను సవాల్‌చేస్తూ పిటిషన్ దాఖలుచేసినప్పటికీ, బోర్డు తీర్పు ఇవ్వడాన్ని నిర్భయ తల్లిదండ్రులు ప్రశ్నించారు.