న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల విచారణకు బిహార్, కేరళ రాష్ట్రాల్లో జిల్లాకొకటి చొప్పున ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విధించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిల్‌ను కోర్టు విచారించింది. తమ ఉత్తర్వులకు సమ్మతి తెలుపుతూ 14లోపు నివేదికలు పంపాలని కేరళ, బిహార్ హైకోర్టులను ఆదేశించింది. ఇప్పటికే స్పెషల్ కోర్టుల్లో ఉన్న కేసులను ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసే కోర్టులకు పంపాలని కోరింది. జిల్లాల్లో అవసరమైనన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఈ రెండు రాష్ట్రాల హైకోర్టులకు కల్పించింది. దీంతోపాటు ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తెలపాలంటూ అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తన వద్ద ఉన్న వివరాలను కోర్టు ముందుంచారు.
దీని ప్రకారం.. ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలపై దేశ వ్యాప్తంగా 4,122 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2,324 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించినవి కాగా 1,675 మంది మాజీలపై ఉన్నవి. ట్రయల్ కోర్టుల విచారణలో ఉన్న 264 కేసులపై హైకోర్టులు స్టే విధించాయి. పెండింగ్ కేసులున్న ప్రముఖుల్లో పంజాబ్, కర్ణాటక సీఎంలు అమరీందర్, కుమారస్వామితోపాటు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేరళ మంత్రి ఎంఎం మణి, ఎన్‌సీపీకి చెందిన గుజరాత్ ఎమ్మెల్యే కేఎస్ జడేజా ఉన్నారు. సీఎం కుమారస్వామిపై ఆరోపణలు రుజువైతే యావజ్జీవ కారాగారం ఖాయం. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై ఉన్న 9 కేసుల్లో 8 కేసులు రుజువైతే జీవిత కాల జైలు శిక్ష, ఒక కేసులో ఏడేళ్ల కారాగారం విధించే అవకాశముంది. యడ్యూరప్పపై ఉన్న 18 కేసుల్లో 14 కేసులు యావజ్జీవానికి అవకాశమున్నవే. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కోర్టుల్లో ఉన్న 109 కేసుల్లో 38, తెలంగాణలోని 99 కేసుల్లో 66 కేసులు స్పెషల్ కోర్టులకు బదిలీ అయ్యాయి. వీటిని సెషన్స్ జడ్జి స్థాయి న్యాయాధికారి విచారిస్తున్నారు. ఈ కేసుల సత్వర విచారణకు అదనంగా 51 స్పెషల్ కోర్టులు అవసరమవుతాయి.
వారి కేసులపై జిల్లాకొక స్పెషల్ కోర్టు
Published Wed, Dec 5 2018 1:54 AM | Last Updated on Wed, Dec 5 2018 1:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment