♦ సుజనా ఎండీపై న్యాయస్థానం ఆగ్రహం
♦ పెర్జురీ కేసు పెట్టాలంటూ సిబ్బందికి జడ్జి ఆదేశం
♦ సుజనా చౌదరి- మారిషస్ బ్యాంకు కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసరాజుపై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి (పెర్జురీ) కోర్టును తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టింది. ఇందుకు ఐపీసీ 191, 193, 199, 200, 206 సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని 11వ అదనపు చీఫ్ జడ్జి తన సిబ్బందిని ఆదేశించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ సంస్థ.. మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రూ.100 కోట్లకు పైగా రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది.
కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా నిందితుడు కావటం గమనార్హం. దీనిపై మారిషస్ కమర్షియల్ బ్యాంకు తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సుజనా సంస్థ ఎండీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు మాకు తెలియగానే కోర్టుకు ఫిర్యాదు చేశాం. న్యాయస్థానం దీనిపై ప్రాథమిక విచారణ జరిపింది. మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చింది. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చీఫ్ మెజిస్ట్రీరియల్ అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు’’ అని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవలే మారిషస్ బ్యాంకు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి సుజనా చౌదరికి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇస్తారా?
Published Fri, Feb 26 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement