ఇలా పెరుగుతుంటే...హెల్దీగా ఉన్నట్లే!
ఆరోగ్యకరమైన శిశువు పుట్టినప్పుడు 2.5 నుంచి 4 కేజీల బరువు ఉంటుంది. భారతీయుల విషయానికి వస్తే గరిష్ట బరువు 3.5 కేజీలు.
ఐదవ నెల నిండేసరికి పిల్లలు... పుట్టిన నాటికి ఉన్న బరువుకు రెండింతలు అవుతారు. ఏడాది నిండేసరికి మూడింతలవుతారు.
మొదటి నెల నుంచి మూడవ నెల వరకు సరాసరిన నెలకు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు పెరుగుతారు. ఏడు నుంచి పన్నెండు నెలల వరకు నెలకు 250 గ్రాముల చొప్పున పెరుగుతారు. ఏడాది దాటినప్పటి నుంచి యౌవన దశ (14-15 ఏళ్లు) వచ్చేవరకు ఏడాదికి సరాసరిన ఒకటిన్నర నుంచి రెండు కిలోల బరువు పెరుగుతారు.
ఇక ఎత్తు విషయానికి వస్తే...
పుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా 50 సెంటీమీటర్ల పొడవుంటారు.
ఆరు నెలలు నిండేసరికి 66 సెంటీమీటర్లు, ఏడాది నిండేటప్పటికి 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు.
ఏడాది నిండినప్పటి నుంచి యౌవన (ఫ్యూబర్టీ) దశ వరకు ఏడాదికి ఐదారు సెంటీమీటర్లు పెరుగుతారు.
సాధారణ పురోగతి ఇలా...
6-8 వారాల వయసులో పలకరింపుగా నవ్వడం, ‘ఊ’కొట్టడం
మూడు నెలల వయసులో మెడ నిలపడం
నాలుగైదు నెలలకు బోర్లా పడడం, పాకడం
ఆరు-ఏడు నెలలకు కూర్చోవడం, తొమ్మిది నెలలకు ఎవరి సహాయం లేకుండా సొంతంగా కూర్చోవడం
పది నెలలకు దేనినైనా పట్టుకుని సొంతంగా లేచి నిలబడడం, ఏదో ఒకటి పలకడం
12-13 నెలలకు సొంతంగా అడుగులు వేయడం, చెప్పాలనుకున్న పదాలు పలకడం.
- డా. ప్రీతమ్ కుమార్,
పీడియాట్రీషియన్, రెయిన్‌బో హాస్పిటల్