మందులంటే... మారాం చేస్తోందెలా? | D.padma palvay tells about of Kids Minds | Sakshi
Sakshi News home page

మందులంటే... మారాం చేస్తోందెలా?

Published Sat, Feb 13 2016 10:41 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

మందులంటే... మారాం చేస్తోందెలా? - Sakshi

మందులంటే... మారాం చేస్తోందెలా?

కిడ్స్ మైండ్స్
మా పాప వయసు పదేళ్లు. సంవత్సరం క్రితం సడెన్‌గా అనారోగ్యం పాలయ్యింది. డాక్టర్‌కి చూపిస్తే ఓ చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని చెప్పారు. కొన్నాళ్ల పాటు మందులు వేస్తే సమస్య తీరిపోతుందన్నారు. అయితే పాపతో మందులు మింగించడం చాలా కష్టంగా ఉంటోంది. మందు అంటే చాలు అరిచి గీపెడుతుంది. తనని ఎలా డీల్ చేయాలో చెప్తారా?
 - కె.మనోజ్ఞ, హైదరాబాద్

 
పాప ఎందుకు మందు వేసుకోనం టోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిం చండి. మందు చేదుగా ఉంటుందనా? మింగడం రాదా? లేక మందు ఎందుకు వేసుకోవాలి అనే మంకుపట్టా? ఎందుకు వేసుకోనంటోందో తెలిస్తే ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించవచ్చు. సాధారణంగా పిల్లలు భయంతో మందులు వేసుకోవ డానికి మారం చేస్తుంటారు. అలాం టప్పుడు జమ్స్ లాంటి చాకొలెట్స్‌తో ప్రాక్టీస్ చేయించాలి.

అవి తియ్యగా ఉంటాయి కాబట్టి, వాళ్లకు నచ్చుతాయి కాబట్టి భయం పోతుంది. మందులు కూడా అలానే ఉంటాయి అని చెబితే, వేసుకోవడానికి సిద్ధపడతారు. లేదంటే నీతో పాటు నేను కూడా వేసుకుంటాను అని చెప్పి, మీరు కూడా కొన్ని రోజుల పాటు ఓ విటమిన్ మాత్ర మింగుతూ ఉండండి. అప్పుడు తనకీ ధైర్యం వస్తుంది.
 
నాకు ఈ మధ్యనే ఓ పాప పుట్టింది. తను పుట్టినప్పట్నుంచీ మా పెద్దపాపలో (రెండో తరగతి చదువుతోంది) చాలా మార్పు వచ్చింది. చెప్పినమాట చక్కగా వినేది, ఇప్పుడు వినడం లేదు. చిన్న పాపకు స్నానం చేయి స్తున్నప్పుడో నిద్ర పుచ్చుతున్నప్పుడో ఏదో ఒకటి కావాలని అడుగుతుంది. ఆగమంటే ఆగదు. వెంటనే కావాలంటూ గొడవ గొడవ చేస్తుంది. నేను చిన్న పాపతో ఉన్న ప్రతిసారీ తను ఇలా కావాలనే చేస్తోందని అర్థమైంది. అలా అని తనని పట్టించుకోకపోవడం ఏమీ లేదు. మరి ఇంకెందుకింత అసూయ?
 - జ్యోతి, విశాఖపట్నం

 
ఇంతవరకూ మీ పెద్ద పాప ఒక్కతే ఉంది కాబట్టి మీ అటెన్షన్ అంతా తనమీదే ఉండేది. ఇప్పుడు చిన్న పాప పుట్టడంతో ఆ అటెన్షన్ డివైడ్ అయ్యింది. దీన్ని చాలా మంది పిల్లలు తట్టుకోలేరు. అందుకే చెల్లి వచ్చినా తన స్థానం అలాగే ఉంది అనే ఫీలింగ్ పాపకు కలిగించాలి. రోజూ కొంత సేపు తనతో గడపండి. అప్పుడు చిన్న పాపను మీతో ఉంచుకోవద్దు. ఇంతకు ముందుకంటే ఎక్కువగా పాప పనుల్లో సాయం చేయండి. తనకు మీరిచ్చే ప్రాధా న్యత అర్థమవుతుంది. అలాగే చిన్నపాప పనుల్లో పెద్ద పాపను ఇన్‌వాల్వ్ చేయండి. పాపను తన ఒడిలో కూర్చోబెట్టండి.

స్నానం చేయించేటప్పుడు తనను హెల్ప్ చేయమనండి. చెల్లికి ఏ బట్టలు వేయాలో నువ్వే సెలెక్ట్ చెయ్యి అని చెప్పండి. చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మీరు వేరే పనులు చేసుకుంటూ ఉండండి. దానివల్ల చెల్లెలి బాధ్యత తనకూ ఉందని తెలు స్తుంది. ప్రేమ పెరుగుతుంది. ఇంకొకరు వచ్చారు కాబట్టి తనను చూడరేమో అన్న భయం పిల్లల్ని ఇలా తయారు చేస్తుంది. కొన్ని రోజుల్లో తనే మారిపోతుందిలెండి.
 
మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తెలివికి వంక పెట్టక్కర్లేదు. కాకపోతే వాడు ఈ మధ్య ఫ్యాషన్‌మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ఏదైనా డ్రెస్ కొంటే నాకు నచ్చలేదు, వేసుకోను అని చెప్పేస్తున్నాడు. వాడి డ్రెస్ వాడే సెలెక్ట్ చేసుకోవాలట. అలాగే చాలాసేపు తయారవుతున్నాడు. పదే పదే అద్దంలో చూసుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. నా ఆలోచన కరెక్టేనా?
 - వి.పవన్‌కుమార్, రేణిగుంట

 
తొమ్మిదో తరగతి అంటే 13-14 సంవత్సరాలు ఉండవచ్చేమో కదా! టీనేజీలో పిల్లలకు సహజంగానే అప్పియరెన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఈ వయయసులో వాళ్లు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అవసరం కూడా. పెద్దయిన తర్వాత తమ నిర్ణయాలు తాము సొంతగా తీసుకునేందుకు ఇది సహాయపడుతుంది. తప్పు చేసినా పెద్దగా హాని చేయని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మెచ్చుకోవాలే తప్ప కంగారు పడకూడదు.

అలాంటి విషయాల్లో తనని అలా వదిలేయండి. మరీ ఇన్‌డీసెంట్‌గా ఉంటే చెప్పండి తప్ప... తన దుస్తులు, వాటి రంగులు, స్టయిల్స్ మీకు నచ్చకపోయినా పట్టించుకోకండి. తను సంతోషంగా ఉంటాడు కదా! అయితే ఏదైనా డ్యామేజ్ జరిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం అడ్డుకోండి. అలాగని తిట్టకూడదు. కూర్చోబెట్టి మాట్లాడి, అర్థమయ్యేలా వివరించాలి. అంటే తనకి ఫ్రీడమ్ ఇస్తూనే మంచి చెడులను కనుక్కోవాలన్నమాట. బట్టలు కూడా మీరు చెప్పినవే వేసుకునే వయసు కాదు తనది. అది మీరు అర్థం చేసుకోవాలి.  
- డా॥పద్మ పాల్వాయ్
 చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement