అన్నీ ఇస్తున్నాం... అయినా ఎందుకిలా?!
కిడ్స్ మైండ్స్
మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడే. కానీ ఎందుకో పరీక్షల సమయం వచ్చేసరికి విపరీతంగా టెన్షన్ పడిపోతాడు. స్లిప్ టెస్టులకు కూడా ఫైనల్ ఎగ్జామ్స్‌లాగా కంగారు పడిపోతాడు. పరీక్ష అంటే చాలు జ్వరం వచ్చేస్తుంది. దాంతో ఎంత చదివినా సరిగ్గా రాయలేడు. ఎంత ధైర్యం చెప్పినా పరిస్థితి మారట్లేదు. కౌన్సెలింగ్ లాంటిదేమైనా ఇప్పిస్తే మంచిదంటారా?
- రవికాంత్, ఆదిలాబాద్
పరీక్షలకు టెన్షన్ పడటం వల్ల పెర్‌ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒకవేళ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోండి. ఎందుకంటే చాలాసార్లు పెద్దవాళ్లు పిల్లలతో డెరైక్ట్‌గా ‘నీకెన్ని మార్కులు వచ్చినా ఫర్వాలేదు నాన్నా’ అంటారు. కానీ మార్కులు కాస్త తక్కువ వచ్చినా పెదవి విరవడం, ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకెండ్ ర్యాంక్ వచ్చినా... చూశావా, నేను చెప్పినట్టు ఆ రోజు చదివివుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అనడం చేస్తుంటారు.
ఒక్కసారి ఇంట్లో కానీ, స్కూల్లో కానీ ఎవరైనా అతిగా ఒత్తిడి చేస్తున్నారేమో చూడండి. అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే సరి చేయండి. అలాంటిదేమీ లేకపోతే బాబును తప్పకుండా కౌన్సెలింగుకు తీసుకు వెళ్లండి. బాబుది భయపడే మనస్తత్వం అయితే కనుక కౌన్సెలింగ్ తప్పకుండా పని చేస్తుంది. ఈ భయం ముందు ముందు వేరే భయాలకు దారి తీయకుండా ఉంటుంది.
మా పాప ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆరు నెలల క్రితం మెచ్యూర్ అయ్యింది. అయితే అప్పటి నుంచీ ఎందుకో చాలా సెలైంట్ అయిపోయింది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడటం లేదు. ముభావంగా ఉంటోంది. ఒంట్లో బాలేదా అంటే బాగానే ఉంది అంటోంది. కానీ డల్‌గానే కనిపిస్తోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే తనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది?
- మధుమణి, రాజమండ్రి
అసలు పాప మెచ్యూర్ అవ్వడానికి, ఈ బిహేవియర్‌కి సంబంధం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఒకవేళ తన మనసులో ఏవైనా అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయేమో కనుక్కోండి. తను మెచ్యూర్ అయినప్పుడు స్కూల్లో తన స్నేహితులు ఏమైనా చెప్పారేమో అడగండి. లేదా తనలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల ఏవైనా అపోహలు తలెత్తాయా అన్నది కనుక్కోండి.
కూల్‌గా మాట్లాడితే తన మనసులో మాట తెలుస్తుంది. తను చెప్పినదాన్ని బట్టి తన సందేహాలను తీర్చండి. భయాలుంటే పోగొట్టండి. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా తన మనసులో మాట మీతో చెప్పకపోతే కౌన్సెలర్ ఒకసారి దగ్గరకు తీసుకు వెళ్లండి.
మాకు ఒక్కడే బాబు. రెండో తరగతి చదువు తున్నాడు. తనని మేం బాగా గారాబం చేస్తాం. అడిగినదల్లా ఇస్తాం. కానీ అదేంటో... తన దగ్గర ఎన్ని ఉన్నా, పక్క పిల్లల పెన్నులు, పెన్సిళ్లు తీసేసుకుంటున్నాడు. ఒక్కోసారి వాళ్లకు చెప్పకుండా కూడా తీసేసుకుంటున్నా డని తెలిసింది. ఈ మధ్యనే స్కూలు నుంచి కంప్లయింట్ వస్తే మేం షాకయ్యాం. ఎదుటి వాళ్ల వస్తువులు చెప్పకుండా తీసుకోకూడదని, దొంగతనం తప్పు అని ఎంత చెప్పినా అలా చేయడం మానట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇది మానసిక సమస్య కాదు కదా?
- ఎస్.ప్రభాకర్, విశాఖపట్నం
బాబు ఏదైనా వస్తువు తనకు నచ్చగానే తీసేసుకుంటున్నట్టున్నాడు. తనకేదైనా కావాలనుకుంటే ఆగలేక పోతున్నాడు. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే... ఏదైనా కావాలి అనుకున్న వెంటనే దొరకదని, దొరికే వరకూ ఆగాలని చెప్పాలి. ప్రతిదీ అడగ్గానే ఇవ్వకండి. ఏది ఇవ్వొచ్చో, ఏది ఇవ్వ కూడదో ఆలోచించండి. తనకేదైనా వస్తువు నచ్చి తీసేసుకున్నప్పుడు...
ఆ వస్తువు ఎవరిదో వారి దగ్గరకు తీసుకెళ్లి, బాబుతోనే ఆ వస్తువు తిరిగి ఇప్పించి, క్షమాపణ చెప్పేలా చేయండి. అంటే దొంగిలించడం తప్పని, దొంగతనం చేయడం వల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదనీ మీరు బాబుకి చెప్పినట్టు అవుతుంది.
అయినా అలాగే చేస్తుంటే... తప్పు చేసిన ప్రతిసారీ ఖండించడం, తనకు నచ్చినవి ఇవ్వకపోవడం, టీవీ చూడనివ్వకపోవడం లాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వండి. అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒకళ్లు స్ట్రిక్ట్‌గా ఉండి మరొకరు ముద్దు చేస్తూ ఉంటే బాబు తన తప్పు తెలుసుకోడు. కాబట్టి అందరూ కలిసి బాబుకున్న ఈ చెడు అలవాటును మాన్పించండి.
డా॥పద్మ పాల్వాయ్
చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్,
హైదరాబాద్