చదువుతాడు... మర్చిపోతాడు... ఎందుకని?
కిడ్స్ మైండ్స్
మా బాబు వయసు పద్నాలుగేళ్లు. చురుగ్గా ఉంటాడు. కానీ నన్ను వదిలి ఒక్కక్షణం ఉండడు. నేను, మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులమే. దాంతో శెలవులు సరిగ్గా ఉండవు. బాబుకి శెలవులు ఉన్నప్పుడు వాణ్ని మా అమ్మవాళ్ల ఇంటికి పంపింద్దామనుకుంటే అస్సలు వెళ్లడు. వాళ్లు ఎంత బతిమిలాడినా పోనంటాడు. తన ఫ్రెండ్స్ బర్త్ డే ఫంక్షన్లకి కూడా నేనే తీసుకెళ్లాలి. నువ్వు వెళ్లు అంటే వినడు. తీసుకెళ్లకపోతే బెంగపడతాడని వాడి కోసం పని గట్టుకుని టైమ్ కేటాయించాల్సి వస్తోంది. ఇది నాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాడినెలా మార్చాలి?
- బి.విజయ, హైదరాబాద్
బాబు ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఉండలేకపోవడం ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నప్పట్నుంచీ తనకు మీరు లేకుండా బయటకు వెళ్లడం అలవాటు చేశారో లేదో మీరు చెప్పలేదు. చేసి వుండకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిం దని నేననుకుంటున్నాను. ఇలా ఉన్న ట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్లడానికి బెంగగా ఉండివుంటుంది పాపం. ఒకవేళ తనకి మొదట్నుంచీ అలవాటు ఉండి ఇప్పుడు వెళ్లలేకపోతుంటే... తనకి మెల్లగా అల వాటు చేయడం మంచిది.
ముందు ఫ్రెండ్స్ ఇళ్లకి పార్టీలకవీ పంపించండి. మీరు వెళ్లొద్దు. తనని వెళ్లమని పంపిం చండి. కొత్తలో సిగ్గుగానో భయంగానో ఫీలయినా తర్వాత అలవాటు పడతాడు. ఊళ్లో తనంత తాను తిరగడం అలవాటైన తర్వాత ఒకటి రెండు రోజుల కోసం ఎక్కడికైనా పంపడం మొదలుపెట్టండి. అది కూడా అలవాటయ్యాక ఎక్కువ రోజులు పంపించవచ్చు. ఇది సమస్యేమీ కాదు. ఎప్పుడూ మీతోనే ఉంటాడు కాబట్టి అమ్మ లేకపోతే ఎలా అని ఫీలవుతున్నట్టున్నాడు. మెల్లగా అలవాటు చేస్తే తనే దారికి వస్తాడు.
మా బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో తను చాలా డల్. ఏ విషయమూ నాలుగైదుసార్లు చెబితేకానీ బుర్రకి ఎక్కదు. చదివిందే పదిసార్లు చదివినా కూడా మైండ్‌లో ఉండదు. అంతేకాదు... ఏదైనా పని చెప్పినా పక్క గదిలోకి వెళ్లేసరికి మర్చిపోతుంటాడు. తన వస్తువులు తనే ఎక్కడ పెట్టాడో గుర్తు లేదంటాడు. స్కూల్లో కూడా తన వస్తువులు మర్చిపోయి వచ్చేస్తుంటాడు. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపు అసహజం కదా... ఇదేమైనా మానసిక సమస్యా?
- సుదర్శన్, గుంతకల్లు
చదువు అర్థం కావడం లేదు అంటే తనకి ఓసారి ఐక్యూ టెస్ట్ చేయించడం మంచిది. ఒక్కోసారి ఐక్యూ తక్కువ ఉండటం వల్ల కూడా పిల్లలకు పాఠాలు అర్థం కావు. అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్నా కూడా పిల్లలు చదువులో వెనక బడిపోతారు. అస్సలు శ్రద్ధ పెట్టలేక పోతారు. ఒకవేళ చదివినా మర్చి పోతుంటారు. కాబట్టి ముందు ఈ రెండిటిలో ఏ సమస్య అయినా బాబుకి ఉందేమో సైకి యాట్రిస్టుతో పరీక్ష చేయించండి. సమస్య ఉన్నా టెన్షన్ పడాల్సిన పని లేదు. వాటికి తగ్గ మంచి చికిత్సలు ఉన్నాయి. చేయిస్తే ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఉండండి.
మా పాప పదో తరగతి చదువుతోంది. వచ్చే యేడు ఇక్కడే ఏదైనా కాలేజీలో చేర్పించాలని అనుకుంటున్నాం. కానీ తను మాత్రం సిటీకి వెళ్లి ఒక మంచి కాలేజీలో చేరతానంటోంది. అంటే హాస్టల్లో ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. రోజూ ఆడపిల్లల విషయంలో జరిగేవి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే ఇప్పటివరకూ బయటికి వెళ్లని తనని ఒక్కసారిగా అంత దూరం పంపడానికి భయమేస్తోంది. నా భయం తనకి అర్థమయ్యేలా ఎలా చేయాలి?
- యు.ఉషశ్రీ, బాపట్ల
మీరు, మీవారు అన్నీ ఆలోచించిన తర్వాతే తనను ఇంటి దగ్గర కాలేజీలో చదవడం మంచిదని డిసైడ్ చేసి ఉంటే... అది తనకు వివరించి చెప్పండి. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకింత పంతం పడుతున్నారు అనేది తనకు అర్థమయ్యేలా చెప్పండి. తను వింటే సరే. వినకపోతే మంకుపట్టు పట్ట వచ్చు. అలాంటప్పుడు మీరు కాస్త కఠినంగానే మాట్లాడాల్సి ఉంటుంది. మీరు నిర్ణయం తీసేసుకున్నారని, ఇక మార్చుకునే వీలు లేదని చెప్పేయండి. అవసరం అయితే ఆపై చదువులకు పంపిస్తామని చెప్పండి. అయితే ఒకటి. ఇదంతా చేసేముందు ఒక్కసారి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బాగా ఆలోచించండి.
కేవలం భయంతోటే తీసుకుంటే మాత్రం మీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యలు అన్నిచోట్లా ఉంటాయి. ప్రమాదాలు ఇంట్లో ఉన్నా ముంచుకొస్తాయి. అందుకని ఇలా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుకుంటాం అంటే కుదరదు కదా! రేపు ఏ విదేశీ యూనివర్శిటీలోనో తనకి సీటు వస్తే ఏం చేస్తారు? వదులుకోలేరు కదా! తప్పక పంపించాలి కదా! కాబట్టి వట్టి భయంతో తన ఆశల్ని చంపేయకండి. మీరు తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లూ పాపకి మంచిదని అనిపిస్తేనే దాన్ని అమలు చేయండి.
- డా॥పద్మ పాల్వాయ్
చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్,
హైదరాబాద్