మంచికే చెబుతున్నా... మొరాయిస్తే ఎలా?
కిడ్స్ మైండ్స్
మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. మొన్నటి వరకూ బాగానే ఉండేవాడు. కానీ ఈ మధ్య వాడి ప్రవర్తనలో తేడా వస్తోంది. ఏదైనా సలహా ఇవ్వబోతే నాకు తెలుసులే అంటున్నాడు. నేనేం చిన్నపిల్లాడినా, వచ్చే యేడు కాలేజీకి కూడా వెళ్లబోతున్నా కదా అంటాడు. ఫ్రెండ్స్‌తో షికార్లు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇంతకు ముందులా స్కూలు అవ్వగానే తిన్నగా ఇంటికి రావడం లేదు. సరదాగా ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఈ నిర్లక్ష్యం వాడి చదువు మీద ప్రభావం చూపుతుందేమోనని భయంగా ఉంది. అసలే పదో తరగతి కదా! ఇప్పుడేం చేయాలో సలహా ఇవ్వండి?
- సంగీత, హైదరాబాద్
బాబు స్నేహితులలో మార్పేమైనా వచ్చిందేమో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొత్త స్నేహితులు వచ్చినప్పుడు మన పిల్లల ప్రవర్తనపై వారి ప్రభావం కనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం తప్పేమీ కాదు. కానీ మీతో చెప్పకుండా, స్కూలు నుంచి డెరైక్ట్‌గా వెళ్లిపోవడం మాత్రం తప్పు. ఈ వయసులో పిల్లలు కొద్దిగా స్వాతంత్య్రాన్ని కోరుకోవడం, తీసుకోవడం మొదలవుతుంది. పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి ఇంతకు ముందులా ప్రతిదీ మీకు చెప్పి చేయరు, మీరు చెప్పింది వినరు.
కానీ మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం అంత మంచిది కాదు. ఏది సబబు, ఏది కాదు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అన్నది వాళ్లకి తెలియాలి. కాబట్టి ఓసారి కూర్చోబెట్టి బాబుతో వివరంగా మాట్లాడండి. మీ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని చెప్పండి. వెళ్తే ఎలాంటి సమస్యలు రావొచ్చో కూడా వివరించండి. అలా అని మరీ రిస్ట్రిక్ట్ చేయకుండా కాస్త ఫ్రీగా వదలండి. కాకపోతే ఏ రూల్స్ కచ్చితంగా పాటించి తీరాలన్నది తనకు స్పష్టం చేయండి. వాటి విషయంలో మీరు కూడా స్ట్రిక్ట్‌గా ఉండండి.
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. చాలా చలాకీగా ఉంటాడు. కానీ ఎందుకో మాటలే సరిగ్గా రావడం లేదనిపిస్తోంది. గడగడా మాట్లాడలేడు. ఆగి ఆగి మాట్లాడతాడు. ఏదో ఆచి తూచి మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. కొన్ని పదాలు నత్తినత్తిగా పలుకుతాడు. తనకి ఏదైనా సమస్య ఉందంటారా?
- వరప్రసాద్, ఏలూరు
బాబుకి మాటలు ఇంకా పూర్తిగా వచ్చినట్టు లేదు. కొంతమంది పిల్లలకు మాటలు రావడం కాస్త ఆలస్యం కావొచ్చు. నత్తిగా మాట్లాడం కూడా స్పీచ్ ప్రాబ్లెమే. తనని ఓసారి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్లండి. వాళ్లు ఇచ్చే థెరపీ ద్వారా బాబుకి మాటలు బాగా వస్తాయి.
నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే మా బాబుని బాగా చదివించాలని అనుకుంటున్నాను. వాడిప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు. వాడిని మంచి స్థాయిలో చూడాలన్నది నా కల. అయితే మేము కాస్త వెనుకబడిన ప్రాంతంలో ఉంటున్నాం. అందుకే ఏడో తరగతికి తనని సిటీలోని ఓ మంచి స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నాను. కానీ హాస్టల్లో ఉండటానికి బాబు అస్సలు ఒప్పుకోవడం లేదు. ముందుగానే చెబితే తను ప్రిపేరవుతాడనుకున్నాను. కానీ చెప్పీ చెప్పడంతోనే వాడు బెంగ పెట్టేసుకున్నాడు. ఎట్టి పరిస్థితిల్లోనూ హాస్టల్‌కి వెళ్లనని, మమ్మల్నందరినీ వదిలి ఉండలేనని తెగేసి చెప్తున్నాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి?
- వై.రాజేంద్ర, ఎస్.కోట
బాబును బయటకు పంపడమే తన భవిష్యత్తుకు మంచిదని మీరు నమ్ముతుంటే... తను బాధపడినా కూడా వెనకడుగు వేయకండి. అసలు మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు దూరంగా పంపాలనుకుంటున్నారు, అది తన భవిష్యత్తుకు ఎంత అవసరం అనేది వివరంగా చెప్పండి. తను ఇప్పటివరకూ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బాధపడటం, వెళ్లనని అనడం సహజం. అది చూసి మీకూ బాధ కలుగుతుంది. కానీ తప్పదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసి తనని కన్విన్స్ చేయాలి కదా! కాబట్టి మీరు కాస్త కఠినంగా వ్యవహరించి తనని హాస్టల్లో చేర్పించండి.
కొత్తలో తరచూ ఫోన్లలో మాట్లాడితే దగ్గరగా ఉన్నట్లు ఫీలవుతాడు. మీరు వీలైనన్నిసార్లు వెళ్లి చూడటం, శెలవులు వచ్చినప్పుడు తనను ఇంటికి తీసుకు రావడం చేస్తుంటే... హాస్టల్లో ఉన్నా మీరందరూ తనను పట్టించు కుంటున్నారన్న ధైర్యం కలుగుతుంది తనకి. కాబట్టి తన బాధ చూసి సంశయించి మీరు వెనకడుగు వేయకుండా, తన భవిష్యత్తు కోసం మీ నిర్ణయాన్ని అమలు జరపండి. మొదట్లో కాస్త బెంగగా, బాధగా ఉంటాడు కానీ మెల్లగా అలవాటు పడిపోతాడు.
- డా॥పద్మ పాల్వాయ్
చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్, హైదరాబాద్