Dr.Padma palvai
-
తినమంటే తినదు... ఏం చేయాలి?
కిడ్స్ మైండ్స్ మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. చాలా హుషారుగా ఉంటాడు. కానీ తరచుగా నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అని అడిగితే చెప్పడు. డాక్టర్‌కి చూపించాం. పీడకలలు వస్తున్నాయేమో సైకియాట్రిస్టుకు చూపించండి అన్నారు. ఇంత తరచుగా పీడకలలు వస్తాయా? సైకియాట్రిస్టుకి చూపించడం తప్ప మరో మార్గం లేదా? - ఆర్.పరమేశ్వరి, సిరిపురం బాబుకు పీడకలలు వస్తూ ఉండవచ్చు. లేదా నైట్ ట్సై కావచ్చు. పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు చాలా భయపడినట్టుగా కనిపిస్తారు. కానీ వాళ్లను నిద్ర లేపడానికి అవకాశం ఉంటుంది. లేచిన తరువాత వాళ్లకు కల కొద్దిగా గుర్తు కూడా ఉంటుంది. నైట్ ట్సై కూడా నిద్రలో ఏదో భయం కలిగించే ఎక్స్‌పీరియెన్స్ వల్లనే వస్తాయి. పిల్లలను నైట్ ట్సై నుంచి లేపడం కష్టం. వాళ్లకు ఏమీ గుర్తు ఉండదు కూడా! ఏదైనా కూడా పెద్దయే కొద్దీ తగ్గుతూ వస్తాయి. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలా క్రమశిక్షణతో ఉంటుంది. బాగా చదువుతుంది కూడా. కానీ తిండి దగ్గర ముప్పు తిప్పలు పెడుతుంది. లంచ్‌బాక్స్ ఏ రోజూ ఖాళీగా తీసుకురాదు. ఇంట్లో కూడా సరిగ్గా తినదు. దానికిష్టమైన కూరలే వండుతాను. రకరకాల తినుబండారాలూ చేస్తుంటాను. అయినా కూడా పెద్దగా తినదు. చివరికి అందరు పిల్లల్లా చాక్లెట్లు, చిప్స్ లాంటివి కూడా తినదు. ఆకలి సమస్య ఏమైనా ఉందేమోనని డాక్టర్‌కి చూపించాం. కానీ పాప ఆరోగ్యంగానే ఉంది అన్నారు. మరి తను ఎందుకు తినడం లేదు? - సుజాత, ఏలూరు పాప హెల్దీగా ఉన్నంతకాలం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తన ఎత్తు, బరువు వయసుకు తగినట్టుగానే ఉంటే తనకు ఎంత తినాలనిపిస్తే అంతే తిననివ్వండి. పిల్లలకు ఎంత ఫుడ్ అవసరం అన్నదాంట్లో మనం చాలాసార్లు ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంటాము. అందుకే వాళ్లు తక్కువ తింటున్నారని బాధపడిపోతూ ఉంటాం. పాప ఆరోగ్యంగానే ఉంది కదా! మరి ఇంకెందుకు బెంగ? తనకు కడుపు నిండినంతవరకూ తింటుంది కాబట్టి అంతే తిననివ్వండి. ఆకలి తీరకపోతే తనే తింటుంది కదా! ఇక చిరు తిండ్లు తినకపోవడం అనేది మరీ మంచిది. తను తినేవాటిలో పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైనవి ఎక్కువ ఉండేలా చూసుకుంటే... తక్కువే తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తనకి ఏ సమస్యా లేదు కాబట్టే డాక్టర్ కూడా అలా చెప్పారు. సో, మీరు కూడా ఎక్కువ దిగులు పడకుండా పాపని ఫ్రీగా వదిలేయండి. మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు. కానీ వాడితో ఒక్కటే సమస్య. వస్తువులు మర్చిపోతుంటాడు. స్కూల్లో బుక్స్, లంచ్‌బాక్స్ లాంటివి మర్చిపోయి వస్తాడు. ఏదైనా షాపుకి పంపిస్తే కొన్ని వస్తువులు తెచ్చి కొన్ని మర్చిపోతాడు. ఇంట్లో తన వస్తువులు తనే ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాడు. పోనీ తర్వాతైనా గుర్తొస్తుందా అంటే రాదు. ఎంత ఆలోచించినా చెప్పలేడు ఎక్కడ పెట్టాడో. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపేంటి? పైగా ఇది వస్తువుల విషయంలో మాత్రమే ఉంది. చదువు విషయంలో ఎప్పుడూ బెస్టే. ఎందుకిలా? - గోవర్థన్, దోమగుండ ఇలా మర్చిపోతున్నాడు అంటే బహుశా కాన్సన్ట్రేషన్ లోపం వల్ల కావచ్చు. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండటం వల్లే పిల్లలు ఏది ఎక్కడ పెడుతున్నారో చూసుకోరు. ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టేస్తారు. ఆ తర్వాత దాన్ని అక్కడ పెట్టామని మర్చిపోతుంటారు. నిజానికిదంతా గుర్తు లేకపోవడం వల్ల కాదు. ఎక్కడ పెడుతున్నాం అన్నదాన్ని సరిగ్గా గమనించకపోవడం వల్ల. చదువులో సమస్య లేదంటున్నారు కాబట్టి మీ అబ్బాయిది కూడా ఇదే సమస్య అనుకుంటున్నాను. తనని కూర్చోబెట్టి, అన్నిటి మీదా ఎలా దృష్టి పెట్టాలి, ఎలా శ్రద్ధ చూపాలి అన్న విషయాలను వివరించండి. మరీ అవసరం అనుకుంటే ఓసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. వస్తువులు ఎక్కడ పెట్టాడో గుర్తు పెట్టుకోడానికి కొన్ని స్ట్రాటజీలు నేర్పించి, ప్రాక్టీస్ చేయిస్తారు. దానివల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
చదువుతాడు... మర్చిపోతాడు... ఎందుకని?
కిడ్స్ మైండ్స్ మా బాబు వయసు పద్నాలుగేళ్లు. చురుగ్గా ఉంటాడు. కానీ నన్ను వదిలి ఒక్కక్షణం ఉండడు. నేను, మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులమే. దాంతో శెలవులు సరిగ్గా ఉండవు. బాబుకి శెలవులు ఉన్నప్పుడు వాణ్ని మా అమ్మవాళ్ల ఇంటికి పంపింద్దామనుకుంటే అస్సలు వెళ్లడు. వాళ్లు ఎంత బతిమిలాడినా పోనంటాడు. తన ఫ్రెండ్స్ బర్త్ డే ఫంక్షన్లకి కూడా నేనే తీసుకెళ్లాలి. నువ్వు వెళ్లు అంటే వినడు. తీసుకెళ్లకపోతే బెంగపడతాడని వాడి కోసం పని గట్టుకుని టైమ్ కేటాయించాల్సి వస్తోంది. ఇది నాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాడినెలా మార్చాలి? - బి.విజయ, హైదరాబాద్ బాబు ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఉండలేకపోవడం ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నప్పట్నుంచీ తనకు మీరు లేకుండా బయటకు వెళ్లడం అలవాటు చేశారో లేదో మీరు చెప్పలేదు. చేసి వుండకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిం దని నేననుకుంటున్నాను. ఇలా ఉన్న ట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్లడానికి బెంగగా ఉండివుంటుంది పాపం. ఒకవేళ తనకి మొదట్నుంచీ అలవాటు ఉండి ఇప్పుడు వెళ్లలేకపోతుంటే... తనకి మెల్లగా అల వాటు చేయడం మంచిది. ముందు ఫ్రెండ్స్ ఇళ్లకి పార్టీలకవీ పంపించండి. మీరు వెళ్లొద్దు. తనని వెళ్లమని పంపిం చండి. కొత్తలో సిగ్గుగానో భయంగానో ఫీలయినా తర్వాత అలవాటు పడతాడు. ఊళ్లో తనంత తాను తిరగడం అలవాటైన తర్వాత ఒకటి రెండు రోజుల కోసం ఎక్కడికైనా పంపడం మొదలుపెట్టండి. అది కూడా అలవాటయ్యాక ఎక్కువ రోజులు పంపించవచ్చు. ఇది సమస్యేమీ కాదు. ఎప్పుడూ మీతోనే ఉంటాడు కాబట్టి అమ్మ లేకపోతే ఎలా అని ఫీలవుతున్నట్టున్నాడు. మెల్లగా అలవాటు చేస్తే తనే దారికి వస్తాడు. మా బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో తను చాలా డల్. ఏ విషయమూ నాలుగైదుసార్లు చెబితేకానీ బుర్రకి ఎక్కదు. చదివిందే పదిసార్లు చదివినా కూడా మైండ్‌లో ఉండదు. అంతేకాదు... ఏదైనా పని చెప్పినా పక్క గదిలోకి వెళ్లేసరికి మర్చిపోతుంటాడు. తన వస్తువులు తనే ఎక్కడ పెట్టాడో గుర్తు లేదంటాడు. స్కూల్లో కూడా తన వస్తువులు మర్చిపోయి వచ్చేస్తుంటాడు. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపు అసహజం కదా... ఇదేమైనా మానసిక సమస్యా? - సుదర్శన్, గుంతకల్లు చదువు అర్థం కావడం లేదు అంటే తనకి ఓసారి ఐక్యూ టెస్ట్ చేయించడం మంచిది. ఒక్కోసారి ఐక్యూ తక్కువ ఉండటం వల్ల కూడా పిల్లలకు పాఠాలు అర్థం కావు. అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్నా కూడా పిల్లలు చదువులో వెనక బడిపోతారు. అస్సలు శ్రద్ధ పెట్టలేక పోతారు. ఒకవేళ చదివినా మర్చి పోతుంటారు. కాబట్టి ముందు ఈ రెండిటిలో ఏ సమస్య అయినా బాబుకి ఉందేమో సైకి యాట్రిస్టుతో పరీక్ష చేయించండి. సమస్య ఉన్నా టెన్షన్ పడాల్సిన పని లేదు. వాటికి తగ్గ మంచి చికిత్సలు ఉన్నాయి. చేయిస్తే ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఉండండి. మా పాప పదో తరగతి చదువుతోంది. వచ్చే యేడు ఇక్కడే ఏదైనా కాలేజీలో చేర్పించాలని అనుకుంటున్నాం. కానీ తను మాత్రం సిటీకి వెళ్లి ఒక మంచి కాలేజీలో చేరతానంటోంది. అంటే హాస్టల్లో ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. రోజూ ఆడపిల్లల విషయంలో జరిగేవి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే ఇప్పటివరకూ బయటికి వెళ్లని తనని ఒక్కసారిగా అంత దూరం పంపడానికి భయమేస్తోంది. నా భయం తనకి అర్థమయ్యేలా ఎలా చేయాలి? - యు.ఉషశ్రీ, బాపట్ల మీరు, మీవారు అన్నీ ఆలోచించిన తర్వాతే తనను ఇంటి దగ్గర కాలేజీలో చదవడం మంచిదని డిసైడ్ చేసి ఉంటే... అది తనకు వివరించి చెప్పండి. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకింత పంతం పడుతున్నారు అనేది తనకు అర్థమయ్యేలా చెప్పండి. తను వింటే సరే. వినకపోతే మంకుపట్టు పట్ట వచ్చు. అలాంటప్పుడు మీరు కాస్త కఠినంగానే మాట్లాడాల్సి ఉంటుంది. మీరు నిర్ణయం తీసేసుకున్నారని, ఇక మార్చుకునే వీలు లేదని చెప్పేయండి. అవసరం అయితే ఆపై చదువులకు పంపిస్తామని చెప్పండి. అయితే ఒకటి. ఇదంతా చేసేముందు ఒక్కసారి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బాగా ఆలోచించండి. కేవలం భయంతోటే తీసుకుంటే మాత్రం మీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యలు అన్నిచోట్లా ఉంటాయి. ప్రమాదాలు ఇంట్లో ఉన్నా ముంచుకొస్తాయి. అందుకని ఇలా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుకుంటాం అంటే కుదరదు కదా! రేపు ఏ విదేశీ యూనివర్శిటీలోనో తనకి సీటు వస్తే ఏం చేస్తారు? వదులుకోలేరు కదా! తప్పక పంపించాలి కదా! కాబట్టి వట్టి భయంతో తన ఆశల్ని చంపేయకండి. మీరు తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లూ పాపకి మంచిదని అనిపిస్తేనే దాన్ని అమలు చేయండి. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి?
కిడ్స్ మైండ్స్ మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ మధ్య తన మాట తీరులో చాలా తేడా వచ్చింది. ఏదైనా అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. పైగా కొన్ని సందర్భాల్లో బూతులు మాట్లాడటం విన్నాను. రెండు తగి లిస్తే ఇంకెప్పుడూ అలా మాట్లాడనన్నాడు. కానీ స్కూల్లో కూడా అలాగే మాట్లాడుతున్నాడని టీచర్ కంప్లయింట్ చేశారు. ఉన్నట్టుండి ఎందుకిలా అయ్యాడు? తననెలా మార్చాలి? - జె.సుధారాణి, తణుకు సాధారణంగా పిల్లలు టీనేజ్‌లో ఎదురు తిరుగుతారు తప్ప ఆరో తరగతిలోనే అలా చేయడం జరగదు. ఈ వయసులో ఇలాంటి మార్పు, అందు లోనూ సడెన్‌గా రావడం అనేది ఆలో చించాల్సిన విషయం. స్కూల్లోగానీ బయటగానీ ఎవరితోనైనా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటున్నా డేమో చూడండి. ఆ ఫ్రెండ్ అలవాట్లను గమనించండి. తన వల్లే బాబులో ఈ మార్పు అనుకుంటే తనకి కాస్త దూరంగా పెట్టండి. అలాంటి కారణమేమీ కనిపించక పోతే... ఓసారి జాగ్రత్తగా లాలించి అడ గండి... ఎందుకిలా చేస్తున్నావని. అలా చేయడం వల్ల తనకెంత చెడ్డపేరొస్తుందో వివరించండి. మానుకుంటే మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. మానకపోతే పని ష్మెంట్ ఉంటుందని కూడా చెప్పండి. అవసరమైతే ఇవ్వండి కూడా. సాధా రణంగా పరిసరాల్లో మార్పులు, కొత్త స్నేహాల వల్లే పిల్లల్లో ఈ మార్పు కనిపిస్తూ ఉంటుంది. సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలిస్తే పరిష్కారం తెలుస్తుంది. మా అమ్మాయి ఈ మధ్యనే మెచ్యూర్ అయ్యింది. ఓ నెల రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత స్కూల్‌కి పంపించడం మొదలు పెట్టాం. అయితే తను ఇంతకుముందులా ఆటలు ఆడటం లేదని, ఎవరితోనూ సరదాగా గడపడం లేదని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఇంట్లో కూడా హుషారుగా ఉండటం లేదు. డల్‌గా ఉండటం లేదు కానీ తన పని తాను సెలైంట్‌గా చేసుకుని పోతోంది. బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. పైగా ఎవరితోనైనా మాట్లాడమన్నా, ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్లను చూసి ముడుచుకు పోతోంది. మెచ్యూర్ అవ్వడం వల్ల మాన సికంగా ఏదైనా సమస్య వచ్చిందా అని నాకు భయమేస్తోంది. ఇప్పుడేం చేయాలి? - అనిత, ఖమ్మం సమస్య ఏమిటని పాపనే అడిగి చూడాల్సింది. అది ఇప్పుడైనా చేయండి. ఇదేమీ మానసిక వ్యాధి కాదు. మెచ్యూర్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్య రాదు. కాకపోతే దాని గురించి పాప ఆలోచించే విధానం వల్ల వచ్చి ఉండాలి. తను ఇంతవరకూ చిన్నపిల్ల. ఇప్పుడు సడెన్‌గా పెద్దదయ్యిందని అందరూ అని వుంటారు. దాంతో తను ఇంతకు ముందులా ఇంట్లోను, బయట ఉండలేను, ఆడుకోలేను అని ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదంటే తాను పెద్దది అయ్యింది కాబట్టి కాస్త పద్ధతిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అదీ కాదంటే... మెచ్యూర్ అయినప్పుడు తనను అందరూ ప్రత్యేకంగా చూడటం వల్ల తనలో సిగ్గు పెరిగి ఉండవచ్చు. కారణం తెలియాలంటే తనతో మాట్లాడి తీరాల్సిందే. అది సిగ్గో భయమో మరేదైనా కారణమో తెలిస్తే దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయవచ్చు. మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చాలా అల్లరివాడు. ఇల్లు పీకి పందిరేసేవాడు. అయితే చదువులో ఎప్పుడూ ముందుండేవాడు కాబట్టి ఏమీ అనేవాళ్లం కాదు. అయితే ఏడో తరగతి పూర్తయ్యాక తనలో బాగా మార్పు వచ్చింది. ఒక్కసారిగా సెలైంట్ అయిపోయాడు. చదువు మీద కూడా అశ్రద్ధ కనిపిస్తోంది. ఏమైందని అడిగినా చెప్పడం లేదని డాక్టర్‌కి చూపించాం. ఏడీహెచ్‌డీ అన్నారు. నాకు తెలిసి ఆ సమస్య వచ్చిన పిల్లలు హైపర్‌గా ఉంటారు. కానీ వీడు డల్ ఎందుకయ్యాడు అని అడిగితే ఇలాక్కూడా జరుగుతుంది అన్నారు. అది నిజమేనా? వాడికిప్పుడు ఏ చికిత్స చేయాలి? - వి.రాజేంద్రప్రసాద్, సికింద్రాబాద్ ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలంతా హైపర్ యాక్టివ్‌గా ఉండాలని లేదు. కొంతమందికి కేవలం కాన్సన్ట్రేషన్ ప్రాబ్లెమ్ ఉంటుంది. వీళ్లు చిన్నప్పట్నుంచీ చదువు మీద శ్రద్ధ చూపలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ హైపర్ యాక్టివ్‌గా ఉండరు. ఇంకొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. చదువు మీద కూడా శ్రద్ధ చూపలేరు. అయితే కొందరు పెద్దయ్యాక వాళ్లలో హైపర్ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ ప్రాబ్లెమ్ మాత్రమే మిగులుతుంది. అలాగే కొంతమంది పిల్లలకు చిన్నప్పుడు మంచి మార్కులే వస్తాయి. తర్వాత తగ్గిపోతాయి. కారణం... చిన్న క్లాసెస్‌లో ఎక్కువసేపు కూర్చుని చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, పెద్ద క్లాసెస్‌కి వెళ్లేసరికి ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేక పోతుంటారు. అందుకే మార్కులు తగ్గుతాయి. కాబట్టి బాబును బద్ధకస్తుడనో మొద్దు అనో విసుక్కోవద్దు. చైల్డ్ సైకియాట్రిస్టుతో మందులు ఇప్పించండి. బిహేవియరల్ థెరపీ చేయించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
మంచికే చెబుతున్నా... మొరాయిస్తే ఎలా?
కిడ్స్ మైండ్స్ మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. మొన్నటి వరకూ బాగానే ఉండేవాడు. కానీ ఈ మధ్య వాడి ప్రవర్తనలో తేడా వస్తోంది. ఏదైనా సలహా ఇవ్వబోతే నాకు తెలుసులే అంటున్నాడు. నేనేం చిన్నపిల్లాడినా, వచ్చే యేడు కాలేజీకి కూడా వెళ్లబోతున్నా కదా అంటాడు. ఫ్రెండ్స్‌తో షికార్లు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇంతకు ముందులా స్కూలు అవ్వగానే తిన్నగా ఇంటికి రావడం లేదు. సరదాగా ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఈ నిర్లక్ష్యం వాడి చదువు మీద ప్రభావం చూపుతుందేమోనని భయంగా ఉంది. అసలే పదో తరగతి కదా! ఇప్పుడేం చేయాలో సలహా ఇవ్వండి? - సంగీత, హైదరాబాద్ బాబు స్నేహితులలో మార్పేమైనా వచ్చిందేమో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొత్త స్నేహితులు వచ్చినప్పుడు మన పిల్లల ప్రవర్తనపై వారి ప్రభావం కనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం తప్పేమీ కాదు. కానీ మీతో చెప్పకుండా, స్కూలు నుంచి డెరైక్ట్‌గా వెళ్లిపోవడం మాత్రం తప్పు. ఈ వయసులో పిల్లలు కొద్దిగా స్వాతంత్య్రాన్ని కోరుకోవడం, తీసుకోవడం మొదలవుతుంది. పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి ఇంతకు ముందులా ప్రతిదీ మీకు చెప్పి చేయరు, మీరు చెప్పింది వినరు. కానీ మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం అంత మంచిది కాదు. ఏది సబబు, ఏది కాదు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అన్నది వాళ్లకి తెలియాలి. కాబట్టి ఓసారి కూర్చోబెట్టి బాబుతో వివరంగా మాట్లాడండి. మీ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని చెప్పండి. వెళ్తే ఎలాంటి సమస్యలు రావొచ్చో కూడా వివరించండి. అలా అని మరీ రిస్ట్రిక్ట్ చేయకుండా కాస్త ఫ్రీగా వదలండి. కాకపోతే ఏ రూల్స్ కచ్చితంగా పాటించి తీరాలన్నది తనకు స్పష్టం చేయండి. వాటి విషయంలో మీరు కూడా స్ట్రిక్ట్‌గా ఉండండి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. చాలా చలాకీగా ఉంటాడు. కానీ ఎందుకో మాటలే సరిగ్గా రావడం లేదనిపిస్తోంది. గడగడా మాట్లాడలేడు. ఆగి ఆగి మాట్లాడతాడు. ఏదో ఆచి తూచి మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. కొన్ని పదాలు నత్తినత్తిగా పలుకుతాడు. తనకి ఏదైనా సమస్య ఉందంటారా? - వరప్రసాద్, ఏలూరు బాబుకి మాటలు ఇంకా పూర్తిగా వచ్చినట్టు లేదు. కొంతమంది పిల్లలకు మాటలు రావడం కాస్త ఆలస్యం కావొచ్చు. నత్తిగా మాట్లాడం కూడా స్పీచ్ ప్రాబ్లెమే. తనని ఓసారి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్లండి. వాళ్లు ఇచ్చే థెరపీ ద్వారా బాబుకి మాటలు బాగా వస్తాయి. నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే మా బాబుని బాగా చదివించాలని అనుకుంటున్నాను. వాడిప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు. వాడిని మంచి స్థాయిలో చూడాలన్నది నా కల. అయితే మేము కాస్త వెనుకబడిన ప్రాంతంలో ఉంటున్నాం. అందుకే ఏడో తరగతికి తనని సిటీలోని ఓ మంచి స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నాను. కానీ హాస్టల్లో ఉండటానికి బాబు అస్సలు ఒప్పుకోవడం లేదు. ముందుగానే చెబితే తను ప్రిపేరవుతాడనుకున్నాను. కానీ చెప్పీ చెప్పడంతోనే వాడు బెంగ పెట్టేసుకున్నాడు. ఎట్టి పరిస్థితిల్లోనూ హాస్టల్‌కి వెళ్లనని, మమ్మల్నందరినీ వదిలి ఉండలేనని తెగేసి చెప్తున్నాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? - వై.రాజేంద్ర, ఎస్.కోట బాబును బయటకు పంపడమే తన భవిష్యత్తుకు మంచిదని మీరు నమ్ముతుంటే... తను బాధపడినా కూడా వెనకడుగు వేయకండి. అసలు మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు దూరంగా పంపాలనుకుంటున్నారు, అది తన భవిష్యత్తుకు ఎంత అవసరం అనేది వివరంగా చెప్పండి. తను ఇప్పటివరకూ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బాధపడటం, వెళ్లనని అనడం సహజం. అది చూసి మీకూ బాధ కలుగుతుంది. కానీ తప్పదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసి తనని కన్విన్స్ చేయాలి కదా! కాబట్టి మీరు కాస్త కఠినంగా వ్యవహరించి తనని హాస్టల్లో చేర్పించండి. కొత్తలో తరచూ ఫోన్లలో మాట్లాడితే దగ్గరగా ఉన్నట్లు ఫీలవుతాడు. మీరు వీలైనన్నిసార్లు వెళ్లి చూడటం, శెలవులు వచ్చినప్పుడు తనను ఇంటికి తీసుకు రావడం చేస్తుంటే... హాస్టల్లో ఉన్నా మీరందరూ తనను పట్టించు కుంటున్నారన్న ధైర్యం కలుగుతుంది తనకి. కాబట్టి తన బాధ చూసి సంశయించి మీరు వెనకడుగు వేయకుండా, తన భవిష్యత్తు కోసం మీ నిర్ణయాన్ని అమలు జరపండి. మొదట్లో కాస్త బెంగగా, బాధగా ఉంటాడు కానీ మెల్లగా అలవాటు పడిపోతాడు. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్