బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి? | how to control the child mind set at school? | Sakshi
Sakshi News home page

బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి?

Published Sat, Feb 20 2016 9:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి?

బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి?

కిడ్స్ మైండ్స్
మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ మధ్య తన మాట తీరులో చాలా తేడా వచ్చింది. ఏదైనా అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. పైగా కొన్ని సందర్భాల్లో బూతులు మాట్లాడటం విన్నాను. రెండు తగి లిస్తే ఇంకెప్పుడూ అలా మాట్లాడనన్నాడు. కానీ స్కూల్లో కూడా అలాగే మాట్లాడుతున్నాడని టీచర్ కంప్లయింట్ చేశారు. ఉన్నట్టుండి ఎందుకిలా అయ్యాడు? తననెలా మార్చాలి?
 - జె.సుధారాణి, తణుకు

 
సాధారణంగా పిల్లలు టీనేజ్‌లో ఎదురు తిరుగుతారు తప్ప ఆరో తరగతిలోనే అలా చేయడం జరగదు. ఈ వయసులో ఇలాంటి మార్పు, అందు లోనూ సడెన్‌గా రావడం అనేది ఆలో చించాల్సిన విషయం. స్కూల్లోగానీ బయటగానీ ఎవరితోనైనా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటున్నా డేమో చూడండి. ఆ ఫ్రెండ్ అలవాట్లను గమనించండి. తన వల్లే బాబులో ఈ మార్పు అనుకుంటే తనకి కాస్త దూరంగా పెట్టండి.

అలాంటి కారణమేమీ కనిపించక పోతే... ఓసారి జాగ్రత్తగా లాలించి అడ గండి... ఎందుకిలా చేస్తున్నావని. అలా చేయడం వల్ల తనకెంత చెడ్డపేరొస్తుందో వివరించండి. మానుకుంటే మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. మానకపోతే పని ష్మెంట్ ఉంటుందని కూడా చెప్పండి. అవసరమైతే ఇవ్వండి కూడా. సాధా రణంగా పరిసరాల్లో మార్పులు, కొత్త స్నేహాల వల్లే పిల్లల్లో ఈ మార్పు కనిపిస్తూ ఉంటుంది. సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలిస్తే పరిష్కారం తెలుస్తుంది.
 
మా అమ్మాయి ఈ మధ్యనే మెచ్యూర్ అయ్యింది. ఓ నెల రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత స్కూల్‌కి పంపించడం మొదలు పెట్టాం. అయితే తను ఇంతకుముందులా ఆటలు ఆడటం లేదని, ఎవరితోనూ సరదాగా గడపడం లేదని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఇంట్లో కూడా హుషారుగా ఉండటం లేదు. డల్‌గా ఉండటం లేదు కానీ తన పని తాను సెలైంట్‌గా చేసుకుని పోతోంది. బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. పైగా ఎవరితోనైనా మాట్లాడమన్నా, ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్లను చూసి ముడుచుకు పోతోంది. మెచ్యూర్ అవ్వడం వల్ల మాన సికంగా ఏదైనా సమస్య వచ్చిందా అని నాకు భయమేస్తోంది. ఇప్పుడేం చేయాలి?
 - అనిత, ఖమ్మం

 
సమస్య ఏమిటని పాపనే అడిగి చూడాల్సింది. అది ఇప్పుడైనా చేయండి. ఇదేమీ మానసిక వ్యాధి కాదు. మెచ్యూర్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్య రాదు. కాకపోతే దాని గురించి పాప ఆలోచించే విధానం వల్ల వచ్చి ఉండాలి. తను ఇంతవరకూ చిన్నపిల్ల. ఇప్పుడు సడెన్‌గా పెద్దదయ్యిందని అందరూ అని వుంటారు. దాంతో తను ఇంతకు ముందులా ఇంట్లోను, బయట ఉండలేను, ఆడుకోలేను అని ఆలోచిస్తూ ఉండవచ్చు.

లేదంటే తాను పెద్దది అయ్యింది కాబట్టి కాస్త పద్ధతిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అదీ కాదంటే... మెచ్యూర్ అయినప్పుడు తనను అందరూ ప్రత్యేకంగా చూడటం వల్ల తనలో సిగ్గు పెరిగి ఉండవచ్చు. కారణం తెలియాలంటే తనతో మాట్లాడి తీరాల్సిందే. అది సిగ్గో భయమో మరేదైనా కారణమో తెలిస్తే దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయవచ్చు.
 
మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చాలా అల్లరివాడు. ఇల్లు పీకి పందిరేసేవాడు. అయితే చదువులో ఎప్పుడూ ముందుండేవాడు కాబట్టి ఏమీ అనేవాళ్లం కాదు. అయితే  ఏడో తరగతి పూర్తయ్యాక తనలో బాగా మార్పు వచ్చింది. ఒక్కసారిగా సెలైంట్ అయిపోయాడు. చదువు మీద కూడా అశ్రద్ధ కనిపిస్తోంది. ఏమైందని అడిగినా చెప్పడం లేదని డాక్టర్‌కి చూపించాం. ఏడీహెచ్‌డీ అన్నారు. నాకు తెలిసి ఆ సమస్య వచ్చిన పిల్లలు హైపర్‌గా ఉంటారు. కానీ వీడు డల్ ఎందుకయ్యాడు అని అడిగితే ఇలాక్కూడా జరుగుతుంది అన్నారు. అది నిజమేనా? వాడికిప్పుడు ఏ చికిత్స చేయాలి?
 - వి.రాజేంద్రప్రసాద్, సికింద్రాబాద్

 
ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలంతా హైపర్ యాక్టివ్‌గా ఉండాలని లేదు. కొంతమందికి కేవలం కాన్సన్‌ట్రేషన్ ప్రాబ్లెమ్ ఉంటుంది. వీళ్లు చిన్నప్పట్నుంచీ చదువు మీద శ్రద్ధ చూపలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ హైపర్ యాక్టివ్‌గా ఉండరు. ఇంకొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. చదువు మీద కూడా శ్రద్ధ చూపలేరు. అయితే కొందరు పెద్దయ్యాక వాళ్లలో హైపర్ యాక్టివ్‌నెస్ తగ్గిపోతుంది. కాన్సన్‌ట్రేషన్ ప్రాబ్లెమ్ మాత్రమే మిగులుతుంది. అలాగే కొంతమంది పిల్లలకు చిన్నప్పుడు మంచి మార్కులే వస్తాయి.

తర్వాత తగ్గిపోతాయి. కారణం... చిన్న క్లాసెస్‌లో ఎక్కువసేపు కూర్చుని చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, పెద్ద క్లాసెస్‌కి వెళ్లేసరికి ఎక్కువసేపు కాన్సన్‌ట్రేట్ చేయలేక పోతుంటారు. అందుకే మార్కులు తగ్గుతాయి. కాబట్టి బాబును బద్ధకస్తుడనో మొద్దు అనో విసుక్కోవద్దు. చైల్డ్ సైకియాట్రిస్టుతో మందులు ఇప్పించండి. బిహేవియరల్ థెరపీ చేయించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.
- డా॥పద్మ పాల్వాయ్
 చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement