గౌతమ్ పుట్టినప్పుడు ఆందోళన చెందాం: నమ్రత
హైదరాబాద: ‘గౌతమ్ నెలలు నిండక ముందే తక్కువ బరువు (1.46 కేజీలు)తో పుట్టాడు. అందరిలాగే నేను కూడా బాబు శారీరక, మానసిక ఎదుగుదలపై ఆందోళన చెందాను’ అని సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ చెప్పారు. వరల్డ్ ప్రిమెచ్యూర్ డేను పురస్కరించుకుని గురువారం హోటల్ తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను కాపాడటంలో వైద్యులు చేస్తున్న కృషి మరిచిపోలేనిదని చెప్పారు.
రెయిన్‌బో ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ డెరైక్టర్ డాక్టర్ దినేష్ చీరాల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 మిలియన్ల మంది నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మిస్తుండగా, ఇందులో ఒక్క భారతదేశంలోనే 36 లక్షల ప్రిమెచ్యూర్ జననాలు చోటు చేసుకుంటుడంటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుమారు 200 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.