మహేశ్‌ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్‌లో ఉన్నప్పుడు.. | Namrata shirodkar Says Mahesh Babu Wants Her to Quit Movies | Sakshi
Sakshi News home page

Namrata shirodkar: టాప్‌హీరోయిన్‌ కావాలని... మహేశ్‌ వల్లే నటనకుదూరం

Mar 6 2025 4:40 PM | Updated on Mar 6 2025 5:11 PM

Namrata shirodkar Says Mahesh Babu Wants Her to Quit Movies

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ హీరోలు హీరోయిన్లను పెళ్లాడడం జరుగుతూనే ఉంది. అయితే గతంలో పెళ్లి తర్వాత హీరోయిన్లు తప్పనిసరిగా తమ నటన కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం  ఆ పరిస్థితి లేదు. పెళ్లి తర్వాత కూడా టాప్‌ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే మహేశ్‌బాబు (Mahesh Babu)ను పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్న అప్పటి స్టార్‌ హీరోయిన్‌ నమ్రత (Namrata Shirodkar) మాత్రం నటనను వదిలేసుకున్నారు. మరి ఇప్పటి పరిస్థితిని చూసి ఆమె ఎలా ఫీల్‌ అవుతున్నారు? 

అందాల కిరీటం అందుకున్న నమ్రత
ఎందుకంటే అప్పట్లో అందాల కిరీటం అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దేశంలోని అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్‌... మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిస్తే ఎకాఎకిన సినిమాల్లోకి వచ్చేసినట్టే. ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh Babu) సతీమణిగా గ్లామర్‌ రంగానికి దూరంగా ఉన్న నమ్రత శిరోద్కర్‌ తొలిసారిగా 1993లో ఫెమినా మిస్‌ ఇండియాగా కిరీటాన్ని పొందిన ఘనత దక్కించుకుంది. దాంతో  అప్పటి బాలీవుడ్‌ టాప్‌ హీరో సంజయ్‌ దత్‌, మళయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి సరసన నటించేందుకు వరుస అవకాశాలు వచ్చాయి. 

అప్పుడు హీరోయిన్‌గా.. ఇప్పుడు ఇల్లాలిగా..
మెగాస్టార్‌ చిరంజీవితో కూడా నమ్రత నటించింది. తన సినీరంగ ప్రవేశం జరిగి మూడు దశాబ్ధాల తర్వాత... ప్రస్తుతం  ఆమె టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు భార్యగా చక్కని సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడు తెర వెనుక పూర్తి జీవితాన్ని అనుభవిస్తోంది మాజీ నటి నమ్రతా శిరోద్కర్‌. ఆమె 1998లో హిందీ 'ఎల్‌ఎమ్‌ జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై'తో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. నమ్రత కెరీర్‌.. హిందీ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళంతో సహా పలు భాషల్లో విస్తరించింది. ఆమె హీరో హిందుస్తానీ, పుకార్, అస్తిత్వ, దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్, తెహసీబ్, ఇన్సాఫ్‌: ది జస్టిస్‌ వంటి అనేక రకాల టాప్‌ మూవీస్‌లో నటించింది. 

వంశీ సినిమాతో మొదలు..
ఎజుపున్న తారకన్‌ చిత్రం ద్వారా ఆమె మలయాళ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. అదే క్రమంలో 2000లో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన వంశీతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. వంశీ సినిమా ద్వారానే వారిద్దరూ సన్నిహితంగా మారారు. ఆ సినిమా షూటింగ్‌ కోసం  52 రోజుల పాటు న్యూజిలాండ్‌లో గడిపారు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది.  వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

పెళ్లికి ముందే కండీషన్‌
అయితే ఆ సమయంలో మహేశ్‌ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా నమ్రత మహేశ్‌ కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది కావడం, హిందీ చిత్రసీమకు చెందిన సినీనటిని కోడలిగా తెచ్చుకోవడానికి ఇష్టపడకపోవడం చిక్కులు తెచ్చిపెట్టింది. చివరికి, వారు అన్ని అడ్డంకులను అధిగమించి 2005లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక మహేశ్‌బాబు నటనకు స్వస్తి చెప్పాలని కోరడంతో పెళ్లికి ముందే నమ్రత తన కమిట్మెంట్స్‌ అన్నీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత  నమ్రత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు ఆ విషయం వెల్లడైంది.

రిలేషన్‌లో ఉన్నప్పుడే..
తామిద్దరూ రిలేషన్‌షిప్‌ ఉన్నప్పుడే మహేశ్‌ తనకు ఈ విషయాన్ని చెప్పాడని నమ్రత అంటోంది. నటించడం నచ్చక లేదా నటిగా కొనసాగడం నచ్చకే మహేష్‌ అలా అన్నాడా? అంటే ‘అదేమీ కాదు. ‘మహేశ్‌కు ఇంటిని దిద్దుకునే  భార్య కావాలి. నేను వేరే ఏదైనా ఉద్యోగంలో ఉండి ఉంటే కూడా అతను నన్ను ఆ జాబ్‌ వదిలేయమని అడిగేవాడు’’ అనేది నమ్రత సమాధానం. ఒకవేళ తాను సినిమాల్లో కొనసాగి ఉంటే మరింత అగ్రస్థానంలో ఉండేదేమో కదా! అని ఎవరైనా అంటే.. ‘‘నాకెప్పుడూ కూడా టాప్‌ హీరోయిన్‌ని కావాలనే కోరిక  లేదు, కాబట్టి నేను నటించడం మానేయాల్సి వచ్చినప్పుడు, ఏ మాత్రం నిరాశ చెందలేదు.‘ అని నమ్రత స్పష్టం చేసింది. 

అర్థం చేసుకున్న మహేశ్‌
‘నేను ముంబైలో  నివసించిన పరిస్థితులకు  మహేశ్‌తో కలిసి హైదరాబాద్‌లో పెద్ద  బంగ్లాకు మారడం నాకు చాలా కష్టమైన మార్పు. ఇది అర్థం చేసుకున్నాడు మహేశ్‌. దాంతో మా పెళ్లి తర్వాత, కొంతకాలం మేం ముంబైలో ఉండిపోయాం’’ అంటూ చెప్పుకొచ్చారు నమ్రత.  అయితే నమ్రత, మహేశ్‌ విడిపోయారని, నమ్రత తమ కొడుకుతో కలిసి ముంబైకి వెళ్లారని అప్పట్లో కొన్ని పుకార్లు షికారు చేశాయి. ‘నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను అలాగే కొన్ని విభేదాల వల్ల కొంతకాలం విడిగా ఉన్నాము.

మహేశ్‌ విజయం వెనక నమ్రత
కానీ ఆ సమయంలో, మేము మా అనుబంధంలోని బలం స్పష్టతను కనుగొన్నాం’’ అంటూ చెప్పారామె. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ మహిళ ఉందంటారు.. ’మహేశ్‌బాబు తన విజయానికి కీలకం అని నమ్రతను తరచుగా అంటుంటాడు.  తన భర్త నిర్మాణ సంస్థ అయిన జి. మహేష్‌ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే నమ్రత తన కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. సక్సెస్‌ఫుల్‌ భార్యగా, తల్లిగా ఇంటిని తీర్చిదిద్దుతోంది.
-సత్యబాబు

చదవండి:  బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్‌.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement