Dr. Padma palvai
-
వాణ్ణే కంటే పోలా?
ఊళ్లో పిల్లలందరికంటే ‘మావాడే గ్రేట్’ అని డబ్బా కొట్టుకుని.. పిల్లల్ని చెడగొట్టుకోవడం ఒక తంతైతే.. పక్కింటివాడిలా, పొరుగింటి వాడిలా నువ్వెందుకు లేవు? వాడిలా ఎందుకు లేవు? వీడిలా ఎందుకు లేవు.. అని పిల్లల్ని పోల్చడం.. ఇంకా డేంజరస్. ‘వాడెవడో.. నాకంటే అంత గొప్పోడైతే.. వాణ్ణే కంటే పోలా’ అని ఏ బిడ్డయినా అనుకుంటే?! చిన్న పిల్లల్ని చిన్నబుచ్చకండి. మీ ఆశయాలతో చిత్రహింసలు పెట్టకండి. వాడూ వజ్రమే! సానబట్టండి... సాధించకండి!! ‘అంకుల్, మ్యాథ్స్ నోట్‌బుక్ కావాలి’బడి ఆవరణలోనే ఉన్న స్టేషనరీ షాప్‌లోకి వెళ్లి అడిగాడు బంటి. తీసి ఇచ్చాడు షాప్ ఓనర్. చూసి ‘అంకుల్.. దేవుడి బొమ్మ కవర్ ఉన్నది కావాలి’ అన్నాడు. వినాయకుడి బొమ్మ ఉన్న బుక్ ఇచ్చాడు షాప్ ఓనర్. ‘అబ్బ.. నాకిష్టమైన గాడ్’ అని ఆ బుక్‌ను గుండెకానించుకుని షాప్ ఓనర్‌కి 20 రూపాయల నోటిచ్చి వెనక్కి తిరిగాడు బంటీ. క్లాస్రూమ్ వైపు నడుస్తూ ఆ కొత్త నోట్‌బుక్‌ను అలాగే గుండెకానించుకుని ‘దేవుడా.. దేవుడా.. నాకు మ్యాథ్స్ వచ్చేట్టు చూడు.. టీచర్‌తో తిట్లు తప్పేట్లు చూడు’ అని మనసులోనే దండం పెట్టుకున్నాడు బంటీ. వినాయకుడూ విష్ చేయలేదు బంటీ థర్డ్‌క్లాస్ స్టూడెంట్. చదువుకన్నా ఆటలంటే ఆసక్తి ఎక్కువ. ఇంగ్లిష్, సోషల్ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్‌లో అంతంతమాత్రమే. లెక్కలంటే భయం. దాంతో లెక్కల టీచర్ అన్నా, లెక్కల పీరియడ్ అన్నా.. లెక్కల ట్యూటర్ అన్నా.. చివరకు అమ్మ ఏదైనా కొనుక్కురమ్మని పంపి, వచ్చాక లెక్కలు అడిగినా వణుకే. అందుకే మొన్న వినాయక చవితికి వినాయకుడి దగ్గర వాడు లెక్కల పుస్తకమే పెట్టాడు. లెక్కల క్లాస్‌లో టీచర్ కొట్టొద్దని అమ్మ వాళ్లు చూడకుండా 101 గుంజీళ్లు తీశాడు. ఇప్పుడు వినాయకుడి బొమ్మ ఉన్న నోట్‌బుక్ కొనుక్కున్నాడు. లెక్కల పీరియడ్ గంట మోగనే మోగింది. టీచర్ వచ్చింది. ప్రేయర్ అప్పుడు టీచర్ కనపడకపోతే.. సేఫ్ అనుకొని సంబరపడ్డాడు. క్లాస్‌లో ప్రత్యక్షమైన టీచర్‌ను చూడగానే ఆ ఆనందమంతా ఆవిరైపోయింది వాడిలో. అయినా ఎక్కడో ఏ మూలో నమ్మకం దేవుడి మీద. లెక్కలన్నీ వచ్చేట్టు చూస్తాడని.. టీచర్ చేత చీవాట్లు తప్పిస్తాడని. ఆ రోజు సబ్స్ట్రాక్షన్స్ క్లాస్. చెప్పి, రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చింది సాల్వ్చేయమని క్లాస్ వర్క్ కింద. బంటీ ‘దేవుడి బొమ్మ కొత్త నోట్‌బుక్‌కి బోణీ’ ఆ తీసివేతలు. పదిసార్లు ఆ వినాయకుడికి దండం పెట్టుకొని ఇచ్చిన రెండు లెక్కలను చేసి.. టీచర్ దగ్గరకు వెళ్లాడు చూపించడానికి. నోట్‌బుక్‌ను టీచర్‌కు ఇచ్చేముందు కూడా ఆ దేవుడిని గుండెకు హత్తుకొని కళ్లుమూసుకున్నాడు. ఈలోపే టీచర్ వాడిచేతిలోంచి నోట్‌బుక్‌ను లాక్కుంది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. టీచర్ మొహంలోని భావాలను గమనించసాగాడు భయం భయంగా. రెడ్ ఇంక్ పెన్‌తో ఆ రెండు లెక్కల మీద ఇంటూ మార్క్స్ పెట్టేసింది పెద్దగా. మొహం చిట్లించి బంటీవైపు తిరిగింది. అయిపోయింది అంతా అయిపోయింది. దేవుడు కూడా చీట్ చేశాడు. ‘‘ఒరేయ్ మొద్దు.. ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు? వీళ్లంతా చేస్తున్నారు.. నీకేమైంది? అడిషన్స్‌లో ఫెయిల్.. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్కూడా రావట్లేదు.. ఎలారా..?’’ చెడామడా తిట్టింది. కొట్టడానికి చెక్క స్కేల్‌ను కూడా పైకెత్తింది. వణుకుతున్న చేయిని చాపి.. గట్టిగా కళ్లు మూసుకొని నిలబడ్డాడు బంటీ. వాడి కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి. ఏమనుకుందో ఏమో టీచర్.. ఒరేయ్.. ఈ నోట్స్ మీద రేపు మీ పేరెంట్స్ సైన్ తీసుకుని రా.. ’ అని పురమాయించి, వెళ్లి కూర్చోమంది. రాత్రి ఇంట్లో.. ‘ఇన్నిన్ని ఫీజులు.. మళ్లీ అంత డబ్బుపోసి ట్యూషన్ పెట్టినా.. వీడికి చదువురావట్లేదు. మ్యాథ్స్‌లో అయితే మరీ పూర్ అవుతున్నాడు రోజురోజుకి’ మొదలు పెట్టింది బంటీవాళ్ల అమ్మ భోజనాల దగ్గర. ‘ఆటలు ఎక్కువయ్యాయి.. అన్నీ బంద్ చేయించు.. రోగం కుదిరి చదువు మీద మనసు పెడతాడు’ కంచంలో చేయి, సెల్‌ఫోన్ మీద దృష్టీ నిలుపుతూ అన్నాడు తండ్రి. మొహం ప్లేట్లోనే పెట్టి వింటున్నాడు బంటీ. పక్కనే ఉన్న బంటీ అక్క బబ్లీ భయపడుతోంది ఆ ఉరుము తన మీద కూడా ఎక్కడ గర్జిస్తుందోనని. ‘ఈ రోజు సబ్ట్రాక్షన్స్లో టెస్ట్ పెడితే జీరో మార్క్స్ వచ్చాయి’ ఇంకో నిజం అమ్మ నుంచి బంటీ వాళ్లనాన్నకు ఫిర్యాదు రూపంలో. నాన్న నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని కూర్చున్నచోటే బిగుసుకుపోయాడు బంటీ. ‘మన పక్కఫ్లాట్లో ఉండే అక్షయ్.. వీడి క్లాసే. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్. మ్యాథ్స్‌లో అయితే పర్ఫెక్ట్. వాళ్లమ్మ వాడి గురించి చెప్తుంటే నాకు తలతీసేసినట్టుగా ఉంటోంది’ మళ్లీ కంప్లయింట్. ఈసారి బంటి ఎడమచేయి పిడికిలి బిగుసుకుంది. ‘ఇరవై నాలుగు గంటలూ చదువుతూనే ఉంటాడండీ.. స్కూల్నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్ ముందేసుకొని కూర్చుంటాడు. ఏదడిగినా ఇట్టే చెప్పేస్తాడు.సినిమాలు, షికార్లకు రమ్మని బతిమాలినా వెళ్లడు. చదువు తప్ప మరో ధ్యాస లేదు వాడికి. బంగారం. నా కడుపునా పుట్టారు.. డొక్కచీలిస్తే అక్షరం ముక్కరాని మొద్దులు.. నా ఖర్మ’ గిన్నెలు శబ్దం చేస్తూ కోపంతో వంటింట్లోకి వెళ్లింది బంటీవాళ్లమ్మ. తినడం ఆపేసి కళ్లకిందనుంచి చూశాడు బంటీని వాళ్ల నాన్న. బంటీలో సన్నగా వణుకు మొదలైంది. ‘‘మాలతీ.. ఆ పక్కింటి కుర్రోడిని పిలువు ఒకసారి’’ కేకేశాడు భార్యను. ఆ మాట వచ్చిందే తడవుగా గబగబా పక్కింటికి వెళ్లి అక్షయ్‌ను వెంటబెట్టుకొని వచ్చింది. బంటీ వర్సెస్ అక్షయ్ ‘‘గబుక్కున తినేసిరా హాల్లోకి’’ అని కంచంలోనే చేయి కడుక్కొని వెళ్లిపోయాడు బంటీ వాళ్ల నాన్న. అక్కాతమ్ముళ్లు దిగులుగా మొహాలు చూసుకున్నారు. హాల్లో.. అక్షయ్‌తో బంటీ తల్లీ, తండ్రీ కబుర్లు చెపుతున్నారు. వాడు కళ్లు పెద్దవి చేసి గుండ్రంగా తిప్పుతూ ఉత్సాహంగా సమాధానాలు ఇస్తున్నాడు. అన్నీ డైనింగ్ హాల్లో ఉన్న అక్కాతమ్ముడికి వినపడుతున్నాయి. ఆ ముచ్చట్లలో మూడొంతులు చదువు గురించే ఉంది. అందులోనూ కంపారిజనే. వాడి మాటలు విని అబ్బురపడుతూ బంటీని తక్కువ చేస్తున్నారు ఆ పేరెంట్స్. ఈ ఇద్దరూ ఏదో తిన్నట్టు చేసి చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చేశారు. గమనించిన బంటీ తండ్రి.. అక్షయ్‌తో.. ‘‘ఏదీ నైన్త్ టేబుల్ చెప్పు నాన్నా..’’ అన్నాడు ముద్దుగా ఒళ్లో కూర్చోబెట్టుకొని. ఆ దృశ్యం చూసి బంటీకి ఒళ్లు మండిపోయింది. అక్షయ్ గుక్క తిప్పుకోకుండా తొమ్మిదో ఎక్కం అప్పజెప్పాడు. అలా మరో రెండు ఎక్కాలడిగితే అవీ చెప్పేశాడు. ఇప్పుడు బంటీ వంక చూసి‘‘ నువ్వు చెప్పు’’ అన్నాడు తండ్రి. ట్రై చేశాడు బంటీ. రాలేదు. వాడి తడబాటు చూసి అక్షయ్ మూతికి చెయ్యి అడ్డంపెట్టుకొని నవ్వసాగాడు. బంటీ మొహం ఎర్రబడింది. అవమానభారంతో ఆ పసిహృదయం తల్లడిల్లింది. తెలియకుండానే అక్షయ్ మీద కసి మొదలైంది. దాన్ని రగిలించే ప్రయత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. ‘ఒరేయ్.. వీడికి గుర్తుండిపోయేలా.. రేపటిలోగా టేబుల్స్ అన్నీ వచ్చేలా చెంప మీదొక్కటివ్వు’ అన్నాడు బంటీ తండ్రి. అక్షయ్ ఉత్సాహంగా రాసాగాడు... తల్లిదండ్రులమీద కోపం, అక్షయ్ పట్ల ఉన్న కసి రెండూ ఆవేశంగా మారాయి బంటీలో. అక్షయ్ ముందుకురాగానే వాడు చెయ్యి ఎత్తేలోపే వాడిని పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టాడు బంటీ. కిందపడేసి కొట్టసాగాడు. అక్కడున్న అందరూ హతాశులయ్యారు బంటీ చర్యకు. వారిస్తుంటే ఆగట్లేదు వాడు. బలవంతంగా వాడిని పక్కకు లాగి అక్షయ్‌ను లేపి వాళ్లింటికి తీసుకెళ్లింది బంటీ వాళ్లమ్మ. కౌన్సెలింగ్ పిల్లలకు కాదు.. ఆవేశం తగ్గని బంటీ స్కూల్ బ్యాగ్ తెచ్చి..‘‘నాకు మ్యాథ్స్ రాదు.. సైన్స్రాదు.. ఏమీ రావు పొండి.. నాకసలు చదువేరాదు.. అక్షయ్ బాగా చదువుతాడు కదా.. వాడినే ఇంట్లో పెట్టుకోండి.. నేనుండను.. నాకు చదువొద్దు’’ అని అరుస్తూ పుస్తకాలన్నీ చించేయసాగాడు. ఈ చర్య బంటీవాళ్ల నాన్నను మరింత షాక్‌కు గురి చేసింది. బబ్లీ ఏడుస్తూ పక్కన బిక్కుబిక్కుమంటూ నిలబడింది. ఈలోపునే వాళ్లమ్మా వచ్చింది. బంటీని చూసి కంగారు పడింది. వాళ్ల నాన్న ఆమె భుజం మీద చేయి వేసి నొక్కాడు కంగారు పడొద్దు అని. ఆ రాత్రి ఆ దంపతులు డిసైడ్ అయ్యారు పిల్లలను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలని. తీరా వెళ్లాక కౌన్సెలింగ్ పిల్లలకు కాదు తల్లిదండ్రులకే కావాలి అని అర్థమైంది సైకియాట్రిస్ట్‌కి. అలా చేస్తే నెగటివ్ ఫలితాలే ఎక్కువ! పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం, క్రమశిక్షణలో పెట్టడం అవసరమే. కాదనడం లేదు. కాని క్రమశిక్షణ పేరుతో వాళ్ల మీద ఒత్తిడి పెట్టడమే చాలా తప్పు. ప్రమాదం కూడా. పిల్లలు బద్ధకంతో చదవట్లేదా లేక లర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్న రెండు విషయాలను పెద్దవాళ్లు గమనించాలి. పిల్లాడు కావాలనే చదవకపోయినా తల్లిదండ్రులు అలా ప్రవర్తించడం తప్పు. ఇలా వేరే పిల్లలతో, లేదా ఇంట్లోనే తోబుట్టువులతో కంపైర్ చేయడం వల్ల పెద్దవాళ్లు ఆశించిన ఫలితాలు రాకపోగా, ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదమే ఎక్కువ. ముందు పిల్లల శక్తిసామర్థ్యాలు, వాళ్ల లర్నింగ్ ఎబిలిటీస్‌ను అంచనా వేసి వాళ్ల లక్ష్యాలు నిర్దేశించాలి. నిజంగానే పోల్చాల్సి వస్తే.. వేరేవాళ్లతో కాకుండా వాళ్లతో వాళ్లనే పోల్చాలి. కిందటిసారి బాగానే చదివావ్.. గుడ్.. ఈసారి ఇంకాస్త కష్టపడు.. ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతావ్ అంటూ పాజిటివ్‌గా మొటివేట్ చేయాలి. అంతేకాని వేరే పిల్లలతో కంపైర్ చేస్తూ .. వీళ్లను కించపర్చడం మాత్రం చాలా తప్పు. దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువని గ్రహించాలి. ఒకవేళ పిల్లలు ఆటలు, పాటలు వంటి ఇతర వ్యాపకాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతుంటే వాటితోపాటు చదువు ఎంత అవసరమో.. దాంతో సాధించే అచీవ్మెంట్స్ కూడా ఎంత గొప్పగా ఉంటాయో పిల్లలకు వివరించాలి. అన్నిటికన్నా ముందు పెద్దవాళ్లు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పిల్లల మీద ఒత్తిడి పెట్టడం అస్సలు మంచిది కాదు. దానివల్ల పిల్లలు మరింతగా మొండికేసే ప్రమాదమే ఎక్కువ. – డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ -
చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!
కిడ్స్ మైండ్స్ * మా బాబు వయసు ఏడేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అల్లరంటే అరవడం, పరుగులు తీయడం కాదు. అన్నీ పగులగొట్టేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలు, ఇంట్లోని ఇతరత్రా వస్తువులు నేలకేసి కొట్టడం వాడికి చాలా ఇష్టం. అంతవరకూ బానే ఉంటాడు. ఉన్నట్టుండి చేతిలో ఉన్నదాన్ని విసిరి కొడతాడు. తిట్టినా, కొట్టినా వినడం లేదు. ఈ అలవాటు ఎలా పోగొట్టాలి? - వాణి, పాలకొల్లు హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఒక్క దగ్గర కూర్చోరు. పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి పిల్లలు ఇలా చేసే అవకాశాలు ఎక్కువ. కాకపోతే బాబు మరే విధమైన అల్లరీ చేయకుండా కేవలం విసిరి కొట్టడం మాత్రమే చేస్తున్నాడు. బహుశా ఇలా చేయడాన్ని తను ఎక్కడైనా చూసి ఉండవచ్చు. లేదంటే తను అలా ఒకట్రెండుసార్లు చేసినప్పుడు అటెన్షన్ దొరకడం వల్ల అది తనకు అలవాటైపోయి ఉండవచ్చు. దీన్ని మాన్పించాలంటే మీరొక పని చేయండి. దేనినైనా పగులగొడితే ‘టైమ్ అవుట్’ ఇస్తానని క్లియర్‌గా చెప్పండి. ‘టైమ్ అవుట్’ అంటే... తప్పు చేసినప్పుడు తనని తీసుకెళ్లి ఓ మూలన కూర్చోబెట్టి, అక్కడి నుంచి లేస్తే ఆ రోజు టీవీ చూడనివ్వననో ఆడుకోనివ్వననో చెప్పడం. వినడానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ఫలితాలనిస్తుంది. మొదట్లో బాబు లైట్‌గా తీసుకున్నా, నాలుగైదుసార్లు అలా చేసేసరికి తాను ఏం మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది. అలాగే మీరు ఇలా చేయడం ఎంత ముఖ్యమో... బాబు బుద్ధిగా ఉన్నప్పుడు మెచ్చుకోవడమూ అంతే ముఖ్యం. దానివల్ల మంచిగా ఉంటే మెప్పుకోలు వస్తుందన్న విషయం కూడా అర్థమై తనలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. * మా పాపకు ఎనిమిదేళ్లు. పెద్దగా అల్లరి చేయదు. బాగా చదువుతుంది కూడా. అయితే ఎందుకో ఈ మధ్య అబద్ధాలు ఆడుతోంది. హోమ్‌వర్క్ చేయకపోయినా చేశానంటుంది. టీచర్ ఏదైనా అన్నా, స్నేహితులతో గొడవ పడినా మాకు చెప్పడం లేదు. విషయం తెలిసి మేము నిలదీసినా ఏదేదో చెప్తోంది తప్ప నిజం చెప్పట్లేదు. పోనీ మేం తిడతామని భయపడుతోందా అంటే... నేను అస్సలు కోప్పడను. మావారు నాకంటే కూల్. అయినా ఎందుకిలా చేస్తోందంటారు? - మంజూష, చెన్నై మీది కోప్పడే తత్వం కాకపోయినా ఒక్కో సారి పిల్లలు నిజం చెప్పడానికి భయపడ వచ్చు. కాబట్టి తనను కూర్చోబెట్టి కూల్‌గా మాట్లాడండి. అబద్ధం చెప్పడం తప్పు, నిజమే చెప్పాలి అని చెప్పండి. మేమేమీ అనం, నువ్వు నిజాలే చెప్పు, అలా చెబితే మేం సంతోషపడతాము అంటూ వివరించండి. తను నిజం చెప్పినప్పుడు బాగా మెచ్చుకోండి. వీలైతే ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అలాగే అబద్ధం చెప్పినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల తనకు మంచికుండే విలువ, చెడు వల్ల కలిగే ఫలితం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని చేసినా కూడా పాప మారకపోతే మాత్రం వెంటనే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తమదైన పద్ధతిలో పాప అలవాటును తప్పకుండా మార్చగలుగుతారు. * మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. టీవీ విపరీతంగా చూస్తాడు. అయితే చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. అందుకే ఎప్పుడూ ఏమీ అనం. కాకపోతే వాడు చిన్నపిల్లలు చూసేవేమీ చూడడు. డిస్కవరీ, కార్టూన్ చానెల్స్ పెట్టడు. క్రైమ్‌స్టోరీలు, హారర్ స్టోరీలు చూస్తుంటాడు. సినిమాలు చూసినా ఇంగ్లిష్ యాక్షన్ మూవీసే చూస్తాడు. ఇది వాడి మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందేమో నని భయమేస్తోంది. అయినా కానీ ఆ అలవాటు మాన్పించలేకపోతున్నాం. ఏదైనా సలహా చెప్పండి. - శ్రీనివాసరావు, నంద్యాల బాబు బాగా చదవడం సంతోష కరమైన విషయం. కానీ ఎంత బాగా చదివినా టీవీ ఎక్కువసేపు చూడడం మాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి బరువు పెరుగుతారు. ఇతర పిల్లలతో ఆడడం తగ్గిపోయి, వయసుకు తగిన సోషల్ బిహేవియర్ నేర్చుకోలేరు. ఇంకా పెద్ద క్లాసులకు వెళ్లినప్పుడు చదువుపై కూడా ప్రభావం పడుతుంది. ఎంత మంచి ప్రోగ్రాములైనా సరే, ఒక గంటకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వకండి. అంటే.... టీవీ, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్ వంటివి ఏవైనా కూడా గంటను మించి చూడనివ్వకండి. అలాగే మీ బాబు పెద్దవాళ్ల ప్రోగ్రాములు చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి తను చూడకూడని చానెల్స్ని లాక్ చేసేయండి. ఆ సౌకర్యం టీవీల్లో ఉంటోంది. అన్నిటికంటే ముందు మీరు తను టీవీ చూసే టైమును స్ట్రిక్ట్‌గా తగ్గించేయండి. ఏడ్చినా, అరిచినా, ఎంత గోల చేసినా అందులో మార్పు చేయకండి. తర్వాత సమస్య దానికదే పరిష్కారమవుతుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
అరిచి గోల చేస్తోంది... ఆపేదెలా?
కిడ్స్ మైండ్స్ మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. తను అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడూ పరుగులు తీస్తూ, గెంతుతూ ఉంటాడు. అవీ ఇవీ ఎక్కి దూకుతుంటాడు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడు. స్కూల్లో కూడా పక్కనున్న పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడని, తాము చెప్పేది వినడని టీచర్లు కంప్లయింట్ చేస్తున్నారు. వాణ్ని ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి. - కావ్య, రఘునాథపల్లి కొంతమంది పిల్లలు అంతే. నిలకడగా కూర్చోరు. కాన్సన్ట్రేట్ చేయరు. ఇది కావాలని చేసేది కాదు. వాళ్లు నిజంగానే అలా ఉండలేరు, చేయలేరు. మీ అబ్బాయి మరీ ఎక్కువ అల్లరి చేస్తున్నాడంటే, తనకి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందని నా అనుమానం. ఇది ఉన్నవాళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఓసారి బాబుని చైల్డ్ సైకాలజిస్టుకు చూపించండి. తనకి ఆ సమస్య ఉంటే బిహేవియరల్ థెరపీ చేస్తారు. అవసరమైతే మందులు కూడా సూచిస్తారు. మా పాప వయసు మూడేళ్లు. తను ఏదడిగితే అది ఇచ్చేయాలి. లేకపోతే గట్టిగా అరుస్తుంది. లేదంటే దొర్లి దొర్లి ఏడుస్తుంది. ఒక్కోసారి తిరగబడి కొడుతుంది కూడా. దాంతో అడిగిందల్లా ఇవ్వాల్సి వస్తోంది. స్కూల్లో టీచర్లు చెప్పింది చక్కగా వింటుందట. ఇంట్లోనే ఇలా. ఈ ప్రవర్తనని ఎలా మార్చాలి? - భవాని, విజయవాడ పిల్లలన్నాక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు అవసరమైనవి ఇవ్వడం, అవసరం లేనివి ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. మంకుపట్టు పడితే మాత్రం ఒక్కోసారి బాధ కలిగో, విసుగొచ్చో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారీ ఇలానే చేస్తూ ఉంటే వాళ్లకదే అలవాటైపోతుంది. ఏడిస్తే ఇచ్చేస్తారు కదా అని ప్రతిసారీ ఏడుస్తూంటారు. మీ అమ్మాయి విషయంలో అదే జరుగుతోంది. కాబట్టి తను అడిగింది ఇవ్వదగినది కాకపోతే కుదరదని కచ్చితంగా చెప్పండి. ఏడ్చినా చూడనట్టే ఉండండి. మొదట్లో గొడవ చేసినా మెల్లగా తనకు మీ ఉద్దేశం తెలుస్తుంది. ఎంత ఏడ్చినా మీరిక ఇవ్వరు అని అర్థమై, మెల్లగా ఏడ్చే అలవాటు పోతుంది. అయితే ఇది ఏ ఒక్కరో కాదు, ఇంట్లో పెద్దలందరూ చేయాలి. ఒకళ్లు పాటించి మరొకళ్లు పాటించకపోతే మీ పాపను మార్చడం కష్టం. మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదేమిటో, ఆరు నెలల నుంచి వాడికి శుభ్రం మరీ ఎక్కువైపోయింది. స్నానం గంటసేపు చేస్తున్నాడు. స్కూలుకు లేటయిపోతున్నా తెమల్చడు. చేతులు కూడా అస్తమానం కడుగుతూంటాడు. దాంతో చేతుల చర్మం పగిలిపోయింది కూడా. ఎందుకలా చేస్తున్నావంటే వాడికి కోపం వచ్చేస్తోంది. ఎందుకిలా? - రవి యాదవ్, భువనగిరి మీ బాబు అబ్సెసివ్ కంపల్సివ్ డిజా ర్డర్ బారిన పడ్డాడని అనిపిస్తోంది. ఇది ఉన్న పిల్లలు అతి శుభ్రతను పాటించడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చేస్తారు. అలా చేయకుండా చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తే యాంగ్జయిటీ ఫీలవుతారు. టెన్షన్ పడిపోతారు. అందుకే మీరు వద్దని చెప్పినా మీ బాబు అలా చేయకుండా ఉండలేకపో తున్నాడు. తనను వెంటనే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. నిజంగానే ఈ డిజార్డర్ ఉంటే కనుక ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ చేస్తారు. ఇది మంచి ఫలితాలనిస్తుంది. మా బాబు స్కూలుకు బాగానే వెళ్లేవాడు. కానీ ఈ మధ్య మాట్లాడితే కడుపునొప్పి అని తరచూ స్కూలు ఎగ్గొట్టేస్తున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించాం. ఏ సమస్యా లేదన్నారు. దాంతో స్కూలు ఎగ్గొట్టడానికి సాకు చెబుతున్నాడని అనిపిస్తోంది. నేనేం చేయాలి? - వసుంధర, కాకినాడ ఒక్కోసారి పిల్లలకు భయం వల్ల కానీ, బాధ వల్ల కానీ కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దవాళ్లకు ఒత్తిడి ఎక్కువైతే తలనొప్పి వచ్చినట్టు, పిల్లలకూ అలాంటి శారీరక బాధలు కలుగుతాయన్నమాట. మీ అబ్బాయికి స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉందేమో, దేనివల్లనయినా ఒత్తిడికి లోనవుతున్నాడేమో అడిగి తెలుసుకోండి. తన టీచర్లు, స్నేహితులతో కూడా మాట్లాడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించండి. అప్పటికీ తను వెళ్లడానికి ఇష్టపడకపోతే, మెల్లగా స్కూలుని అలవాటు చేయండి. ఓ గంటసేపు స్కూల్లో ఉండి వచ్చేస్తే చాలని నచ్చజెప్పి పంపించండి. కొన్ని రోజులు అలా వెళ్లాక రెండు గంటలు అని చెప్పండి. అలా కొద్దికొద్దిగా సమయం పెంచుతూ పోతే, ఈలోపు బాబు భయం తగ్గుతుంది. కావాలంటే స్కూలువారి సాయం తీసుకోండి. మరీ అవసరమనుకుంటే కౌన్సెలర్ సలహా కూడా తీసుకోండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్,హైదరాబాద్ -
‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ)
పిల్లలు దైవస్వరూపాలు. వాళ్లలో దేవుడు కొలువుంటాడు. అయితే ఒక్కోసారి దైవం కొలువున్న ఆ చోటులో.. దెయ్యం కూడా వచ్చి చేరుతుంది. ఆ దెయ్యం పేరే ‘మంకుపట్టు’. అప్పుడే తల్లిదండ్రులకు తంటా. అదెలాగంటే... ముద్దు ముద్దుగా మాట్లాడుతూ, కాస్తంత బెట్టు చేస్తూ ఉండే చిన్న పిల్లలు కనీసం ఒకటికి రెండు సార్లు చెబితే వింటారు. అది మంచిది కాదని తల్లిదండ్రులో, టీచర్లో బుద్ధులు, సుద్దులు చెబితే ఆలకిస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్లలో ఒక రకమైన మంకు పట్టు ధోరణి మొదలవుతుందో, మంచి చెప్పినా, మంది చెప్పినా వినరు. మొండికేస్తారు. ఈ మంకుపట్టు ధోరణినే మనోవైజ్ఞానిక శాస్త్ర పరిధిలో ‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’గా పేర్కొంటారు. ఆ మంకుధోరణి ఎందుకో, దాన్ని తల్లిదండ్రులు ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు ఉపయోగపడేదే... ఈ కథనం. ‘‘తప్పు... నోట్లో అలా వేలు వేసుకోకూడదు. నీ వయసుకు ఇది తగదు’’ అని తల్లిదండ్రులు అంటూ ఉండగానే వాళ్లు ‘‘నేనిలాగే చేస్తాను’’ అనేస్తారు. అంతేకాదు... వద్దన్నందుకు మరింత ఎక్కువగా చేస్తారు. తల్లిదండ్రుల సహనం చచ్చి, ఆగ్రహం వచ్చేదాకా వద్దన్నా ఆ పని చేస్తుంటారు. ఇదీ మంకు ధోరణి. ఒక పిల్లవాడుగాని, చిన్నారిగాని... ఆ వయసుకు తగదంటూ వద్దన్న పనిని అలాగే మొండిగా చేయడం, తల్లిదండ్రుల ఆదేశాలనూ, టీచర్ల ఆజ్ఞలనూ లెక్కచేయకపోవడాన్ని మంకుపట్టుగా పేర్కొంటారు. అంతేకాదు... ఒక్కోసారి బహిరంగ ప్రదేశంలో తాము వద్దన్నది సాధించుకోవడం కోసం... కాళ్లూ, చేతులు తపతపా కొట్టుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించి, తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పరిస్థితిని కొని తెస్తే, వాళ్లు అంగీకరిస్తారని గ్రహించి, ఒక రకమైన ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ ధోరణికీ తెగబడతారు. ఇలాంటి ‘మంకుపట్టు’ ధోరణినే ‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ)గా పేర్కొంటారు. సహజ గుణమే-కాకపోతే కొద్దిమేరకే... పిల్లల్లో కొంత ధిక్కార ధోరణి, కొంత స్వతంత్ర వ్యవహార శైలి సహజంగానే ఉంటాయి. నిజానికి వాటివల్లనే పిల్లలు స్వతంత్రులుగా ఎదిగే వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. తమ కాళ్లపై తామే నిలిచేలా ఎదిగేందుకు ఇది కొంతవరకు దోహదపడుతుంది కూడా. తల్లిదండ్రులు ఈ తరహా ధోరణిని కొంతవరకు ఆహ్వానించాలి. దానిగురించి ఆందోళన పడకూడదు. అయితే... ఆందోళన పడాల్సిందెప్పుడన్న విచక్షణ కూడా వారికి తెలిసి ఉండాలి. ఒక రెండేళ్ల పిల్లవాడు ఆ వయసుకు ప్రదర్శించాల్సిన ధోరణి కాకుండా, నాలుగేళ్ల చిన్నారి కనబరుస్తున్న ధోరణిని ఆ చిన్నవయసులోనే ప్రదర్శిస్తున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించాలి. ఓడీడీ లక్షణాలివే... ఊ ఈ తరహా పిల్లలు చాలా త్వరగా సహనం కోల్పోతుంటారు. ఊ త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఊ కోపంలో చాలా ధిక్కారపూరితమైన ధోరణితో ఉంటారు. ఊ ఆ సమయంలో అడ్డదిడ్డంగా తల్లిదండ్రులతో వాదిస్తుంటారు. ఊ తల్లిదండ్రులు లేదా టీచర్ల ఆదేశాలను లెక్కచేయరు. వాటిని స్వీకరించడానికి అంగీకరించరు. తిరగబడటానికీ వెనకాడరు. ఊ తమ చేష్టల ద్వారా ఎదుటివారికి కోపం వచ్చేలా చేస్తారు. అలా కోపం తెప్పించింది చాలక అందుకు ఎదుటివాళ్లనే తప్పుబడుతుంటారు. ఊ తమ తప్పులకు ఎదుటివాళ్లను బాధ్యులను చేస్తుంటారు. ఊ ఎదుటివాళ్లతో తమకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, సహనం వహించక, ప్రతీకార ధోరణితో ఉంటారు. ఈ పైన పేర్కొన్న ధోరణుల్లో కనీసం నాలుగు ఉంటే పిల్లలకు ఈ తరహా వ్యవహార శైలి ఉందని అనుకోవచ్చు. అయితే పిల్లలు ఏదో ఒక సమయంలో ఇలాంటి ధోరణులు కనబరచడం ఎప్పుడూ ఉండేదే. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలను చూసి, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ డిజార్డర్ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదే ధోరణిని వారు నిత్యం కనబరుస్తూ, తమకేగాక, తాము ఉన్న పరిసరాల్లోని వ్యక్తులకూ, సమాజంలోని వారికీ నిత్యం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నప్పుడు మాత్రం వాళ్లకు అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్ (ఓడీడీ) ఉన్నట్లుగా పరిగణించి, మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. ఓడీడీగా పొరబడే మరికొన్ని సందర్భాలు... ఊ ఒక్కోసారి కొన్ని కుటుంబాల్లో పిల్లల పట్ల అయితే అతి క్రమశిక్షణ లేదా తేలిగ్గా తీసుకునే వ్యవహారశైలి ఉంటుంది. ఈ రెండూ పిల్లల వికాసంలో మేలు చేయవు. వాళ్లు మాట విననప్పుడు లేదా వింటున్నారు కదా అని... అతిగా క్రమశిక్షణలో పెట్టడం సరికాదు. అలాగని పూర్తిగా వదిలివేయడమూ సరికాదు. ఈ రెండు విషయాల్లో ఏది అతిగా అమలవుతున్నా పిల్లలు మంకుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు తమ ఇంట్లో తమకు తెలియకుండా కొన్ని నిబంధనలు అమలవుతుంటాయని తెలియాలి. తమకు మంచి చేయని అంశాలపై తమ తల్లిదండ్రులు ఎంతగా బతిమాలినా లేదా కోప్పడ్డా వాళ్లు వినరని పిల్లలకు తెలిసేలా చేయాలి. ఊ ఒక అంశంపై అతిగా ఉద్వేగపడుతూ ఉండే పిల్లలు (ఏంక్షియస్ చిల్డ్రెన్): కొందరు పిల్లలు కొన్ని అంశాలపట్ల చాలా అతిగా ఉద్వేగాలకు గురవుతూ ఉంటారు. అతిగా స్పందిస్తారు. ఉదాహరణకు వీళ్లు స్కూల్ వెళ్లడానికి నిరాకరిస్తూ అతిగా ఏడ్వటం, మంకుగా వ్యవహరించడం చేస్తారు. ఊ డిప్రెషన్‌తో బాధపడే పిల్లలు: కొందరు పిల్లలు వ్యాకులత, నిరాశ, నిస్పృహలతో బాధపడుతుంటారు. ఇలా నిస్పృహతో (డిప్రెషన్‌తో) ఉండే పిల్లలు చాలా వేగంగా కోపం తెచ్చుకుంటారు. ఇలాంటి డిప్రెషన్‌తో బాధపడే పిల్లల్లో 18 శాతం మందిలో ఓడీడీ ఉండే అవకాశం ఉంది. ఊ కొంతమంది పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే విపరీత ధోరణి ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఎంత చెప్పినా వినరు. కానీ శక్తియుక్తులు ఎంతగానో ఉంటాయి. స్కూల్లో వీళ్ల స్కోర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఏడీహెచ్‌డీ ఉన్న 45 శాతం మంది పిల్లల్లో ఓడీడీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ పిల్లల శక్తియుక్తులను సరిగ్గా దేనిపైనైనా కేంద్రీకరించేలా చేయాలి. బాల్టిమోర్ బుల్లెట్ అంటూ పిలుచుకునే... ఈతపోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో ఏడు బంగారు పతకాలు సంపాదించిన క్రీడాకారుడైన ‘మైకెల్ ఫెల్ప్స్‌కు’ చిన్నప్పుడు ఏడీహెచ్‌డీ ఉన్నట్లు తేలింది. అయితే ఇలాంటి పిల్లల్లోని శక్తియుక్తులను సరిగా ఉపయోగించేలా చేసేందుకు వాళ్లను ఏదైనా ‘యాక్టివిటీ’ వైపునకు మళ్లిస్తారు. ఇది ఏడీహెచ్‌డీ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడటంతో పాటు, వాళ్ల శక్తి, నైపుణ్యాలను వృథా చేయకుండా ఒక ప్రయోజనపూర్వకమైన కార్యకలాపం వైపునకూ ఉపయోగపడేలా చేయడానికీ... ఆఖరికి ఇదే చికిత్సగానూ పరిణమిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... ప్రఖ్యాత పాప్ గాయని బ్రిట్నీ స్పియర్ కూడా చిన్నప్పుడు ఏడీహెచ్‌డీ వల్ల మంకుపట్టుతో వ్యవహరించే అమ్మాయన్న సంగతి ఆమె పెద్దయ్యాక తెలిసింది. గుర్తించండి... మానసిక చికిత్స అందించండి... పిల్లలు అతిగా మొండిగా ఉన్నా, మితిమీరి మంకు చేస్తున్నా వాళ్ల వ్యవహార ధోరణిని తల్లిదండ్రులు గుర్తించాలి. అది అందరికీ ఇబ్బందిగా పరిణమిస్తున్నప్పుడు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఇంత చిన్న అంశానికి మానసిక చికిత్స ఏమిటన్న భావన వద్దు. ఎందుకంటే మానసిక నిపుణులు ఈ ధోరణిని గుర్తించి దానికి చికిత్స ఏమిటన్నది పేర్కొంటారు. పైన పేర్కొన్న ఏడీహెచ్‌డీ ఉదాహరణలలో మైకెల్ ఫెల్ప్స్ శక్తియుక్తులను ఛానలైజ్ చేసేందుకుగాను ఒక చికిత్సగా ఫెల్ప్స్ తాలూకు సైకియాట్రిస్ట్ అతడిని ఆరేళ్ల వయసులో ఈతకొలనుకు పరిచయం చేశాడు. దాంతో అతడిలోనే ఏడీహెచ్‌డీ, ఓడీడీ లక్షణాలను ఒక పాజిటివ్ ధోరణికి తీసుకొచ్చేందుకు అది ఉపయోగపడింది. దీనికి చికిత్స కూడా చాలా సులభం. పైనపేర్కొన్నట్లుగా పిల్లలు ఏ విషయంలో తమ బలాలను ప్రదర్శిస్తున్నారో, నిపుణులైన మానసికవైద్యులు గుర్తిస్తారు. దాంతో అతడిలోని అంతర్గత నైపుణ్యాల (టాలెంట్స్)ను బయటికి తెచ్చేందుకూ వీలవుతుంది, పనిలో పనిగా చికిత్స కూడా జరిగిపోతుంది. ఇక ఈ సమయంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులకూ అవసరమైన వైద్యం కూడా అందుతుంది. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తమకు తెలియకుండా చేసే పొరబాట్లను మానసిక వైద్యులు సరిదిద్దుతారు. ఆలా చేయడం ద్వారా అటు పిల్లలూ, ఇటు పెద్దలూ... ఈ ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. -నిర్వహణ: యాసీన్ చికిత్స ప్రక్రియలూ ఎంతో సులువు... ఈ తరహా ధోరణికి చికిత్స ప్రక్రియలు సులువే. చాలా కొద్దిసందర్భాల్లో మాత్రమే అంటే అవసరాన్ని బట్టి మందులు ఉపయోగిస్తారు. దీంతోపాటు... తల్లిదండ్రుల మాట విని, వారి ఆజ్ఞలను పాటించినప్పుడు వారికి ఇష్టమైన బహుమతులు అందుతాయంటూ తెలిసేలా చేయడం ఒక పద్ధతి. అయితే ఇది పిల్లలకు లంచం ఇచ్చేలా చేయడంలా అంటే వస్తురూపంలో బహుమతి ఇవ్వడం లాంటివి కాదు. అలాగే మాట విననప్పుడు అంటే ఇలా మంకుపట్టు పడితే వారికి టీవీ చూడటం లాంటి సౌకర్యం అందదని గ్రహించేలా శిక్షలు ఉండాలి. ఉండకూడదు. వారాంతంలో పిక్నిక్కు వెళ్లడం, విహారయాత్ర వంటివై ఉండాలి). ఇలా మాట వినడం ద్వారా దొరికే ప్రయోజనాలు, మాట విననప్పుడు పడే శిక్షలు నిర్ణయించాక ఇక పిల్లలు ఎంతగా మంకుపట్టు పట్టినా ప్రయోజనం లేదని వాళ్లు గ్రహించేలా వ్యవహరించాలి. అంటే వాళ్ల బెదిరింపు ధోరణికి ఎంతమాత్రమూ లొంగకూడదు. ఇక పిల్లలు మాట విన్నప్పుడు వాళ్లను ప్రశంసించడం, వాళ్ల పని వల్ల జరిగిన ప్రయోజనాన్ని వాళ్లకు కనబరిచేలా చేయాలి. దాంతో క్రమంగా వాళ్లకు కలిగే ప్రయోజనం వాళ్లను, వాళ్లతోపాటు తల్లిదండ్రులనూ ఎంతగా సంతోషపెడుతుందో తెలియజెప్పేలా చేస్తుంటే వాళ్ల పెడధోరణి క్రమంగా తగ్గుతుంది. కాబట్టి పిల్లలను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లడం అంటే వాళ్లకు పిచ్చి ఉందనే అభిప్రాయాన్ని వదిలేసి, అవసరాన్ని బట్టి వాళ్లను సరిదిద్దడానికి అలా తీసుకెళ్లడంలో తప్పు లేదని తల్లిదండ్రులు గ్రహించాలి. అప్పుడే చిన్నప్పటి అకడమిక్ రికార్డులు మెరుగవడంతో పాటు, వాళ్ల శక్తియుక్తులు బయటకు వచ్చి పెద్దయ్యాక వాళ్లు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ పాల్వాయి పద్మ అడల్ట్ అండ్ చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.