‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ) | Oppositional defiant disorder (ODD) is a childhood disorder | Sakshi
Sakshi News home page

‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ)

Published Sun, Nov 3 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ)

‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ)

పిల్లలు దైవస్వరూపాలు. వాళ్లలో దేవుడు కొలువుంటాడు. అయితే ఒక్కోసారి దైవం కొలువున్న ఆ చోటులో.. దెయ్యం కూడా వచ్చి చేరుతుంది. ఆ దెయ్యం పేరే ‘మంకుపట్టు’. అప్పుడే తల్లిదండ్రులకు తంటా. అదెలాగంటే... ముద్దు ముద్దుగా మాట్లాడుతూ, కాస్తంత బెట్టు చేస్తూ ఉండే చిన్న పిల్లలు కనీసం ఒకటికి రెండు సార్లు చెబితే వింటారు. అది మంచిది కాదని తల్లిదండ్రులో, టీచర్లో బుద్ధులు, సుద్దులు చెబితే ఆలకిస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్లలో ఒక రకమైన మంకు పట్టు ధోరణి మొదలవుతుందో, మంచి చెప్పినా, మంది చెప్పినా వినరు. మొండికేస్తారు. ఈ మంకుపట్టు ధోరణినే మనోవైజ్ఞానిక శాస్త్ర పరిధిలో ‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’గా పేర్కొంటారు. ఆ మంకుధోరణి ఎందుకో, దాన్ని తల్లిదండ్రులు ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు ఉపయోగపడేదే... ఈ కథనం.
 
 ‘‘తప్పు... నోట్లో అలా వేలు వేసుకోకూడదు. నీ వయసుకు ఇది తగదు’’ అని తల్లిదండ్రులు అంటూ ఉండగానే వాళ్లు ‘‘నేనిలాగే చేస్తాను’’ అనేస్తారు. అంతేకాదు... వద్దన్నందుకు మరింత ఎక్కువగా చేస్తారు. తల్లిదండ్రుల సహనం చచ్చి, ఆగ్రహం వచ్చేదాకా వద్దన్నా ఆ పని చేస్తుంటారు. ఇదీ మంకు ధోరణి. ఒక పిల్లవాడుగాని, చిన్నారిగాని... ఆ వయసుకు తగదంటూ వద్దన్న పనిని అలాగే మొండిగా చేయడం, తల్లిదండ్రుల ఆదేశాలనూ, టీచర్ల ఆజ్ఞలనూ లెక్కచేయకపోవడాన్ని మంకుపట్టుగా పేర్కొంటారు. అంతేకాదు... ఒక్కోసారి బహిరంగ ప్రదేశంలో తాము వద్దన్నది సాధించుకోవడం కోసం... కాళ్లూ, చేతులు తపతపా కొట్టుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించి, తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పరిస్థితిని కొని తెస్తే, వాళ్లు అంగీకరిస్తారని గ్రహించి, ఒక రకమైన ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ ధోరణికీ తెగబడతారు. ఇలాంటి ‘మంకుపట్టు’ ధోరణినే ‘అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్’ (ఓడీడీ)గా పేర్కొంటారు.
 
 సహజ గుణమే-కాకపోతే కొద్దిమేరకే...
 
 పిల్లల్లో కొంత ధిక్కార ధోరణి, కొంత స్వతంత్ర వ్యవహార శైలి సహజంగానే ఉంటాయి. నిజానికి వాటివల్లనే పిల్లలు స్వతంత్రులుగా ఎదిగే వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. తమ కాళ్లపై తామే నిలిచేలా ఎదిగేందుకు ఇది కొంతవరకు దోహదపడుతుంది కూడా. తల్లిదండ్రులు ఈ తరహా ధోరణిని కొంతవరకు ఆహ్వానించాలి. దానిగురించి ఆందోళన పడకూడదు. అయితే... ఆందోళన పడాల్సిందెప్పుడన్న విచక్షణ కూడా వారికి తెలిసి ఉండాలి. ఒక రెండేళ్ల పిల్లవాడు ఆ వయసుకు ప్రదర్శించాల్సిన ధోరణి కాకుండా, నాలుగేళ్ల చిన్నారి కనబరుస్తున్న ధోరణిని ఆ చిన్నవయసులోనే ప్రదర్శిస్తున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించాలి.
 
 ఓడీడీ లక్షణాలివే...
 
 ఊ ఈ తరహా పిల్లలు చాలా త్వరగా సహనం కోల్పోతుంటారు. ఊ త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఊ కోపంలో చాలా ధిక్కారపూరితమైన ధోరణితో ఉంటారు. ఊ ఆ సమయంలో అడ్డదిడ్డంగా తల్లిదండ్రులతో వాదిస్తుంటారు. ఊ తల్లిదండ్రులు లేదా టీచర్ల ఆదేశాలను లెక్కచేయరు. వాటిని స్వీకరించడానికి అంగీకరించరు. తిరగబడటానికీ వెనకాడరు. ఊ తమ చేష్టల ద్వారా ఎదుటివారికి కోపం వచ్చేలా చేస్తారు. అలా కోపం తెప్పించింది చాలక అందుకు ఎదుటివాళ్లనే తప్పుబడుతుంటారు. ఊ తమ తప్పులకు ఎదుటివాళ్లను బాధ్యులను చేస్తుంటారు.  ఊ ఎదుటివాళ్లతో తమకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, సహనం వహించక, ప్రతీకార ధోరణితో ఉంటారు.
 

ఈ పైన పేర్కొన్న ధోరణుల్లో కనీసం నాలుగు ఉంటే పిల్లలకు ఈ తరహా వ్యవహార శైలి ఉందని అనుకోవచ్చు. అయితే పిల్లలు ఏదో ఒక సమయంలో ఇలాంటి ధోరణులు కనబరచడం ఎప్పుడూ ఉండేదే. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలను చూసి, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ డిజార్డర్ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదే ధోరణిని వారు నిత్యం కనబరుస్తూ, తమకేగాక, తాము ఉన్న పరిసరాల్లోని వ్యక్తులకూ, సమాజంలోని వారికీ నిత్యం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నప్పుడు మాత్రం వాళ్లకు అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్ (ఓడీడీ) ఉన్నట్లుగా పరిగణించి, మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి.
 
 ఓడీడీగా పొరబడే మరికొన్ని సందర్భాలు...
 
 ఊ ఒక్కోసారి కొన్ని కుటుంబాల్లో పిల్లల పట్ల అయితే అతి క్రమశిక్షణ లేదా తేలిగ్గా తీసుకునే వ్యవహారశైలి ఉంటుంది. ఈ రెండూ పిల్లల వికాసంలో మేలు చేయవు. వాళ్లు మాట విననప్పుడు లేదా వింటున్నారు కదా అని... అతిగా క్రమశిక్షణలో పెట్టడం సరికాదు. అలాగని పూర్తిగా వదిలివేయడమూ సరికాదు. ఈ రెండు విషయాల్లో ఏది అతిగా అమలవుతున్నా పిల్లలు మంకుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి  పిల్లలకు తమ ఇంట్లో తమకు తెలియకుండా కొన్ని నిబంధనలు అమలవుతుంటాయని తెలియాలి. తమకు మంచి చేయని అంశాలపై తమ తల్లిదండ్రులు ఎంతగా బతిమాలినా లేదా కోప్పడ్డా వాళ్లు వినరని పిల్లలకు తెలిసేలా చేయాలి.
 
 ఊ ఒక అంశంపై అతిగా ఉద్వేగపడుతూ ఉండే పిల్లలు (ఏంక్షియస్ చిల్డ్రెన్): కొందరు పిల్లలు కొన్ని అంశాలపట్ల చాలా అతిగా ఉద్వేగాలకు గురవుతూ ఉంటారు. అతిగా స్పందిస్తారు. ఉదాహరణకు వీళ్లు స్కూల్ వెళ్లడానికి నిరాకరిస్తూ అతిగా ఏడ్వటం, మంకుగా వ్యవహరించడం చేస్తారు.
 
 ఊ డిప్రెషన్‌తో బాధపడే పిల్లలు: కొందరు పిల్లలు వ్యాకులత, నిరాశ, నిస్పృహలతో బాధపడుతుంటారు. ఇలా నిస్పృహతో (డిప్రెషన్‌తో) ఉండే పిల్లలు చాలా వేగంగా కోపం తెచ్చుకుంటారు. ఇలాంటి డిప్రెషన్‌తో బాధపడే పిల్లల్లో 18 శాతం మందిలో ఓడీడీ  ఉండే అవకాశం ఉంది.
 
 ఊ కొంతమంది పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే విపరీత ధోరణి ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఎంత చెప్పినా వినరు. కానీ శక్తియుక్తులు ఎంతగానో ఉంటాయి. స్కూల్లో వీళ్ల స్కోర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఏడీహెచ్‌డీ ఉన్న 45 శాతం మంది పిల్లల్లో ఓడీడీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ పిల్లల శక్తియుక్తులను సరిగ్గా దేనిపైనైనా కేంద్రీకరించేలా చేయాలి. బాల్టిమోర్ బుల్లెట్ అంటూ పిలుచుకునే... ఈతపోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో ఏడు బంగారు పతకాలు సంపాదించిన క్రీడాకారుడైన ‘మైకెల్ ఫెల్ప్స్‌కు’ చిన్నప్పుడు ఏడీహెచ్‌డీ ఉన్నట్లు తేలింది. అయితే ఇలాంటి పిల్లల్లోని శక్తియుక్తులను సరిగా ఉపయోగించేలా చేసేందుకు వాళ్లను ఏదైనా ‘యాక్టివిటీ’ వైపునకు మళ్లిస్తారు. ఇది ఏడీహెచ్‌డీ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడటంతో పాటు,  వాళ్ల శక్తి, నైపుణ్యాలను వృథా చేయకుండా ఒక ప్రయోజనపూర్వకమైన కార్యకలాపం వైపునకూ ఉపయోగపడేలా చేయడానికీ... ఆఖరికి ఇదే చికిత్సగానూ పరిణమిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... ప్రఖ్యాత పాప్ గాయని బ్రిట్నీ స్పియర్ కూడా చిన్నప్పుడు ఏడీహెచ్‌డీ వల్ల మంకుపట్టుతో వ్యవహరించే అమ్మాయన్న సంగతి ఆమె పెద్దయ్యాక తెలిసింది.
 
 గుర్తించండి... మానసిక చికిత్స అందించండి...
 
 పిల్లలు అతిగా మొండిగా ఉన్నా, మితిమీరి మంకు చేస్తున్నా వాళ్ల వ్యవహార ధోరణిని తల్లిదండ్రులు గుర్తించాలి. అది అందరికీ ఇబ్బందిగా పరిణమిస్తున్నప్పుడు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఇంత చిన్న అంశానికి మానసిక చికిత్స ఏమిటన్న భావన వద్దు. ఎందుకంటే మానసిక నిపుణులు ఈ ధోరణిని గుర్తించి దానికి చికిత్స ఏమిటన్నది పేర్కొంటారు. పైన పేర్కొన్న ఏడీహెచ్‌డీ ఉదాహరణలలో మైకెల్ ఫెల్ప్స్ శక్తియుక్తులను ఛానలైజ్ చేసేందుకుగాను ఒక చికిత్సగా ఫెల్ప్స్ తాలూకు సైకియాట్రిస్ట్ అతడిని ఆరేళ్ల వయసులో ఈతకొలనుకు పరిచయం చేశాడు. దాంతో అతడిలోనే ఏడీహెచ్‌డీ, ఓడీడీ లక్షణాలను ఒక పాజిటివ్ ధోరణికి తీసుకొచ్చేందుకు అది ఉపయోగపడింది.
 
 దీనికి చికిత్స కూడా చాలా సులభం. పైనపేర్కొన్నట్లుగా పిల్లలు ఏ విషయంలో తమ బలాలను ప్రదర్శిస్తున్నారో, నిపుణులైన మానసికవైద్యులు గుర్తిస్తారు. దాంతో అతడిలోని అంతర్గత నైపుణ్యాల (టాలెంట్స్)ను బయటికి తెచ్చేందుకూ వీలవుతుంది, పనిలో పనిగా చికిత్స కూడా జరిగిపోతుంది. ఇక ఈ సమయంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులకూ అవసరమైన వైద్యం కూడా అందుతుంది. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తమకు తెలియకుండా చేసే పొరబాట్లను మానసిక వైద్యులు సరిదిద్దుతారు.
 
 ఆలా చేయడం ద్వారా అటు పిల్లలూ, ఇటు పెద్దలూ...  ఈ ఇద్దరూ ప్రయోజనం పొందుతారు.    
 
 -నిర్వహణ: యాసీన్
 
 చికిత్స ప్రక్రియలూ ఎంతో సులువు...  

ఈ తరహా ధోరణికి చికిత్స ప్రక్రియలు సులువే. చాలా కొద్దిసందర్భాల్లో మాత్రమే అంటే అవసరాన్ని బట్టి మందులు ఉపయోగిస్తారు. దీంతోపాటు... తల్లిదండ్రుల మాట విని, వారి ఆజ్ఞలను పాటించినప్పుడు వారికి ఇష్టమైన బహుమతులు అందుతాయంటూ తెలిసేలా చేయడం ఒక పద్ధతి. అయితే ఇది పిల్లలకు లంచం ఇచ్చేలా చేయడంలా అంటే వస్తురూపంలో బహుమతి ఇవ్వడం లాంటివి కాదు. అలాగే మాట విననప్పుడు అంటే ఇలా మంకుపట్టు పడితే వారికి టీవీ చూడటం లాంటి సౌకర్యం అందదని గ్రహించేలా శిక్షలు ఉండాలి. ఉండకూడదు. వారాంతంలో పిక్నిక్‌కు వెళ్లడం, విహారయాత్ర వంటివై ఉండాలి). ఇలా మాట వినడం ద్వారా దొరికే ప్రయోజనాలు, మాట విననప్పుడు పడే శిక్షలు నిర్ణయించాక ఇక పిల్లలు ఎంతగా మంకుపట్టు పట్టినా ప్రయోజనం లేదని వాళ్లు గ్రహించేలా వ్యవహరించాలి. అంటే వాళ్ల బెదిరింపు ధోరణికి ఎంతమాత్రమూ లొంగకూడదు. ఇక పిల్లలు మాట విన్నప్పుడు వాళ్లను ప్రశంసించడం, వాళ్ల పని వల్ల జరిగిన ప్రయోజనాన్ని వాళ్లకు కనబరిచేలా చేయాలి. దాంతో క్రమంగా వాళ్లకు కలిగే ప్రయోజనం వాళ్లను, వాళ్లతోపాటు తల్లిదండ్రులనూ ఎంతగా సంతోషపెడుతుందో తెలియజెప్పేలా చేస్తుంటే వాళ్ల పెడధోరణి క్రమంగా తగ్గుతుంది. కాబట్టి పిల్లలను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లడం అంటే వాళ్లకు పిచ్చి ఉందనే అభిప్రాయాన్ని వదిలేసి, అవసరాన్ని బట్టి వాళ్లను సరిదిద్దడానికి అలా తీసుకెళ్లడంలో తప్పు లేదని తల్లిదండ్రులు గ్రహించాలి. అప్పుడే చిన్నప్పటి అకడమిక్ రికార్డులు మెరుగవడంతో పాటు, వాళ్ల శక్తియుక్తులు బయటకు వచ్చి పెద్దయ్యాక వాళ్లు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
 
 డాక్టర్ పాల్వాయి పద్మ
 అడల్ట్ అండ్ చైల్డ్ సైకియాట్రిస్ట్,
 రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్, హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement