అల్లా ఆశీర్వదించిన పావురాలు | Funday story of world | Sakshi
Sakshi News home page

అల్లా ఆశీర్వదించిన పావురాలు

Published Sun, Oct 14 2018 12:52 AM | Last Updated on Sun, Oct 14 2018 1:02 AM

Funday story of world - Sakshi

తెల్లవారుజాము నుండే చేతినిండా ఉన్న పనులతో సతమతమవుతూ, వంటిల్లు అనబడే రణరంగంలో కత్తి పీట, చాకు, అప్పడాల కర్ర, పెనం, అట్లకాడ మొదలైన ఆయుధాలతో పోరాడే సరయూ గుండెలయ, పావు తక్కువ ఎనిమిదింటికి తను ఇంటి దగ్గర ఎక్కే సిటీ బస్సులో కూర్చున్న తరువాతే నియంత్రణలోకి వచ్చేది. ఆ వంటింటి నుండి తనకు విడుదల లేదేమో అనే ఆలోచన మనస్సులో మెదలి కోపం, అసహాయతతో ఉడికిపోతూ, చెమటలు కారుస్తూ బస్సెక్కే ఆమెకు కిటికీ పక్కన సీటు దొరికితే కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తుంది. నింపాదిగా ఆమె చుట్టూ ఆవరించే చల్లని గాలికి ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంటుంది. తరువాత కళ్లు తెరచి బయటి దృశ్యాల చిత్రాలను మనస్సులోకి దింపుకున్నప్పుడల్లా  లోపలి ఒత్తిడి తగ్గి, మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అప్పుడే హఠాత్తుగా ఎదురయ్యే మలుపు దగ్గర  ఉన్న ఏకాకి వేపచెట్టును దాటి బస్సు తిరుగుతుంది.  రైల్వే అండర్‌ బ్రిడ్జి దాటి దిగువలో ఉన్న బారాకొట్రి అనే రహస్యలోకానికి చేరుకుంటుంది.

శాహిదా ఇంటిపనికి వచ్చేదాకా బారాకొట్రి అనే ఒక లోకం ఉన్న సంగతే తెలియదు సరయూకి. ఉదయం తొమ్మిదిగంటలకు సరిగ్గా  అల్లాహో అక్బర్‌ అని వినిపించే సమయానికి కాకతాళీయమేమో అనిపించేటట్టు బస్సు బారాకొట్రిని చుట్టుకుని వెళ్తుంది. చాలావరకు ముస్లిములు నివసించే ఈ ప్రదేశానికి బారాకొట్రి అనే పేరు ఎందుకు వచ్చిందో అని అప్పుడప్పుడూ సరయూ అనుకుంటుంది. రోడ్డుకు దగ్గరగా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు, స్పీకర్లు కట్టుకుని నుంచున్న మసీదు, ఉర్దూ ప్రైమరీ స్కూలు, కొన్ని గ్యారేజులు, వర్క్‌షాప్‌లు ఉన్న ఆ ప్రదేశం పాత ప్లాస్టిక్, ఇనుప సామానుల త్యాజ్యాలను పరచుకుని చెల్లాచెదురుగా ఉంటుంది. పొడుగు జుబ్బా, పొట్టి లుంగీ ధరించి తెల్లగడ్డాలలో మునిగిన ముసలివారు, నడుము నుండి జారిపోతుందా అనేట్టున్న జీన్స్‌ప్యాంట్‌ పైన సల్మాన్, షారూఖ్‌ల చిత్రాలున్న టీషర్ట్‌లు ధరించి ఛాతీ విరుచుకుని నుంచున్న నవయువకులు చాలా వరకు కనిపిస్తారు. ఎప్పుడైనా ఒకసారి బురఖాలు ధరించిన ఆడవాళ్లతో పాటు అన్ని వయసుల పిల్లలూ బిలబిలమని బస్సులోకి జొరబడతారు.
రోడ్డుకు తెరచుకున్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళ వైపు సరయూ ఎప్పుడూ కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ఇళ్ళ ముందు మెట్లు కాకుండా పెద్ద నాపరాయి ఏటవాలుగా కనిపిస్తుంది. ఆ రాయిని ఆనుకునే మురికి కాలువ ప్రవహిస్తుంది. కొన్నిసార్లు సర్రుమని తెరలు తొలగించి  మెరుపు తీగల వలె దేవకన్యలు బయటకు తొంగిచూస్తారు. ఎప్పుడైనా ఒకసారి ఇంటిముందు పరచిన నాపరాళ్ళ మీద బట్టలు ఉతుకుతూనో, సొట్టలు పడిన అల్యూమినియం పాత్రలు  తోముతూనో, చిన్న పిల్లల తలలోని పేలు తీస్తూనో కనిపించే వీరు పాతాళం నుండి పైకొచ్చిన అప్సరసల మాదిరి కళ్ళు మిరుమిట్లుగొలుపుతారు. లేత అందాలతో పాటు చెప్పలేని అంతరంగ ప్రకాశమేదో కనిపిస్తున్నట్లుంటుంది వాళ్ళలో. అకస్మాత్తుగా వారేమైనా బస్సు వైపు చూస్తే, వారినే గమనిస్తున్న సరయూ గాభరా పడుతుంది. అలా వాళ్ళ కళ్ళు కలిసినప్పటి క్షణాలలో కలిగిన భావనలను అర్థం చేసుకోలేక చూపు తిప్పేస్తుంది. ఎప్పటికైనా తను వీళ్ళతోటి తనలో కలిగే ఈ భావనలను పంచుకోవచ్చా? అలాంటి అదను ఎప్పటికైనా వస్తుందా? అనిపించి తనపైన తనకే ఆశ్చర్యం కలుగుతుంది.

ముందంతా ధారవాడ నగరానికి బయట, ఎవరూ పట్టించుకోకుండా తానేమో తనదేమో అన్నట్లున్న బారాకొట్రి అనే ఈ మురికి కాలనీ నగరానికి మధ్యకు రాగానే కళ్ళకు కొట్టొచ్చినట్లు మారింది. దానిని ఆనుకునే ఉన్న గౌళిగల్లి ఇప్పుడు బసవగిరిగా గణ్య వ్యక్తులు నివసించే ప్రదేశంగా మారి అక్కడి సైట్ల విలువ ఆకాశానికి చేరుకోవడం ప్రారంభమైనాక ఇప్పుడు ఇంకా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమక్రమంగా బారాకొట్రి రోడ్లలో మేయడానికి వెళ్తూ కనిపించే పశువులు మాయమై, వేగంగా రయ్‌మని దూసుకెళ్ళే పెద్ద పెద్ద కార్లు కనిపించసాగాయి.  అలాగే కొంచెం ముందుకెళితే నిర్మలానగర్‌ ఉంది. తెల్లటి తెలుపురంగులతో ఆకాశంలోకి చొచ్చుకుపోయే చర్చిలు, కాన్వెంట్లు, శుభ్రంగా కనిపించే పార్కులు, ఆట మైదానాలు కనిపిస్తాయి. అలాగే ముందుకువెళితే విశ్వవిద్యాలయం  మహాద్వారం ఎదురవుతుంది. విధానసభను తలపించే యూనివర్సిటీ భవనం కనిపించి బారాకొట్రి గుర్తులను చెరిపేస్తుంది. మెయిన్‌ బిల్డింగ్‌ దాటి ముందుకు వెళ్తే డిపార్ట్‌మెంట్ల నుండి లోపలికీ బయటికీ ఫైలులను ఛాతీకి హుత్తుకుని ఎగురుతున్నట్లు నడిచే విద్యార్థీ విద్యార్థినులు అక్కడి గాలికి సుగంధాన్నలుముతారు. వైవిధ్యాలను జీర్ణించుకున్న విశ్వవిద్యాలయమనే ప్రపంచంలోకి బారాకొట్రికి చెందిన పొగచూరిన పరదాల చాటునుండి వచ్చిన శాహిదా అడుగు పెట్టిందే ఒక ఆశ్చర్యం! లారీ డ్రైవరైన మొగుడు యాసీన్‌ ఒక ప్రమాదంలో ఒక చేయి పోగొట్టుకున్నాక,  తనపైనే ఆధారపడిన ఇద్దరు పిల్లల సంసారాన్ని పోషించడానికి తన రెక్కలు ముక్కలు చేసుకోక తప్పింది కాదు ఆమెకు.

యూనివర్సిటీలో తోటపని చేసుకుంటున్న అబ్దుల్లా ద్వారా  శాహిదా అక్కడి నేల ఊడ్చడం, తుడవడం చేసే గ్యాంగ్‌లో చేరుకుంది. మొదటిసారి అంత పెద్ద బిల్డింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడు శాహిదా కాళ్లు వణికాయి. కుంకుమ, విభూతి ధరించి ఇంతెత్తు నిలుచున్న బీరువాలు, కంప్యూటర్లు, లేసులతో కట్టిన లావుపాటి ఫైళ్ళు, వాటి మధ్యన మునిగిపోయిన కళ్ళద్దాల అధికారులు, సీలు సైన్‌ అంటూ అటూ ఇటూ పరుగులు తీసే జవాన్లు...ఇవన్నీ చూస్తూ తికమక పడిన శాహిదా కొద్దిగా నిలదొక్కుకోగలిగింది తను పనిచేసే బయోకెమిస్ట్రీ డిపార్డ్‌మెంట్‌ ల్యాబుల్లో  ధ్యానాసక్తుల వలె తెల్లకోటులు వేసుకున్న విద్యార్థినుల సాహచర్యంలో. వాళ్లను చూసినప్పుడల్లా ఆమెకు తన పిల్లలు సూఫియా, శిఫా గుర్తుకు వచ్చేవారు. కొట్టుమిట్టాడే కలలు మళ్లీ చిగురించేవి. కానీ వెలుగును వెన్నంటే వచ్చే చీకటిలా కలల వెనుకే వచ్చే తన పరిస్థితి యొక్క కలవరం ఆమెను వెక్కిరించేది. చేతకాని తండ్రి వద్ద వదలి వచ్చిన తన నాలుగు సంవత్సరాల సూఫియా, రెండు సంవత్సరాల శిఫాలను తలచుకుని కన్నీరుమున్నీరయ్యేది. అందుకే పొద్దున పదిగంటల నుండి సాయంత్రం ఐదుదాకా చేసే యూనివర్సిటీ పనికి వీడ్కోలు చెప్పేసి ఇంటి పనులు వెతుక్కుంటూ స్టెల్లా ఆంటీ ఇంటికి వచ్చింది. ఆమె కష్టాలు చూడలేక స్టెల్లా ఆంటీ, ఎదురింటి రెడ్డి ఆంటీ, పక్క ఇంటి శోభా ఆంటీ వాళ్ల ఇళ్లను కూడా ఇప్పించింది. స్టెల్లా  ఆంటీ వాళ్ల మేడ మీదికి అద్దెకు వచ్చిన సరయూకు శాహిదా పరిచయం ఇలా జరిగింది.

ఆరోజు శాహిదా ఇంట్లోకి వచ్చి నుంచున్నప్పుడు ఒక్క క్షణం సరయూ ఆశ్చర్యంగా నిలుచుండిపోయింది.  ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు ఒకటో రెండో మాత్రమే. స్టెల్లా ఆంటీ పూనుకొని సరయూ ఎదుర్కొంటున్న తిరగలిలాంటి పరిస్థితులని చెప్పి శాహిదాకు ఆమె బాధ్యతలను వివరించింది. సరయూ ఇంట్లోని రొట్టెలపైన శాహిదా వ్రేళ్ళ గీతలు పడినట్లల్లా ఆమె చేతి వెచ్చదనం అనుభవానికి వస్తూ వంటింట్లోనూ వెచ్చని అనుభూతిరాసాగింది. మెడనొప్పితో బాధపడే సరయూ భుజాల పైన శాహిదా వ్రేళ్ళు ఆప్యాయంగా తడిమి నొప్పి మూలాలను వెదకసాగాయి. లోతుకు దిగినకొద్దీ ఎక్కడో పెనవేసుకున్న లతల్లాంటి ఆడబతుకుల బాధలన్నిటికి మూలం ఒకటేనేమో అనిపిస్తూ, ఇద్దరు దగ్గరవుతూ పోయారు. అప్పుడే శాహిదా తన అనాథబాల్యం గురించి చెప్పింది. పెంచుకున్నవాళ్ళు సరిగ్గా తిండి పెట్టకపోవడం దగ్గర నుంచి  ఆకలి, అవమానాల వరకు... చివరికి ఆమెకన్న ఒక అంగుళం పొట్టిగా ఉన్న యాసీన్‌ మెడకు ఆమెను కట్టి నిట్టూర్చేవరకు అన్నీ పంచుకుంది. తరువాత యాసీన్‌ ప్రేమలో తాను ఒక మనిషే అనే భావన మేలుకుని ఆమె బతుకు నిజంగానే స్వప్న సదృశమయింది. 

మెరుపుల టిక్లీలున్న చీరతో బురఖాలో దూరి సినిమా చూసిందీ, లారీలోని ఎల్తైన సీట్లో శెహజాదీలా కూర్చుని బయటి ప్రపంచాన్ని చూసింది, ఇలాంటి మురిపాల నడుమ సూఫియా, శిఫా తన ఒడిలో పడిందీ...అన్ని సినిమా రీళ్ళలా సాగిపోయాయి. తనదీ ఒక ముచ్చటైన సంసారం, ఆ సంసారానికి దీపాలుగా పుట్టిన ఈ పాపలు అల్లా ఆశీర్వదించి పంపిన పావురాలే అనిపించేది ఆమెకి. వారిద్దరికీ తను అనుభవించిన అనాథబ్రతుకు, అవమానాలను ఏ మాత్రం తగలకుండా పెంచాలి అనే పట్టుదల కళ్ళ ముందే కూలింది విధి ఆడిన నాటకంతోనే.రోడ్డు ప్రమాదంలో ఒక చెయ్యి పోగొట్టుకున్న యాíసీన్‌ తన మరో చేతిని కూడా పోగొట్టుకున్నాడు. పక్షవాతం వల్ల చెయ్యి చచ్చుపడిపోయింది. అప్పుడు శాహిదా కృంగిపోయింది. ఎవరూ ఆదుకోవడానికి రాకపోవడం చూసి తనే నడుము బిగించింది. కష్టాలు ఆమెకు కొత్తకావు. కానీ కల చెదిరిపోడమే దిగ్భ్రమ. భర్తకు, పిల్లలకు స్నానాలు చేయించి, బట్టలు ఉతికి, వండి, పిల్లలను భర్తకు అప్పగించి బయటపడే శాహిదాను భయం ఆవరిస్తుంది. దేనినీ ఎత్తలేని, సరిగ్గా నడవనూలేని భర్త  నిస్సహాయత, పిల్లల్లో తొంగి చూసే అనాథ భావం ఆమె మనస్సును పిండివేసేది. నెమ్మదిగా తాను తిని, తండ్రికి తినిపించే స్థాయికి చేరుకుంది సూఫియా. ‘‘మనందరిలోనూ చాలా శక్తి ఉంటుందట అక్కా... మరి అది బయటికి రావాలంటే కష్టాలు రావాలికదా... అల్లా దాన్ని పరీక్షిస్తాడట’’ అంటూ సగం నవ్వు సగం ఏడ్పులతో చెప్తూ శాహిదా కళ్లనీళ్ల పర్యంతమయ్యేది. సరయూకు కూడా కళ్లలో నీళ్లు తిరిగేవి. ‘‘ఏమైనా కానీ పిల్లలను మాత్రం బాగా చదివించు శాహిదా. డబ్బుల అవసరం వస్తే అడుగు’’ అంటూ సరయూ చూపిన అభిమానానికి హృదయం నిండిరాగా ‘‘అంత చాలు అక్కా! ఆ మాట చాలు నాకు... కావలసి వస్తే తప్పకుండా అడుగుతాను’’ అంటూ మాట మార్చేది.

రంజాన్‌ నెలలో మాత్రం పనికి రావడం కుదరదు అని కచ్చితంగా చెప్పేది శాహిదా. ఆ నెలలో శ్రీమంతులు దాన ధర్మాలు చేస్తారు. అప్పుడు వారు యాసీన్‌ దీన పరిస్థితిని చూసి కొంచెం ఉదారంగా ఇచ్చేవారు.ఇవన్నీ ముందు ఆమెకు అలవాటు లేకపోయినప్పటికీ పరిస్థితులు తప్పనిసరిగా అలవాటు చేశాయి. ఒక సంవత్సరానికి సరిపడే ధాన్యాలు, దుస్తులు ఈ నెలలోనే వచ్చి పడేవి. అంతే కాక పండుగ రోజు వాళ్ల వీళ్ల ఇళ్లు శుభ్రం చేసి, వంట సాయం చేసి బక్షీసు తీసుకునేది. రంజాన్‌ రోజు వాళ్లు చేసే శీర్‌ కుర్మా మాత్రం తప్పకుండా తెచ్చేది. సరయూ కొడుకు రాఘవకు అదంటే ప్రాణం అని తెలుసు శాహిదాకు. అలాంటి ఒక రంజాన్‌ నెలలో సరయూ ఊరి నుండి ఆమె చెల్లెలు సుమ, గిరిజత్త వచ్చారు. వాళ్లు వచ్చేటప్పటికి శాహిదా పన్లోకి రావడం లేదు. గిరిజత్తకు శాహిదా చేసిన జొన్న రొట్టెలు, కూరలను ఎలా తినిపించడమా అనే వ్యథ కలిగింది సరయూకు. సుమా తమాషాకు ‘‘అయ్యో అక్కా! ఆమె పేరు ఏ లక్షో్మ, పార్వతి అనో చెప్పెయ్యరాదా. ఒక బింది ప్యాకెట్‌ శాహిదాకు ఇచ్చి మేము వెళ్లిపోయేదాకా పెట్టుకోమను.’’ అంటూ కన్నుకొట్టింది. శాహిదాకు బొట్టు పెట్టుకుని లక్ష్మిలా కనబడడాన్ని ఊహించుకున్న సరయూ కూడా నవ్వింది. ‘‘క్యాలెండర్‌లోని లక్ష్మిదేవిలా కనిపిస్తుంది శాహిదా’’ అంది. రంజాన్‌ రోజు సుమా సరయూ చెవిలో ‘‘ఈ రోజు మీ క్యాలెండర్‌ లక్ష్మి శీర్‌ కుర్మాతో ప్రత్యక్షమవుతుందా?’’ అంటూ హాస్యమాడింది. ‘‘ఏ లక్ష్మీనే’’ అని గిరిజత్త అడిగినదానికి ఇద్దరూ ముఖాలు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.సాయంత్రానికి శాహిదా శీర్‌ కుర్మాతో నిజంగానే ప్రత్యక్షమయింది. కానీ ఆ రోజు ఆమె బురఖా ధరించింది. సరయూ ఒక్క క్షణం అవాక్కయింది. ఇంతవరకు శాహిదా ఎప్పుడూ బురఖా ధరించలేదు. అలా చూస్తే వారిద్దరూ ఎప్పుడూ దేవుడి గురించి కానీ, మతం గురించి కానీ ఆచారాల గురించి కానీ మాట్లాడుకోలేదు. శాహిదా మాత్రం మామూలుగా ‘‘ఎల్లుండి నుండి పన్లోకి వస్తానక్కా! ఇది తీస్కుని డబ్బా ఖాళీ చేసిస్తే వెళ్లిపోతాను. చాలా పన్లున్నాయి. చీకటి పడుతోంది’’ అని తొందరపెట్టింది. రాఘవను ముద్దాడి ‘‘బాగా కిస్‌మిస్, జీడిపప్పు వేశాను. తినాలి నువ్వు సరేనా?’’ అంటూ గడప దాటింది. ‘‘ఇదేమిటి? వాళ్ల అల్లా ప్రసాదమా’’ అంటూ గిరిజత్త రాగం తీసింది. ‘‘మరి ఆ దేవుడు ఈ దేవుడు అంటూ గుళ్లు తిరుగుతావు కదా. ఈ ప్రసాదాన్ని కూడా తీసుకో మరి’’ అంటూ సుమ తమాషా చేసింది గిరిజత్తను. గిరిజత్త మొహం తిప్పేసుకుంటూ ‘‘నాకు రేపటి నుండి రొట్టె, కూర వద్దమ్మా. ఎందుకో కొద్దిగా అజీర్ణమయినట్టనిపిస్తుంది. అన్నమయితే మెత్తగా ఉంటుంది. అది చాలు’’ అంటూ లేచి లోపలికి వెళ్లింది.ఊళ్లో అంతా గిరిజత్త అంటే చాలా మంచిపేరు. మహిళా మండలి, భజన మండలి అంటూ అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటుంది. ఆ రోజు రాత్రి ఆమె సరయు–సుమలకు క్లాసు తీసుకుంది. ‘‘మనవాళ్లు ఈ మధ్య చాలా చెడిపోతున్నారు.ఆచారాలను మంటగలుపుతున్నారు. దీనివలన మన సంస్కృతి చెడిపోతోంది.  అందరూ వారి వారి దారిలో సరిగ్గానే నడుస్తున్నారు. మనం మాత్రం ‘మనది’ అన్నదాన్ని కాలరాచివేస్తున్నాం. నీ భర్తను, బాబును రోజూ సంధ్యావందనం చెయ్యమను. నువ్వు కూడా ఏదైనా నోమో వ్రతమో ప్రారంభించు. మనం మాత్రమే మన సంప్రదాయాలను నిలుపుకోవాలని మొన్న స్వామీజీ కూడా చెప్పారు’’ అని మరీ మరీ చెప్పింది.

మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా అన్యమనస్కంగా కనిపించింది. సూఫియా, శిఫాల స్కూల్‌ గురించిన వివరాలడిగినప్పుడు ‘‘అక్కా! సూఫియాను గవర్నమెంట్‌ స్కూల్‌లో వేశాం కదా. శిఫానైనా మదరసాకు పంపాలనుకుంటున్నాము. మా రీతి నీతులు అన్నీ నేర్చుకోవాలి కదక్కా! మేమైతే అవేం తెలుసుకోకుండా పెరిగి కాఫిర్లమైనాము. అదైనా కురాన్, హదీస్‌ అన్నీ నేర్చుకోనీ అని...’’ అంటూ ఆపేసింది. నిన్ననే చాలా ఇబ్బందిగా తన గిరిజత్త నుండి విన్న ఈ ‘మనది’ అనే పదం, మనసును కలవర పెట్టినా మాటలను కొనసాగించకుండా గమ్మునయిపోయింది సరయూ.మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా యాంత్రికంగా రొట్టెలు తట్టుతోంది. గ్యాస్‌ పొయ్యి మీద పొంగుతున్న రొట్టెను తన చేతివేళ్లతో చాకచక్యంగా తిప్పుతున్నా చూపు ఎక్కడో ఉంది. అంతలో శాహిదా సన్నగా ఏడవడం వినిపించింది. ఆ రోజు ఆదివారం కావడం వలన సరయూ ఆమెను మాటల్లోకి దింపింది. ‘‘అక్కా! ఈ మధ్య మా ఇంటాయన నా పైన చాలా అనుమాన పడుతున్నాడు. బురఖా లేకుండా బయటికి వెళ్లకూడదు అని తాకీదు చేశాడు.నేను ఎవరెవరి ఇళ్లకు పనికి వెళ్లానో వాళ్ల ఇంటి ముందు వచ్చి నిలబడుతాడు. నువ్వేం నన్ను పోషించక్కర్లా అంటూ వడ్డించిన కంచాన్ని ముక్కూ మూతీ చూడకుండా విసిరేస్తాడు. చేతులు ఎత్తడానికి చేతకాదు కదా. అందుకే కూర్చున్న చోటునుంచే కాలితో తంతాడు. అలా కొట్టినప్పుడు పడబోతే మళ్లీ తన్నులు తిన్న నేనే పట్టుకోవాలి. ఆ మనిషిని చూస్తే ఒక్కోసారి చెడ్డ కోపం వస్తుంది. ఒక్కోసారి జాలి వేస్తుంది’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆశ్చర్యమేమంటే గిరిజత్తే శాహిదాను ఓదార్చింది. ‘‘ఈ మగవాళ్లంతా ఇంతేలే. ధైర్యంగా ఉండు’’ అంటూ గిరిజత్త శాహిదా చెయ్యి పట్టుకుని చెప్పింది. ఆ రోజు లలితా సహస్ర నామాలు చదివి ముగించిన తరువాత  ‘‘ఆడతనాన్నే అఖండ శక్తి కేంద్రంగా భావిద్దాం. ఆ భావనలో సరయూ, శాహిదా, స్టెల్లా వేరువేరుగా కనిపించరు కదూ’’ అన్నది సుమ. ఆమె మాటలు పుస్తకాలలో ఉపయోగించే మాటల మాదిరిగా అనిపించినా అందులోని అర్థం మనసుకు తెలిసినటై్ట సరయూ, గిరిజత్త మౌనం వహించారు.సరయూకు ట్రాన్స్‌ఫర్‌ అయి ఆమె సంసారం ధారవాడ నుండి బయలుదేరినప్పుడు శాహిదా పావురాళ్లలాంటి తన ఇద్దరు కూతుళ్లనూ తన భర్తనూ తీసుకుని వీడ్కోలు చెప్పడానికి వచ్చింది.  ‘‘శాహిదా! నీ ఆరోగ్యం జాగ్రత్త. వీరిద్దరినీ బాగా చదివించు... ఏమయ్యా.. మా శాహిదాను ఇబ్బంది పెట్టవద్దు’’ అంటూ సరయూ ఏమేమో అప్పగింతలు చదివింది. ‘‘ఆయనకు చెప్పండక్కా! నాకైతే వీళ్లిద్దరినీ యూనివర్సిటీలో చదివించాలని ఉంది’’ బిడియంగా అంది శాహిదా. ‘‘దానికి నా ఓటు కూడా ఉంది’’ అంటూ శాహిదా చెయి నొక్కింది సరయూ.

సరయూ మనసులో ముద్రపడిన ఈ జ్ఞాపకాలను ఏమాత్రం చెదరకుండా మళ్లీ ఆమెను మేలుకొలిపింది మొన్న ఫేస్‌బుక్‌లో ఆమె యాక్సెప్ట్‌ చేసిన ఒక ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వలన. శిఫా అనే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న ఆత్మవిశ్వాసమే మూర్తీభవించినట్టున్న అమ్మాయి రిక్వెస్ట్‌ అది. ఆ ప్రొఫైల్‌ చూస్తున్నప్పుడల్లా  గుండె ఆత్మీయతతో కొట్టుకోసాగింది. అందులో ఐదారు గోల్డ్‌ మెడల్స్‌ ధరించిన అమ్మాయి ఫొటో, పక్కలో నించున్న శాహిదా, వెంట్రుకలు అక్కడక్కడా నెరిసినట్టు కనిపించడం తప్ప మిగతా అంతా తను అప్పుడు చూసిన శాహిదానే! ఇన్‌బాక్స్‌లో ఒక మెసేజ్‌ కనిపించడం ‘‘అమ్మ మిమ్మల్ని చాలా అనుకుంటుంది ఆంటీ. నేను అక్కా ఇద్దరూ యూనివర్సిటీ చదువులు ముగించాము. సూఫియా బయోకెమిస్ట్రీలో పి.హెచ్‌.డి చేసి ఇక్కడే యూనివర్సిటీలో పని చేస్తోంది. నాది మొన్న ఇంగ్లీష్‌ ఎమ్‌.ఏ అయింది. అమ్మ.. మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది’’ అని ముగించింది. ఇంకో ఫొటోలో సూఫియా, శిఫా ఇద్దరూ దేవకన్యల మాదిరి నుంచుని కనిపించారు. బారాకొట్రిలో నాకు కనిపించిన లేత కన్యలు కొంత గాంభీర్యాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది. కానీ అప్పుడు అక్కడ కనిపించిన ఆంతర్యంలోని వెలుగు మాత్రం మాసిపోకుండా మొహాల్లో కనిపించింది. సమయాన్ని తమ రెక్కల్లో పొదువుకుని ఎగిరే అల్లా ఆశీర్వదించి పంపిన పావురాల్లాగా!
కన్నడ మూలం : గీతా వసంత్‌
అనువాదం: చందకచర్ల రమేశ్‌బాబు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement