జైనథ్, వాంకిడి, కోటపల్లి: రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో ఓ మహిళ సహా ముగ్గురు రైతులు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ యాసిన్(41) తన భార్య అఫ్సానాతో పొలంలో పత్తికి పురు గుల మందు పిచికారీ చేస్తుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసేందుకు చెట్టు కిందకు వెళ్ల గా ఒక్కసారిగా పిడుగుపడటంతో యాసిన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. రెండు ఎడ్లు సైతం అక్కడికక్కడే మృతి చెందాయి.
కొంత దూరంలో ఉన్న అఫ్సానాకు తలకు గాయాలై స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో పత్తి చేనులో ఎరువు వేస్తు న్న క్రమంలో భారీ వర్షం రావడంతో చింత చెట్టు వద్దకు వెళ్లి పిడుగు పాటుకు గురై మన్నెగూడ గ్రామానికి చెందిన పద్మబాయి(23) మృతి చెందారు.
పక్కనే ఉన్న ఆమె భర్త గేడం టుల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్ (25) పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా పిడుగు పడి స్పృహకోల్పోయాడు. దగ్గరలోనే ఉన్న భార్య లావణ్య వెంటనే రవీందర్‌ను చెన్నూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే వారికి వివాహమైంది.
Comments
Please login to add a commentAdd a comment