డాక్టర్‌  పంచతంత్రుడు...!  | funday story to in this week | Sakshi
Sakshi News home page

డాక్టర్‌  పంచతంత్రుడు...! 

Published Sun, Feb 4 2018 12:38 AM | Last Updated on Sun, Feb 4 2018 12:38 AM

funday story to in this week - Sakshi

‘‘నాన్నా! ఏనుగులకు అంతంత ఒబెసిటీ ఉంటుంది కదా. వాటికి హార్ట్‌ ఎటాక్‌ రాదా?’’ అడిగాడు మా బుజ్జిగాడు.  నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అంతలో వాళ్ల అమ్మ వచ్చింది. ‘‘మీరేమో వాణ్ణి డాక్టర్‌ను చేయాలంటారు. తొమ్మిదో క్లాసుకు వచ్చినా నాలెడ్జీ మాత్రం సున్న. వాడికి మొన్న బయాలజీ పరీక్షలో వచ్చిన పర్సెంటేజీ పద్నాలుగు. వాడి టీచరేమో మాటిమాటికీ పిలిచి మనల్ని తిడుతోంది. వాడు చదవడు... మీరు  చదివించరు’’ అంటూ క్లాసు తీసుకుంటుంటే కాసేపు వాడికి బయాలజీ చెబుదామని నేను ట్రై చేశా.  న్యూట్రిషన్‌ అనే లెసన్‌నుంచి వీడికి రకరకాల ప్రశ్నలిచ్చారు. రకరకాల టెక్నికల్‌ నేమ్స్‌తో ఆ లెసన్‌ సాగింది. ఆ పోషకాల పేర్లు గుర్తుపెట్టుకోవడం వీడికి సాధ్యపడలేదట. నాకున్న మిడిమిడి జ్ఞానం కొద్దీ వాడికేదైనా ఎక్స్‌ప్లెయిన్‌ చేద్దామనుకుంటే నాకూ ఆ టెక్నికల్‌ టర్మ్స్‌ అర్థం కాలేదు. దాంతో వాడికి కాస్త రిలాక్సేçషన్‌ ఇద్దామని అనుకున్నా. ‘‘ఒరేయ్‌ ఈ తిట్ల మూడ్‌లో నువ్వు లెసన్‌ చదువుకోలేవు. చదివినా అర్థం కాదు. కాబట్టి కాసేపు ఈ పుస్తకం చదువుకో’’ అంటూ వాడి చేతికి పంచతంత్రం ఇచ్చా. కథల పుస్తకం కావడంతో వాడూ దాన్ని శ్రద్ధగా చదువుతూ లీనమయ్యాడు. కొద్దిగా రిఫ్రెష్‌ అయ్యాక... బయాలజీ కూడా చదువుకున్నాడు.   ఆ మర్నాడు ఉదయం నిద్రలేవగానే నా దగ్గరికి వచ్చాడు. ‘‘పంచతంత్రం చదివాక బయాలజీ ఇంకా బాగా అర్థమైంది నాన్నా’’ అన్నాడు. ‘‘ఎలారా?’’ అడిగా.  వాడు కథలు కథలుగా నాకు చెప్పిన విషయాలివి. 

మొదటి చాప్టర్‌ గ్రీన్‌లాభం 
అప్పట్లో గజేంద్రుడనే ఏనుగుల రాజు తన మందతో గడ్డి మైదానాలలో య«థేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఏనుగులు అన్ని రకాల పదార్థాలూ తినేవి. ఏదిబడితే అది నోట్లోకి కుక్కడం, మెక్కడం వల్ల వాటికి పెద్ద పెద్ద ఊబకాయాలు వచ్చాయి. ఆ ఒబేసిటీ కారణంగా హఠాత్తుగా హార్ట్‌ఎటాకులూ గట్రా వచ్చి చాలా ఏనుగులు హరీమనేవి. వాటి కళేబరాలు పడి ఉన్న ప్రాంతంలో అది పూర్తిగా కుళ్లి శిథిలమయ్యేవరకూ గడ్డి కూడా మొలిచేది కాదు. ఇది చూసిన హరితవర్ణిత అనే గడ్డిమొక్క తీవ్రమైన విచారంలో మునిగిపోయింది. ఒకనాడు గజేంద్రుడు అడవిలో సంచరిస్తుండగా హరితవర్ణిత ఆ ఏనుగుల రాజును తన దగ్గరికి పిలిచి ఇలా అన్నది. ‘‘ఓ ఏనుగోత్తమా! మీరు ఏది బడితే అది తిని ఎక్కడబడితే అక్కడ గుటుక్కుమంటున్నారు. దాంతో మీ కళేబరం పడి ఉన్న ప్రాంతంలో చాలాకాలం పాటు  గడ్డిమొలవకుండా పోతోంది. పైగా ఇటీవల ఇక్కడ భూసారమూ బాగా తగ్గుతోంది. ఈ రెండు అంశాలూ మా మనుగడకు అడ్డమవుతున్నాయి. కాబట్టి ఓ భారీకాయమా!  ఇకపై అనారోగ్యకరమైనవి తినకండి. కేవలం ఆకుపచ్చటివి మాత్రమే తినండి. అప్పుడు మీరు పుష్కలంగా పెంట వేస్తారు. దాంతో నేల సారవంతమవుతుంది. మరింత గడ్డి, పచ్చటి మొక్కలు మొలుస్తాయి. అది మీకూ మాకూ మంచిది’’ అంది. ‘‘అవును ఇది నిజం. ఇది నిజం. మమ్మల్ని తొక్కేయకుండా మాకూ ఇలా మేలు చేయండి’’ అంటూ తోటకూరడూ, పాలకూరడూ, గోరుచిక్కుడు, పచ్చఅరిటుడు అనే ఇతర మొక్కార్భకులు ప్రాధేయపడ్డాయి. అప్పట్నుంచి ఆకులు అలములు మాత్రమే తినడం మొదలుపెట్టాయి. వాటి ఒబేసిటీ ఏమాత్రం తగ్గకున్నా హార్ట్‌ ఎటాక్‌ రావడం మాత్రం ఆగిపోయింది. వాటి పెంటతో ఆ గడ్డిమొక్కలూ, ఇతర వృక్షజాతులూ ఏపుగా ఎదగడం మొదలుపెట్టాయి.  ఇలా పరస్పర మైత్రితో ఇరువర్గాలూ మిత్ర లాభం పొందాయి.  

రెండో చాప్టర్‌ హెల్త్‌ భేదం      
అప్పట్లో హైదరాపురం అనే నగరంలో సైబరావనం అనే అరణ్యం ఉండేది. అక్కడ నిత్యానందం, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులు తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా జీవించేవారు. అయితే వారి పనుల్లో కష్టం చాలా ఎక్కువగా ఉండేది. ఒకనాడు సిస్టముడు, ల్యాపటాపుడు అనే ఇద్దరు సేవకులు వారి దగ్గరకు వచ్చారు.     ‘‘మిత్రోత్తములారా... మీరెందుకు ఇంతగా కష్టపడుతూ మీ రెక్కల్లాగే మెదడునూ ముక్కలు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఉపయోగించుకుంటే మీ పనులు ఎంత సులువవుతాయో చూడండి’’ అన్నారు. అప్పట్నుంచి ఆ సేవకుల సాయంతో నిత్యానందుడూ, సత్యానందుడూ పనులు వేగంగా చేసేవారు. అయితే పనివేగం పెరగడంతో ఆవలి మెరక అనే ప్రాంతం నుంచి మరింతమంది మరిన్ని పనుల్ని వారికి అప్పగించడం మొదలుపెట్టారు.  ఆవలి–మెరక అనే ఆ ప్రాంతం పేరు కాస్త పెద్దగా ఉండటంతో దాన్ని సూక్ష్మంగా ఆమెరక... ఆమెరక అని కూడా పిలిచేవాళ్లు. అక్కడి నుంచి వచ్చి పడే పనితో సైబరావనంలోని చాలామందికి పనిభారం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో మన సత్యా– నిత్యానందులకు ఇద్దరు అపరిచితులు తారసపడి ఇలా అన్నారు. 

‘‘ఓ మిత్రోత్తములారా... నా పేరు శ్వేతకాష్టుడు. ఇతడి పేరు స్వప్నచిత్తుడు. మాతో స్నేహం చేయండి. నన్ను పీల్చగానే చుట్టూ పొగలు కమ్మి అవి మబ్బుల్లా ఆవరిస్తాయి. మీరు ఆ మబ్బుల్లో తేలిపోయినంతగా తేలికవుతారు. ఇక స్వప్నచిత్తుడిని గ్రోలగానే ఒళ్లంతా తేలికై హాయిగా ఉంటుంది. తర్వాత కాసేపటికి మంచి నిద్రపడుతుంది. దాంతో మంచి మంచి స్వప్నాలు వచ్చేలా చేస్తాడు కాబట్టి మావాడికి స్వప్నచిత్తుడని పేరు. అయితే కాస్తంత మత్తునిస్తాడంటూ గిట్టనివాళ్లు వాణ్ని ఆడిపోసుకుంటారు. మత్తుతో చిత్తు చేస్తాడంటూ మత్తుచిత్తుడని దూషిస్తుంటారు. కానీ మేము ఎవరినీ చిత్తుచేయము. టెన్షనుడనే ఒక అసురుడి సంతతి అన్నిచోట్లా విస్తృతంగా విస్తరిస్తోంది. వారితోనే మాకు వైరం. మేము చిత్తుచేసేది టెన్షనాసురుడి సంతతివాళ్లను మాత్రమే’’ అంటూ తమ గొప్ప చెప్పుకున్నారు. 

సత్యానందుడు వారిని లెక్కచేయలేదు గానీ నిత్యానందుడు వారిని ఆదరించాడు.  ‘‘వారు తమ దుష్టత్వం గురించి తామే చెప్పుకుంటున్నారు. ఇంత చెప్పాక కూడా వారితో స్నేహం సరికాదు. అలాంటి వారి నుంచి దూరంగా ఉండటమే మేలు’’ అంటూ సత్యానందుడు ఒక సలహా కూడా ఇచ్చాడు. అయితే నిత్యానందుడు ఆ సలహాను లెక్కచేయలేదు. వారితో స్నేహం మొదలుపెట్టాడు. ఒకరోజు నిత్యానందుడు అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో తోటి మిత్రులు అతడిని డాక్టరుడనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. విషయం గ్రహించిన డాక్టరుడు నవ్వి ఇలా అన్నాడు. ‘‘ఓ నిత్యానందుడా... నీ తోటి మిత్రుడైన సత్యానందుడు నీలాగే పనిచేస్తున్నాడు కదా. అయినా అతడు అనారోగ్యానికి గురికాలేదు. అది ఎందుకో అర్థంచేసుకో.  శ్వేతకాష్టుడు, మత్తచిత్తులతో నీ స్నేహం ఇలాగే కొనసాగితే నువ్వూ త్వరలోనే ఆ అకాలకిక్కరుడిలా ప్రాణాలు వదిలేస్తావు’’ అన్నాడు. అప్పుడు నిత్యానందం ‘‘ఎవరా కిక్కరుడూ... ఏమా కథ?’’ అని అడిగాడు. అప్పుడు డాక్టరుడు నవ్వి... ‘‘అప్పట్లో మాధవాపురానికి పడమటగా పదిక్రోసుల దూరంలో గచ్చిబౌళ్యం అనే ప్రాంతం ఉంది. అక్కడ కిక్కరుడు అనే వ్యక్తి పనిచేస్తుండేవాడు. ఒత్తిడిలో తనకు తెలియకుండానే కుర్చీలను తంతుండటం, పళ్లుకొరుక్కోవడం, జుట్టుపీక్కోవడం ఇత్యాది పనులు  చేస్తుండేవాడు. టెన్షన్‌లో చూసుకోకుండా దేన్ని పడితే దాన్ని తన్నుతూ ఉండటం వల్ల కొందరతణ్ణి ఎగతాళిగా టెన్షన్‌ కిక్కరుడు అని కూడా పిలిచేవాళ్లు. నీకంటే ముందు అతడు ఈ శ్వేతకాష్టుడూ, మత్తచిత్తులతో స్నేహం చేశాడు. శ్వేతకాష్టుడు తెల్లగా నిలువెత్తు రూపంలో అందంగానూ, మత్తచిత్తుడు బంగారువర్ణంతో మిలమిలలాడుతూ ద్రవరూపంలో  కనిపించేవారు. అంత అందమైన రూపురేఖలున్నాయి గానీ నిజానికి వారు దుష్టులు. తమ వద్ద రహస్యంగా ఉన్న నికోటినుడు, కొలెస్టరుడు అనే రాక్షసుల సాయంతో ఇతరులను కబళిస్తుంటారు. ఆ దుష్టజనసాన్నిహిత్యంతోనే కిక్కరుడు చనిపోయాడు. కాలం తీరకముందే పోవడం వల్ల ఆ దురదృష్టవంతుణ్ణి అందరూ ‘అకాల బకెట్‌ కిక్కరుడు’ అని కూడా పిలుస్తున్నారు’’ అని డాక్టరుడు కథ ముగించాడు. దాంతో ఆరోగ్యంలో భేదం తెచ్చే దుష్టసాంగత్యాలకు దూరంగా ఉండి నిత్యానందుడు నూరేళ్లు ఆరోగ్యంగా బతికాడు. 

సంధి... 
అప్పట్లో మొక్కలూ – జంతువులు పరస్పరం విపరీతమైన ద్వేషంతో రగిలిపోయేవి. కోపంతో జంతువులు మొక్కలను విచ్చలవిడిగా తినేస్తుండేవి. ప్రతీకారంతో మొక్కలు తమ వద్ద ఉన్న కంటకాలు అనే ఆయుధాలతో జంతువులను బాధించేవి. ఈ పోరు ఇరువురికీ నష్టం చేస్తుందని తెలుసుకున్న మొక్కలు ఒకరోజు జంతువులను తమ దగ్గరికి పిలిచాయి. ‘‘ఓ పిచ్చి జంతువులారా! విచ్చలవిడిగా మమ్మల్ని మేయడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం లేదు. నేడు మేము అంతరించిపోతే, రేపు ఆకలితో నకనకలాడుతూ మీరూ అంతరిస్తారు. ఒకప్పుడు మాకూ రవికిరణాలకు మధ్య తీవ్రమైన వైరం ఉండేది. వాటితో సంధి చేసుకొని మేం బాగుపడ్డాం. అదే దారిలో మీరూ–మేమూ సంధి చేసుకుందాం రండి’’ అని జంతువులకు సూచించాయి.  ‘‘ఎవరా రవికిరణాలూ – ఏమా కథ’’ అడిగాయి జంతువులు. అప్పుడు రవికిరణాల వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాయి మొక్కలు. ‘‘అప్పట్లో మేం ఇలా పచ్చగా ఆకులతో ఉండేవాళ్లం కాదు. కింద ఉన్న కుళ్లు మీద పుట్టగొడుగుల్లా పెరిగేవాళ్లం. అంతరిక్షంలోని అరుణపురం అనే చోటి నుంచి రవికిరణాలు... కాంతిపుంజాలనే వాహనాలను ఎక్కి విహరించడానికి భూమ్మీదికి వచ్చేవి. మేం మా గొడుగులతో వాటిని అడ్డుకునేవాళ్లం. అవి తీక్షణత అనే ఆయుధాలను ధరించి మమ్మల్ని బాధిస్తుండేవి. ఆ ఆయుధాల తాకిడికి మేము కమిలి, ముడుచుకుపోయి మూర్ఛిల్లి మరణించేవాళ్లం. మేం మరణించాక కూడా కిరణాలు మమ్మల్ని వదిలేవి కావు. మమ్మల్ని పూర్తిగా ఎండేలా చేసేవి. ఒకనాడు మేమంతా కిరణాలతో చర్చలు జరిపాం.  

‘‘అయ్యా... మీరు కారుణ్యాస్పదమైన కిరణోత్తములు. మమ్మల్ని ఎందుకిలా  బాధిస్తున్నారు’’ అని అడిగాం. అప్పుడా కిరణాలు ‘ఓ మొక్కబాలకులారా! మేము అరుణపురం నుంచి ఏ గ్రహం మీదికి వెళ్లినా మాకెవరూ అడ్డురారు. కానీ భూగ్రహంలో మీరు గొడుగుల్లా విస్తరించి మమ్మల్ని అడ్డగిస్తున్నారు. మా గమ్యమైన నేలను తాకకుండా చేస్తున్నారు. అందుకే మేము మిమ్మల్ని కమిలిపోయేలా కబళిస్తున్నాం’ అన్నాయి. అప్పుడు మేమికపై వారిని పూర్తిగా అడ్డగించబోమని చెప్పాం.  దాంతో ఆ రవి కిరణాలు కూడా కరుణించి ‘ఇకనుంచి మా ఎండతో మీ కండ పెరిగేలా చేస్తాం’ అని మాటిచ్చాయి. అప్పట్నుంచి మేం ఆకులను అభివృద్ధి చేసుకున్నాం. ఆకుకూ ఆకుకూ గ్యాప్‌ ఇస్తూ అవి గమ్యం చేరేలా చూస్తున్నాం. దాంతో కిరణాలు కూడా మాకు తమ శక్తిని ప్రసాదిస్తుంటాయి. ఆ శక్తిలోని వేడిమి సాయంతో మేం స్వయంపాకం చేసుకొని మా పాయసం మేమే వండుకు తింటుంటాం. అలా మా ఆహారం మేమే తయారు చేసుకుంటూ ఎండ సాయంతో కండపట్టడం మొదలుపెట్టాం. ఇదీ మా సంధి కథ. ఇలా సంధి చేసుకుంటే ఇరువురమూ లాభపడతాం’’ అని చెప్పాయి మొక్కలు. 

అంతేకాదు... జంతువుల గౌరవార్థం ఆమ్లజన్యం అనే శంఖాన్ని తీసి ‘ఇకపై దీన్ని  మీరు ఊదుకోండి’ అని చెప్పాయి. అప్పుడు జంతువులు కూడా నిశ్చింతగా ఊపిరివదిలి అందులోంచి బొగ్గుపులుసు అనే రుచికరమైన పులుసు వంటకాన్ని మొక్కలకు ఇచ్చాయి. ఇచ్చి... ఇకపై మీ కిరణాహారంతో పాటు ఈ పులుసునూ కలుపుకొని ఫుల్‌మీల్స్‌ తినమని చెప్పాయి. ఆ ఆమ్లజన్యం శంఖాన్ని ఊదుకోవడం, ఈ బొగ్గుపులుసును జుర్రుకోవడం కష్టం కావడంతో అవి రెండూ వాయురూపంలోకి మారాయి. సంధి తర్వాత అటు మొక్కలూ, ఇటు జంతువులూ వాయురూపంలోని ఆ పదార్థాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని విందు చేసుకుంటూ ఇప్పటికీ సుఖంగా జీవిస్తున్నాయి. 

‘‘ఇప్పటివరకూ బాగానే లాగించావు. సంధి తర్వాత విగ్రహం. ఇక్కడ సైన్సులోని న్యూట్రిషన్‌ పాఠం ఎలా చెబుతావురా? కష్టం కదా?’’ నేనడిగాను. ‘‘అందుకే నాన్నా! విగ్రహం బదులుగా ఈ చాప్టర్‌ పేరు ‘నిగ్రహం’ అని పెడతా’’ అన్నాడు. ‘‘నిగ్రహమా? అంటే? అందులో ఏం చెబుతావు?’’ ‘‘హెల్త్‌ బాగుండాలంటే ఏమేమి తినకుండా నిగ్రహం పాటించాలో ఈ చాప్టర్‌లో డీల్‌ చేస్తామన్నమాట. ఉదాహరణకు తెల్లరంగులో ఉండే శ్వేతభూతాలైన ఉప్పు, పంచదార ఇక్కడి పాత్రధారులు. ఇక అలాగే కొవ్వాసురులు, మాంసాసురులు అనే అసురుల పాత్రలు ప్రవేశపెట్టి... అవి చాలా రుచికరమైన కామరూపం ధరించి మార్కెటవనంలో, కిచెనాలయంలో, భోజనంబల్ల పరిసరాల్లో తిరుగుతూ ఆహ్వానిస్తుంటాయని చెపుతాం. వాటిని చూసి కూడా నిగ్రహించుకున్నవాడు అన్ని విధాలా బాగుపడతాడన్న విషయాన్ని ‘నిగ్రహం’ చాప్టర్‌లో వివరిస్తాం అన్నమాట’’ ఎక్స్‌ప్లెయిన్‌ చేశాడు మా బుజ్జిగాడు. 

ఒక్క విషయం నాకు నిర్ద్వంద్వంగా తెలిసిపోయింది. పంచతంత్రం కేవలం కథలు జీవితాన్ని నేర్పించడానికే పరిమితం కాదు. సరిగ్గా అన్వయించుకోవాలేగానీ... ఎవ్వరికైనా చదువు నేర్పించగలవవి. అలనాటి రాజు కొడుకులకేనా? విష్ణుశర్మ కల్లోకి వచ్చి అపరమొద్దు అయిన మా బుజ్జిగాడికి బయాలజీ, హెల్త్, న్యూట్రిషన్, మెడికల్‌ సైన్స్‌ ఇలా ఏదైనా చెబుతాడు. పంచతంత్రం శ్రద్ధగా చదివితే... రేపు మావాడు డాక్టర్‌ కావడం ఖాయమని నిశ్చయంగా తేలిపోయింది. 
 – యాసీన్‌  
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement