వాణ్ణే కంటే పోలా? | Child Psychiatrist counciling | Sakshi
Sakshi News home page

వాణ్ణే కంటే పోలా?

Published Tue, Aug 29 2017 12:18 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

వాణ్ణే కంటే పోలా?

వాణ్ణే కంటే పోలా?

ఊళ్లో పిల్లలందరికంటే ‘మావాడే గ్రేట్‌’ అని డబ్బా కొట్టుకుని.. పిల్లల్ని చెడగొట్టుకోవడం ఒక తంతైతే.. పక్కింటివాడిలా, పొరుగింటి వాడిలా నువ్వెందుకు లేవు? వాడిలా ఎందుకు లేవు? వీడిలా ఎందుకు లేవు.. అని పిల్లల్ని పోల్చడం.. ఇంకా డేంజరస్‌. ‘వాడెవడో.. నాకంటే అంత గొప్పోడైతే.. వాణ్ణే కంటే పోలా’ అని ఏ బిడ్డయినా అనుకుంటే?! చిన్న పిల్లల్ని చిన్నబుచ్చకండి. మీ ఆశయాలతో చిత్రహింసలు పెట్టకండి. వాడూ వజ్రమే! సానబట్టండి... సాధించకండి!!


‘అంకుల్, మ్యాథ్స్‌ నోట్‌బుక్‌ కావాలి’బడి ఆవరణలోనే ఉన్న స్టేషనరీ షాప్‌లోకి వెళ్లి అడిగాడు బంటి. తీసి ఇచ్చాడు షాప్‌ ఓనర్‌. చూసి ‘అంకుల్‌.. దేవుడి బొమ్మ కవర్‌ ఉన్నది కావాలి’ అన్నాడు. వినాయకుడి బొమ్మ ఉన్న బుక్‌ ఇచ్చాడు షాప్‌ ఓనర్‌. ‘అబ్బ.. నాకిష్టమైన గాడ్‌’ అని ఆ బుక్‌ను గుండెకానించుకుని షాప్‌ ఓనర్‌కి 20 రూపాయల నోటిచ్చి వెనక్కి తిరిగాడు బంటీ. క్లాస్‌రూమ్‌ వైపు నడుస్తూ ఆ కొత్త నోట్‌బుక్‌ను అలాగే గుండెకానించుకుని ‘దేవుడా.. దేవుడా.. నాకు మ్యాథ్స్‌ వచ్చేట్టు చూడు.. టీచర్‌తో తిట్లు తప్పేట్లు చూడు’ అని మనసులోనే దండం పెట్టుకున్నాడు బంటీ.

వినాయకుడూ విష్‌ చేయలేదు
బంటీ థర్డ్‌క్లాస్‌ స్టూడెంట్‌. చదువుకన్నా ఆటలంటే ఆసక్తి ఎక్కువ. ఇంగ్లిష్, సోషల్‌ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్‌లో అంతంతమాత్రమే. లెక్కలంటే భయం. దాంతో లెక్కల టీచర్‌ అన్నా, లెక్కల పీరియడ్‌ అన్నా.. లెక్కల ట్యూటర్‌ అన్నా.. చివరకు అమ్మ ఏదైనా కొనుక్కురమ్మని పంపి, వచ్చాక లెక్కలు అడిగినా వణుకే. అందుకే మొన్న వినాయక చవితికి వినాయకుడి దగ్గర వాడు లెక్కల పుస్తకమే పెట్టాడు. లెక్కల క్లాస్‌లో టీచర్‌ కొట్టొద్దని అమ్మ వాళ్లు చూడకుండా 101 గుంజీళ్లు తీశాడు. ఇప్పుడు వినాయకుడి బొమ్మ ఉన్న నోట్‌బుక్‌ కొనుక్కున్నాడు.

లెక్కల పీరియడ్‌ గంట మోగనే మోగింది. టీచర్‌ వచ్చింది. ప్రేయర్‌ అప్పుడు టీచర్‌ కనపడకపోతే.. సేఫ్‌ అనుకొని సంబరపడ్డాడు. క్లాస్‌లో ప్రత్యక్షమైన టీచర్‌ను చూడగానే ఆ ఆనందమంతా ఆవిరైపోయింది వాడిలో. అయినా ఎక్కడో ఏ మూలో నమ్మకం దేవుడి మీద. లెక్కలన్నీ వచ్చేట్టు చూస్తాడని.. టీచర్‌ చేత చీవాట్లు తప్పిస్తాడని. ఆ రోజు సబ్‌స్ట్రాక్షన్స్‌ క్లాస్‌. చెప్పి, రెండు ప్రాబ్లమ్స్‌ ఇచ్చింది సాల్వ్‌చేయమని క్లాస్‌ వర్క్‌ కింద. బంటీ ‘దేవుడి బొమ్మ కొత్త నోట్‌బుక్‌కి బోణీ’ ఆ తీసివేతలు. పదిసార్లు ఆ వినాయకుడికి దండం పెట్టుకొని ఇచ్చిన రెండు లెక్కలను చేసి.. టీచర్‌ దగ్గరకు వెళ్లాడు చూపించడానికి.

నోట్‌బుక్‌ను టీచర్‌కు ఇచ్చేముందు కూడా ఆ దేవుడిని గుండెకు హత్తుకొని కళ్లుమూసుకున్నాడు. ఈలోపే టీచర్‌ వాడిచేతిలోంచి నోట్‌బుక్‌ను లాక్కుంది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. టీచర్‌ మొహంలోని భావాలను గమనించసాగాడు భయం భయంగా. రెడ్‌ ఇంక్‌ పెన్‌తో ఆ రెండు లెక్కల మీద ఇంటూ మార్క్స్‌ పెట్టేసింది పెద్దగా. మొహం చిట్లించి బంటీవైపు తిరిగింది. అయిపోయింది అంతా అయిపోయింది. దేవుడు కూడా చీట్‌ చేశాడు.

‘‘ఒరేయ్‌ మొద్దు.. ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు? వీళ్లంతా చేస్తున్నారు.. నీకేమైంది? అడిషన్స్‌లో ఫెయిల్‌.. ఇప్పుడు సబ్‌ట్రాక్షన్స్‌కూడా రావట్లేదు.. ఎలారా..?’’ చెడామడా తిట్టింది. కొట్టడానికి చెక్క స్కేల్‌ను కూడా పైకెత్తింది.  వణుకుతున్న చేయిని చాపి.. గట్టిగా కళ్లు మూసుకొని నిలబడ్డాడు బంటీ. వాడి కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి. ఏమనుకుందో ఏమో టీచర్‌.. ఒరేయ్‌.. ఈ నోట్స్‌ మీద రేపు మీ పేరెంట్స్‌ సైన్‌ తీసుకుని రా.. ’ అని పురమాయించి, వెళ్లి కూర్చోమంది.

రాత్రి ఇంట్లో..
‘ఇన్నిన్ని ఫీజులు.. మళ్లీ అంత డబ్బుపోసి ట్యూషన్‌ పెట్టినా.. వీడికి చదువురావట్లేదు. మ్యాథ్స్‌లో అయితే మరీ పూర్‌ అవుతున్నాడు రోజురోజుకి’ మొదలు పెట్టింది బంటీవాళ్ల అమ్మ భోజనాల దగ్గర. ‘ఆటలు ఎక్కువయ్యాయి.. అన్నీ బంద్‌ చేయించు..  రోగం కుదిరి చదువు మీద మనసు పెడతాడు’ కంచంలో చేయి, సెల్‌ఫోన్‌ మీద దృష్టీ నిలుపుతూ అన్నాడు తండ్రి. మొహం ప్లేట్లోనే పెట్టి వింటున్నాడు బంటీ. పక్కనే ఉన్న బంటీ అక్క బబ్లీ భయపడుతోంది ఆ ఉరుము తన మీద కూడా ఎక్కడ గర్జిస్తుందోనని. ‘ఈ రోజు సబ్‌ట్రాక్షన్స్‌లో టెస్ట్‌ పెడితే జీరో మార్క్స్‌ వచ్చాయి’ ఇంకో నిజం అమ్మ నుంచి బంటీ వాళ్లనాన్నకు ఫిర్యాదు రూపంలో. నాన్న నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందోనని కూర్చున్నచోటే బిగుసుకుపోయాడు బంటీ.

‘మన పక్కఫ్లాట్‌లో ఉండే అక్షయ్‌.. వీడి క్లాసే. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌. మ్యాథ్స్‌లో అయితే పర్‌ఫెక్ట్‌. వాళ్లమ్మ వాడి గురించి చెప్తుంటే నాకు తలతీసేసినట్టుగా ఉంటోంది’ మళ్లీ కంప్లయింట్‌. ఈసారి బంటి ఎడమచేయి పిడికిలి బిగుసుకుంది. ‘ఇరవై నాలుగు గంటలూ చదువుతూనే ఉంటాడండీ.. స్కూల్‌నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్‌ ముందేసుకొని కూర్చుంటాడు. ఏదడిగినా ఇట్టే చెప్పేస్తాడు.సినిమాలు, షికార్లకు రమ్మని బతిమాలినా వెళ్లడు. చదువు తప్ప మరో ధ్యాస లేదు వాడికి. బంగారం. నా కడుపునా పుట్టారు.. డొక్కచీలిస్తే అక్షరం ముక్కరాని మొద్దులు.. నా ఖర్మ’ గిన్నెలు శబ్దం చేస్తూ కోపంతో వంటింట్లోకి వెళ్లింది బంటీవాళ్లమ్మ. తినడం ఆపేసి  కళ్లకిందనుంచి చూశాడు బంటీని వాళ్ల నాన్న. బంటీలో సన్నగా వణుకు మొదలైంది. ‘‘మాలతీ.. ఆ పక్కింటి కుర్రోడిని పిలువు ఒకసారి’’ కేకేశాడు భార్యను. ఆ మాట వచ్చిందే తడవుగా గబగబా పక్కింటికి వెళ్లి అక్షయ్‌ను వెంటబెట్టుకొని వచ్చింది.

బంటీ వర్సెస్‌ అక్షయ్‌
 ‘‘గబుక్కున తినేసిరా హాల్లోకి’’ అని కంచంలోనే చేయి కడుక్కొని వెళ్లిపోయాడు బంటీ వాళ్ల నాన్న. అక్కాతమ్ముళ్లు దిగులుగా మొహాలు చూసుకున్నారు. హాల్లో.. అక్షయ్‌తో బంటీ తల్లీ, తండ్రీ కబుర్లు చెపుతున్నారు. వాడు  కళ్లు పెద్దవి చేసి గుండ్రంగా తిప్పుతూ ఉత్సాహంగా సమాధానాలు ఇస్తున్నాడు. అన్నీ డైనింగ్‌ హాల్లో ఉన్న అక్కాతమ్ముడికి వినపడుతున్నాయి. ఆ ముచ్చట్లలో మూడొంతులు చదువు గురించే ఉంది. అందులోనూ  కంపారిజనే.

వాడి మాటలు విని అబ్బురపడుతూ బంటీని తక్కువ చేస్తున్నారు ఆ పేరెంట్స్‌. ఈ ఇద్దరూ ఏదో తిన్నట్టు చేసి చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చేశారు.  గమనించిన బంటీ తండ్రి.. అక్షయ్‌తో.. ‘‘ఏదీ నైన్త్‌ టేబుల్‌ చెప్పు నాన్నా..’’ అన్నాడు ముద్దుగా ఒళ్లో కూర్చోబెట్టుకొని. ఆ దృశ్యం చూసి బంటీకి ఒళ్లు మండిపోయింది. అక్షయ్‌ గుక్క తిప్పుకోకుండా తొమ్మిదో ఎక్కం అప్పజెప్పాడు. అలా మరో రెండు ఎక్కాలడిగితే అవీ చెప్పేశాడు. ఇప్పుడు బంటీ వంక చూసి‘‘ నువ్వు చెప్పు’’ అన్నాడు తండ్రి. ట్రై చేశాడు బంటీ. రాలేదు. వాడి తడబాటు చూసి అక్షయ్‌ మూతికి చెయ్యి అడ్డంపెట్టుకొని నవ్వసాగాడు. బంటీ మొహం ఎర్రబడింది. అవమానభారంతో ఆ పసిహృదయం తల్లడిల్లింది. తెలియకుండానే అక్షయ్‌ మీద కసి మొదలైంది. దాన్ని రగిలించే ప్రయత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. ‘ఒరేయ్‌.. వీడికి గుర్తుండిపోయేలా.. రేపటిలోగా టేబుల్స్‌ అన్నీ వచ్చేలా చెంప మీదొక్కటివ్వు’ అన్నాడు బంటీ తండ్రి.  అక్షయ్‌ ఉత్సాహంగా రాసాగాడు... తల్లిదండ్రులమీద కోపం, అక్షయ్‌ పట్ల ఉన్న కసి రెండూ ఆవేశంగా మారాయి బంటీలో. అక్షయ్‌ ముందుకురాగానే వాడు చెయ్యి ఎత్తేలోపే వాడిని పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టాడు బంటీ. కిందపడేసి కొట్టసాగాడు. అక్కడున్న అందరూ హతాశులయ్యారు బంటీ చర్యకు. వారిస్తుంటే ఆగట్లేదు వాడు. బలవంతంగా వాడిని పక్కకు లాగి అక్షయ్‌ను లేపి వాళ్లింటికి తీసుకెళ్లింది బంటీ వాళ్లమ్మ.

కౌన్సెలింగ్‌ పిల్లలకు కాదు..
ఆవేశం తగ్గని బంటీ స్కూల్‌ బ్యాగ్‌ తెచ్చి..‘‘నాకు మ్యాథ్స్‌ రాదు.. సైన్స్‌రాదు.. ఏమీ రావు పొండి.. నాకసలు చదువేరాదు.. అక్షయ్‌ బాగా చదువుతాడు కదా.. వాడినే ఇంట్లో పెట్టుకోండి.. నేనుండను.. నాకు చదువొద్దు’’ అని అరుస్తూ పుస్తకాలన్నీ చించేయసాగాడు. ఈ చర్య బంటీవాళ్ల నాన్నను మరింత షాక్‌కు గురి చేసింది. బబ్లీ ఏడుస్తూ పక్కన బిక్కుబిక్కుమంటూ నిలబడింది. ఈలోపునే వాళ్లమ్మా వచ్చింది. బంటీని చూసి కంగారు పడింది. వాళ్ల నాన్న ఆమె భుజం మీద చేయి వేసి నొక్కాడు కంగారు పడొద్దు అని.
ఆ రాత్రి ఆ దంపతులు డిసైడ్‌ అయ్యారు పిల్లలను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాలని. తీరా వెళ్లాక కౌన్సెలింగ్‌ పిల్లలకు కాదు తల్లిదండ్రులకే కావాలి అని అర్థమైంది సైకియాట్రిస్ట్‌కి.

అలా చేస్తే నెగటివ్‌ ఫలితాలే ఎక్కువ!
పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం, క్రమశిక్షణలో పెట్టడం అవసరమే. కాదనడం లేదు. కాని క్రమశిక్షణ పేరుతో వాళ్ల మీద ఒత్తిడి పెట్టడమే చాలా తప్పు. ప్రమాదం కూడా. పిల్లలు బద్ధకంతో చదవట్లేదా లేక లర్నింగ్‌ ప్రాబ్లమ్స్‌ ఏమన్నా ఉన్నాయా అన్న రెండు విషయాలను పెద్దవాళ్లు గమనించాలి. పిల్లాడు కావాలనే చదవకపోయినా తల్లిదండ్రులు అలా ప్రవర్తించడం తప్పు.  ఇలా వేరే పిల్లలతో, లేదా ఇంట్లోనే తోబుట్టువులతో కంపైర్‌ చేయడం వల్ల పెద్దవాళ్లు ఆశించిన ఫలితాలు రాకపోగా, ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదమే ఎక్కువ. ముందు పిల్లల శక్తిసామర్థ్యాలు, వాళ్ల లర్నింగ్‌ ఎబిలిటీస్‌ను అంచనా వేసి వాళ్ల లక్ష్యాలు నిర్దేశించాలి.

నిజంగానే పోల్చాల్సి వస్తే.. వేరేవాళ్లతో కాకుండా వాళ్లతో వాళ్లనే పోల్చాలి. కిందటిసారి బాగానే చదివావ్‌.. గుడ్‌.. ఈసారి ఇంకాస్త కష్టపడు.. ఇంకా బాగా ఇంప్రూవ్‌ అవుతావ్‌ అంటూ పాజిటివ్‌గా మొటివేట్‌ చేయాలి. అంతేకాని వేరే పిల్లలతో కంపైర్‌ చేస్తూ .. వీళ్లను కించపర్చడం మాత్రం చాలా తప్పు. దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువని గ్రహించాలి. ఒకవేళ  పిల్లలు ఆటలు, పాటలు వంటి ఇతర వ్యాపకాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతుంటే వాటితోపాటు చదువు ఎంత అవసరమో.. దాంతో సాధించే అచీవ్‌మెంట్స్‌ కూడా ఎంత గొప్పగా ఉంటాయో పిల్లలకు వివరించాలి. అన్నిటికన్నా ముందు పెద్దవాళ్లు రీజనబుల్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా పిల్లల మీద ఒత్తిడి పెట్టడం అస్సలు మంచిది కాదు. దానివల్ల పిల్లలు మరింతగా మొండికేసే ప్రమాదమే ఎక్కువ.
 – డాక్టర్‌ పద్మ పాల్వాయి, చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement