న్యూఢిల్లీ: సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ 2025లో పది లక్షల యూనిట్ల టీవీ విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పలు అంతర్జాతీయ బ్రాండ్ల భారత మార్కెట్ లైసెన్స్ కలిగిన ఈ సంస్థ టీవీ(TV)లతోపాటు గృహోపకరణాలను విక్రయిస్తుంటుంది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, సామర్థ్య విస్తరణ, ఆఫ్‌లైన్ ఛానళ్ల అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. థామ్సన్, కొడాక్(Kodak), బ్లాపంక్ట్, వైట్–వెస్టింగ్ హౌస్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ లైసెన్స్ హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి.
మరో రెండు అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి భారత మార్కెట్ హక్కులను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, జనవరి చివరికి వీటిని ప్రవేశపెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది 6,00,000 యూనిట్ల టీవీ అమ్మకాలను సాధించనున్నాం. వచ్చే ఏడాది 10,00,000 లక్షల అమ్మకాలు మా లక్ష్యం’అని చెప్పారు. అందుబాటు ధరల శ్రేణిలో వివిధ బ్రాండ్లపై స్మార్ట్ టీవీ(Smart TV)లను విక్రయిస్తున్న ఈ సంస్థ టర్నోవర్ రూ.700 కోట్లుగా ఉంది. ఆదాయంలో అధిక భాగం టీవీల విక్రయాల ద్వారానే వస్తోంది.
కరోనా తర్వాత అమ్మకాల జోరు
కరోనా అనంతరం ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడంతో టీవీల అమ్మకాలు ఆ సమయంలో జోరుగా సాగాయి. అనంతరం ఈ మార్కెట్‌లో వృద్ధి బలహీనపడింది. అయినప్పటికీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీ అమ్మకాల్లో వృద్ధి నమోదు చేస్తుండడం గమనార్హం. ఈ విభాగంలో థామ్సన్ బ్రాండ్ విక్రయాలపై ఈ కంపెనీకి అధిక ఆదాయం లభిస్తోంది. ఆ తర్వాత కొడాక్ బ్రాండ్ అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి.
ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
వాషింగ్ మెషిన్లపై దృష్టి..
సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీల తర్వాత వాషింగ్ మెషిన్ల విభాగంలో అధిక అమ్మకాలు సాధిస్తోంది. ఆన్‌లైన్ మార్కెట్లో వాషింగ్ మెషిన్ల విక్రయాల్లో ఈ సంస్థ వాటా రెండంకెల స్థాయిలో ఉంటోంది. ఆఫ్‌లైన్ ఛానళ్లనూ ఈ ఏడాది విస్తరించుకున్నామని, 2025లో రెండు లక్షల వాషింగ్ మెషిన్ యూనిట్ల అమ్మకాలు నమోదు చేయనున్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్(Amazon) ఈ–కామర్స్ పోర్టళ్లలో ఈ సంస్థ ఎక్కువగా అమ్మకాలు నమోదు చేస్తుంటుంది. ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తమ అమ్మకాల్లో 80 శాతం ఆన్‌లైన్ నుంచి, 20 శాతం ఆఫ్‌లైన్ నుంచి వస్తున్నాయని అవనీత్ సింగ్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆఫ్‌లైన్‌లో విక్రయాల వాటాను 40 శాతానికి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. టైర్–1 నగరాల నుంచి 35 అమ్మకాలు వస్తుండగా, టైర్–2 నుంచి 25 శాతం, టైర్–3 నుంచి 15 శాతం ఉంటున్నట్టు వెల్లడించారు. మిగిలిన 25 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటున్నాయని తెలిపారు. గత రెండేళ్లలో తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలనిస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment