దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.
‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్‌లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు.
ఏఆర్‌పీయూ రూ.300 స్థాయికి..
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్‌పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లు తమ కనెక్షన్‌లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.
మౌలికంలో పెట్టుబడులు..
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్‌పీయూ అవసరం.
ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్‌పీసీఐ ఊరట
బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్పు
ధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్‌లో వైర్‌లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. యాక్టివ్ సబ్‌స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్‌లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment