Tariff rates
-
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
12 ఓటీటీలు అందించే జియో కొత్త ప్లాన్ ఇదే..
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటీవల తన సబ్స్క్రైబర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.148 చెల్లించి ఏకంగా 12 ఓటీటీలను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి. జియో రూ.148 ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు 12 ఓటీటీలు ఇవే.. జియోసినిమా ప్రీమియం జీ5 సోనీలివ్ లయన్స్‌గేట్ ప్లే డిస్కవరీ+ సన్‌నెక్ట్స్ డాక్యుబే హోఇచోయ్ ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
ట్రంప్ నోట మళ్లీ భారత్‌పై పన్ను మాట
వాషింగ్టన్: భారత్‌లో కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా ఉన్నాయంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష పగ్గాలు మళ్లీ చేపడితే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తాననని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారత్‌లో ట్యాక్సులు మరీ ఎక్కువ. హార్లీ డేవిడ్ సన్లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు వేస్తోంది. అక్కడ 100 శాతం, 150, 200 శాతం వరకు పన్నులున్నాయి. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదా? అది సరికాదు. మనం కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తా’అని ఆయన హెచ్చరించారు. -
మొబైల్ వినియోగదారులకు భారీ షాక్!
టెలికాం దిగ్గజాలు మొబైల్ వినియోగదారులకు భారీ షాకివ్వనున్నాయి. గతేడాది నవంబర్‌లో ప్రీపెయిడ్ రీఛార్జ్ టారిఫ్‌లు పెంచాయి. ఈ ఏడాది మరోసారి పెంచేందుకు టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు సిద్ధమయ్యాయి. దేశీయ టెలికాం కంపెనీలు ఈ ఏడాది దీపావళి నాటికి 10 నుంచి 12 శాతం ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. దీంతో పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం ఎయిర్ టెల్ రూ.200, జియో రూ.185, వొడాఫోన్ ఐడియా రూ.135 పెరుగుతుందని ఇండియా యూనిట్‌కు చెందిన ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియం ఓ' నీల్ & కో ప్రతినిధి మయూరేష్ జోషి తెలిపారు. గతేడాది ఎంత పెంచాయంటే! గతేడాది నవంబర్‌లో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ టారిఫ్ ధరల్ని 20 నుంచి 25శాతం వరకు పెంచాయి. జియో సైతం అదే తరహాలో పెంచింది. దీంతో ఎక్కువ మంది వినియోగించుకునే లో టైర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.79 ని రూ.99కి చేరింది. దీంతో పాటు ఎయిర్టెల్ 84రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా ప్యాక్ రూ.698 నుంచి రూ.839కి చేరింది. -
AP: ఆ వాదనలో నిజం లేదు: ట్రాన్స్ కో ఎండీ
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్ అన్నారు. వేసవి దృష్ట్యా వినియోగం పెరిగిందని.. అదనపు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్లలోపు టారిఫ్‌లోకి వస్తారన్నారు. 50 శాతం మంది ప్రజల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారం స్వల్పంగానే ఉంటుందని తెలిపారు. ప్రజల కోరిక మేరకే టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నామని.. ఈ విధానంతో ప్రజలపై పెద్దగా భారం పడదని శ్రీధర్ అన్నారు. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ ‘‘విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా ప్రజలపై పడే భారం స్వల్పమే. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఏపిఈఆర్సీది. గతంలో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు అధిక ధరలకు చేసుకున్నారు. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వేసవి కారణంగా డిమాండ్ పెరిగింది. అందుకే 230 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతోంది. వాస్తవానికి సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదన నిజం కాదు. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదు. ధరలను సమీక్షించమనే ప్రభుత్వం కంపెనీలను కోరింది. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరా కోసమే సెకీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తును వినియోగిస్తామని’’ శ్రీధర్ తెలిపారు. -
ఈ ఏడాదీ మొబైల్ టారిఫ్‌ల మోత!
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ టారిఫ్‌ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ‘2022లో టారిఫ్‌లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు. పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. 2021 నవంబర్‌లో టారిఫ్‌లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్టెల్ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్‌పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 163గా ఉంది. వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్‌ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్ చెప్పారు. నెట్‌వర్క్‌లు .. డివైజ్‌ల అప్‌గ్రెడేషన్, క్లౌడ్ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎయిర్టెల్ బాదుడు షురూ!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా భారీ స్థాయిలో ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లు పెంచింది. వాయిస్ ప్లాన్లు, అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్–అప్‌లపై ఇది ఏకంగా 20–25 శాతం దాకా ఉంది. కొత్త రేట్లు నవంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎంట్రీ స్థాయి వాయిస్ ప్లాన్ రేటు 25 శాతం పెరగ్గా, మిగతా చాలా మటుకు అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో పెంపు సుమారు 20 శాతంగా ఉంది. డేటా టాప్–అప్ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు 20–21 శాతంగా ఉంది. పెట్టుబడులపై సముచిత రాబడులు వచ్చి, వ్యాపార నిర్వహణ సజావుగా సాగాలంటే ప్రతి మొబైల్ యూజర్‌పై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం రూ. 200 స్థాయిలో, అంతిమంగా రూ. 300 స్థాయిలో ఉండాలని ముందు నుంచి తాము చెబుతున్నామని ఎయిర్టెల్ పేర్కొంది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. ‘ఏఆర్పీయూ మేము భావిస్తున్న స్థాయిలో ఉంటే నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రంపై గణనీయంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. అలాగే దేశీయంగా 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా సాధ్యమవుతుంది‘ అని ఎయిర్టెల్ వివరించింది. ఏఆర్పీయూ పెరగాల్సిన అవసరం ఉందని చాన్నాళ్లుగా చెబుతున్నప్పటికీ.. ఎయిర్టెల్ ఈ స్థాయిలో టారిఫ్‌లు పెంచడం ఇదే ప్రథమం. ఈ ఏడాది జూలైలోనే కంపెనీ కొంత మేర పెంచింది. అప్పట్లో రూ. 49 ప్రీపెయిడ్ రీచార్జ్‌ని తొలగించింది. ఈసారి మాత్రం పెంపు భారీగానే ఉంది. రూ. 79 ప్లాన్.. ఇకపై రూ. 99.. ► టారిఫ్డ్ వాయిస్ ప్లాన్లకు సంబంధించి ప్రస్తుతం రూ. 79గా ఉన్న ప్లాన్ రేటు ఇకపై రూ. 99గా ఉండనుంది (దాదాపు 25.3 శాతం పెంపు). ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్‌టైమ్ (50 శాతం అధికంగా), 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది. ► అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో రూ. 149 ప్లాన్ ధర రూ. 179కి పెరుగుతుంది. అలాగే రూ. 2,498 ప్లాన్ రూ. 2,999గా మారుతుంది. ► డేటా టాప్ అప్ల విషయంలో రూ. 48 ప్లాన్ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారుతుంది. ► రూ. 251 డేటా టాప్ అప్ ప్లాన్ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) మారుతుంది. జియో, వొడాఐడియాపై దృష్టి.. ఎయిర్టెల్ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్‌ల పెంపు కీలకమంటూ వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర టక్కర్ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. తమ కంపెనీ మొబైల్ టారిఫ్‌ల పెంపుపై కసరత్తు చేస్తోందని, త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. -
భారీగా తగ్గిన డేటా టారిఫ్స్
న్యూఢిల్లీ : మొబైల్ ఇంటర్నెట్ రేట్లు భారీగా తగ్గాయి. గత మూడేళ్లలో మొబైల్ ఇంటర్నెట్ రేట్లు 93 శాతం మేర తగ్గినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డీవోటీ) రిపోర్టు చేసింది. ఇంటర్నెట్ రేట్లు భారీగా క్షీణించడంతో, ఈ మూడేళ్లలో డేటా వాడకం 25 సార్లకు పైగా పెరిగినట్టు తెలిపింది. అత్యంత చౌకైన టారిఫ్ గ్లోబలీ- 2014లో ఒక్కో జీబీకి 33 రూపాయలుంటే, 2017 సెప్టెంబర్‌లో ఒక్కో జీబీకి 21 రూపాయలుందని వెల్లడించింది. అంటే మొత్తంగా 93 శాతం వరకు టారిఫ్ తగ్గింపు ఉన్నట్టు డీవోటీ తెలిపింది. 2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాక, టారిఫ్ రేట్ల తగ్గింపు మరింత ఉందని పేర్కొంది. ఈ కంపెనీ ఒక్కో జీబీని రోజుకు అత్యంత తక్కువగా 4 రూపాయలకే అందిస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ రేట్లు తగ్గడంతో, డేటా వాడకం పలు సార్లు పెరిగినట్టు తెలిసింది. ఒక్కో సబ్‌స్క్రైబర్ సగటు డేటా వాడకం 25 సార్లు పెరిగిందని డీవోటీ ట్వీట్ చేసింది. అంటే 2014లో ఒక్కో నెలలో 62జీబీ వాడకముంటే, 2017లో ఒక్కో నెలలో 1.6జీబీ వాడకముందని తెలిపింది. కాగ, భారత్‌లో మొబైల్ డేటా వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్కో నెలలో 1.3 మిలియన్ జీబీ నమోదవుతున్నట్టు డీవోటీ పేర్కొంది. ఇది అమెరికా, చైనాలలో వాడే డేటా వాడకం కంటే అత్యధికం. మరోవైపు దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం రెండింతలు పైగా పెరగడంతో(190 మిలియన్ నుంచి 390 మిలియన్లకు పెరగడంతో), ఇంటర్నెట్ యూజర్లు కూడా 66 శాతం పెరిగినట్టు డీవోటీ తెలిపింది. 2014-17 మధ్యకాలంలో ఇంటర్నెట్ యూజర్లు 251 మిలియన్ల నుంచి 429 మిలియన్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. అటు బ్రాడ్‌బ్యాండ్ యాక్సస్ యూజర్లు కూడా 2014 మార్చిలో 61 మిలియన్ సబ్‌స్క్రైబర్లుంటే, 2017 సెప్టెంబర్‌లో 325 మిలియన్ల సబ్స్క్రైబర్లకు పెరిగినట్టు వెల్లడించింది. ట్రాయ్ డేటా ప్రకారం 2017 డిసెంబర్ చివరి నాటికి ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు 445.9 మిలియన్లకు ఎగిసినట్టు తెలిసింది. -
స్విచ్చేస్తే షాక్
సాక్షి, మంచిర్యాల : మరోసారి వినియోగదారులపై కరెంటు చార్జీల మోత మోగనుంది. సంస్థ లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచేలా ఎన్పీడీసీఎల్ ప్రతిపాదనలు చేసింది. దీంతో విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి కానుంది. ఫలితంగా ఏటా రూ.30 కోట్ల వరకు భారం పడనుంది. ఇప్పటికే వస్తున్న కరెంటు చార్జీలను భరించలేకుండా ఉన్న వినియోగదారులు.. మరోమారు పెంచనుండడంతో లబోదిబోమంటున్నారు. కమిషన్‌కు పెంపు ప్రతిపాదనలు.. : విద్యుత్ చార్జీల పెంపు టారిఫ్ రేట్లను రూపొందించిన ఎన్పీడీసీఎల్ ప్రతిపాదనలను ఇటీవల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేసింది. కమిషన్ కూడా చార్జీల పెంపుపై సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. చార్జీల పెంపుపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ గురువారం ఈ విషయమై వరంగల్‌లో సమావేశమైంది. ఇందులో జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు టారిఫ్ రేట్లపై వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇందులో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినా సభ్యులు మాత్రం మౌనంగా ఉండి .. చార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. చార్జీలు పెరిగితే జిల్లా ప్రజలపై సుమారుగా ఏటా రూ.30 కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. చార్జీల పెంపు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు.. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో రానున్న రోజుల్లో కరెంట్ కోతల ముప్పూ ఉండడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా 6,44,151 విద్యుత్ కనెక్షన్లు.. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలకు సంబంధించి 6,44,151 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో.. 5,10,695 గృహ సంబంధిత కనె క్షన్లు ఉండగా, పరిశ్రమలు 3,420, వ్యవసాయ కనెక్షన్లు 1,30,036 ఉన్నాయి. ప్రతినెలా 124 మిలియన్ యూనిట్ల నుంచి 140 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు సగటున నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకంలో ఉంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో డిస్కంల ఖర్చులు.. విద్యుత్ చార్జీల ఆదాయం మధ్య రూ.2.5 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు లోటు ఉంటోంది. అందుకే.. ఈ లోటును చార్జీల రూపేణా పూడ్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. చార్జీల పెంపు స్వల్పమే.. ప్రస్తుతం కొంత మేరకే చార్జీలు పెంచాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. అదే ప్రతిపాదన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేసింది. 100-200 యూనిట్లు వాడితే 4 శాతం, 200 ఆ పైనా విద్యుత్ వాడితే 5.57 శాతం మేరకు బిల్లులు పెంచాలని నిర్ణయించింది. గృహేతర, వాణిజ్య, పరిశ్రమలు, వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలు, పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, ప్రార్థనా మందిరాల్లో విద్యుత్ వినియోగంపై ప్రస్తుతమున్న చార్జీల కన్నా 5.75 శాతం హెచ్చిస్తూ ప్రతిపాదనలు పంపింది. దీంతోపాటు హెచ్‌టీ వినియోగం కింద సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వాడిన పరిశ్రమలకు అదనంగా ఒక రూపాయి చొప్పున టీవోడీ చార్జీని వినియోగించాలని విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఇదిలావుంటే.. జిల్లాలో గృహావసరాలకు సంబంధించి చాలా మంది 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. ఇతర కేటగిరిల్లోనూ వాడకం ఎక్కువే. ఈ లెక్కన చూసుకుంటే.. జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై రూ. 30 కోట్ల మేరకు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.