గూగుల్‌ పే, ఫోన్‌పేకి ఎన్‌పీసీఐ ఊరట | latest updates regarding Google Pay PhonePe and the National Payments Corporation of India | Sakshi
Sakshi News home page

గూగుల్‌ పే, ఫోన్‌పేకి ఎన్‌పీసీఐ ఊరట

Published Thu, Jan 2 2025 9:51 AM | Last Updated on Thu, Jan 2 2025 9:51 AM

latest updates regarding Google Pay PhonePe and the National Payments Corporation of India

ఫోన్‌పే, గూగుల్‌ పేలాంటి యూపీఐ యాప్‌లకు ఊరటనిచ్చే దిశగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది. థర్డ్‌ పార్టీ ఏకీకృత చెల్లింపుల విధానం (UPI) యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణంలో నిర్దిష్ట యాప్‌ల వాటా 30 శాతానికి మించరాదన్న ప్రతిపాదనను మరో రెండేళ్లు పెంచింది. 2026 డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో గూగుల్‌ పే, ఫోన్‌పేలాంటి థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్ల (TPAP) వాటా 80 శాతం స్థాయిలో ఉంటోంది. ఈ పరిమితిని క్రితం మూడు నెలల్లో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల ప్రాతిపదికన లెక్కిస్తారు. మరోవైపు, వాట్సాప్‌ పే యాప్‌ మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఎన్‌పీసీఐ పరిమితిని తొలగించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో వాట్సాప్‌ పే ఇకపై దేశవ్యాప్తంగా తమకున్న యూజర్లందరికీ యూపీఐ సర్వీసులను అందించేందుకు వీలవుతుంది. గతంలో వాట్సాప్‌ పే దశలవారీగా యూపీఐ యూజర్లను పెంచుకునే విధంగా పరిమితి విధించింది. ఇది 10 కోట్ల యూజర్లుగా ఉండేది.

ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దాంతో కొన్ని లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సానుకూల పరిణామాలు

సులువుగా లావాదేవీలు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి కేవైసీతో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌(PPI)ను థర్డ్ పార్టీ యుపీఐ యాప్స్‌కు అనుసంధానించడానికి అనుమతించింది. ఇది లావాదేవీలను మరింత అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా చేస్తుంది.

మరింత చేరువగా..

ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ లేని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా అందుబాటులోలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

సౌలభ్యంగా..

వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లను (పేటీఎం, ఫోన్ పే..) ఉపయోగించిన సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.

ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..

ప్రతికూల పరిణామాలు

మార్కెట్ ఆధిపత్యం

కొన్ని థర్డ్ పార్టీ యాప్‌ల(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) ఆధిపత్యం ద్వంద్వ ధోరణికి దారితీస్తుంది. ఇది డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లో పోటీని, సృజనాత్మకతను తగ్గిస్తుంది.

సాంకేతిక సవాళ్లు

కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లనే అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక అవాంతరాలు జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.

విదేశీ యాజమాన్యం

ఈ యాప్‌లు చాలా వరకు విదేశీ యాజమాన్యంలో ఉన్నాయి. వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలో ఫోన్‌పే, గూగుల్ - గూగుల్ పే.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. స్థానికంగా జరిగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై విదేశీ నియంత్రణకు సంబంధించి ఆందోళనలకు దారితీస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement