ఎన్‌పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం! | NPCI Meet With Fintech Companies For Increase Share Of UPI Transactions | Sakshi
Sakshi News home page

NPCI: కొత్త ఫిన్‌టెక్‌ సంస్థలతో చర్చలు.. ఎందుకంటే..

Published Thu, Apr 18 2024 9:08 AM | Last Updated on Thu, Apr 18 2024 9:25 AM

NPCI Meet With Fintech Companies For Increase Share Of UPI Transactions - Sakshi

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్‌పార్టీ చెల్లింపు యాప్‌లైన గూగుల్‌పే, ఫేన్‌పేను ఆహ్వానించలేదు.  క్రెడ్‌, స్లైస్‌, ఫ్యామ్‌పే, జొమాటో, గ్రో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్‌ఆఫ్‌ఇండియాలో కథనం వెలువడింది.

ఎన్‌పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్‌ యూపీఐ సర్వీస్‌లను అందించేలా చూడాలని ఎన్‌పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్‌ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్‌(ఎండీఆర్‌) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్‌పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్‌లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది.

రెండు సంస్థలదే గుత్తాధిపత్యం..

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్‌పే, గూగుల్‌పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్‌ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు

యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్‌ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్‌పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement