LeapFrog
-
చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!
కిడ్స్ మైండ్స్ * మా బాబు వయసు ఏడేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అల్లరంటే అరవడం, పరుగులు తీయడం కాదు. అన్నీ పగులగొట్టేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలు, ఇంట్లోని ఇతరత్రా వస్తువులు నేలకేసి కొట్టడం వాడికి చాలా ఇష్టం. అంతవరకూ బానే ఉంటాడు. ఉన్నట్టుండి చేతిలో ఉన్నదాన్ని విసిరి కొడతాడు. తిట్టినా, కొట్టినా వినడం లేదు. ఈ అలవాటు ఎలా పోగొట్టాలి? - వాణి, పాలకొల్లు హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఒక్క దగ్గర కూర్చోరు. పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి పిల్లలు ఇలా చేసే అవకాశాలు ఎక్కువ. కాకపోతే బాబు మరే విధమైన అల్లరీ చేయకుండా కేవలం విసిరి కొట్టడం మాత్రమే చేస్తున్నాడు. బహుశా ఇలా చేయడాన్ని తను ఎక్కడైనా చూసి ఉండవచ్చు. లేదంటే తను అలా ఒకట్రెండుసార్లు చేసినప్పుడు అటెన్షన్ దొరకడం వల్ల అది తనకు అలవాటైపోయి ఉండవచ్చు. దీన్ని మాన్పించాలంటే మీరొక పని చేయండి. దేనినైనా పగులగొడితే ‘టైమ్ అవుట్’ ఇస్తానని క్లియర్‌గా చెప్పండి. ‘టైమ్ అవుట్’ అంటే... తప్పు చేసినప్పుడు తనని తీసుకెళ్లి ఓ మూలన కూర్చోబెట్టి, అక్కడి నుంచి లేస్తే ఆ రోజు టీవీ చూడనివ్వననో ఆడుకోనివ్వననో చెప్పడం. వినడానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ఫలితాలనిస్తుంది. మొదట్లో బాబు లైట్‌గా తీసుకున్నా, నాలుగైదుసార్లు అలా చేసేసరికి తాను ఏం మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది. అలాగే మీరు ఇలా చేయడం ఎంత ముఖ్యమో... బాబు బుద్ధిగా ఉన్నప్పుడు మెచ్చుకోవడమూ అంతే ముఖ్యం. దానివల్ల మంచిగా ఉంటే మెప్పుకోలు వస్తుందన్న విషయం కూడా అర్థమై తనలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. * మా పాపకు ఎనిమిదేళ్లు. పెద్దగా అల్లరి చేయదు. బాగా చదువుతుంది కూడా. అయితే ఎందుకో ఈ మధ్య అబద్ధాలు ఆడుతోంది. హోమ్‌వర్క్ చేయకపోయినా చేశానంటుంది. టీచర్ ఏదైనా అన్నా, స్నేహితులతో గొడవ పడినా మాకు చెప్పడం లేదు. విషయం తెలిసి మేము నిలదీసినా ఏదేదో చెప్తోంది తప్ప నిజం చెప్పట్లేదు. పోనీ మేం తిడతామని భయపడుతోందా అంటే... నేను అస్సలు కోప్పడను. మావారు నాకంటే కూల్. అయినా ఎందుకిలా చేస్తోందంటారు? - మంజూష, చెన్నై మీది కోప్పడే తత్వం కాకపోయినా ఒక్కో సారి పిల్లలు నిజం చెప్పడానికి భయపడ వచ్చు. కాబట్టి తనను కూర్చోబెట్టి కూల్‌గా మాట్లాడండి. అబద్ధం చెప్పడం తప్పు, నిజమే చెప్పాలి అని చెప్పండి. మేమేమీ అనం, నువ్వు నిజాలే చెప్పు, అలా చెబితే మేం సంతోషపడతాము అంటూ వివరించండి. తను నిజం చెప్పినప్పుడు బాగా మెచ్చుకోండి. వీలైతే ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అలాగే అబద్ధం చెప్పినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల తనకు మంచికుండే విలువ, చెడు వల్ల కలిగే ఫలితం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని చేసినా కూడా పాప మారకపోతే మాత్రం వెంటనే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తమదైన పద్ధతిలో పాప అలవాటును తప్పకుండా మార్చగలుగుతారు. * మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. టీవీ విపరీతంగా చూస్తాడు. అయితే చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. అందుకే ఎప్పుడూ ఏమీ అనం. కాకపోతే వాడు చిన్నపిల్లలు చూసేవేమీ చూడడు. డిస్కవరీ, కార్టూన్ చానెల్స్ పెట్టడు. క్రైమ్‌స్టోరీలు, హారర్ స్టోరీలు చూస్తుంటాడు. సినిమాలు చూసినా ఇంగ్లిష్ యాక్షన్ మూవీసే చూస్తాడు. ఇది వాడి మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందేమో నని భయమేస్తోంది. అయినా కానీ ఆ అలవాటు మాన్పించలేకపోతున్నాం. ఏదైనా సలహా చెప్పండి. - శ్రీనివాసరావు, నంద్యాల బాబు బాగా చదవడం సంతోష కరమైన విషయం. కానీ ఎంత బాగా చదివినా టీవీ ఎక్కువసేపు చూడడం మాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి బరువు పెరుగుతారు. ఇతర పిల్లలతో ఆడడం తగ్గిపోయి, వయసుకు తగిన సోషల్ బిహేవియర్ నేర్చుకోలేరు. ఇంకా పెద్ద క్లాసులకు వెళ్లినప్పుడు చదువుపై కూడా ప్రభావం పడుతుంది. ఎంత మంచి ప్రోగ్రాములైనా సరే, ఒక గంటకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వకండి. అంటే.... టీవీ, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్ వంటివి ఏవైనా కూడా గంటను మించి చూడనివ్వకండి. అలాగే మీ బాబు పెద్దవాళ్ల ప్రోగ్రాములు చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి తను చూడకూడని చానెల్స్ని లాక్ చేసేయండి. ఆ సౌకర్యం టీవీల్లో ఉంటోంది. అన్నిటికంటే ముందు మీరు తను టీవీ చూసే టైమును స్ట్రిక్ట్‌గా తగ్గించేయండి. ఏడ్చినా, అరిచినా, ఎంత గోల చేసినా అందులో మార్పు చేయకండి. తర్వాత సమస్య దానికదే పరిష్కారమవుతుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
అల్లరి చేస్తోందని వాతలు
ఓ తల్లి ఘాతుకం బాపూజీనగర్‌లో ఘటన బంజారాహిల్స్: అల్లరి చేస్తున్న చిన్నారిని లాలించి.. బుజ్జగించాల్సిన తల్లే రాక్షసిలా మారింది... కన్నబిడ్డ అనే కనికరం లేకుండా గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రగాయాలకు గురైన ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్ హిల్స్ బాపూజీనగర్‌లో నివసించే వాణి, ఆంజనేయులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మద్యానికి బానిసైన భర్త ఇంటికి రాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో వాణి ఓ ఇంట్లో పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కూతురు సోని (5) ఇదే బస్తీలో అంగన్వాడి కేంద్రంలో చదువుతోంది. ఈ చిన్నారి ఎక్కువగా అల్లరి చేస్తుంది. చుట్టుపక్కల చిన్నారులతో ఆడుకొనే సమయంలో తన కొంటెతనాన్ని చూపించి తల్లికి తలనొప్పి తెస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సోనిని రోజూ దండిస్తోంది. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం తల్లి దిండు కింద దాచిన రూ. 100ను సోని తీసుకొని సమీపంలోని షాపులో తినుబండారాలు కొనుక్కుంది. తనకు తెలియకుండా డబ్బులు తీసుకుందని, రోజు రోజుకూ కూతురు అల్లరి ఎక్కువైందనే కోపం.. భర్త ఇంటిపట్టున ఉండటం లేదన్న బాధ.. ఈనేపథ్యంలో సహనం కోల్పోయిన వాణి సోమవారం ఉదయం గరిటెను బాగా కాల్చి చిన్నారి సోని కాళ్లు, చేతులు, కడుపు, బుగ్గలపై రెండువైపులా వాతలు పెట్టింది. చిన్నారి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగు తీయబోగా... లోపలి నుంచి గడియపెట్టి మళ్లీ వాతలు పెట్టింది. దీంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే వాణి కూతురిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి.. ఇంట్లోనే బంధించింది. చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మీడియా పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కలిగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తల్లిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అత్యంత దారుణం: బాలాల హక్కుల సంఘం సిటీబ్యూరో: చిన్నారి సోనిపై తల్లి వాతలు పెట్టిన ఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తల్లిదండ్రలే కన్న బిడ్డను హింసించడం అత్యంత దారుణమని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు త్వరగా విచారణ జరిపి శిక్ష విధిస్తే మరొకరు నేరం చేయరని ఆమె పేర్కొన్నారు. -
అలా... నా అల్లరి తగ్గింది!
కనువిప్పు సినిమాల్లో లెక్చరర్లను స్టూడెంట్లు ఆటపట్టించే దృశ్యాలను చూసీచూసీ... తెలియకుండానే వాటి ప్రభావానికి లోనయ్యాను. క్లాసులోకి లెక్చరర్ రావడమే ఆలస్యం... ఏదో ఒక జోక్ పేల్చేవాడిని. అమ్మాయిలు నవ్వడంతో మరింత రెచ్చిపోయేవాడిని. కొన్నిసార్లు బ్లాక్‌బోర్డ్ మీద ఏవో రాతలు రాసేవాడిని. మా కెమిస్ట్రీ లెక్చరర్‌కు ‘విషయం ఏమిటంటే...’ అనేది ఊతపదం. పాఠం చెబుతున్నప్పుడు చాలా సార్లు ‘విషయం ఏమిటంటే..’ అనేవారు. కెమిస్ట్రీ లెక్చరర్ రావడానికి ముందు నేను బ్లాక్‌బోర్డ్‌పై- ‘విషయం ఏమిటంటే... రేపు ఆదివారం. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి’ అని రాశాను. ఇది చూసి క్లాసంతా విరగబడి నవ్వింది. వారు నవ్వుతుంటే నేనేదో గొప్ప పని చేసినట్లు గర్వంగా ఫీలయ్యేవాడిని. ఆ రోజు కెమిస్ట్రీ మాస్టారు చిన్నబుచ్చుకున్నారు. ఆయన కళ్లలో బాధ కనిపించింది. కాలేజీలో కొత్తగా చేరిన ఒక లెక్చరర్, నా మీద ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ‘‘కాలేజీలో ఇలాంటి చిలిపి పనులు కామన్. నువ్వు మాత్రం నీ కాలేజీ రోజుల్లో చేయలేదా ఏమిటి! టేకిట్ ఈజీ’’ అని ప్రిన్సిపాల్ కెమిస్ట్రీ లెక్చరర్‌తో అనడంతో నేను మరింత రెచ్చిపోయాను. ప్రతి సంవత్సరం గురుపూజోత్సవం సందర్భంగా స్టూడెంట్లే లెక్చరర్ల పాత్ర పోషించేవారు. తోటి విద్యార్థులకు క్లాసులు తీసుకునేవారు. బాగా బోధించిన వారికి మంచి బహుమతి ఉండేది. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని నేను మ్యాథ్స్ లెక్చరర్ అయ్యాను. క్లాసులో అడుగుపెడుతున్నప్పుడు గుండెలు దడదడలాడాయి. ‘‘నాకు భయం ఏమిటి?’’ అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని క్లాసులోకి అడుగుపెట్టాను. క్లాసులో స్టూడెంట్స్ నా మీద వేసిన జోక్‌లు ఇన్నీ అన్నీ కావు. హడావుడిగా క్లాసు ముగించాను. క్లాసు నుంచి బయటికి రాగానే అవమాన భారంతో ఒళ్లంతా చెమటతో తడిసింది. ‘ఒక్కరోజు క్లాసుకే నేను ఇంత ఫీలై పోతే...రోజూ వచ్చే లెక్చరర్లు ఎంత ఫీలైపోతున్నారో’ అనే కోణంలో ఆలోచించి నా తప్పును నేను తెలుసుకున్నాను. ఇక, ఆ తరువాత నుంచి క్లాస్‌లో ఎప్పుడూ, ఏ లెక్చరర్ మీదా కామెంట్ చేయలేదు. - జె.కె, కాకినాడ -
మరీ ఇంత గారాబం అయితే ఎలా?
నాకు నా భార్యకు ఎప్పుడూ విభేదాలు వచ్చేవి కావు. అయితే మా అబ్బాయి పెరిగి పెద్దవాడవుతున్న కొద్ది..మా మధ్య విభేదాలు ఏర్పడడం, పెద్ద కావడం జరిగింది. విషయం ఏమంటే, మాకు ఒక్కగానొక్క కొడుకు. అబ్బాయిని మా ఆవిడ పరిమితికి మించి గారాబం చేసింది. దీంతో పిల్లాడు రెచ్చి పోయి అల్లరి చిల్లర పనులు చేసేవాడు. వాడిని ఎప్పుడైనా మందలిస్తే చాలు మా ఆవిడ అగ్గి మీద గుగ్గిలం అయ్యేది. ‘‘ఎప్పుడూ అబ్బాయి మీదే మీ దృష్టి. వాడిని బతకనివ్వరా ఏమిటి?’’ అనేది. ‘‘అబ్బాయి మీద నీ కంటే నాకు ప్రేమ ఎక్కువ. అలా అని గారాబంతో వాడిని చెడగొట్టడం భావ్యం కాదు’’ అని చెప్పి చూశాను. ఎన్ని చెప్పినా ఆమెలో మార్పు రాకపోవడంతో ఇక ఏమీ పట్టించుకోకుండా నా పనిలో నేను పడిపోయాను. కొద్దిరోజుల తరువాత... పొద్దుటే ఎవరో పెద్దగా తలుపు బాదుతున్నారు. ఆందోళనతో వెళ్లి తలుపు తీశాను. బయట అయిదుగురి వరకు ఉన్నారు. అందరి ముఖంలోనూ కోపం తాండవిస్తోంది. కదిలిస్తే కొట్టేలా ఉన్నారు. ‘‘ఏమైంది? ఎందుకొచ్చారు?’’ అని అడక్కుండానే...‘‘మీరు పిల్లాడిని కన్నారా? రాక్షసుడిని కన్నారా?’’ అన్నది ఒకావిడ కళ్లెర్ర చేస్తూ. సంగతి ఏమిటో నాకు అర్థమైంది. ‘‘నిన్న స్కూల్లో మీ అబ్బాయి మా అబ్బాయి చెవు కొరికాడట...’’ అని ఆమె చెప్పుకుంటూ పోతోంది. మా ఆవిడ, నేను క్షమాపణల మీద క్షమాపణలు చెప్పాము. వారిని శాంతింప చేయడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇక అప్పటి నుంచి మా ఆవిడ అబ్బాయి అల్లరిని అదుపులో ఉంచింది. నన్ను అర్థం చేసుకుంది. -పి.సూర్య నారాయణ, అనంతపురం