మరీ ఇంత గారాబం అయితే ఎలా?
నాకు నా భార్యకు ఎప్పుడూ విభేదాలు వచ్చేవి కావు. అయితే మా అబ్బాయి పెరిగి పెద్దవాడవుతున్న కొద్ది..మా మధ్య విభేదాలు ఏర్పడడం, పెద్ద కావడం జరిగింది. విషయం ఏమంటే, మాకు ఒక్కగానొక్క కొడుకు. అబ్బాయిని మా ఆవిడ పరిమితికి మించి గారాబం చేసింది. దీంతో పిల్లాడు రెచ్చి పోయి అల్లరి చిల్లర పనులు చేసేవాడు.
వాడిని ఎప్పుడైనా మందలిస్తే చాలు మా ఆవిడ అగ్గి మీద గుగ్గిలం అయ్యేది. ‘‘ఎప్పుడూ అబ్బాయి మీదే మీ దృష్టి. వాడిని బతకనివ్వరా ఏమిటి?’’ అనేది. ‘‘అబ్బాయి మీద నీ కంటే నాకు ప్రేమ ఎక్కువ. అలా అని గారాబంతో వాడిని చెడగొట్టడం భావ్యం కాదు’’ అని చెప్పి చూశాను. ఎన్ని చెప్పినా ఆమెలో మార్పు రాకపోవడంతో ఇక ఏమీ పట్టించుకోకుండా నా పనిలో నేను పడిపోయాను. కొద్దిరోజుల తరువాత... పొద్దుటే ఎవరో పెద్దగా తలుపు బాదుతున్నారు. ఆందోళనతో వెళ్లి తలుపు తీశాను. బయట అయిదుగురి వరకు ఉన్నారు. అందరి ముఖంలోనూ కోపం తాండవిస్తోంది. కదిలిస్తే కొట్టేలా ఉన్నారు.
‘‘ఏమైంది? ఎందుకొచ్చారు?’’ అని అడక్కుండానే...‘‘మీరు పిల్లాడిని కన్నారా? రాక్షసుడిని కన్నారా?’’ అన్నది ఒకావిడ కళ్లెర్ర చేస్తూ. సంగతి ఏమిటో నాకు అర్థమైంది. ‘‘నిన్న స్కూల్లో మీ అబ్బాయి మా అబ్బాయి చెవు కొరికాడట...’’ అని ఆమె చెప్పుకుంటూ పోతోంది.
మా ఆవిడ, నేను క్షమాపణల మీద క్షమాపణలు చెప్పాము. వారిని శాంతింప చేయడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇక అప్పటి నుంచి మా ఆవిడ అబ్బాయి అల్లరిని అదుపులో ఉంచింది. నన్ను అర్థం చేసుకుంది.
-పి.సూర్య నారాయణ, అనంతపురం