ఓ తల్లి ఘాతుకం బాపూజీనగర్‌లో ఘటన
బంజారాహిల్స్: అల్లరి చేస్తున్న చిన్నారిని లాలించి.. బుజ్జగించాల్సిన తల్లే రాక్షసిలా మారింది... కన్నబిడ్డ అనే కనికరం లేకుండా గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రగాయాలకు గురైన ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్ హిల్స్ బాపూజీనగర్‌లో నివసించే వాణి, ఆంజనేయులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మద్యానికి బానిసైన భర్త ఇంటికి రాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో వాణి ఓ ఇంట్లో పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కూతురు సోని (5) ఇదే బస్తీలో అంగన్‌వాడి కేంద్రంలో చదువుతోంది. ఈ చిన్నారి ఎక్కువగా అల్లరి చేస్తుంది. చుట్టుపక్కల చిన్నారులతో ఆడుకొనే సమయంలో తన కొంటెతనాన్ని చూపించి తల్లికి తలనొప్పి తెస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సోనిని రోజూ దండిస్తోంది. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం తల్లి దిండు కింద దాచిన రూ. 100ను సోని తీసుకొని సమీపంలోని షాపులో తినుబండారాలు కొనుక్కుంది. తనకు తెలియకుండా డబ్బులు తీసుకుందని, రోజు రోజుకూ కూతురు అల్లరి ఎక్కువైందనే కోపం.. భర్త ఇంటిపట్టున ఉండటం లేదన్న బాధ.. ఈనేపథ్యంలో సహనం కోల్పోయిన వాణి సోమవారం ఉదయం గరిటెను బాగా కాల్చి చిన్నారి సోని కాళ్లు, చేతులు, కడుపు, బుగ్గలపై రెండువైపులా వాతలు పెట్టింది.
చిన్నారి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగు తీయబోగా... లోపలి నుంచి గడియపెట్టి మళ్లీ వాతలు పెట్టింది. దీంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే వాణి కూతురిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి.. ఇంట్లోనే బంధించింది. చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మీడియా పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కలిగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తల్లిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అత్యంత దారుణం: బాలాల హక్కుల సంఘం
సిటీబ్యూరో: చిన్నారి సోనిపై తల్లి వాతలు పెట్టిన ఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తల్లిదండ్రలే కన్న బిడ్డను హింసించడం అత్యంత దారుణమని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు త్వరగా విచారణ జరిపి శిక్ష విధిస్తే మరొకరు నేరం చేయరని ఆమె పేర్కొన్నారు.
అల్లరి చేస్తోందని వాతలు
Published Wed, Dec 3 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement