కొరియన్, చైనా బ్రాండ్‌ల దెబ్బకు భారత్‌లో జపాన్ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలు కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో జపాన్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల వల్ల తిరిగి ఇండియాలో వాటి ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సోనీ , పానాసోనిక్, హిటాచీ వంటి జపాన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్‌లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కానీ కొరియన్, చైనా బ్రాండ్‌ల దెబ్బకు వాటి అమ్మకాలు స్థానికంగా తగ్గిపోయాయి. దాంతో జపాన్ కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తూ తిరిగి వాటి ఉత్పత్తుల అమ్మకాలను పునరుద్ధరిస్తున్నాయి.
ఎక్కువ మార్జిన్లు ఉండే ఉత్పత్తులు, బిగ్‌స్క్రీన్ టీవీలను విక్రయించడం, తక్కువ మార్జిన్లు ఉండే వాటిని నిలిపేయడం వంటి విధానాలను పాటిస్తున్నాయి. ప్రధానంగా జపాన్ కంపెనీలు ఇండియాలో టెలివిజన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెరిగాయి. దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధి, అమ్మకాల విషయంలో తిరోగమన పథంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 30% పైగా పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల వ్యాపారంతో పోలిస్తే వినియోగదారుల విభాగంలో 2025లో రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
అమ్మకాలు జూమ్
సోనీ ఇండియా గత ఎనిమిదేళ్లలో ఈసారి అత్యుత్తమ నికర లాభాన్ని నమోదు చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్ల అమ్మకాల్లో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సోనీ ఇండియా అమ్మకాలు రూ.7,663 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో గరిష్టంగా కంపెనీకి రూ.11,000 కోట్ల రెవెన్యూ సమకూరింది. తర్వాత ఈసారి వచ్చిన ఆదాయమే అధికంగా ఉంది.
చైనా బ్రాండ్‌లతో పోటీ
పానాసోనిక్ ఇండియా బిజినెస్ ఛైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ..‘జపాన్ బ్రాండ్‌లు ధరల విషయంలో పోటీ పడటం లేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి. వైఫల్యాల రేటును గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటున్నాం. భారత్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నాయి. షావోమీ, హైసెన్స్, హాయర్ వంటి చైనీస్ బ్రాండ్‌లు, కొడాక్, థామ్సన్ వంటి ఆన్‌లైన్ కేంద్రీకృత బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలున్నాయి. కొరియన్ కంపెనీలైన ఎల్‌జీ, సామ్‌సంగ్‌లతో కూడా జపాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఎయిర్ కండీషనర్ తయారీ రంగంలో ఉన్న జపాన్ కంపెనీ హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదిక 64% అమ్మకాలు పెరగడం ద్వారా రూ.1,392 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment