
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం ముగిసింది. కీలకమైన రెపోరేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకుకున్న కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐదో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించారు.
రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. రెపోరేటును యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది పదకొండోసారి. ఇక నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించారు. దీంతో ఇది 4 శాతానికి తగ్గింది.
