...కంట్రోల్ కంట్రోల్...
జీవితంలో మనం ఏది చేసినా దాని వల్ల మనకి మన కుటుంబానికి మన పరిసరాలకి ఉపయోగపడేలా ఉండాలి... కోపం ఎందుకూ పనికి రాదు. కొంతమంది కోపం వస్తే ఊగిపోతారు. కొందరు గోడకు నెత్తి బాదుకుంటారట. ఇంకొందరు ఏకంగా జుట్టే పీకేసుకుంటారట.గోడు చెప్పుకుంటే పోలా... గోడకు బాదుకోవాలా? పంచుకుంటే పోలా... పీక్కోవాలా? నవ గ్రహాలకు కోపం వస్తే పండితులు పరిహారం చెబుతారు. దశ ఆగ్రహాలు వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి సైకియాట్రిస్ట్‌లు చెబుతున్నారు.
1. గొంతు చిరుగుద్ది: గాండ్రింపు, గర్జన, ఘీంకారం... అడవి జంతువుల ఆగ్రహ ప్రదర్శన మార్గం. అర్థంలేని ధ్వనులవి. కొందరికి కోపం వస్తే, అర్థం లేకుండా గొంతు చించుకుంటారు. దీనివల్ల స్వరపేటిక దెబ్బతిని, గొంతు బొంగురుపోవడం తప్ప ఉపయోగమేమీ ఉండదు. ఇలా గొంతు చించుకోవడాన్నే వైద్య పరిభాషలో ‘షౌటింగ్ స్పెల్స్’ అంటారు.
2. తలకు తప్పని బొప్పి: కోపతాపాలు తలకెక్కినప్పుడు కొందరు అదేపనిగా గోడకేసి తలబాదేసుకుంటారు. దీవార్‌తో వారు చేసే వార్ ఎలా ఉంటుందంటే, చెవులే లేని గోడ ముందు నెత్తితో శంఖం ఊదడంలా ఉంటుంది. గొంతు చించుకున్నా, కోపం చల్లారకుంటే కొందరు ఇలాగే తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. ఫలితంగా తలకు బొప్పి కట్టించుకుని, తర్వాత తాపీగా బాధపడతారు.
3. అర్థంలేని ఆత్మహాని: కోపానికి కాళ్లు మొలిసన్తే అది దేన్ని తంతోందో దానికే తెలియదు. ఉదాహరణకు బైక్ మీద వెళ్తూ... గుండ్రటి రాయి తగిలి కిందపడిపోయారని అనుకుందాం. లేవగానే మొదట చేసే పని ఆ రాయిని కాలితో తంతారు. రాయిని తంతే గాయమయ్యేది కాలికే గానీ, రాతికి కాదనే ఇంగితం ఆ క్షణాన పనిచేయదు. దీన్నే వైద్యులు ‘డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్’ (డీఎస్‌హెచ్) అంటారు.
4. వస్తువులపై ప్రతాపం: కోపం కట్టలు తెంచుకున్నప్పుడు కొందరు అందుబాటులో ఉన్న వస్తువులపై ప్రతాపం చూపిస్తారు. చేతిలో ఉన్న వస్తువులను బలంగా విసిరి కొడతారు. గోడకు ఆనుకున్న టీవీ లాంటి వస్తువులను సైతం నేలకేసి కొడతారు. ఇలాంటి చర్యల వల్ల ఆర్థికనష్టం, ఆపై మనస్తాపం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
5. మాడిపోతారు: ఆగ్రహజ్వాలల్లో తమను తామే మాడ్చేసుకుంటారు కొందరు. నిస్సహాయ పరిస్థితులు ఎదురైనప్పుడు బాహాటంగా కోపతాపాలను ప్రదర్శించలేని సందర్భాల్లో, ఆ కోపాన్ని తమపైకే మళ్లించుకుంటారు. తిండి మీద అలిగి, పేగులను మాడ్చేసుకుంటారు.
6. కునుకుపై కోపం: కోపతాపాలు మనసును దహిస్తున్నప్పుడు కొందరు నిద్రకు దూరమవుతారు. నిద్ర ముంచుకొస్తున్నా, రేగుతున్న కోపాన్ని జోగనివ్వకుండా ఉండేందుకు తమను తామే హింసించుకుంటారు. దీనినే వైద్య పరిభాషలో ‘డెలిబరేట్ ఇన్సోమ్నియా’ అంటారు.
7. సహాయ నిరాకరణ: ఇది గాంధీ మార్గం. నిస్సహాయులు చేసే అసహన ప్రదర్శన. కోపం తలకెక్కినప్పుడు... తమకు తాము హాని చేసుకునేంతగా నియంత్రణ కోల్పోని సంయమనశీలురు పనిపాట్లపై ప్రతాపాన్ని చూపిస్తారు. స్కూలుకెళ్లే పిల్లలైతే, బడికి డుమ్మా కొట్టేస్తారు. ఉద్యోగులైతే ఆఫీసుకు ఎగనామం పెడతారు. బాస్ పిలిచినా మీటింగ్‌కు ముఖం చాటేస్తారు. ఇలాంటి సహాయ నిరాకరణనే ‘డెలిబరేట్ నాన్ కోఆపరేషన్’ అంటారు.
8. మౌన పోరాటం: కోపంతో గొంతుచించుకునే లక్షణం కొందరిలో ఉంటే, ఇంకొందరు నోరువిప్పకుండానే సాధిస్తారు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనపోరాటం సాగిస్తారు. కోప శిఖరాన్ని ఆరోహించిన వారు ఎప్పటికో గానీ, దిగిరారు.
9. స్వీయ హింసాత్మకం: నిప్పంటితే చాలు... చప్పున చెయ్యి వెనక్కు లాక్కుంటాం. కానీ కోపం తెచ్చే ముప్పు నిప్పులా మండుతుంది. కోపంతో భగ్గుమనే అగ్గిరాముళ్లు కోపం తలకెక్కినప్పుడు తమ శరీరాన్ని తామే సిగరెట్స్‌తో కాల్చుకోవడం, వాతలు పెట్టుకోవడం వంటి చేష్టలకు దిగుతారు.
10. జుట్టు పీక్కుంటారు: ఏదో మాట వరసకు కాదు, కోపం కంట్రోల్ తప్పినప్పుడు కొందరు నిజంగానే జుట్టు పీకేసుకుంటారు. నెత్తిపైన చేతికి అందే జుట్టు మాత్రమే కాదు.. కోపంతో వారు పెకలించే కేశాలు కనురెప్పలవీ కావచ్చు.. దేహసర్వస్వం నుంచి కేశసర్వస్వాన్నీ పీకి పారేసుకునే ఈ ఉన్మాదాన్ని వైద్య పరిభాషలో ‘ట్రైకోటిల్లోమేనియా’ అంటారు.
కోపానికి కళ్లాలిలా...
కోపం సహజ సహజాతం. దాన్ని అదుపు చేసే మార్గాలు ఆరోగ్యకరంగా ఉండాలి. స్వయంగా నియంత్రించుకోవాలి. అలా చేసేందుకు పది మార్గాలివి...
1. కోపంతో ఏ పనికీ పూనుకోవద్దు. అలాంటప్పుడు కోపానికి దారితీసిన పరిసరాల నుంచి దూరంగా వెళ్లాలి. చేయబోయే పని మంచిచెడులను కూల్‌గా ఆలోచించాలి. వీలుంటే ఎవరితోనైనా సంప్రదించాలి.
2. జీవితంలో అన్నీ మామూలు పరిణామాలే. కోపం ఒక ఉద్వేగం. ఆ స్థితి దాటిన తర్వాత పరిస్థితి మామూలైపోతుంది అని గ్రహించాలి.
3. ప్రతిసారీ మనదే గెలుపు కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్లూ గెలవవచ్చు. ఇది చాలా సహజం. క్రీడాస్ఫూర్తితో ఈ సత్యాన్ని ఆమోదించాలి.
4. కోపం తలకెక్కినప్పుడు కాస్త అదుపులోకి తెచ్చుకుని, మిమ్మల్ని చల్లబరచేవారి మాటలను వినండి. వారి మాటలు ఎంతగా వింటుంటే, అంతగా మీ కోపం తగ్గుతుంది.
5. జీవితంలో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలనే లేదు. మీకు తెలియని అంశాలూ ఉండవచ్చు. అందుకు చిన్నబుచ్చుకోవడం, కోపం తెచ్చుకోవడం తగదు.
6. కోపతాపాలతో అర్థంలేని ఆత్మహాని మార్గాలకు దిగకుండా కాస్త రిలాక్స్ అవ్వండి. విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది.
7. మీ కోపాన్ని అదుపు చేయగలవారు అని మీరు నమ్మిన వ్యక్తులను రోల్‌మోడల్‌గా ఎంచుకోండి. వీలున్నప్పుడల్లా వారితో కొద్దిసేపు గడపండి. వాళ్లను అనుసరించే ప్రయత్నం చేయండి.
8. మీకు కోపం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను భయభ్రాంతులను చేయడం ద్వారా మీరు గెలవవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు ఓడిపోతుంటారన్న విషయాన్ని గ్రహించండి.
9. మీ మాట నెగ్గుతోందా, మీ పంతం నెరవేరుతోందా, లేక మీరు గెలుస్తున్నారా అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోండి.
10. ఏయే సమయాల్లో మీకు కోపం వస్తుందో గ్రహించి, మీ వృత్తి బాధ్యతలలో కోసం వల్ల మీరేమి కోల్పోతున్నారో, దానిని అధిగమించడం వల్ల మీరు గెలవగలిగేదేమిటో రాసుకొండి. దాన్ని మాటిమాటికీ చదువుకోండి.
పైన పేర్కొన్నవి కోపం వచ్చినప్పుడు చేసే పనులు. అవిగాక మామూలుగా ఉన్నప్పుడూ రోజూ ధ్యానం లాంటి మార్గాలు అనుసరించండి. దాంతో కోపాన్ని నివారించుకోవడం వీలవుతుంది. అప్పటికీ సాధ్యం కాకపోతే, ముక్కు చివరనే అది తిష్ఠ వేస్తే... సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.
ఇన్‌పుట్స్: డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్, బంజారాహిల్స్, హైదరాబాద్
కోపలాభాలు
ఆగ్రహం అనర్థదాయకమే అయినా, అదుపు తప్పనివ్వకుంటే, దానిని సానుకూలంగానూ వినియోగించుకోవచ్చు. కోపతాపాలను సద్వినియోగం చేసుకోగల పది మార్గాలు ఇవే...
1. మీరు ఒక మంచి వ్యాపకాన్ని ఎంచుకోండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆగ్రహాన్ని ఆ వ్యాపకంలో ప్రదర్శించండి.
2. ఏదైనా ఒక ఆటను ప్రాక్టీస్ చేయండి. ఆగ్రహ సమయంలో మీకు ఇష్టమైన ఆట ఆడండి.
3. వేర్వేరు రంగాలకు చెందిన అనేక రకాల వ్యక్తులతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి. కోపం రాగానే, మీరున్న చోటి నుంచి పక్కకు వెళ్లి, మీ స్నేహితులను కలవండి.
4. కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇతరులకు శిక్షణ ఇవ్వండి. ఇలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరే... కోపాన్ని నివారించుకోవాలన్న స్పృహను అభివృద్ధి చేసుకుంటారు.
5. మానవాళికి మేలు చేసే అంశాల గురించి ఆలోచించండి. సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు కోపం కలగదు సరికదా... సంతోషం ఎక్కువవుతుంది.
6. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను ముందుగా వెళ్లనీయండి. వెళ్లనిచ్చేలా మనసుకు శిక్షణ ఇచ్చుకోండి.
7. మంచి సంగీతం, పాటలూ మిమ్మల్ని ఆహ్లాదరపరుస్తాయి.
8. కోపం వచ్చినప్పుడల్లా మరిన్ని అదనపు బాధ్యతలు తీసుకోండి.
9. కొత్త పుస్తకం ప్రత్యేకంగా మనస్తత్వ శాస్త్రానికి చెందినది వెతకి మరీ చదవండి.
10. హాస్య సంఘటనలను నెమరు వేసుకోండి. హ్యూమర్ వీడియోలు, కార్టూన్లు, కామెడీ సినిమాలు చూడండి.