అడ్వాన్స్‌డ్‌ తర్వాతే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ | Counselling schedule after JEE Advanced | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌ తర్వాతే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

Published Wed, Jan 1 2025 1:08 AM | Last Updated on Wed, Jan 1 2025 1:08 AM

Counselling schedule after JEE Advanced

జేఈఈ పరీక్షపై జోసా నిర్ణయం..

కౌన్సెలింగ్‌ రౌండ్లు తగ్గించే యోచన 

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కాస్త సరళతరం.. 

అడ్మిట్‌ కార్డులకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌

సాక్షి, హైదరాబాద్‌ :  జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష పూర్తయిన తర్వాతే ఈసారి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయాలని జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో స్థానిక కౌన్సెలింగ్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 

జోసా కౌన్సెలింగ్‌ సాధారణంగా ఆరు రౌండ్ల వరకూ ఉంటుంది. అయితే 2025లో దీన్ని కుదించే ఆలోచన చేస్తున్నారు. నాలుగు రౌండ్లలోనే పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ దశల కౌన్సెలింగ్‌ వల్ల కూడా విద్యార్థులు ఆప్షన్ల ఎంపిక, అంతర్గత స్లైడింగ్‌ విధానంలో ఇబ్బంది పడుతున్నట్టు గత రెండేళ్ళుగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

ఇక అడ్వాన్స్‌డ్‌ పరీక్ష విధానాన్ని కూడా కొంత సరళీకరించాలనే యోచనలో ఉన్నారు. అత్యంత కఠినం, కఠినం, సాధారణ ప్రశ్నల్లో.. అత్యంత కఠినం స్థాయిని కొంతమేర తగ్గించాలని భావిస్తున్నారు.

సర్వర్‌ సమస్యకు చెక్‌
జేఈఈ మెయిన్స్‌ తొలి దశ జనవరి 22 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఈ పరీక్ష రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది మెయిన్స్‌కు హాజరవుతారు. 

అయితే ఏటా ఎక్కడో ఒకచోట అడ్మిట్‌ కార్డులు సరిగా డౌన్‌లోడ్‌ అవ్వడం లేదు. దీనికి సర్వర్‌ సమస్య కారణమని గుర్తించడంతో, ఈసారి కొత్త సాఫ్‌్టవేర్‌ను అనుసంధానం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మెయిన్స్‌లో మెరిట్‌ సాధించిన విద్యార్థుల్లో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు.

రాష్ట్రంలో 13 కేంద్రాల్లో పరీక్ష
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో జరుగుతుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి కేంద్రాలను ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. ఏపీలో కూడా పలు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. 

ఆయా కేంద్రాలను జనవరిలో కాన్పూర్‌ ఐఐటీ అధికారులు పరిశీలిస్తారు. మే 18న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష పూర్తయిన తర్వాత 22న అభ్యర్ధుల ఓఎంఆర్‌ పత్రాలు వెబ్‌లో ఉంచుతారు. 26వ తేదీన ప్రాథమిక కీ విడు దల చేస్తారు. 26–27 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్‌ 8న ఫలితాలు వెల్లడిస్తారు. 

ఈ నేపథ్యంలో మే 25లోగా జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జోసా కౌన్సెలింగ్‌ చివరి రౌండ్‌ను బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ చివరి రౌండ్‌ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement