joint seat allocation authority
-
సీఎస్‌ఈకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం ఐదవ విడత సీట్ల కేటా యింపు పూర్తిచేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి ఇది చివరిదశ. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా రెండు విడతల సీట్ల కేటాయింపు చేపడతారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్ఐటీల్లో 24,226, దేశంలోని 26 ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు, ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60 వేల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన వారికి ఐఐటీల్లో, జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. కలిసొచ్చిన కటాఫ్... సీట్ల పెరుగుదలఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కటాఫ్ పెరిగింది. దీంతో పాటు ఐఐటీల్లో అదనంగా వెయ్యి సీట్లు కొత్తగా చేర్చారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచీలో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. తాము కోరుకున్న సీటు ఎన్ఐటీల్లో పొందవచ్చని భావించారు. ఫలితంగా నిట్ వంటి సంస్థల్లో సీఎస్ఈకి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈఈ ర్యాంకర్లు కూడా మళ్లుతున్నారు. ఐఐటీ అడ్వాన్స్డ్ రాసినవారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. ఈ కారణంగానూ ఈసారి ఐఐటీ సీట్లు పొందే కటాఫ్ పెరిగింది. కానీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.సీఎస్ఈ రాకుంటే ఐఐటీల్లో చేరడం లేదు అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా విద్యార్థులు ఎన్ఐటీల్లో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సీఎస్ఈలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇతర బ్రాంచీల్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు. వీరంతా ఎన్ఐటీల్లో, రాష్ట్ర టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాదికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయి. ఎన్ఐటీల్లో మాత్రం పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. – ఎంఎన్.రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐ టీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఆరు దశల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు చేపట్టింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఏ సంస్థలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందనేది తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఐటీల్లో దాదాపు సీట్ల కేటాయింపు పూర్తయినప్పటికీ, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే వీలుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇందులో ఐఐటీ సీటు కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హులైనప్పటికీ పరీక్ష రాసింది మాత్రం కేవలం1.60 లక్షల మందే ఉన్నారు. వీరిలో 42 వేల మంది అర్హులుగా ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు. ఆ సంస్థల్లో 54,477 ఇంజనీరింగ్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్ఐటీల్లో 54477 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళ లకు 1,567 సీట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐఐటీల్లో మొత్తంగా 500 సీట్ల వరకూ పెరిగాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ పెంపు అనివార్యమైంది. ఎన్ఐటీలో 23, 994 సీట్లు ఉంటే, ఇందులో మహిళలకు 749 సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 7,126 ఇంజనీరింగ్ సీట్లు (మహిళలకు 625), జీఎఫ్ఐ టీల్లో 6,759 (మహిళలకు 30) సీట్లున్నాయి. -
సీట్ల కేటాయింపు 6 రౌండ్లకు పరిమితం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ఆరు రౌండ్లలో పూర్తి చేయాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2022 నిర్ణయించింది. ఈసారి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో సీట్ల కేటాయింపును ఆరు విడతలకే పరిమితం చేసింది. గతంలో ఏడు రౌండ్ల మేర సీట్ల కేటాయింపు చేయడంతోపాటు ప్రత్యేక రౌండ్లను కూడా నిర్వహించింది. 2015, 2016ల్లో నాలుగేసి రౌండ్లలో సీట్ల కేటాయింపును పూర్తి చేయగా 2017, 2018, 2019ల్లో ఏడేసి రౌండ్లలో సీట్ల కేటాయింపు చేశారు. 2020, 2021ల్లో ఆరు రౌండ్లలో ముగించారు. ఈసారి సీట్ల కేటాయింపును త్వరగా పూర్తి చేసి తరగతులు ప్రారంభమయ్యేలా జోసా షెడ్యూల్‌ను రూపొందించింది. 12 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనుండడంతో మరుసటి రోజు అంటే 12 నుంచి సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆ రోజు నుంచి మెరిట్ విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు చాయిస్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నందున ఆర్కిటెక్చర్ కోర్సు ఔత్సాహికులు ఆ రోజున చాయిస్‌లను నమోదు చేయాలి. ఇలా చాయిస్‌లను నమోదు చేసిన వారికి 18న మాక్ సీట్ కేటాయిస్తారు. ఆ తర్వాత మళ్లీ చాయిస్‌ల నమోదుకు అవకాశమిచ్చి 20న మాక్ సీట్ కేటాయింపు చేస్తారు. తమ ర్యాంకుకు ఏ కోర్సులో, ఏ సంస్థలో సీటు వస్తుందో ఒక అవగాహనకు వచ్చిన విద్యార్థులు చివరగా సెప్టెంబర్ 20న చాయిస్‌లను లాక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపును చేపడతారు. ఇక ఎన్ఐటీలు, తదితర సంస్థల్లో మిగిలి ఉండే సీట్లకు ప్రత్యేక రౌండ్ ద్వారా నిర్వహిస్తారు. ఎన్ని సంస్థలు, ఎన్ని సీట్లు.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 36 ఇతర సంస్థల్లో విద్యార్థులకు జోసా సీట్లను కేటాయిస్తుంది. కాగా అందరూ సీట్లు ఆశించే 23 ఐఐటీల్లో 16 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. మరోవైపు ఐఐటీల్లో అమ్మాయిల చేరికలను 20 శాతం మేర పెంచేందుకు కేంద్రం2018 నుంచి 2020 వరకు వారికి ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటాను ప్రకటించింది. 2021 నుంచి ఈ కేటాయింపును ఆయా జాతీయ విద్యా సంస్థలే నిర్ణయానికే వదిలేసింది. -
నిట్‌లోని 750 సీట్లు ఫుల్
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో చేరడానికి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించిన తొలి రౌండ్లోనే నిట్‌లో ఉన్న 750 సీట్లు అయిపోయాయి. ఇక్కడ చేరడానికి అంగీకారం వ్యక్తం చేస్తూ 750 మంది ఆప్షన్‌ను ఇచ్చారు. ఈ వివరాలను బుధవారం రాత్రి నిట్ అధికారులు వెల్లడించారు. నిట్‌లో మొత్తం సీట్లు 750 ఉండగా, ఆరు రౌండ్లలో ఈ సీట్లను ఆప్షన్‌గా ఎంచుకొనే అవకాశం ఉంది. తొలిరౌండ్ బుధవారం సాయంత్రానికే సీట్లు పూర్తయ్యాయి. సీట్ల ఎంపికలో మూడు ఆప్షన్లు ఉంటాయి. ఫ్రీజింగ్ (ఇన్స్టిట్యూట్లో చేరడానికి పూర్తిగా అంగీకారం తెలిపి సీటును రిజర్వు చేసుకోవడం), స్లైడింగ్ (ఇన్స్టిట్యూట్లో సీటు తీసుకోవడానికి అంగీకారం తెలిపి, బ్రాంచ్ మార్చుకొనే అవకాశం ఎంచుకోవడం), ఫ్లోటింగ్ (ఇన్స్టిట్యూట్ మార్చుకొనే అవకాశం ఎంపిక చేసుకోవడం) వంటివి ఉన్నాయి. ఎంత మంది ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నారనే విషయం గురువారం తెలియనుంది. -
జూన్ 19 నుంచి ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని (జోసా) కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. అందుకు అనుగుణంగా జోసా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను వచ్చే నెల 14న ఐఐటీ రూర్కీ ప్రకటించనుంది. దీంతో వచ్చే నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాలను చేపట్టేందుకు జోసా చర్యలు చేపట్టింది. మొత్తానికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మొత్తం 42 వేల సీట్ల భర్తీని జూలై 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 39,425 సీట్ల భర్తీకి ఏడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించిన జోసా ఈసారి అవసరమైతే 8 దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి 2 వేలకు పైగా ఈడబ్ల్యూఎస్ కోటా, బాలికల కోటా కింద సూపర్‌న్యూమరరీ సీట్లు రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 42 వేలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 39 వేల సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొదట్లో 2.24 లక్షల మంది విద్యార్థులనే ఎంపిక చేసింది. అయితే అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో చివరకు 2,31,024 మందిని అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతి ఇచ్చింది. కానీ అందులోనూ అడ్వాన్స్‌డ్‌కు 1,65,656 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పలు కాలే జీల్లో సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి జేఈఈ మెయిన్‌లో టాప్ 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పించింది. అయితే ఈసారి ఎంత మంది దరఖాస్తు చేస్తారో వేచిచూడాల్సిందే. నేటి నుంచి దరఖాస్తులు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను ఈనెల 3 నుంచి స్వీకరించేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.45 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన దాదాపు 35 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన వారిలో ఓపెన్ కేటగిరీలో 1,13,925 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 9,800 మంది, ఓబీసీలో 66,150 మంది, ఎస్సీలో 36,750 మంది, ఎస్టీల్లో 18,375 మంది ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రధాన తేదీలు ఈనెల 3 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 9 సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు అవకాశం. ఈనెల 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఈనెల 27న: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష. జూన్ 4న జవాబు పత్రాల కీలు విడుదల. జూన్ 14న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 14, 15 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 17న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు 21న ఫలితాలు జూన్ 19 నుంచి జూలై 15 వరకు సీట్ల కేటాయింపు -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్ మార్పు
ఈనెల 25 బదులు 29 నుంచి వెబ్ ఆప్షన్లు * సవరించిన షెడ్యూలు జారీ చేసిన జాయింట్ సీట్ అల కేషన్ అథారిటీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో ఒకేసారి చేపట్టే ఉమ్మడి ప్రవేశాల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ మార్పులు చేసింది. ఐఐటీ బాంబే ముందుగా ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచే ప్రారంభించాల్సిన వెబ్ ఆప్షన్లను (ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్) ఈనెల 29 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు ఈనెల 24నే విడుదల కావాల్సి ఉన్నా జాప్యం కావడంతో ఈ మార్పులు చేసింది. గురువారం ఢిల్లీలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ అధికారులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారులు సమావేశమై ఈ మేరకు మార్పులు చేశారు. తాజా షెడ్యూల్‌ను జేఈఈ అడ్వాన్స్డ్, జాయింట్ సీట్ అలకేషన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఐఐటీల్లో జూలై 21 నుంచి, ఎన్ఐటీల్లో జూలై 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇతర వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. -
25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ
⇒ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీలకు ఉమ్మడి షెడ్యూల్ ⇒ తుది ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ⇒ వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు పూర్తి ⇒ జూలై 16 నుంచే ఐఐటీల్లో తరగతులు ⇒ ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో 23 నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలన్నింటికీ కలిపి ఈసారి ఉమ్మడిగా ప్రవేశాలను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ తగిన ఏర్పాట్లు చేసింది. తుది ర్యాంకు ఆధారంగా విద్యార్థి ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో సీట్లను కేటాయించనుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రకటిస్తూ ఉమ్మడి షెడ్యూల్‌ను సీట్ అలొకేషన్ అథారిటీ జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 25 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. 23 నుంచి తరగతులు మొదలవుతాయి. కాగా, ఏ రాష్ట్రంలో ఎన్ఐటీ ఉంటే ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయించనున్నారు. ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి లేదా అర ్హత పరీక్షలో 75 శాతం(జనరల్, ఓబీసీ), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధిం చినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది. 24న జేఈఈ మెయిన్ ర్యాంకులు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులను ఈ నెల 24న సీబీఎస్ఈ వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో జరిగిన పరీక్షల్లో విద్యార్థుల మార్కులను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఈ పరీక్షలకు 13.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 1,19,850 మంది పరీక్ష రాశారు. ఇందులో తెలంగాణ నుంచి 66,596 మంది, ఏపీ నుంచి 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి ఆలిండియా ర్యాంకులను సీబీఎస్ఈ ఖరారు చేస్తుంది. సీట్ల వివరాలు ఐఐటీల్లో 10,006 సీట్లు, ఎన్ఐటీల్లో 17,390 సీట్లు, ట్రిపుల్ఐటీల్లో 2,228(చిత్తూరుకు 130, కర్నూలుకు 50 కలిపి) సీట్లు ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు సంస్థల్లో 3,741 సీట్లను కూడా ఈ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. కాగా, ఎన్ఐటీ సీట్ల విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్ఐటీని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రవేశాలకు ఉమ్మడి షెడ్యూల్ ⇒ జూన్ 25 నుంచి 29 వరకు: కాలేజీలను ఎంచుకునేందుకు విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ⇒ 28: విద్యార్థుల ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ⇒ 30: ఐఐటీ/ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు ⇒ జూలై 1: మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రకటన ⇒ 2 నుంచి 6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. ⇒ 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన, రెండో దశ సీట్ల కేటాయింపు. ⇒ 8 నుంచి 11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. ⇒ 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాలు ప్రకటన, మూడో దశ కౌన్సెలింగ్ ⇒ 13 నుంచి 15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. ⇒ 16: ఐఐటీ, ఐఎస్‌ఎంల్లో తరగతులు ప్రారంభం. ⇒ 16: భర్తీ అయిన, మిగిలిన సీట్ల వెల్లడి, నాలుగో దశ కౌన్సెలింగ్. ⇒ 17 నుంచి 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. ⇒ 23 నుంచి: ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో తరగతులు ప్రారంభం