25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ | From 25 Admission process | Sakshi
Sakshi News home page

25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ

Published Fri, Jun 19 2015 1:29 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

From 25 Admission process

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలకు ఉమ్మడి షెడ్యూల్
తుది ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు
వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు పూర్తి
జూలై 16 నుంచే ఐఐటీల్లో తరగతులు
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో  23 నుంచి ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలన్నింటికీ కలిపి ఈసారి ఉమ్మడిగా ప్రవేశాలను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ తగిన ఏర్పాట్లు చేసింది.

తుది ర్యాంకు ఆధారంగా విద్యార్థి ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లను కేటాయించనుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రకటిస్తూ ఉమ్మడి షెడ్యూల్‌ను సీట్ అలొకేషన్ అథారిటీ జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 25 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. 23 నుంచి తరగతులు మొదలవుతాయి. కాగా, ఏ రాష్ట్రంలో ఎన్‌ఐటీ ఉంటే ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయించనున్నారు.

ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి లేదా అర ్హత పరీక్షలో 75 శాతం(జనరల్, ఓబీసీ), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధిం చినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది.
 
24న జేఈఈ మెయిన్ ర్యాంకులు

ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులను ఈ నెల 24న సీబీఎస్‌ఈ వెల్లడించనుంది.  దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగిన పరీక్షల్లో విద్యార్థుల మార్కులను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఈ పరీక్షలకు 13.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 1,19,850 మంది పరీక్ష రాశారు. ఇందులో తెలంగాణ  నుంచి 66,596 మంది, ఏపీ నుంచి 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి ఆలిండియా ర్యాంకులను సీబీఎస్‌ఈ ఖరారు చేస్తుంది.
 
సీట్ల వివరాలు
ఐఐటీల్లో 10,006 సీట్లు, ఎన్‌ఐటీల్లో 17,390 సీట్లు, ట్రిపుల్‌ఐటీల్లో 2,228(చిత్తూరుకు 130, కర్నూలుకు 50 కలిపి) సీట్లు ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు సంస్థల్లో 3,741 సీట్లను కూడా ఈ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. కాగా, ఎన్‌ఐటీ సీట్ల విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్‌ఐటీని పరిగణనలోకి తీసుకోలేదు.
 
ప్రవేశాలకు ఉమ్మడి షెడ్యూల్
జూన్ 25 నుంచి 29 వరకు: కాలేజీలను ఎంచుకునేందుకు   విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు
28: విద్యార్థుల ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్
30: ఐఐటీ/ఎన్‌ఐటీల్లో సీట్ల కేటాయింపు
జూలై 1: మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రకటన
2 నుంచి 6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం.
7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన, రెండో దశ సీట్ల కేటాయింపు.
8 నుంచి 11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం.
12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాలు ప్రకటన, మూడో దశ కౌన్సెలింగ్
13 నుంచి 15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం.
16: ఐఐటీ, ఐఎస్‌ఎంల్లో తరగతులు ప్రారంభం.
16: భర్తీ అయిన, మిగిలిన సీట్ల వెల్లడి, నాలుగో దశ కౌన్సెలింగ్.
17 నుంచి 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం.
23 నుంచి: ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో తరగతులు ప్రారంభం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement