JEE Main ranks
-
బోర్డు తప్పులు.. విద్యార్థులకు తిప్పలు..
-
బోర్డు తప్పులు.. విద్యార్థులకు తిప్పలు..
* అడగడుగునా అధికారుల నిర్లక్ష్యం.. రిటైర్డ్ అధికారుల రాజ్యం * తప్పు జరిగితే కిందిస్థాయి వారిపై వేటు * ఏపీ బోర్డు పేరుతో రాష్ట్ర విద్యార్థులకు మెమోలు * తాజాగా జేఈఈ మెయిన్ ర్యాంకులు గల్లంతు సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రిటైర్డ్ అధికారుల ఇష్టారాజ్యం.. వెరసి వరుసగా జరుగుతున్న తప్పిదాలతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితికి కారణమవుతోంది. ఇంతకుముందే పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలో కాలేజీల తప్పిదాలను పట్టించుకోకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనూ ఇదే తరహాలో వివాదాస్పద వైఖరి అవలంబించింది. తాజాగా జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల వివరాలను సీబీఎస్ఈకి పంపడంలో నిర్లక్ష్యం వహించింది. విద్యార్థులు బాధ్యులా? విద్యార్థులు చెల్లించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను యాజమాన్యాలు బోర్డు ఖాతాలో జమ చేసే క్రమంలో సాంకేతిక సమస్యల కారణంగా జమకాలేదు. దీంతో దాదాపు 5 వేల మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. ఫీజులు జమచేయడంలో కాలేజీలు పొరపాటు చేశాయని, ఫీజులు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోర్డుకు విజ్ఞప్తులు చేశారు. కానీ వారిని అనుమతిస్తే ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందంటూ తిరస్కరించింది. మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల సమయంలోనూ ఇదే తప్పు జరిగింది. కాలేజీల నుంచి ఫీజులు రాలేదంటూ కొందరు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. చివరకు తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో రూ.10 వేల ఆలస్య రుసుము తీసుకొని హాల్‌టికెట్లు ఇచ్చింది. మెమోల విషయంలోనూ.. తెలంగాణ ఇంటర్ బోర్డులో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు పేరుతో అధికారులు మెమోలు జారీచేశారు. ఈ విషయంలోనూ కిందిస్థాయి సిబ్బందిపై మాత్రమే వేటు పడింది. ఉన్నతాధికారులు, ప్రత్యేకంగా నియమించుకున్న అధికారులు ఏం చేస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పుడూ అదే తీరు.. జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల వివరాలు అన్నింటిని పంపించాలి. కానీ దాదాపు 2 వేల మంది విద్యార్థుల వివరాలను పంపలేదు. దీంతో వారికి సీబీఎస్ఈ ర్యాంకులు కేటాయించలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. -
జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఉత్కంఠ
ర్యాంకుల కోసం 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణ ♦ 24నే వెల్లడించాల్సి ఉన్నా ఇంకా ప్రకటించని సీబీఎస్ఈ ♦ ఫలితంగా రెండోసారి మారిన వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ♦ నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయన్న జేఓఎస్ఏఏ ♦ రెండుసార్లు షెడ్యూల్ మార్పు జేఈఈ చరిత్రలో ఇదే తొలిసారి సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ర్యాంకుల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నా సీబీఎస్ఈ వాటిని ఇంకా ప్రకటించలేదు. వాస్తవానికి ఈనెల 25 నుంచే వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉన్నా ర్యాంకుల విడుదలలో జాప్యం కారణంగా ఆ ప్రక్రియను సోమవారం (29వ తేదీ) నుంచి ప్రారంభిస్తామని ఉమ్మడి ప్రవేశాల కోసం ఏర్పాటైన జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) ఈనెల 24న పేర్కొంది. దీంతో ఆదివారం (28వ తేదీ) అర్ధరాత్రి వరకైనా ర్యాంకులు వెలువడతాయని విద్యార్థులు ఎదురుచూసినా అలా జరగలేదు. సీబీఎస్ఈ ర్యాంకులను ప్రకటించిన రెండు మూడు గంటల తరువాత వెబ్ ఆప్షన్ల లింకు అందుబాటులోకి వస్తుందని జేఓఎస్ఏఏ వెబ్సైట్లో పేర్కొంది. కానీ సోమవారం కూడా మెయిన్ ర్యాంకులు విడుదల కాకపోవడం, సోమవారం సాయంత్రం వరకు కూడా వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు వెలువడకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెల కొంది. ఎట్టకేలకు సోమవారం రాత్రి వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను జేఓఎస్ఏఏ తిరిగి మార్చింది. మంగళవారం (30వ తేదీ) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని పేర్కొంది. ఇలా ప్రవేశాల షెడ్యూలును 2 సార్లు మార్పు చేయడం జేఈఈ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. జూలై 7న ఫలితాలని తొలుత నోటిఫికేషన్.. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షల్లో విద్యార్థుల స్కోర్‌ను ఏప్రిల్ 27న సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ ఫలితాలను జూలై 7న ప్రకటిస్తామని సీబీఎస్ఈ మొదట్లో తన నోటిఫికేషన్లో ప్రకటించింది. అయితే ఈసారి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో అన్నింటికీ ఒకేసారి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను ఈనెల 18న ప్రకటించింది. మరోవైపు జేఈఈ మెయిన్ ర్యాంకులను కూడా ఈనెల 24న ప్రకటించాలని తొలుత నిర్ణయించింది. పరీక్ష రాసిన 1.19 లక్షల మంది తెలుగు విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జేఈఈ మెయిన్ కోసం 1,24,234 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,19,850 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 69,234 మంది దరఖాస్తు చేసుకోగా 66,596 మంది హాజరయ్యారు. ఆం ధ్రప్రదేశ్ నుంచి 55,000 మంది దరఖాస్తు చేసుకోగా 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు. -
25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ
⇒ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీలకు ఉమ్మడి షెడ్యూల్ ⇒ తుది ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ⇒ వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు పూర్తి ⇒ జూలై 16 నుంచే ఐఐటీల్లో తరగతులు ⇒ ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో 23 నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలన్నింటికీ కలిపి ఈసారి ఉమ్మడిగా ప్రవేశాలను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ తగిన ఏర్పాట్లు చేసింది. తుది ర్యాంకు ఆధారంగా విద్యార్థి ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో సీట్లను కేటాయించనుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రకటిస్తూ ఉమ్మడి షెడ్యూల్‌ను సీట్ అలొకేషన్ అథారిటీ జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 25 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. 23 నుంచి తరగతులు మొదలవుతాయి. కాగా, ఏ రాష్ట్రంలో ఎన్ఐటీ ఉంటే ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయించనున్నారు. ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి లేదా అర ్హత పరీక్షలో 75 శాతం(జనరల్, ఓబీసీ), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధిం చినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది. 24న జేఈఈ మెయిన్ ర్యాంకులు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులను ఈ నెల 24న సీబీఎస్ఈ వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో జరిగిన పరీక్షల్లో విద్యార్థుల మార్కులను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఈ పరీక్షలకు 13.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 1,19,850 మంది పరీక్ష రాశారు. ఇందులో తెలంగాణ నుంచి 66,596 మంది, ఏపీ నుంచి 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి ఆలిండియా ర్యాంకులను సీబీఎస్ఈ ఖరారు చేస్తుంది. సీట్ల వివరాలు ఐఐటీల్లో 10,006 సీట్లు, ఎన్ఐటీల్లో 17,390 సీట్లు, ట్రిపుల్ఐటీల్లో 2,228(చిత్తూరుకు 130, కర్నూలుకు 50 కలిపి) సీట్లు ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు సంస్థల్లో 3,741 సీట్లను కూడా ఈ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. కాగా, ఎన్ఐటీ సీట్ల విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్ఐటీని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రవేశాలకు ఉమ్మడి షెడ్యూల్ ⇒ జూన్ 25 నుంచి 29 వరకు: కాలేజీలను ఎంచుకునేందుకు విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ⇒ 28: విద్యార్థుల ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ⇒ 30: ఐఐటీ/ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు ⇒ జూలై 1: మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రకటన ⇒ 2 నుంచి 6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. ⇒ 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన, రెండో దశ సీట్ల కేటాయింపు. ⇒ 8 నుంచి 11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. ⇒ 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాలు ప్రకటన, మూడో దశ కౌన్సెలింగ్ ⇒ 13 నుంచి 15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. ⇒ 16: ఐఐటీ, ఐఎస్‌ఎంల్లో తరగతులు ప్రారంభం. ⇒ 16: భర్తీ అయిన, మిగిలిన సీట్ల వెల్లడి, నాలుగో దశ కౌన్సెలింగ్. ⇒ 17 నుంచి 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. ⇒ 23 నుంచి: ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో తరగతులు ప్రారంభం