బోర్డు తప్పులు.. విద్యార్థులకు తిప్పలు..
* అడగడుగునా అధికారుల నిర్లక్ష్యం.. రిటైర్డ్ అధికారుల రాజ్యం
* తప్పు జరిగితే కిందిస్థాయి వారిపై వేటు
* ఏపీ బోర్డు పేరుతో రాష్ట్ర విద్యార్థులకు మెమోలు
* తాజాగా జేఈఈ మెయిన్ ర్యాంకులు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రిటైర్డ్ అధికారుల ఇష్టారాజ్యం.. వెరసి వరుసగా జరుగుతున్న తప్పిదాలతో అభాసుపాలవుతోంది.
విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితికి కారణమవుతోంది. ఇంతకుముందే పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలో కాలేజీల తప్పిదాలను పట్టించుకోకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనూ ఇదే తరహాలో వివాదాస్పద వైఖరి అవలంబించింది. తాజాగా జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల వివరాలను సీబీఎస్‌ఈకి పంపడంలో నిర్లక్ష్యం వహించింది.
విద్యార్థులు బాధ్యులా?
విద్యార్థులు చెల్లించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను యాజమాన్యాలు బోర్డు ఖాతాలో జమ చేసే క్రమంలో సాంకేతిక సమస్యల కారణంగా జమకాలేదు. దీంతో దాదాపు 5 వేల మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. ఫీజులు జమచేయడంలో కాలేజీలు పొరపాటు చేశాయని, ఫీజులు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోర్డుకు విజ్ఞప్తులు చేశారు. కానీ వారిని అనుమతిస్తే ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందంటూ తిరస్కరించింది.
మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల సమయంలోనూ ఇదే తప్పు జరిగింది. కాలేజీల నుంచి ఫీజులు రాలేదంటూ కొందరు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. చివరకు తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో రూ.10 వేల ఆలస్య రుసుము తీసుకొని హాల్‌టికెట్లు ఇచ్చింది.
మెమోల విషయంలోనూ..
తెలంగాణ ఇంటర్ బోర్డులో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు పేరుతో అధికారులు మెమోలు జారీచేశారు. ఈ విషయంలోనూ కిందిస్థాయి సిబ్బందిపై మాత్రమే వేటు పడింది. ఉన్నతాధికారులు, ప్రత్యేకంగా నియమించుకున్న అధికారులు ఏం చేస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇప్పుడూ అదే తీరు..
జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల వివరాలు అన్నింటిని పంపించాలి. కానీ దాదాపు 2 వేల మంది విద్యార్థుల వివరాలను పంపలేదు. దీంతో వారికి సీబీఎస్‌ఈ ర్యాంకులు కేటాయించలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కల్పించుకుని సమస్యను పరిష్కరించారు.