పెరగనున్న ఇంటర్ ఇంగ్లిషు పుస్తకాల ధర? | Price rising the Inter-English books? | Sakshi
Sakshi News home page

పెరగనున్న ఇంటర్ ఇంగ్లిషు పుస్తకాల ధర?

Published Mon, May 2 2016 4:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

పెరగనున్న ఇంటర్ ఇంగ్లిషు పుస్తకాల ధర? - Sakshi

పెరగనున్న ఇంటర్ ఇంగ్లిషు పుస్తకాల ధర?

ఆంగ్ల పుస్తకాలు ప్రైవేటు పరం చేసేందుకు కసరత్తు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిషు పాఠ్యపుస్తకాల ధరలకు రెక్కలు రానున్నాయి. ఓ ప్రైవేటు పబ్లిషర్‌కు పుస్తకాల ముద్రణ, విక్రయం బాధ్యతలను అప్పగించడం ద్వారా పుస్తకాల ధర పెరిగే పరిస్థితి ఏర్పడింది. రిటైలర్ రిబేటు, పబ్లిషర్ లాభం, ఇంటర్ బోర్టుకు రాయల్టీ పేరుతో ప్రైవేటు పబ్లిషర్ ప్రస్తుతం రూ.70 ఉన్న పాఠ్యపుస్తకం ధరను రెట్టింపు చేసే పరిస్థితిని ఇంటర్ బోర్డే తీసుకువస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్ ఇంగ్లిషు పాఠ్యపుస్తకాలను ఓ ప్రైవేటు ముద్రణ సంస్థ ముద్రించింది. తెలంగాణ వచ్చిన తరువాత ఆ పబ్లిషర్‌ను పుస్తక ముద్రణ బాధ్యతల నుంచి తప్పించి తెలుగు అకాడమీకి ప్రభుత్వం అప్పగించింది. దీంతో అకాడమీ గత ఏడాది ఒక్కో పుస్తకాన్ని రూ.70కే అందించింది. కానీ ఇప్పుడు తెలుగు అకాడమీని పక్కనబెట్టి ప్రైవేటు పబ్లిషర్‌కు పుస్తక ముద్రణ బాధ్యతలను అప్పగించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది.

 పుస్తకాల సిలబస్‌లో మార్పులు
 ఇంటర్ పాఠ్యపుస్తకాల మార్పుల్లో భాగంగా ప్రథమ సంవత్సర ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలోని సిలబస్‌లో నెల రోజుల కిందటే మార్పులు చేసింది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సర ఇంగ్లిషు పాఠ్యపుస్తకం సిలబస్‌లో మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పుస్తకాల ముద్రణ, పంపిణీ పనులపై ఓ పబ్లిషర్ కన్ను పడింది. దీంతో రాజకీయ పలుకుబడి కలిగిన సదరు పబ్లిషర్ ఇంటర్ బోర్డు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

 ‘ప్రైవేటు’కు ఇస్తే పెంపు తప్పదు..
 తెలుగు అకాడమీ విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈసారి కూడా అదే ధరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఇంటర్ బోర్డు మాత్రం ప్రైవేటు పబ్లిషర్‌కు ముద్రణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం కావడంపై బోర్డు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలకు పాఠ్య పుస్తకాల ముద్రణ, విక్రయాల బాధ్యతను అప్పగిస్తే పుస్తకం ధరలో 20 శాతం రిటైల్ వ్యాపారులకు, 17 శాతం పబ్లిషర్‌కు లాభం రూపంలో, 17 శాతం ఇంటర్ బోర్డుకు రాయల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పుస్తకం ధరను పెంచకతప్పని పరిస్థితి ఏర్పడనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement