సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ఆరు రౌండ్లలో పూర్తి చేయాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2022 నిర్ణయించింది. ఈసారి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో సీట్ల కేటాయింపును ఆరు విడతలకే పరిమితం చేసింది.
గతంలో ఏడు రౌండ్ల మేర సీట్ల కేటాయింపు చేయడంతోపాటు ప్రత్యేక రౌండ్లను కూడా నిర్వహించింది. 2015, 2016ల్లో నాలుగేసి రౌండ్లలో సీట్ల కేటాయింపును పూర్తి చేయగా 2017, 2018, 2019ల్లో ఏడేసి రౌండ్లలో సీట్ల కేటాయింపు చేశారు. 2020, 2021ల్లో ఆరు రౌండ్లలో ముగించారు. ఈసారి సీట్ల కేటాయింపును త్వరగా పూర్తి చేసి తరగతులు ప్రారంభమయ్యేలా జోసా షెడ్యూల్‌ను రూపొందించింది.
12 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనుండడంతో మరుసటి రోజు అంటే 12 నుంచి సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆ రోజు నుంచి మెరిట్ విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు చాయిస్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నందున ఆర్కిటెక్చర్ కోర్సు ఔత్సాహికులు ఆ రోజున చాయిస్‌లను నమోదు చేయాలి.
ఇలా చాయిస్‌లను నమోదు చేసిన వారికి 18న మాక్ సీట్ కేటాయిస్తారు. ఆ తర్వాత మళ్లీ చాయిస్‌ల నమోదుకు అవకాశమిచ్చి 20న మాక్ సీట్ కేటాయింపు చేస్తారు. తమ ర్యాంకుకు ఏ కోర్సులో, ఏ సంస్థలో సీటు వస్తుందో ఒక అవగాహనకు వచ్చిన విద్యార్థులు చివరగా సెప్టెంబర్ 20న చాయిస్‌లను లాక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపును చేపడతారు. ఇక ఎన్‌ఐటీలు, తదితర సంస్థల్లో మిగిలి ఉండే సీట్లకు ప్రత్యేక రౌండ్ ద్వారా నిర్వహిస్తారు.
ఎన్ని సంస్థలు, ఎన్ని సీట్లు..
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, 36 ఇతర సంస్థల్లో విద్యార్థులకు జోసా సీట్లను కేటాయిస్తుంది. కాగా అందరూ సీట్లు ఆశించే 23 ఐఐటీల్లో 16 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. మరోవైపు ఐఐటీల్లో అమ్మాయిల చేరికలను 20 శాతం మేర పెంచేందుకు కేంద్రం2018 నుంచి 2020 వరకు వారికి ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటాను ప్రకటించింది. 2021 నుంచి ఈ కేటాయింపును ఆయా జాతీయ విద్యా సంస్థలే నిర్ణయానికే వదిలేసింది.
Comments
Please login to add a commentAdd a comment