allotment of seats
-
బాసర ట్రిపుల్ ఐటీలో 1,404 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్/బాసర/భైంసా: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 1,404 సీట్లు కేటాయించారు. టెన్త్‌లో ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ, జాయింట్ కనీ్వనర్ పావని, దత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. టెన్త్ మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఠీఠీఠీ.టజuజ్టు. ్చఛి.జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ వెంకటరమణ తెలిపారు. వరుస క్రమంలో 8వ తేదీన 1 నుంచి 500 వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1,001 నుంచి 1,404 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు, స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులను ఈనెల 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు (69 శాతం), 428 మంది బాలురు (31 శాతం) ఎంపిక చేశారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 95 శాతం మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్ఐటీ ఉన్న నిర్మల్ జిల్లా విద్యార్థులు 72 సీట్లు దక్కించుకున్నారు. -
తిరుగుబాటు ‘సేన’
కాకినాడ రూరల్/సాక్షి, కోనసీమ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఆయన సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీట్ల కేటాయింపుపై నిరసన వ్యక్తం చేస్తోంది. తమను పార్టీ కోసం వాడుకుని కరివేపాకులా తీసిపడేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ పోతసపల్ల సరోజ చెరియన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక సర్పవరం జంక్షన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు రాసిన రాజీనామా లేఖను ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ, తన ఆత్మగౌరవాన్ని పార్టీ దెబ్బ తీసిందన్నారు. జనసేన తీసుకున్న ముష్టి 21 సీట్లలో ఒక్కటీ శెట్టిబలిజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయేచోట ఒక్క మహిళకు మాత్రమే సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా పోల్, బూత్ మేనేజ్మెంట్లు లేకపోవడానికి కారణం కేవలం నాదెండ్ల మనోహరే అని ధ్వజమెత్తారు. వారాహి యాత్రలో కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ శెట్టిబలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ పవన్‌ను, జనసేనను ముంచేశారని, ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని హితవుపలికారు. పవన్ చుట్టూ ఉండే కోటరీలో హరిప్రసాద్, కేకే, చక్రవర్తి, మనోహర్ తదితరులే మాట్లాడతారని విమర్శించారు. తాను కాకినాడ రూరల్ సీటు ఆశించి మోసపోయానని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీకి వ్యతిరేకంగా పని చేస్తానని సరోజ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమె భర్త చెరియన్ కూడా పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లా! అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పోటీ చేసే రెండు సీట్లలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ ఇన్చార్జులు మండిపడుతున్నారు. పి.గన్నవరం అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికుడే అయినా తెలంగాణ క్యాడర్ ఉద్యోగి. జనసేన నుంచి టికెట్ హామీ వచ్చిన తరువాతే ఉద్యోగానికి జనవరి 31న వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. పార్టీలో రెండు నెలల నుంచి మాత్రమే చురుగా>్గ ఉన్నారు. రాజోలు అభ్యర్థి దేవ వరప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించకున్నా ప్రచారం చేస్తున్నారు. ఈయన పార్టీలో చేరి రెండేళ్లు కావస్తున్నా స్థానికంగా పెద్దగా పరిచయాలు లేవు. స్థానికంగా రాపాక రమేష్‌బాబు, బొంతు రాజేశ్వరరావు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. వీరిద్దరికీ పార్టీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. అమలాపురం పార్టీ ఇన్చార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న డి.ఎం.ఆర్.శేఖర్, బీసీ నేత, శెట్టిబలిజ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణలనూ పవన్ పక్కనపెట్టారు. గత ఎన్నికలలో బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేశారు. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం పార్టీ ఇన్చార్జిలుగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ, బండారు శ్రీనివాసరావు, పోలిశెట్టి చంద్రశేఖర్‌కూ పవన్ ఝలక్ ఇచ్చారు. వీరి భవిష్యత్తుపై పవన్ నుంచి ఎలాంటి హామీ లేదని సమాచారం. దీంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు కరివేపాకులా తీసిపడేశారని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో జనసేనకు 29శాతం ఓటింగ్ వచ్చినా పవన్ కేవలం రెండుస్థానాలతో సరిపెట్టుకోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. -
బాబుకే భ'జనసేన'!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల మాదిరే జనసేన కూడా పూర్తిగా తోకపార్టీగా మారిపోవడంపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ మధ్య కుదిరిన పొత్తులో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను పవన్ పార్టీకి కేవలం 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం గతంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాటికి కేటాయించిన సీట్లతో పోల్చితే ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్లు చాలా తక్కువని జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పవన్‌కళ్యాణ్ స్వయంగా జైలుకెళ్లి ఆయన్ను కలిసొచ్చిన తర్వాత అక్కడికక్కడే పొత్తు ప్రకటన చేసిన తీరుతో తమ పార్టీకి తప్పకుండా 40–45 స్థానాలకు మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని జనసేన శ్రేణులు భావించారు. కానీ, తీరా శనివారం కేవలం 24 అసెంబ్లీ స్థానాలేనని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో టీఆర్ఎస్కు మూడో వంతు సీట్లు గతంలో పొత్తుల పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీలకు టీడీపీ కేటాయించిన సీట్లకు ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్ల సంఖ్యకు పొంతనే లేదని అటు జనసేనలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉదా.. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి పేరుతో ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న మొత్తం సీట్లలో మూడో వంతుకు పైగా కేటాయించింది. అంటే.. 119 సీట్లకు 45 సీట్లను కేటాయించగా.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 32 సీట్లను కేటాయించింది. నిజానికి.. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటములు చవిచూసింది. అయినా, టీడీపీ ఆ పార్టీకి ఎక్కువ సీట్లను కేటాయించింది. అయితే, ఇప్పుడు ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుతం జనసేన బాగా పుంజుకుందని పవన్‌కళ్యాణ్ కొంతకాలంగా చెబుతున్నారు. అలాంటప్పుడు 175 సీట్లలో మూడో వంతు 33 శాతం సీట్లు కాకుండా కేవలం 13 శాతం సీట్లకే పవన్ అంగీకరించడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేక ఆయన్ను తూర్పారబడుతున్నారు. పవన్‌కు సీఎం పదవి అంతే సంగతులా!? ఇక పవన్‌కళ్యాణ్‌ను సీఎంగా చేయడమే తమందరి లక్ష్యమని ఆ పార్టీ శ్రేణులందరూ భావిస్తూ ఉంటారు. కానీ, ఈ పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడంతో పవన్ ఇక ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశాలను పూర్తిగా వదులుకున్నారని అటు జనసేన పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన మొదలైనప్పటి నుంచి సీఎం అభ్యరి్థత్వంపై పవన్ పార్టీ సమావేశాల్లో ‘పొత్తులు, ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి’ అంటూ పార్టీ శ్రేణులందర్నీ మభ్యపెట్టారు. అలాగే, గత ఎన్నికల్లో 30–40 సీట్లు గెలిచి ఉంటే సీఎం పదవిలో వాటా కావాలని అడిగే అవకాశం ఉంటుందని.. టీడీపీ అధినేత స్థానంలో తానున్నా జనసేనకు సీఎం పదవిలో వాటా ఇచ్చేవాడ్ని కాదని పవన్ పార్టీ సమావేశాల్లో అనేకసార్లు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచే తీరులో వ్యాఖ్యానించారు. దీనికితోడు.. పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో సైతం వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే.. సీఎం పదవి వాటా చర్చకు ద్వారాలు మూసుకున్నట్లేనని స్పష్టమవుతోందని వారంటున్నారు. 2014లో బీజేపీకి ఇచ్చిన సీట్లతో పోల్చినా.. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేన పొత్తులో జనసేన ఒక్కచోట కూడా పోటీచేయలేదు. ఆ సమయంలో విభజిత ఏపీలోనే బీజేపీకి 15 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాలను టీడీపీ కేటాయించింది. అప్పటికి రాష్ట్రంలో కేవలం 2–3 శాతం ఓట్లకే బీజేపీ పరిమితమైంది. కానీ, ఇప్పుడు జనసేనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు తమ పార్టీ ఓట్ల శాతం 15 శాతం ఉంటుందని పవన్‌కళ్యాణ్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 24 అసెంబ్లీ సీట్లు, మూడు లోకసభ సీట్లు తీసుకోవడం చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు. బాబు కోసమే పవన్ ఆరాటం 2014 జనసేన ఏర్పాటు నుంచీ పరిశీలిస్తే.. పవన్‌కళ్యాణ్ కార్యక్రమాలన్నీ తన సొంత పార్టీ కంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆరాటపడి పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని జనసేన శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఎందుకంటే.. ♦ పార్టీ ఏర్పాటుచేసి కూడా 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీచేయకుండా పూర్తిగా చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేశారు. ♦ ఆ ఎన్నికల్లో టీడీపీ అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకపోయినా పవన్ ఆయన్ను సమరి్థస్తూనే వచ్చారు. ♦ ఇక 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోగా, అది కూడా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే. ♦ ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్సీపీకి వెళ్లకుండా టీడీపీకి సహకరించారనే విమర్శలున్నాయి. ♦ తిరిగి 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి.. వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. అంటే.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని కారణంగా లాభపడే అవకాశం చంద్రబాబు ఒక్కరికే ఉంటుంది. అందుకే పవన్ ఇప్పుడు టీడీపీతోనే పొత్తుపెట్టుకున్నారు. ♦ మరోవైపు.. గత పదేళ్లుగా జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి పవన్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా టీడీపీకి అనుకూలాంశమే. ఇవన్నీ బాబుకు భజన చేసేవేనని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నారు. -
వెన్నుపోటుకు స్కెచ్ రెడీ!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : నమ్మకద్రోహం, వెన్నుపోట్లకు పేటెంట్‌దారుడైన చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నిసీట్లు విసిరేసినా మహద్భాగ్యంగా స్వీకరించడానికి జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నా, ఆ పార్టీలోని ఆశావహులు, హరిరామజోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిరా అంటున్నారనేందుకు వారి నిత్యాభిప్రాయాలే నిదర్శనం. సీఎం పదవిలో పవన్ షేర్ దక్కించుకోవాలంటే అందుకు తగిన సంఖ్యలో పొత్తులో సీట్లు పొందాల్సిందేనని పట్టు పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం.. పొత్తు ధర్మం కోసం.. అనే ‘ప్యాక్డ్’ పదాలను పక్కన పెట్టాల్సిందేనని పవన్‌కు స్పష్టం చేస్తున్నారు. తమకు ప్రధాన పట్టు ఇక్కడేనని భావిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లను డిమాండ్ చేస్తున్న పవన్ బృందాన్ని ఆ జిల్లాల్లోనే దెబ్బ తీయాలనేది బాబు తాజా ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకుగాను పక్కా వ్యూహంతో కొణిదెల ఫ్యామిలీ రాజకీయ ఓటములను తెరపైకి తీసుకొస్తున్నారనేది సమాచారం. ఇందులో భాగంగా ‘ఆ నలుగురూ కుటుంబ సభ్యులే. అందులో ముగ్గురు స్వయానా అన్నదమ్ములే. అయిదు చోట్ల పోటీ చేయగా గెలిచింది ఒక్క చోటే. ఒకేఒక్కడు. తక్కిన ఇద్దరిదీ మూడో స్థానమే. ఈ విషయాన్నే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అనే సూచనలు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు చేరాయి. ప్రధానంగా టికెట్లు ఎక్కువగా ఆశిస్తున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాప కింద నీరులా ప్రచారం కొనసాగించే బాధ్యతలను తన నమ్మకస్తులకు బాబు అప్పగించారనేది విశ్వసనీయ సమాచారం. ఆ ముగ్గురికీ తప్పని ఘోర పరాజయం టప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొణిదెల చిరంజీవి 2009 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి, తిరుపతిలో మాత్రమే గెలుపొందారు. పాలకొల్లు నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో 5,446 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ♦ జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీపడి వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్లతో ఓడిపోయారు. గాజువాక నుంచి కూడా బరిలోకి దిగిన పవన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. ♦ వీరిద్దరికీ స్వయానా సోదరుడైన కె.నాగబాబు 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి మూడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దే పనిలో జిల్లాల పర్యటనల్లో నిమగ్నమయ్యారు. ♦ ప్రజారాజ్యం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా చలామణి అయిన, చిరంజీవికి స్వయానా బావ అయిన అల్లు అరవింద్ 2009 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, మూడో స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే ప్రచారాస్త్రం అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ప్రజారాజ్యం, జనసేనలను స్థాపించి వారి సొంత జిల్లాలోని నరసాపురం లోక్‌సభ పరిధిలోనే పోటీ చేసి ఓడిపోయారు. పాలకొల్లు నుంచి చిరంజీవి, భీమవరం నుంచి పవన్, నరసాపురం లోక్‌సభ నుంచి నాగబాబుల ఓటమిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది టీడీపీ అధిష్టానం తాజా వ్యూహం. తద్వారా జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్యను భారీగా తగ్గించవచ్చనే అంచనాలో బాబు అండ్ కో ఉందని తెలుస్తోంది. బీజేపీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లాలనేది బాబు తపన. పొత్తు కోసం ప్రణమిల్లిన బాబు బీజేపీ అడిగినన్ని సీట్లను కేటాయించక తప్పని స్థితి. మరోవైపు జనసేన 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను ముప్పావు వంతుకన్నా తక్కువ చేయాలనేది బాబు బృందం ఆలోచన. వీటన్నింటి నేపథ్యంలో జనసేనకు సీట్లను తగ్గించాలంటే కొణిదల సోదరుల ఓటములను 70 ఎంఎం స్కోప్‌లో చూపి రాజకీయంగా, మానసికంగా పైచేయి సాధించాలనే వ్యూహానికి బాబు పదును పెట్టినట్లు తెలిసింది. ఇక్కడా వెన్నుపోటుకే మొగ్గు తాము పోటీ చేసి తీరుతామని టీడీపీలోని ఆశావహులు గట్టిగానే చెబుతున్నారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే 10 నుంచి 12.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఏడెనిమిది సీట్లను జనసేన ఆశిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతకంటే తక్కువ స్థానాలకు అంగీకరించకూడదనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్న తమను పక్కనపెట్టి పొత్తు ధర్మం పేరిట జనసేనకు సీట్లు ఇచ్చేస్తామంటే అంగీకరించేది లేదనే ధిక్కార స్వరం టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సీనియర్లు విభిన్న పద్దతుల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, బుద్దా వెంకన్న లాంటివారు ఆయా స్థానాల టిక్కెట్లను ఆశిస్తున్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు జనసేనకు వెన్నుపోటే ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకున్నారని తెలియవచ్చింది. ఆనాడు ఈనాడులో ‘జెండా పీకేస్తున్నారు’ అంటూ ‘ప్రజారాజ్యం’పై అచ్చేయించిన రీతిలోనే కొణిదెల బ్రదర్స్ ఓటమిని హైలైట్ చేయడమే బెస్ట్ అనే నిర్ణయానికి తమ అధినేత వచ్చారని, ఆ పనిలో తాము నిమగ్నమయ్యామని సీనియర్ నేత ఒకరు లోగుట్టు విప్పారు. నమ్మకం నిలుపుకోవడం కత్తిమీద సామే కొణిదెల బ్రదర్స్‌పై నెగటివ్ ప్రచారం చేయాలనుకోవడం నిజం కాదనడానికి వీల్లేదని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జనసేనకు నమ్మకం కలగాలంటే వారు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, కనీసం ముప్పావు వంతుకు పైగా అయినా సర్దుబాటు చేయక తప్పదని అన్నారు. మరోవైపు పొత్తు కోసం పాకులాడుతున్నందున బీజేపీకి కూడా వారు కోరిన మేరకు సీట్లు ఇవ్వాలని, ఇప్పుడు బాస్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెల్లారిపోయింది.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం చవి చూసింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు అన్నిచోట్లా ఓడిపోవడమే కాదు.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కూకట్‌పల్లిలో పోటీ చేసిన ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు దక్కాయి. తక్కిన ఏడుగురు అభ్యర్థులకు కలిపి 15 వేల ఓట్లకులోపే రావడమంటే.. సగటున ఒక్కో అభ్యర్థికి సగటున రెండు వేల ఓట్లు దక్కాయన్నమాట. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధిష్టానం ప్రజల్లోకి తీసుకెళ్లమంటోందని వినికిడి. -
కాషాయ దళం..కారాలు మిరియాలు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై పార్టీ పాతకాపులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వలస నేతలకు పెద్దపీట వేశారని, గెలుపోటములతో నిమిత్తం లేకుండా దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటూ కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోతున్నారు. పార్టీలోని ఒరిజనల్ కేడర్‌కు సీట్లు ఇవ్వకుండా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు మొండిచెయ్యి చూపించాయంటూ కారాలు, మిరియాలు నూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాషాయ సిద్ధాంతాలు పాటించే వారు, ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారు పనికి రారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రకటించిన 88 అభ్యర్థుల్లో మూడింట రెండు వంతులకు పైగా కొత్తవారికే కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ కారణాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యనేతలు, వారి అనుయాయులకే ఎక్కువగా టికెట్లు దక్కాయని విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని అవలక్షణాలు బీజేపీకి కూడా అంటుకున్నాయనే అభిప్రాయం కలుగుతోందని, కొందరు గుత్తేదారుల చేతుల్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడిందంటూ ఆరోపణలకు సైతం దిగుతుండటం గమనార్హం. గత నాలుగేళ్లలో పార్టీలో చేరి జాతీయ కార్యవర్గసభ్యులుగా, ఇతర ముఖ్య పోస్టుల్లో ఉన్న నేతల్లో కొందరు చక్రం తిప్పి తమ అనుచరులు, అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంతో పాత నాయకులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పార్టీలో పాతకాపులకు ప్రాధాన్యత తగ్గిపోవడం దేనికి సంకేతమని వారు నిలదీస్తున్నారు. ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 20 మంది దాకా మాత్రమే పార్టీ సిద్ధాంతాల పునాదిపై సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్న వారని, మరో 10 నుంచి 15 మంది దాకా గత ఐదు నుంచి పదేళ్లలోపు పార్టీలో చేరి స్థిరంగా పనిచేస్తున్నారని లెక్కలతో సహా వివరిస్తున్నారు. -
సీట్ల కేటాయింపు 6 రౌండ్లకు పరిమితం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ఆరు రౌండ్లలో పూర్తి చేయాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2022 నిర్ణయించింది. ఈసారి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో సీట్ల కేటాయింపును ఆరు విడతలకే పరిమితం చేసింది. గతంలో ఏడు రౌండ్ల మేర సీట్ల కేటాయింపు చేయడంతోపాటు ప్రత్యేక రౌండ్లను కూడా నిర్వహించింది. 2015, 2016ల్లో నాలుగేసి రౌండ్లలో సీట్ల కేటాయింపును పూర్తి చేయగా 2017, 2018, 2019ల్లో ఏడేసి రౌండ్లలో సీట్ల కేటాయింపు చేశారు. 2020, 2021ల్లో ఆరు రౌండ్లలో ముగించారు. ఈసారి సీట్ల కేటాయింపును త్వరగా పూర్తి చేసి తరగతులు ప్రారంభమయ్యేలా జోసా షెడ్యూల్‌ను రూపొందించింది. 12 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనుండడంతో మరుసటి రోజు అంటే 12 నుంచి సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆ రోజు నుంచి మెరిట్ విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు చాయిస్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నందున ఆర్కిటెక్చర్ కోర్సు ఔత్సాహికులు ఆ రోజున చాయిస్‌లను నమోదు చేయాలి. ఇలా చాయిస్‌లను నమోదు చేసిన వారికి 18న మాక్ సీట్ కేటాయిస్తారు. ఆ తర్వాత మళ్లీ చాయిస్‌ల నమోదుకు అవకాశమిచ్చి 20న మాక్ సీట్ కేటాయింపు చేస్తారు. తమ ర్యాంకుకు ఏ కోర్సులో, ఏ సంస్థలో సీటు వస్తుందో ఒక అవగాహనకు వచ్చిన విద్యార్థులు చివరగా సెప్టెంబర్ 20న చాయిస్‌లను లాక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపును చేపడతారు. ఇక ఎన్ఐటీలు, తదితర సంస్థల్లో మిగిలి ఉండే సీట్లకు ప్రత్యేక రౌండ్ ద్వారా నిర్వహిస్తారు. ఎన్ని సంస్థలు, ఎన్ని సీట్లు.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 36 ఇతర సంస్థల్లో విద్యార్థులకు జోసా సీట్లను కేటాయిస్తుంది. కాగా అందరూ సీట్లు ఆశించే 23 ఐఐటీల్లో 16 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. మరోవైపు ఐఐటీల్లో అమ్మాయిల చేరికలను 20 శాతం మేర పెంచేందుకు కేంద్రం2018 నుంచి 2020 వరకు వారికి ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటాను ప్రకటించింది. 2021 నుంచి ఈ కేటాయింపును ఆయా జాతీయ విద్యా సంస్థలే నిర్ణయానికే వదిలేసింది. -
మెడికల్ సీట్ల సర్దుబాటు షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతుల రద్దు కారణంగా.. ఫస్టియర్ ఎంబీబీఎస్, పీజీ మెడికల్ అడ్మిషన్లు కోల్పోయిన విద్యార్థులను సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ అప్పీలును కేంద్రం కొట్టివేయడంతో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు.. ఆ కాలేజీకి చెందిన 150 మంది ఎంబీబీఎస్ వి ద్యార్థులను సర్దుబాటు చేయాలని కాళోజీ నారా యణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఎంఎన్ఆర్, మహావీర్ కాలేజీలకు సంబంధించి మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. టీఆర్ఆర్ విద్యార్థుల కోసం వారంలో నోటిఫికేషన్.. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్, పటాన్‌చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్‌లోని మహావీర్ కాలేజీల్లో మొత్తం 450 ఎంబీబీఎస్ ఫస్టియర్ సీట్లతోపాటు రెండు కాలేజీల్లోని 113 పీజీ మెడికల్ అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎన్ఎంసీ నిర్ణయంపై టీఆర్ఆర్ కాలేజీ చేసుకున్న అప్పీలును కేంద్రం తోసిపుచ్చడంతో అందులో చేరిన 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను రాష్ట్రంలోని 12–13 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్లు సృష్టించి.. సర్దుబాటు చేయాలని కాళోజీ వర్సిటీ నిర్ణయించింది. దీనిపై వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని.. విద్యార్థులు ఇచ్చే ఆప్షన్ల ప్రకారం సర్దుబాటు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే చెల్లించిన ఫీజును.. వారు చేరబోయే మెడికల్ కాలేజీకి టీఆర్ఆర్ కాలేజీ నుంచి బదిలీ చేస్తారు. మిగతా రెండు కాలేజీలపై అనిశ్చితే.. ఎంఎన్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది ఎంబీబీఎస్, 113 పీజీ మెడికల్ విద్యార్థుల సర్దుబాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ అప్పీల్‌ను పరిశీలించిన కేంద్రం.. తనిఖీల సందర్భంగా పలువురు ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని గుర్తించింది. ఓపీ (ఔట్ పేషెంట్ల సంఖ్య) 600గా ఉందని ఒక నివేదికలో, 800 ఓపీగా మరో నివేదికలో ఉందని.. మరికొన్ని అంశాల్లోనూ తేడాలు ఉన్నాయని పరిశీలన సందర్భంగా తేల్చింది. ఈ క్రమంలో మరోసారి ఎంఎన్ఆర్ కాలేజీకి వెళ్లి తనిఖీ చేయా లని నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా ఉంటే అందులోనే విద్యార్థులను కొనసాగించే అవకాశం ఉందని.. లేకుంటే వారినీ సర్దుబా టు చేస్తారని కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మహావీర్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. త్వరలోనే విద్యార్థులందరినీ ఎక్కడో ఒకచోట సర్దుబాటుచేయడమో, లేదా ఉన్నచోటే కొనసాగించడమో జరిగే అవకాశముందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 113 మంది పీజీ మెడికల్ విద్యార్థులను సర్దుబాటు చేయాలంటే.. ఇతర కాలేజీల్లో ఆ మేరకు మౌలిక సదుపాయాలు ఉండాల్సి వస్తుందని.. ఇది కాస్త కష్టమైన పని అని పేర్కొంటున్నాయి. మరి డొనేషన్ల మాటేంటి? విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడం ఒక ఎత్తు అయితే.. వారు చెల్లించిన డొనేషన్ల వ్యవహారాన్ని పరిష్కరించడం మరో సమస్యగా మారే అవకాశముంది. టీఆర్ఆర్ కాలేజీ విద్యార్థులు చెల్లించిన ఫీజును సర్దుబా టు సందర్భంగా వారు చేరే కాలేజీకి బదిలీ చే యాలని నిర్ణయించారు. అయితే ఎంబీబీఎస్ కోర్సు ఐదేళ్ల ఫీజును ఒకేసారి కడితే రాయితీ ఇస్తామని కాలేజీ చెప్పడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అలా చెల్లించినట్టు సమాచారం. ఫీజుకు అదనంగా డొనేషన్లు కూడా తీ సుకున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. డొనేషన్ల సొమ్ముకు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదని అంటున్నారు. ఫీజు సొమ్మును ఎలాగోలా బదిలీ చేస్తారుగానీ.. డొనేషన్ల కింద భారీగా చెల్లించిన డబ్బుల సంగతేమిటని ఆందోళనలో పడ్డారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
అసెట్.. అడ్మిషన్లు ఫట్!
‘మీకు సీట్లు కేటాయించాం. మా వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి’.. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఎస్సెమ్మెస్‌ను చూసి ఉత్సాహంగా చాలామంది విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ అందులో ఏ సీటు కేటాయించారన్న సమాచారం అందలో లేకపోవడంతో హతాశులయ్యారు. మొదటి దశ సీట్లు పొందినవారు ఈ నెల 19 లోగా ఫీజులు కట్టాలని అదే వెబ్సైట్లో ఫీజులు, చేరికల షెడ్యూల్ పెట్టారు. ఆ ప్రకారం దూరప్రాంతాల నుంచి ఉరుకులు, పరుగుల మీద వచ్చిన విద్యార్థులు.. ఫీజులు తీసుకోవడంలేదని తెలిసి ఉసూరుమన్నారు.ఆసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో నెలకొన్న ఈ గందరగోళం ప్రవేశార్థులను అయోమయానికి, ఆందోళనకు దారితీసింది.గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహస్తున్న సంస్థను కాదని.. ఉన్న పళంగా మరో కొత్త సంస్థకు అప్పగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వర్సిటీ ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పురాతన, ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అపకీర్తి తెచ్చే మరో అంకానికి తెరలేచింది. వర్సిటీ పాలకుల నిర్లక్ష్యం, కాసుల కోసం కొందరు పెద్దల ఆరాటం విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రవేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పెద్దలు చేసిన తప్పిదం పీజీ, ఇంజినీరింగ్ ప్రవేశాల పక్రియను తలకిందలు చేసింది. తెరపైకి బెంగళూరు సంస్థ గత కొన్నేళ్లుగా ఆసెట్, ఆఈఈటీలకు సంబంధించి పరీక్షలతో సహా అన్ని రకాల అన్లైన్ పక్రియలను హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించింది. 2010 నుంచి 2018 వరకు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. 2019 ఆసెట్ నిర్వహణ బాధ్యతను మాత్రం వర్సిటీ పెద్దలు అనూహ్యంగా ఆ సంస్థ నుంచి తప్పించి బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పజెప్పారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత డైరెక్టర్ ఆచార్య నిమ్మా వెంకటరావు ప్రమేయం ఉందని సమాచారం. అడ్మిషన్ల ప్రక్రియలో పెద్దగా అనుభవం లేని ఆ సంస్థ నిర్వహణ లోపాలతో మొత్తం ప్రక్రియనే గందరగోళంలో పడేసింది. తొలిదశ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి నెల రోజులవుతున్నా నేటికి సీట్లు కేటాయించలేకపోయింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డీవోఏ)లో ఏం జరుగుతుందో బయటకు పొక్కకుండా గుంభనం పాటిస్తుండటం అనుమానాలకు ఆస్కారమిస్తోంది. సీట్లు కేటాయింపులో గందరగోళం ఎట్టకేలకు జరిగిన తొలిదశ సీట్లు కేటాయింపు విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల పోన్లకు ఆదివారం రాత్రి సంక్షిప్త సందేశాలు అందాయి. అందులోని సూచన మేరకు వెబ్సైట్లోకి వెళ్లి అటాల్మెంట్ ఆర్డర్లు చూసి విద్యార్థులు కంగుతిన్నారు. అందులో సీటు కేటాయించినట్టు గానీ.. లేదని గానీ ఎక్కడా పేర్కొనలేదు. అలాట్మెంట్ ఆర్డరులోకరెంట్ చాయిస్–1, ప్రయారిటీ –ఎక్స్.. ఇలా అర్థం కాని సమాచారం ఉంది. టాప్ ర్యాంకర్లకు సీట్లు ఏవీ..? దీంతో పాటు టాప్ 10 ర్యాంకులొచ్చిన చాలా మందికి వర్సిటీ కళాశాలల్లో కాకుండా ప్రైవేట్ కళాశాల్లో సీట్లు కేటాయించగా.. మరికొందరికి అసలు సీట్లే కేటాయించలేదు. హుమానిటీస్ (15 కోర్సులు), లైఫ్ సైన్స్ (16 కోర్సులు) కోర్సులకు టెస్ట్ రాసి టాప్ ర్యాంకులు సాధించిన చాలా మందికి సీట్లు కేటాయించలేదు. దాంతో సోమవారం వారంతా ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిలో టాప్ 5, 8, 10, 18, 41 వంటి ర్యాంకులు సాధించినవారు ఉన్నారు. ప్రకటనలు మాయం తొలిదశ సీట్ల కేటాయింపుపై ఏయూ వెబ్సైట్లో రోజుకో ప్రకటన కనిపించింది. 16వ తేదీ రాత్రి తమకొచ్చిన ఫోన్ సందేశాల మేరకు విద్యార్థులు వెబ్సైట్లోకి వెళ్లారు. సీట్లు పొందినవారు 19 లోపు ఫీజులు చెల్లించాలని అందులో ఉండటంతో మంగళవారం ఉదయం నుంచి ఫీజు చెల్లించేందుకు అనేక మంది ప్రయత్నించినా కుదరలేదు. సీట్లు కేటాయింపులో తప్పిదాల నేపథ్యంలో సోమవారంనాడే పలువురు ఏయూకు వచ్చి గొడవ చేయడంతో వెబ్సైట్ నుంచి ఆ వివరాలు తొలగించారు. ప్రస్తుత సీట్లు కేటాయింపును రద్దుచేసి త్వరలోనే మళ్లీ కేటాయిస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫీజుల వసూళ్లు నిలిపేశారు. ఇది తెలియక ఫీజు కట్టేదామని వచ్చిన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి సాయంత్రం ఆన్లైన్ పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుందని మరో అబద్దం చెప్పి పంపించేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీట్లు వచ్చిన వారికి అలాగే కొనసాగిస్తారా? లేక మళ్లీ కేటాయిస్తారా?? అన్న సందేహాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కొంత గందరగోళం నిజమే: ఏయూ వీసీ ఆసెట్, ఆఈఈటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సీట్ల కేటాయింపుతో పాటు అన్ని రకాల అన్లైన్ ప్రక్రియలను ఈసారి బెంగళూరు సంస్థకిచ్చిన మాట నిజమేనని ఏయూ వీసీ నాగేశ్వరరావు అంగీకరించారు. ఈ ప్రక్రియలో సోమవారం కొందర గందరగోళం నెలకొనడం కూడా వాస్తవమేనని అన్నారు. కొంత మంది విద్యార్ధులు తన వద్దకు వచ్చి సమస్య చెప్పడంతో పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన అన్నారు. అవకతవకలపై విచారణ జరపాలి ఆసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించడం దారుణం. మా మేనకోడలు మైక్రోబయాలజీలో సీటు కోసం ఆసెట్ రాసింది. 57వ ర్యాంకు వచ్చింది. బీసీ–డి రిజర్వేషన్ కూడా ఉంది. మైక్రోబయాలజీతో పాటు బాటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు కూడా ఆప్షన్స్ పెట్టాం. అయితే ఇప్పటికీ ఎక్కడా సీటు కేటాయించలేదు. అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారు. దీంతో ప్రవేశాల పక్రియపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం తక్షణం ఇక్కడి అధికారులపై చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్నాం. – శివరామనాయుడు, విశాఖపట్నం -
కేయూ పీజీ సీట్ల అలాట్మెంట్ జాబితా విడుదల
ఈనెల 20న కళాశాలల్లో రిపోర్టు చేయాలి కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ జాబితాను కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న సోమవారం విడుదల చేశారు. విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి కంప్యూటర్ సహాయంతో జాబితా తయారు చేశారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 20వతేదీ వరకు విద్యార్హతలు తదితర ఒరిజనల్ సర్టిఫికెట్లతో కెటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సీట్ల కెటాయింపు సమాచారం తెలియజేశామని, ఏకళాశాలలో సీటు లభించిందో తెలుసుకునేందుకు ఈనెల 16న యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా లేదా అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో సంప్రదిచ్చవచ్చని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు ముందుగా ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా లేదా ఎస్బీఐ బిల్yð స్క్ ద్వారా ఫీజు చెల్లించాలని, 24 గంటల తరువాత అడ్మిషన్ కార్డును డౌన్లోడు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 20న సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలన్నారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాని అభ్యర్థులు ఈనెల 25, 26 తేదీల్లో కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, వీరు ఈనెల 26నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. సీటు అలాట్మెంట్ రెండవ జాబితాను సెప్టంబర్ 2న ప్రకటిస్తామని, సెప్టంబర్ 6 వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో చేరవచ్చని, పూర్తివివరాలకు కేయూ వెబ్సైట్, అడ్మిషన్ల వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు లేని కోర్సులకు 24న సర్టిఫికెట్ల పరిశీలన కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో ప్రవేశపరీక్షలులేని సంస్కృతం, హిందీ, ఎంఐటీ, ఉర్దూ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ పీజీ కోర్సులకు ఈనెల 24న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, సీట్ అలాట్మెంట్ కూడా చేస్తారని సంబంధిత అడ్మిషన్ల డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.