‘మీకు సీట్లు కేటాయించాం. మా వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోండి’.. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఎస్సెమ్మెస్‌ను చూసి ఉత్సాహంగా చాలామంది విద్యార్థులు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ అందులో ఏ సీటు కేటాయించారన్న సమాచారం అందలో లేకపోవడంతో హతాశులయ్యారు. మొదటి దశ సీట్లు పొందినవారు ఈ నెల 19 లోగా ఫీజులు కట్టాలని అదే వెబ్‌సైట్‌లో ఫీజులు, చేరికల షెడ్యూల్ పెట్టారు. ఆ ప్రకారం దూరప్రాంతాల నుంచి ఉరుకులు, పరుగుల మీద వచ్చిన విద్యార్థులు.. ఫీజులు తీసుకోవడంలేదని తెలిసి ఉసూరుమన్నారు.ఆసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో నెలకొన్న ఈ గందరగోళం ప్రవేశార్థులను అయోమయానికి, ఆందోళనకు దారితీసింది.గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహస్తున్న సంస్థను కాదని.. ఉన్న పళంగా మరో కొత్త సంస్థకు అప్పగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వర్సిటీ ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పురాతన, ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అపకీర్తి తెచ్చే మరో అంకానికి తెరలేచింది. వర్సిటీ పాలకుల నిర్లక్ష్యం, కాసుల కోసం కొందరు పెద్దల ఆరాటం విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రవేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పెద్దలు చేసిన తప్పిదం పీజీ, ఇంజినీరింగ్ ప్రవేశాల పక్రియను తలకిందలు చేసింది.
తెరపైకి బెంగళూరు సంస్థ
గత కొన్నేళ్లుగా ఆసెట్, ఆఈఈటీలకు సంబంధించి పరీక్షలతో సహా అన్ని రకాల అన్‌లైన్ పక్రియలను హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించింది. 2010 నుంచి 2018 వరకు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. 2019 ఆసెట్ నిర్వహణ బాధ్యతను మాత్రం వర్సిటీ పెద్దలు అనూహ్యంగా ఆ సంస్థ నుంచి తప్పించి బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పజెప్పారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత డైరెక్టర్ ఆచార్య నిమ్మా వెంకటరావు ప్రమేయం ఉందని సమాచారం. అడ్మిషన్ల ప్రక్రియలో పెద్దగా అనుభవం లేని ఆ సంస్థ నిర్వహణ లోపాలతో మొత్తం ప్రక్రియనే గందరగోళంలో పడేసింది. తొలిదశ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి నెల రోజులవుతున్నా నేటికి సీట్లు కేటాయించలేకపోయింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డీవోఏ)లో ఏం జరుగుతుందో బయటకు పొక్కకుండా గుంభనం పాటిస్తుండటం అనుమానాలకు ఆస్కారమిస్తోంది.
సీట్లు కేటాయింపులో గందరగోళం
ఎట్టకేలకు జరిగిన తొలిదశ సీట్లు కేటాయింపు విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల పోన్‌లకు ఆదివారం రాత్రి సంక్షిప్త సందేశాలు అందాయి. అందులోని సూచన మేరకు వెబ్‌సైట్‌లోకి వెళ్లి అటాల్‌మెంట్ ఆర్డర్లు చూసి విద్యార్థులు కంగుతిన్నారు. అందులో సీటు కేటాయించినట్టు గానీ.. లేదని గానీ ఎక్కడా పేర్కొనలేదు. అలాట్‌మెంట్ ఆర్డరులోకరెంట్ చాయిస్–1, ప్రయారిటీ –ఎక్స్.. ఇలా అర్థం కాని సమాచారం ఉంది.
టాప్ ర్యాంకర్లకు సీట్లు ఏవీ..?
దీంతో పాటు టాప్ 10 ర్యాంకులొచ్చిన చాలా మందికి వర్సిటీ కళాశాలల్లో కాకుండా ప్రైవేట్ కళాశాల్లో సీట్లు కేటాయించగా.. మరికొందరికి అసలు సీట్లే కేటాయించలేదు. హుమానిటీస్ (15 కోర్సులు), లైఫ్ సైన్స్ (16 కోర్సులు) కోర్సులకు టెస్ట్ రాసి టాప్ ర్యాంకులు సాధించిన చాలా మందికి సీట్లు కేటాయించలేదు. దాంతో సోమవారం వారంతా ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిలో టాప్ 5, 8, 10, 18, 41 వంటి ర్యాంకులు సాధించినవారు ఉన్నారు.
ప్రకటనలు మాయం
తొలిదశ సీట్ల కేటాయింపుపై ఏయూ వెబ్‌సైట్‌లో రోజుకో ప్రకటన కనిపించింది. 16వ తేదీ రాత్రి తమకొచ్చిన ఫోన్ సందేశాల మేరకు విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లారు. సీట్లు పొందినవారు 19 లోపు ఫీజులు చెల్లించాలని అందులో ఉండటంతో మంగళవారం ఉదయం నుంచి ఫీజు చెల్లించేందుకు అనేక మంది ప్రయత్నించినా కుదరలేదు. సీట్లు కేటాయింపులో తప్పిదాల నేపథ్యంలో సోమవారంనాడే పలువురు ఏయూకు వచ్చి గొడవ చేయడంతో వెబ్‌సైట్ నుంచి ఆ వివరాలు తొలగించారు. ప్రస్తుత సీట్లు కేటాయింపును రద్దుచేసి త్వరలోనే మళ్లీ కేటాయిస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫీజుల వసూళ్లు నిలిపేశారు. ఇది తెలియక ఫీజు కట్టేదామని వచ్చిన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి సాయంత్రం ఆన్‌లైన్ పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుందని మరో అబద్దం చెప్పి పంపించేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీట్లు వచ్చిన వారికి అలాగే కొనసాగిస్తారా? లేక మళ్లీ కేటాయిస్తారా?? అన్న సందేహాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు.
కొంత గందరగోళం నిజమే: ఏయూ వీసీ
ఆసెట్, ఆఈఈటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సీట్ల కేటాయింపుతో పాటు అన్ని రకాల అన్‌లైన్ ప్రక్రియలను ఈసారి బెంగళూరు సంస్థకిచ్చిన మాట నిజమేనని ఏయూ వీసీ నాగేశ్వరరావు అంగీకరించారు. ఈ ప్రక్రియలో సోమవారం కొందర గందరగోళం నెలకొనడం కూడా వాస్తవమేనని అన్నారు. కొంత మంది విద్యార్ధులు తన వద్దకు వచ్చి సమస్య చెప్పడంతో పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన అన్నారు.
అవకతవకలపై విచారణ జరపాలి
ఆసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించడం దారుణం. మా మేనకోడలు మైక్రోబయాలజీలో సీటు కోసం ఆసెట్ రాసింది. 57వ ర్యాంకు వచ్చింది. బీసీ–డి రిజర్వేషన్ కూడా ఉంది. మైక్రోబయాలజీతో పాటు బాటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు కూడా ఆప్షన్స్ పెట్టాం. అయితే ఇప్పటికీ ఎక్కడా సీటు కేటాయించలేదు. అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారు. దీంతో ప్రవేశాల పక్రియపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం తక్షణం ఇక్కడి అధికారులపై చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్నాం. – శివరామనాయుడు, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment