సాక్షి, హైదరాబాద్: బీజేపీపై పార్టీ పాతకాపులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వలస నేతలకు పెద్దపీట వేశారని, గెలుపోటములతో నిమిత్తం లేకుండా దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటూ కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోతున్నారు. పార్టీలోని ఒరిజనల్ కేడర్‌కు సీట్లు ఇవ్వకుండా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు మొండిచెయ్యి చూపించాయంటూ కారాలు, మిరియాలు నూరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాషాయ సిద్ధాంతాలు పాటించే వారు, ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారు పనికి రారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రకటించిన 88 అభ్యర్థుల్లో మూడింట రెండు వంతులకు పైగా కొత్తవారికే కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ కారణాలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యనేతలు, వారి అనుయాయులకే ఎక్కువగా టికెట్లు దక్కాయని విమర్శిస్తున్నారు.
ఇతర పార్టీల్లోని అవలక్షణాలు బీజేపీకి కూడా అంటుకున్నాయనే అభిప్రాయం కలుగుతోందని, కొందరు గుత్తేదారుల చేతుల్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడిందంటూ ఆరోపణలకు సైతం దిగుతుండటం గమనార్హం. గత నాలుగేళ్లలో పార్టీలో చేరి జాతీయ కార్యవర్గసభ్యులుగా, ఇతర ముఖ్య పోస్టుల్లో ఉన్న నేతల్లో కొందరు చక్రం తిప్పి తమ అనుచరులు, అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంతో పాత నాయకులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా పార్టీలో పాతకాపులకు ప్రాధాన్యత తగ్గిపోవడం దేనికి సంకేతమని వారు నిలదీస్తున్నారు. ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 20 మంది దాకా మాత్రమే పార్టీ సిద్ధాంతాల పునాదిపై సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్న వారని, మరో 10 నుంచి 15 మంది దాకా గత ఐదు నుంచి పదేళ్లలోపు పార్టీలో చేరి స్థిరంగా పనిచేస్తున్నారని లెక్కలతో సహా వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment