సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల మాదిరే జనసేన కూడా పూర్తిగా తోకపార్టీగా మారిపోవడంపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ మధ్య కుదిరిన పొత్తులో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను పవన్ పార్టీకి కేవలం 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం గతంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాటికి కేటాయించిన సీట్లతో పోల్చితే ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్లు చాలా తక్కువని జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.
చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పవన్‌కళ్యాణ్ స్వయంగా జైలుకెళ్లి ఆయన్ను కలిసొచ్చిన తర్వాత అక్కడికక్కడే పొత్తు ప్రకటన చేసిన తీరుతో తమ పార్టీకి తప్పకుండా 40–45 స్థానాలకు మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని జనసేన శ్రేణులు భావించారు. కానీ, తీరా శనివారం కేవలం 24 అసెంబ్లీ స్థానాలేనని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
అప్పట్లో టీఆర్‌ఎస్‌కు మూడో వంతు సీట్లు
గతంలో పొత్తుల పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీలకు టీడీపీ కేటాయించిన సీట్లకు ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్ల సంఖ్యకు పొంతనే లేదని అటు జనసేనలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉదా.. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి పేరుతో ఉమ్మడి ఏపీలో టీఆర్‌ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అప్పట్లో టీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న మొత్తం సీట్లలో మూడో వంతుకు పైగా కేటాయించింది. అంటే.. 119 సీట్లకు 45 సీట్లను కేటాయించగా.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 32 సీట్లను కేటాయించింది.
నిజానికి.. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటములు చవిచూసింది. అయినా, టీడీపీ ఆ పార్టీకి ఎక్కువ సీట్లను కేటాయించింది. అయితే, ఇప్పుడు ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుతం జనసేన బాగా పుంజుకుందని పవన్‌కళ్యాణ్ కొంతకాలంగా చెబుతున్నారు. అలాంటప్పుడు 175 సీట్లలో మూడో వంతు 33 శాతం సీట్లు కాకుండా కేవలం 13 శాతం సీట్లకే పవన్ అంగీకరించడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేక ఆయన్ను తూర్పారబడుతున్నారు.
పవన్‌కు సీఎం పదవి అంతే సంగతులా!?
ఇక పవన్‌కళ్యాణ్‌ను సీఎంగా చేయడమే తమందరి లక్ష్యమని ఆ పార్టీ శ్రేణులందరూ భావిస్తూ ఉంటారు. కానీ, ఈ పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడంతో పవన్ ఇక ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశాలను పూర్తిగా వదులుకున్నారని అటు జనసేన పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన మొదలైనప్పటి నుంచి సీఎం అభ్యరి్థత్వంపై పవన్ పార్టీ సమావేశాల్లో ‘పొత్తులు, ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి’ అంటూ పార్టీ శ్రేణులందర్నీ మభ్యపెట్టారు.
అలాగే, గత ఎన్నికల్లో 30–40 సీట్లు గెలిచి ఉంటే సీఎం పదవిలో వాటా కావాలని అడిగే అవకాశం ఉంటుందని.. టీడీపీ అధినేత స్థానంలో తానున్నా జనసేనకు సీఎం పదవిలో వాటా ఇచ్చేవాడ్ని కాదని పవన్ పార్టీ సమావేశాల్లో అనేకసార్లు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచే తీరులో వ్యాఖ్యానించారు. దీనికితోడు.. పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో సైతం వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే.. సీఎం పదవి వాటా చర్చకు ద్వారాలు మూసుకున్నట్లేనని స్పష్టమవుతోందని వారంటున్నారు.
2014లో బీజేపీకి ఇచ్చిన సీట్లతో పోల్చినా..
ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేన పొత్తులో జనసేన ఒక్కచోట కూడా పోటీచేయలేదు. ఆ సమయంలో విభజిత ఏపీలోనే బీజేపీకి 15 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాలను టీడీపీ కేటాయించింది. అప్పటికి రాష్ట్రంలో కేవలం 2–3 శాతం ఓట్లకే బీజేపీ పరిమితమైంది. కానీ, ఇప్పుడు జనసేనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు తమ పార్టీ ఓట్ల శాతం 15 శాతం ఉంటుందని పవన్‌కళ్యాణ్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 24 అసెంబ్లీ సీట్లు, మూడు లోకసభ సీట్లు తీసుకోవడం చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు.
బాబు కోసమే పవన్ ఆరాటం
2014 జనసేన ఏర్పాటు నుంచీ పరిశీలిస్తే.. పవన్‌కళ్యాణ్ కార్యక్రమాలన్నీ తన సొంత పార్టీ కంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆరాటపడి పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని జనసేన శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు.
ఎందుకంటే..
♦ పార్టీ ఏర్పాటుచేసి కూడా 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీచేయకుండా పూర్తిగా చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేశారు.
♦ ఆ ఎన్నికల్లో టీడీపీ అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకపోయినా పవన్ ఆయన్ను సమరి్థస్తూనే వచ్చారు.
♦ ఇక 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోగా, అది కూడా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే.
♦ ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్‌సీపీకి వెళ్లకుండా టీడీపీకి సహకరించారనే విమర్శలున్నాయి.
♦ తిరిగి 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి.. వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. అంటే.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని కారణంగా లాభపడే అవకాశం చంద్రబాబు ఒక్కరికే ఉంటుంది. అందుకే పవన్ ఇప్పుడు టీడీపీతోనే పొత్తుపెట్టుకున్నారు.
♦ మరోవైపు.. గత పదేళ్లుగా జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి పవన్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా టీడీపీకి అనుకూలాంశమే. ఇవన్నీ బాబుకు భజన చేసేవేనని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment