సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: పొత్తు ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని నేతలతోపాటు పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జనసేనతో కలిసి 99 మంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలు చోట్ల నేతలు భగ్గుమంటున్నారు.
♦ విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ టికెట్‌ను తన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కి కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆదివారం గజపతినగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
♦ టీడీపీ బలోపేతం కోసం కష్టపడ్డ తనను అవమానించారని, ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతానని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రకటించారు. చంద్రబాబు తనకు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదన్నారు.
♦ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సీటును సవితకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గం నిరసనలతో హోరెత్తిస్తోంది. ఆదివారం పెనుకొండలో పార్థసారథి అనుచరులు భారీ బైక్ ర్యాలీతో బల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ వెళ్లి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటానని పార్ధసారథి ప్రకటించారు. కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు.
♦ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌యాదవ్‌కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బి.కొత్తకోటలో నిరసన నిర్వహించారు.
♦ నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతోపాటు కుందుల సత్యనారాయణ వర్గాలు మండిపడుతున్నాయి. వారంతా టీడీపీకి మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
చిత్తూరులో బీసీలు భగ్గు
టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు స్థానాలను మినహాయించి చిత్తూరు (కమ్మ), కుప్పం (కమ్మ), నగరి (కమ్మ), తంబళ్లపల్లె (రెడ్డి), పలమనేరు (రెడ్డి) స్థానాలను ఓసీలకు కేటాయించడంపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్ రాజన్‌కు టీడీపీ మొండి చేయి చూపడంపై ఆయన సామాజిక వర్గం మండిపడుతోంది.
శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయించింది. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న గురజాల జగన్‌మోహన్ నాయుడుకు చిత్తూరు టికెట్ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన కాపు నేతలు కటారి హేమలత, ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య, కాజూరు బాలాజీ తదితరులు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు.
జనసేనలోనూ మంటలు...
♦ తణుకు జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ విడివాడ రామచంద్రరావు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అరిమిల్లి రాధాకృష్ణపై నిప్పులు కక్కుతున్నారు. తన ఇంటికి రావద్దంటూ అరిమిల్లిపై మండిపడ్డారు. విడివాడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి యోచనలో ఉన్నారు.
♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించడాన్ని నిరసిస్తూ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆలయాల్లో పూజలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 48 గంటల్లో అధినేత స్పందించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ గోకవరం మండలాధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం చెప్పారు.
♦ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని జనసేన కార్యాలయం వద్ద పార్టీ నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు, బి.రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించి రోడ్డుపై వేసి నిప్పంటించారు. అతి తక్కువ సీట్లకు ఒప్పందం కుదుర్చుకుని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గాన్ని టీడీపీకి కట్టబెట్టడం దారుణమన్నారు. పదేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తే పార్టీని టీడీపీకి అప్పగించి తమను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
♦ కాకినాడ జిల్లా పెద్దాపురం సీటును టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మల బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
♦ పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టి»ొమ్మను కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు సమ్మెట బాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ను గుడ్డిగా నమ్మామని అన్నారు. గౌరవప్రదమైన పొత్తుకు విఘాతం కలిగినట్టుగా జనసైనికులు భావిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment