సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా హఠాత్తుగా దిగిపడుతున్న పారాచూట్ నేతలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తుండటం టీడీపీలో తమ్ముళ్లను కకావికలం చేస్తోంది. జనసేన పొత్తుతోపాటు, బీజేపీతో కూడా ఖాయం అనుకుంటున్న పొత్తు టీడీపీ నేతల టికెట్ అవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో సీనియర్ నేతలతోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మొండి చెయ్యి మిగలనుందని స్పష్టం అవుతోంది. దీంతో అసలు పార్టీలో ఏమి జరుగుతోందో అన్న స్పష్టత లేక టీడీపీ తమ్ముళ్లు మరింత గందరగోళానికి గురవుతున్నారు.
బొండా ఉమాకు సీటు గండం
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనకు పోటీ లేదని భావిస్తున్న బొండా ఉమాకు గడ్డుకాలం మొదలైంది. బీజేపీ పొత్తు రూపంలో ఆయనకు గండం పొంచి ఉంది. దీనికితోడు వంగవీటి రాధా సైతం తనకే సీటు కావాలని పట్టు పడుతుండటంతో విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఎవరన్నది తేలక నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు పొత్తులో భాగంగా సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే బొండా టికెట్ గల్లంతు కావడం ఖాయం.
తిరువూరు తెరపైకి రోజుకో అభ్యర్థి...
తిరువూరు నియోజకవర్గంలో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా శావల దేవదత్తు ఉన్నారు. ఆయనను కాదని కొలికిపూడి శ్రీనివాస్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తమదే టికెట్ అని చేసుకొంటున్న ప్రచారం అక్కడ తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి కూడా టీడీపీ తరఫున టికెట్ రేసులోకి వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఇక్కడికి పారాచూట్ నేతలను తీసుకొస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంది.
జగ్గయ్యపేట అభ్యర్థి నేనే‘నయా’
ఇప్పటికే చంద్రబాబు జగ్గయ్యపేట నియోజకవర్గం పర్యటనలో పార్టీ అభ్యర్థిగా శ్రీరాం తాతయ్యను ప్రకటించారు. కానీ అక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురాం చాపకింద నీరులా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు మరో టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ పేరుతో ‘గెలిస్తే న్యాయం చేస్తా, ఓడినా సాయం చేస్తా, మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా’ అంటూ జగ్గయ్యపేటలో వెలిసిన ఫ్లెక్సీలు అక్కడ టికెట్‌పై కొత్త చర్చకు దారితీసేలా చేశాయి. చంద్రబాబు ఇప్పటికే ఇన్‌చార్జిలుగా ప్రకటించిన అభ్యర్థుల్లో సైతం తమకు బీ ఫాం ఇచ్చే వరకు టికెట్ అనుమానమే అన్న భావనను పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఇది క్యాడర్‌లో తీవ్ర గందరగోళం రేపుతోంది.
సీట్లు తన్నుకు పోతున్న పారాచూట్‌లు...
ఇప్పటికే నూజివీడులో కొలుసు పార్థసారథి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము పారాచూట్‌లుగా వచ్చి టికెట్లు తన్నుకుపోయారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో కూడా పారాచూట్లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండటంతో పారీ్టకోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మైలవరంలో తెరపైకి కేశినేని చిన్ని
వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీతో పొత్తు ఆయన సీటుకు ఎసరు పెట్టనుంది. ఎంపీ సీటుపై బీజేపీ కర్చిప్ వేసింది. ఈ నేపథ్యంలో చిన్నికి ఎక్కడైనా టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ను మైలవరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది.
అదే జరిగితే మైలవరంపై ఆశలు పెట్టుకున్న వసంతకు ఆశాభంగమే. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పెనమలూరు టికెట్ ఇస్తామని చెబుతున్నారు. కానీ అక్కడ బోడే ప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. మరోవైపు దేవినేని ఉమా పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మైలవరంలో టికెట్ ఆయనకు లేదని తేలిపోవడంతో పెనమలూరుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.
అక్కడ బోడే వర్గంతోపాటు, వసంత పోటీకి రావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కుప్పంలో ఎదురుగాలి వీస్తుండటంతో చంద్రబాబు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కన్ను పెనమలూరుపై పడిందని సమాచారం. అదే జరిగితే బోడే ప్రసాద్, వసంత, దేవినేని ఉమా ముగ్గురి సీట్లు గల్లంతయినట్టే.
Comments
Please login to add a commentAdd a comment