జనసేన అధినేత పవన్‌ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే
ఆ పార్టీకి 24 సీట్లు కేటాయించినా, ఇప్పటివరకు ఐదు మాత్రమే ఖరారు
బాబు అభ్యంతరాలతో పవన్ పోటీచేసే నియోజకవర్గం పెండింగే
రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్ కూడా..
ఎన్నికల వేళ హైదరాబాద్‌లో మకాం ఏమిటని పార్టీ శ్రేణుల ప్రశ్న
సాక్షి, అమరావతి: ఒక రాజకీయ పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి.. స్వీయ నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ట్రబుల్ షూటర్ లక్షణాలు.. కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు విలువివ్వడం.. ఇలాంటివన్నీ పుణికిపుచ్చుకోవాలి. కానీ, ఇవేవీ లేనివాళ్లను ఏమనాలి? జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అనాలి. ఎందుకంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఆయన వేసే ప్రతీ అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనుసైగ చేస్తేనే జరుగుతోంది. ఇది ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శ కాదు.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాక్షాత్తు జనసేన శ్రేణులు వ్యక్తంచేస్తున్న నిశ్చితాభిప్రాయం.
ఎందుకంటే.. టీడీపీతో పొత్తులో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో ఇప్పటికీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన పవన్‌కళ్యాణ్, మిగిలిన 19 స్థానాల పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఇందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నారట. ఇదే విషయం ఇప్పుడు జనసేనలో హాట్‌టాపిక్‌గా మారింది. చంద్రబాబు సూచన మేరకు రెండు, మూడు జాబితాలుగా వెలువడే అవకాశముందని జనసేన నేతలు చెబుతున్నారు.
చివరకు.. పవన్ తాను పోటీచేసే స్థానంపై ఇరువురు నేతలు సూచనప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దానిని అధికారికంగా ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని వారంటున్నారు. ఇక వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ–జనసేనల సీట్ల కేటాయింపు ప్రకటనకు ముందే రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత ఈనెల 24న చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన మీడియా సమావేశంలో గతంలో చంద్రబాబు ప్రకటించిన రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారుగానీ.. పవన్ ప్రకటించిన రెండింటిలో రాజోలు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టేశారు.
అక్కడ పవన్‌కళ్యాణ్ ముందుగా అనుకున్న పేరుపై చంద్రబాబు అభ్యంతరం చెప్పిన కారణంగానే జనసేన తొలి జాబితాలో అదిలేదని జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన.. జనసేన పోటీచేసే మిగిలిన 19 స్థానాల జనసేన అభ్యర్థుల ఎంపికకు కూడా చంద్రబాబు ఆమోదం కావాల్సి ఉంటుందని వారు స్పష్టంచేస్తున్నారు. అలాగే.. ఆయా స్థానాల్లో తమకు సీట్లు ఖాయమని ఇప్పటివరకూ అనుకుంటున్న జనసేన నేతలు కూడా తమ అభ్యర్థిత్వానికి టీడీపీ అధినేత ఎసరు పెడతారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు.. చంద్రబాబు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలే కేటాయించడాన్ని కూడా పవన్ పవిత్ర గాయత్రీ మంత్రంతో గొప్పగా పోల్చుకున్నారని.. నిజానికి.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మంత్రాన్ని íచెవిలోనే ఉపదేశిస్తుంటారని.. ఈలెక్కన జనసేనకు కేటాయించిన ఆ 24 సీట్లలో ఎవరు పోటీచేయాలన్నది చంద్రబాబు పవన్ చెవిలో చెప్పిన తర్వాతే తమ అధినేత అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని జనసేన నాయకులే ఛలోక్తులు విసురుతున్నారు.
బాబు చెప్పుచేతల్లో పవన్..
లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు ఇప్పటికే పవన్ మాటలకు విలువ లేకుండా చేశారని వారంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం తమ అధినేతను ఆయన తన చెప్పుచేతల్లో ఉంచుకునే ఎత్తుగడలో ఉన్నారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే..
తొమ్మిది నెలల క్రితం తణుకులో పవన్ అక్కడి స్థానిక పార్టీ ఇన్‌చార్జి వి. రామచంద్రరావుకు సీటు ఇస్తానని ఇచ్చిన మాటకు విలువలేకుండా ఆ స్థానంలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని వారు ఉదహరిస్తున్నారు.
అలాగే, సీట్ల కేటాయింపు ప్రకటనకు వారం రోజుల ముందే పవన్ రాజమండ్రి పర్యటనలో రూరల్ స్థానంలో జనసేనే పోటీచేసేలా చంద్రబాబును ఒప్పిస్తానని స్థానిక పార్టీ నేతలకు మాటిచ్చారు. కానీ, ఆ స్థానం ఇప్పటివరకూ అధికారికంగా ఖరారు కాకపోయినా, అనధికారికంగా ఆ స్థానం టీడీపీకి కేటాయించినట్లు ఇరు పార్టీలు వెల్లడిస్తున్నాయి.
ఇంకోవైపు.. 2019 ఎన్నికల్లో టీడీపీతో సంబంధం లేకుండా జనసేన వేరుగా పోటీచేసినప్పుడే పవన్ 30 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న పలు స్థానాలను కూడా ఇప్పుడు పొత్తులో జనసేనకు కేటాయించకుండా, ఏదో ఒక సాకుతో అక్కడ టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసేసి ఆ ఎన్నికలో జనసేనకు కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చిన నెల్లిమర్ల.. 11,988 ఓట్లే వచ్చిన అనకాపల్లి వంటి నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించారని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment