జనసేనలో నిరసన సెగలు
కాకినాడ మాజీ మేయర్ సరోజ రాజీనామా
పవన్ తీరుపై కోనసీమ జనసేన కార్యకర్తల మండిపాటు
కాకినాడ రూరల్/సాక్షి, కోనసీమ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఆయన సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీట్ల కేటాయింపుపై నిరసన వ్యక్తం చేస్తోంది. తమను పార్టీ కోసం వాడుకుని కరివేపాకులా తీసిపడేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ పోతసపల్ల సరోజ చెరియన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక సర్పవరం జంక్షన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు రాసిన రాజీనామా లేఖను ప్రదర్శించారు.
ఆమె మాట్లాడుతూ, తన ఆత్మగౌరవాన్ని పార్టీ దెబ్బ తీసిందన్నారు. జనసేన తీసుకున్న ముష్టి 21 సీట్లలో ఒక్కటీ శెట్టిబలిజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయేచోట ఒక్క మహిళకు మాత్రమే సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా పోల్, బూత్ మేనేజ్‌మెంట్లు లేకపోవడానికి కారణం కేవలం నాదెండ్ల మనోహరే అని ధ్వజమెత్తారు. వారాహి యాత్రలో కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ శెట్టిబలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నాదెండ్ల మనోహర్ పవన్‌ను, జనసేనను ముంచేశారని, ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని హితవుపలికారు. పవన్ చుట్టూ ఉండే కోటరీలో హరిప్రసాద్, కేకే, చక్రవర్తి, మనోహర్ తదితరులే మాట్లాడతారని విమర్శించారు. తాను కాకినాడ రూరల్ సీటు ఆశించి మోసపోయానని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీకి వ్యతిరేకంగా పని చేస్తానని సరోజ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమె భర్త చెరియన్ కూడా పాల్గొన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లా!
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పోటీ చేసే రెండు సీట్లలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ ఇన్‌చార్జులు మండిపడుతున్నారు. పి.గన్నవరం అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికుడే అయినా తెలంగాణ క్యాడర్ ఉద్యోగి. జనసేన నుంచి టికెట్ హామీ వచ్చిన తరువాతే ఉద్యోగానికి జనవరి 31న వాలంటరీ రిటైర్‌మెంట్ ప్రకటించారు. పార్టీలో రెండు నెలల నుంచి మాత్రమే చురుగా>్గ ఉన్నారు. రాజోలు అభ్యర్థి దేవ వరప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించకున్నా ప్రచారం చేస్తున్నారు.
ఈయన పార్టీలో చేరి రెండేళ్లు కావస్తున్నా స్థానికంగా పెద్దగా పరిచయాలు లేవు. స్థానికంగా రాపాక రమేష్‌బాబు, బొంతు రాజేశ్వరరావు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. వీరిద్దరికీ పార్టీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. అమలాపురం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఉన్న డి.ఎం.ఆర్.శేఖర్, బీసీ నేత, శెట్టిబలిజ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణలనూ పవన్ పక్కనపెట్టారు.
గత ఎన్నికలలో బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేశారు. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ, బండారు శ్రీనివాసరావు, పోలిశెట్టి చంద్రశేఖర్‌కూ పవన్ ఝలక్ ఇచ్చారు. వీరి భవిష్యత్తుపై పవన్ నుంచి ఎలాంటి హామీ లేదని సమాచారం. దీంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు కరివేపాకులా తీసిపడేశారని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో జనసేనకు 29శాతం ఓటింగ్ వచ్చినా పవన్ కేవలం రెండుస్థానాలతో సరిపెట్టుకోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment