జనసేన, టీడీపీ నేతల పోటాపోటీ పోస్టులు
పవన్‌కి పదవులు లెక్క కాదంటూ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు పోస్టు
లోకేష్‌పై జనసైనికుల సెటైరికల్ రీల్స్
ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం కూటమి ధర్మమంటూ కామెంట్లు
లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, భీమవరం: మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు అందుకున్న రాగం కూటమిలో కుంపటి రాజేసింది. తమ నాయకుడి ప్రాధాన్యతను తగ్గించేందుకు టీడీపీ కూటమి ధర్మాన్ని కాలరాస్తోందని జన సైనికులు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆ రెండు పారీ్టల అధిష్టానాలు ప్రకటించినా తగ్గేదే లేదంటూ సోషల్ మీడియా వేదికగా పోటాపోటీగా పోస్టులు పెట్టుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో జనసేన.. ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకులలో టీడీపీ పోటీ చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కారణమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమ అధినేత సీఎం కావాలని జనసేన పార్టీ కేడర్ ఆశించింది.
వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టినా రాష్ట్రానికి ఒక్కరే డిప్యూటీ సీఎం కదా అని కేడర్ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రచారానికి తెరలేపడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు పారీ్టల అధిష్టానాల సూచనల నేపథ్యంలో పబ్లిక్‌గా ఎవరూ స్టేట్‌మెంట్లు ఇవ్వకపోయినప్పటికీ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ టాపిక్ పైనే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
పవన్ ప్రాధాన్యం తగ్గించేందుకే..
దీనిపై జనసేన కేడర్ రకరకాల పోస్టులు, కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. కూటమిలో పవన్ ప్రాధాన్యతను తగ్గించేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి గెలుపులో ఆయన పాత్రని అప్పుడే మీరు మర్చిపోయారా అని ఒకరు పోస్టు పెట్టగా, డిప్యూటీ సీఎంగా లోకేష్ ఓకే.. పవన్‌కల్యాణ్‌ని సీఎం చేస్తారంటూ ఒక నెటిజన్ పోస్టు చేశారు. టీడీపీ ప్లాన్‌లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారంటూ, ఈ ఎనిమిది నెలల్లో విద్యా శాఖ, ఐటీ శాఖల్లో వచ్చిన అభివృద్ధి ఏమిటి తమ్ముళ్లూ.. అన్ని ప్రశి్నస్తూ ఒకరు, కూటమి ధర్మం ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం.. ఇది పాటించండి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మంత్రి లోకేష్‌పై సెటైరికల్‌గా రీల్స్ పోస్టు చేస్తున్నారు.
పవన్‌కు పదవులు లెక్క కాదు ..
నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీని చిన్నచూపు చూస్తున్నారని, నీటి సంఘాల నియామకాల్లో టీడీపీ ఒంటెద్దు పోకడగా వ్యవహరించిందని ఇటీవల ఒక సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి ఈ టాపిక్ పైనా ఓ పోస్టు పెట్టారు. మళ్లీ చెబుతున్నాం.. పదవులు మీకు గొప్ప.. ఆయనకు కాదు.. పదవి ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా ఆయనకేం ఊడదు.. అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఉండి నియోజకవర్గానికి చెందిన ఒక పొలిటికల్ వాట్సప్ గ్రూపులో ఆయన పేరిట వచ్చిన పోస్టు వైరల్ అవుతోంది. పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
లోకేష్ కు మద్దతుగా టీడీపీ కేడర్
ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లోని టీడీపీ, జనసేన పారీ్టల పేరిట, పవన్ కల్యాణ్, లోకేష్ అభిమానుల పేరిట ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు, లోకల్ వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. యువగళం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని కొందరు కోరితే, డిప్యూటీ సీఎంగా చేస్తే తప్పేంటని కొందరు, సీఎం చేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment