సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : నమ్మకద్రోహం, వెన్నుపోట్లకు పేటెంట్‌దారుడైన చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నిసీట్లు విసిరేసినా మహద్భాగ్యంగా స్వీకరించడానికి జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నా, ఆ పార్టీలోని ఆశావహులు, హరిరామజోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిరా అంటున్నారనేందుకు వారి నిత్యాభిప్రాయాలే నిదర్శనం. సీఎం పదవిలో పవన్ షేర్ దక్కించుకోవాలంటే అందుకు తగిన సంఖ్యలో పొత్తులో సీట్లు పొందాల్సిందేనని పట్టు పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం.. పొత్తు ధర్మం కోసం.. అనే ‘ప్యాక్డ్’ పదాలను పక్కన పెట్టాల్సిందేనని పవన్‌కు స్పష్టం చేస్తున్నారు.
తమకు ప్రధాన పట్టు ఇక్కడేనని భావిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లను డిమాండ్ చేస్తున్న పవన్ బృందాన్ని ఆ జిల్లాల్లోనే దెబ్బ తీయాలనేది బాబు తాజా ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకుగాను పక్కా వ్యూహంతో కొణిదెల ఫ్యామిలీ రాజకీయ ఓటములను తెరపైకి తీసుకొస్తున్నారనేది సమాచారం. ఇందులో భాగంగా ‘ఆ నలుగురూ కుటుంబ సభ్యులే.
అందులో ముగ్గురు స్వయానా అన్నదమ్ములే. అయిదు చోట్ల పోటీ చేయగా గెలిచింది ఒక్క చోటే. ఒకేఒక్కడు. తక్కిన ఇద్దరిదీ మూడో స్థానమే. ఈ విషయాన్నే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అనే సూచనలు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు చేరాయి. ప్రధానంగా టికెట్లు ఎక్కువగా ఆశిస్తున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాప కింద నీరులా ప్రచారం కొనసాగించే బాధ్యతలను తన నమ్మకస్తులకు బాబు అప్పగించారనేది విశ్వసనీయ సమాచారం.
ఆ ముగ్గురికీ తప్పని ఘోర పరాజయం
టప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొణిదెల చిరంజీవి 2009 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి, తిరుపతిలో మాత్రమే గెలుపొందారు. పాలకొల్లు నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో 5,446 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
♦ జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీపడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్లతో ఓడిపోయారు. గాజువాక నుంచి కూడా బరిలోకి దిగిన పవన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు.
♦ వీరిద్దరికీ స్వయానా సోదరుడైన కె.నాగబాబు 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి మూడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దే పనిలో జిల్లాల పర్యటనల్లో నిమగ్నమయ్యారు.
♦ ప్రజారాజ్యం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా చలామణి అయిన, చిరంజీవికి స్వయానా బావ అయిన అల్లు అరవింద్ 2009 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, మూడో స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఇప్పుడిదే ప్రచారాస్త్రం
అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ప్రజారాజ్యం, జనసేనలను స్థాపించి వారి సొంత జిల్లాలోని నరసాపురం లోక్‌సభ పరిధిలోనే పోటీ చేసి ఓడిపోయారు. పాలకొల్లు నుంచి చిరంజీవి, భీమవరం నుంచి పవన్, నరసాపురం లోక్‌సభ నుంచి నాగబాబుల ఓటమిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది టీడీపీ అధిష్టానం తాజా వ్యూహం.
తద్వారా జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్యను భారీగా తగ్గించవచ్చనే అంచనాలో బాబు అండ్ కో ఉందని తెలుస్తోంది. బీజేపీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లాలనేది బాబు తపన. పొత్తు కోసం ప్రణమిల్లిన బాబు బీజేపీ అడిగినన్ని సీట్లను కేటాయించక తప్పని స్థితి.
మరోవైపు జనసేన 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను ముప్పావు వంతుకన్నా తక్కువ చేయాలనేది బాబు బృందం ఆలోచన. వీటన్నింటి నేపథ్యంలో జనసేనకు సీట్లను తగ్గించాలంటే కొణిదల సోదరుల ఓటములను 70 ఎంఎం స్కోప్‌లో చూపి రాజకీయంగా, మానసికంగా పైచేయి సాధించాలనే వ్యూహానికి బాబు పదును పెట్టినట్లు తెలిసింది.
ఇక్కడా వెన్నుపోటుకే మొగ్గు
తాము పోటీ చేసి తీరుతామని టీడీపీలోని ఆశావహులు గట్టిగానే చెబుతున్నారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే 10 నుంచి 12.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఏడెనిమిది సీట్లను జనసేన ఆశిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతకంటే తక్కువ స్థానాలకు అంగీకరించకూడదనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్న తమను పక్కనపెట్టి పొత్తు ధర్మం పేరిట జనసేనకు సీట్లు ఇచ్చేస్తామంటే అంగీకరించేది లేదనే ధిక్కార స్వరం టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది.
ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సీనియర్లు విభిన్న పద్దతుల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, బుద్దా వెంకన్న లాంటివారు ఆయా స్థానాల టిక్కెట్లను ఆశిస్తున్నారు.
ఈ పరిస్థితిలో చంద్రబాబు జనసేనకు వెన్నుపోటే ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకున్నారని తెలియవచ్చింది. ఆనాడు ఈనాడులో ‘జెండా పీకేస్తున్నారు’ అంటూ ‘ప్రజారాజ్యం’పై అచ్చేయించిన రీతిలోనే కొణిదెల బ్రదర్స్ ఓటమిని హైలైట్ చేయడమే బెస్ట్ అనే నిర్ణయానికి తమ అధినేత వచ్చారని, ఆ పనిలో తాము నిమగ్నమయ్యామని సీనియర్ నేత ఒకరు లోగుట్టు విప్పారు.
నమ్మకం నిలుపుకోవడం కత్తిమీద సామే
కొణిదెల బ్రదర్స్‌పై నెగటివ్ ప్రచారం చేయాలనుకోవడం నిజం కాదనడానికి వీల్లేదని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జనసేనకు నమ్మకం కలగాలంటే వారు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, కనీసం ముప్పావు వంతుకు పైగా అయినా సర్దుబాటు చేయక తప్పదని అన్నారు.
మరోవైపు పొత్తు కోసం పాకులాడుతున్నందున బీజేపీకి కూడా వారు కోరిన మేరకు సీట్లు ఇవ్వాలని, ఇప్పుడు బాస్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో తెల్లారిపోయింది..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం చవి చూసింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు అన్నిచోట్లా ఓడిపోవడమే కాదు.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
కూకట్‌పల్లిలో పోటీ చేసిన ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు దక్కాయి. తక్కిన ఏడుగురు అభ్యర్థులకు కలిపి 15 వేల ఓట్లకులోపే రావడమంటే.. సగటున ఒక్కో అభ్యర్థికి సగటున రెండు వేల ఓట్లు దక్కాయన్నమాట. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధిష్టానం ప్రజల్లోకి తీసుకెళ్లమంటోందని వినికిడి.
Comments
Please login to add a commentAdd a comment