సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!
వాళ్లు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. తమకు ఒక బిడ్డే ఉండటంతో సరొగసీ పద్ధతి ద్వారా మరోబిడ్డ కావాలనుకున్నారు. భారతదేశంలో అయితే చవగ్గా వీలవుతుందని భావించి.. ఇక్కడకు వచ్చారు. సరొగేట్ తల్లికి ఇద్దరు పండంటి బిడ్డలు పుట్టారు. వాళ్లలో ఒకళ్లు బాబు, మరొకళ్లు పాప. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం తమకు అమ్మాయి వద్దు, అబ్బాయి మాత్రమే కావాలని మంకుపట్టు పట్టారు. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలని భారతదేశంలో ఉన్న ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం అధికారులు వాళ్లకు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు. కేవలం లింగ వివక్ష కారణంగానే ఆ జంట తమ సరొగేట్ పాపను భారతదేశంలో వదిలిపెట్టేసినట్లు ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆ దేశంలోని ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది.
పిల్లలిద్దరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని చెప్పి.. కొన్నాళ్లు వీసా ఇవ్వడం కూడా ఆలస్యం చేసినా ఫలితం దక్కలేదు. ఆ జంటకు అప్పటికే ఒక బిడ్డ ఉంది. మరో బిడ్డ కావాలని సరొగసీ కోసం వచ్చారు. కానీ పుట్టిన ఇద్దరు పిల్లల్లో కేవలం మగ పిల్లాడిని మాత్రమే తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఇలాంటి కేసులపై గట్టి విచారణ జరిపించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు నిర్ణయించింది. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం.. తాము ఒక బిడ్డ సరిపోతుందని అనుకున్నామని, కానీ కవలలు పుట్టడంతో తమకు ఒకళ్లు చాలనుకుని మగ పిల్లాడిని తీసుకెళ్లామని అంటున్నారు. అప్పటికే తమకు ఒక పాప ఉండటంతో బాబును తీసుకెళ్లామన్నారు.