Male baby
-
పట్టించిన ప్రకటన..
సాక్షి, సిటీబ్యూరో: నీలోఫర్ ఆస్పత్రి నుంచి శిశువును కిడ్నాప్ చేసి, ఆ శిశువు మరణానికి కారణమైన కేసులో నిందితురాలు సత్తూరి మంజుల పోలీసుల చిక్కడానికి ఓ ఆటో వెనుక ఉన్న ప్రకటన కీలకంగా మారింది. దీని ఆధారంగా సదరు ఆటోడ్రైవర్‌ను గుర్తించిన అధికారులు అతడు చెప్పిన వివరాలతో బండరోనిపల్లిలో గాలించారు. అక్కడ దొరికిన వివరాలతో రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌లో నిందితురాలిని పట్టుకోగలిగారు. ఈ కేసు దర్యాప్తుపై సాగిందిలా.... గర్భస్రావం విషయం దాచి... మహబూబాబాద్ జిల్లా కె.సముద్రానికి చెందిన మంజుల, బండరోనిపల్లికి చెందిన కుమార్ గౌడ్ హైదరాబాద్ కాటేదాన్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పని చేస్తున్నారు. కుమార్ మూడేళ్ల క్రితం మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటిసారి గర్భందాల్చిన మంజులకు మూడో నెలలోనే గర్భస్రావమైంది. ఈ ఏడాది రెండోసారి గర్భందాల్చగా... ఐదున్నర నెలలకు అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని భర్త, కుటుంబీకులకు చెప్పకుండా దాచిన మంజుల తనకు తొమ్మిదో నెల వచ్చే వరకు మేనేజ్ చేసింది. ఆపై శనివారం ప్రసవం కోసం వెళ్తున్నానంటూ భర్తకు చెప్పి అతడిని ఆదివారం రమ్మంటూ పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. మూడో నెలలో గర్భవతి కార్డు కోసం, ఆపై మరోసారి వైద్య పరీక్షలకు ఆస్పత్రికి వచ్చిన మంజులకు దీనిపై అవగాహన ఉంది. శనివారం ఆస్పత్రి వరకు చేరుకున్న మంజుల తొలుత ఎవరైనా శిశువులను ఇస్తారేమోనని ప్రయత్నించి విఫలమైంది. ఆ రోజు అన్ని వార్డుల్లో కలియదిరిగినా ఫలితం లేకపోవడంతో రాత్రికి అక్కడే నిద్రించింది. ఆటో... బస్సు... బైక్‌పై ప్రయాణం... నగరంలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. పొత్తికడుపు సంబంధిత సమస్యతో బా«ధపడుతున్న శిశువును ఆదివారం నీలోఫర్ ఆస్పత్రికి పంపాలని పేట్లబురుజు ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. అయితే శిశువు వెంట నిర్మలను తీసుకువెళ్ళడం సాధ్యం కాకపోవడంతో ఆమె తల్లి కల్పన ఆయా కోసం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆయాగా వారికి పరిచయమైన మంజుల సహాయం చేస్తున్నట్లు నటిస్తూ నీలోఫర్ వరకు వెళ్ళింది. ఆపై అదును చూసుకుని శిశువును తీసుకుని ఆటోలో ఉడాయించింది. ఆటోలో లక్డీకాపూల్‌లోని సంధ్య హోటల్ వరకు వెళ్లిన మంజుల అక్కడి నుంచి బస్సులో అఫ్జల్‌గంజ్, అటునుంచి పేట్లబురుజు ఆస్పత్రికి చేరుకుంది. అప్పటికే ఆమె భర్త కుమార్‌గౌడ్ అక్కడకు రావడంతో అతడితో కలిసి బైక్‌పై బండరోనిపల్లికి బయలుదేరింది. ఆమన్‌గల్ సమీపంలో బైక్ పంక్చర్ కావడంతో కుమార్ తన భార్య, శిశువును బస్సులో పంపించాడు. ఆటోడ్రైవర్ కీలక సమాచారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. మంజుల శిశువుతో సహా ఓ ఆటో ఎక్కినట్లు కనిపించడంతో దాని నెంబర్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే ఆ ఆటో వెనుక వైపు ఓ వ్యాపార ప్రకటన ఉండటంతో దానిపై ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని సంప్రదించారు. ముందే ఉన్న ఓ ప్రకటనపై మీ ప్రకటన అతికించినట్లు పోలీసులు చెప్పడంతో తాము కేవలం రెండు ఆటోలకే అతికించామంటూ వారు వివరాలు చెప్పారు. ఆ ఇద్దరు ఆటోడ్రైవర్లను గుర్తించి ప్రశ్నించగా.. ఓ వ్యక్తి సదరు మహిళను లక్డీకాపూల్‌లోని సంధ్య హోటల్ వరకు తీసుకువెళ్ళానని, ఆమెది కల్వకుర్తి ప్రాంతంగా చెప్పినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు కల్వకుర్తి, ఆమన్‌గల్, వెల్దండ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అనుమానితురాలి ఫొటోతో స్థానికులను ఆరా తీశారు, మంగళవారం సాయంత్రం బండరోనిపల్లికి వెళ్లి ఆరా తీయగా గ్రామానికి చెందిన వృద్ధుడు ఆమెను కుమార్ భార్య మంజులగా గుర్తించాడు. కాటేదాన్‌లో చిక్కిన కిడ్నాపర్ మంజుల.. రెండు రోజుల క్రితమే మంజుల ప్రసవించిందని, సోమవారం తెల్లవారుజామున శిశువు మరణించడంతో ఖననం చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు చెప్పాడు. దీంతో కుమార్ కోసం ఆరా తీయగా.. ఎవరూ స్పష్టమైన చిరునామా చెప్పలేకపోయారు. నేరచరితుడైన అతడికి ఊరంతా దూరంగా ఉంటుందని తేలింది. చివరకు అతడి సోదరుడి వివరాలు తెలియడంతో నగరంలో పట్టుకున్న పోలీసులు కుమార్ మొదటి భార్య చిరునామా సేకరించారు. ఆమె ద్వారా కుమార్, మంజుల ఇంటిని గుర్తించి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కుటుంబీకులను ఏమార్చడానికి తానే శిశువును కిడ్నాప్ చేశానని, సోమవారం తెల్లవారుజామున మరణించడంతో ఖననం చేసినట్లు అంగీకరించడంతో కేసు కొలిక్కి వచ్చింది. నిందితురాలి రిమాండ్ నాంపల్లి: నీలోఫర్ ఆసుపత్రిలో మగ శిశువును కిడ్నాప్ చేసిన మహిళ మంజులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖనంనం చేసి శిశువు మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు మండల మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితురాలిపై ఐపీసీ 363, 304, 201, 75, 84 జెజె, 3(2),(5),(5ఎ),లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ తెలిపారు. -
ఆ పేరుతో మీకేం నొప్పి: సీనియర్ నటుడు
ముంబయి: బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ తమ పండంటి బిడ్డకు పెట్టిన పేరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కరీనాకపూర్ బాబాయి, సీనియర్ నటుడు రిషి కపూర్ సీరియస్ గా స్పందించారు. గత మంగళవారం కరీనాకపూర్ జన్మనిచ్చిన బాబుకు తైమూర్ అలీఖాన్ పటౌడీ అని పేరు పెడితే మీకేమయ్యింది అంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తంచేశారు. విమర్శిస్తున్న వారిని టార్గెట్ చేసుకుని.. అసలు మీరేవరూ చెప్పడానికి, వారి పిల్లాడికి ఆ తల్లిదండ్రులు వారికి నచ్చిన పేరు పెట్టే అవకాశం ఉందని వరుస ట్వీట్లు చేశారు. 'మీకు పుట్టిన పిల్లలకు ఈ జంట పేరు పెట్టలేదుగా ఆసలు ఈ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. చరిత్రలో మనకు తెలిసి అలెగ్జాండర్, సికందర్ అనే వ్యక్తులు ఆధ్యాత్మిక గురువులేం కాదు. అయినా ప్రపంచంలో ఎంతోమంది తమ పిల్లలకు ఆ పేర్లు పెడుతున్నారు. అదేవిధంగా సైఫీనా దంపతులు వారి బిడ్డకు తైమూర్ అని నామకరణం చేశారు. ఇలా చేస్తే మీకు ఏం నొప్పి వచ్చింది' అంటూ వరుస ట్వీట్లలో రిషికపూర్ తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. కాగా, 14 వ శతాబ్దంలో ఢిల్లీపైకి దండెత్తి వచ్చిన తైమూరు ఇక్కడ సర్వనాశనం చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఎంతో మంది ఈ పేరుతో ఉన్నారని.. అనవసర కామెంట్లు, విమర్శలు చేయకుండా ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదంటూ రిషికపూర్ మండిపడ్డారు. Why are people so bothered what the parents want to name their child please?Mind your business,it's got nothing to do with you.Parents wish! — Rishi Kapoor (@chintskap) 21 December 2016 Alexander and Sikandar were no saints. They are common names in the world. Apna kaam karo na tum. Tumko kya takleef hai? https://t.co/lT2i5U1Qod — Rishi Kapoor (@chintskap) 21 December 2016 -
చిన్న నవాబ్ వచ్చేశాడు
మంగళవారం సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లకు జీవితంలో మరచిపోలేని రోజు. ఈ ఏడాది వాళ్లకు తీపి గుర్తుగా నిలిచిపో తుంది. 20న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పటల్లో కరీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ‘‘మాకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ భార్యాభర్తలిద్దరూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. బుడతడి పేరు కూడా ప్రకటించారు. ‘‘మా అబ్బాయికి ‘తైముర్ అలీఖాన్ పటౌడీ అని పేరు పెట్టాం’’ అన్నారు. ఛోటా నవాబ్ పుట్టిన వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు సైఫ్–కరీనాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు’’ అని సైఫ్ చెల్లెలు సోహా అలీఖాన్ పేర్కొన్నారు. -
ఎవరా లేడీ కిలాడీ!
పది రోజులుగా ప్రసూతి విభాగంలోనే మకాం పక్కా ప్రణాళికతో మగ శిశువు అపహరణ సెక్యూరిటీ వైఫల్యంపై రాజకీయ పక్షాల మండిపాటు సబ్‌కలెక్టర్‌ను ఘెరావ్ చేసిన మహిళా సంఘాలు ఐదు గంటల పాటు ఆస్పత్రిలోనే బైఠాయించిన వంగవీటి రాధాకృష్ణ ఆస్పత్రి సిబ్బందిని ‘బావ..’ అని పిలుస్తూ పరిచయం చేసుకుంది.. అప్పుడే పుట్టిన చిన్నారులను ముద్దాడుతూ పండంటి బిడ్డ పుట్టాడనే పొగడ్తలతో రోగులకు దగ్గరైంది.. ఇలా పది రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ తన మాయమాటలతో సిబ్బంది, రోగులను పరిచయం చేసుకుంది.. అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ పరిశీలించింది. అదును చూసి ప్రజలు, సందర్శకుల నిషేధిత ప్రాంతమైన ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిని అందరి కళ్లుగప్పి అపహరించుకుపోయింది.. 30 నుంచి 35 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఎవరనే దానిపై ఇప్పుడు పోలీసులతో పాటు అందరూ దృష్టి సారించారు. విజయవాడ (లబ్బీపేట) : విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని పోతిన వారి వీధికి చెందిన ఐతా సుబ్రహ్మణ్యం, కళ్యాణి దంపతుల ఐదు రోజుల మగ శిశువు అపహరణ పక్కా ప్లాన్‌తో జరిగినట్లు ప్రభుత్వాస్పత్రి సిబ్బందే చెపుతున్నారు. అప్పుడే శిశువుకు పాలు పట్టించి, టిఫిన్ చేసేందుకు వెళ్లిన కళ్యాణిని గమనించిన ఆ కిలాడీ లేడీ అదును చూసి శిశువును అపహరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎస్ఎన్సీయూ వద్ద సెక్యూరిటీ గార్డు కూడా లేడని సమాచారం. టిఫిన్ చేసి పది నిమిషాల్లో ఎన్ఐసీయూలోకి వెళ్లిన కళ్యాణికి తన బిడ్డ కనిపించలేదు. నిషేధిత ప్రాంతంలో అపహరణ ఎలా... ప్రత్యేక నవజాత శిశు చికిత్సా విభాగం నిషేధిత ప్రాంతంగా ఉంది. అక్కడ శిశువులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించారు. రోజులో ఒక్కసారి మాత్రమే తల్లిని అనుమతిస్తారు. అలాంటి వార్డులో శిశువు అపహరణకు గురవడాన్ని పలు రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులతో పాటు, సబ్‌కలెక్టర్ కూడా తప్పుబట్టారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వాస్పత్రిలో భద్రత ఎలా ఉందో అర్థమవుతుందని ఆరోపిస్తున్నారు. సబ్ కలెక్టర్ ఘెరావ్ ప్రభుత్వాస్పత్రిలో ఘటన జరిగిన వెంటనే ప్రాథమిక విచారణకు వచ్చిన సబ్‌కలెక్టర్‌ను మహిళా సంఘాలు ఘెరావ్ చేశాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సృజన వారితో మాట్లాడుతూ అపహరణకు గురైన బిడ్డను తిరిగి అప్పగిస్తామని, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బందిని విచారించిన పోలీసులు శిశువు అపహరణకు గురైన సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న సిబ్బందితో పాటు, సెక్యురిటీ గార్డులను పోలీసులు ఆస్పత్రిలోనే విచారించారు. ఈ సందర్భంగా ఎస్ఎన్సీయూ వద్ద ఉన్న సెక్యురిటీ గార్డులో ఆ కిలాడీ లేడీ సన్నిహితంగా ఉండేదని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శిశువు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ ఆచూకీ ఎప్పటికి లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో తమ బిడ్డ ఆచూకీ చెప్పండంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేస్తోంది. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ సుబ్బారావు ఆస్పత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : పూనం మాలకొండయ్య ప్రభుత్వాస్పత్రిలోని ఎస్ఎన్సీయూ విభాగంలో శిశువు అపహరణ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనమ్ మాలకొండయ్య అన్నారు. ఆమె గురువారం రాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శిశువు తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. బిడ్డ క్లూ తమకు దొరికిందని ఆమె వివరించారు. -
మగశిశువు మృతిపై బాధితుల ఆందోళన
► ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి నిలదీత ► ప్ పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం అచ్చంపేట రూరల్ : వైద్యుల నిరక్ష్యం వల్లే మగశిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 3వ తేదీ సాయంత్రం ఉప్పునుంతలకు చెందిన కళావతికి పురిటినొప్పులు రావడంతో భర్త కృష్ణయ్య అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు ఆపరేషన్ చేసి మగశిశువును బయటకు తీసి తల్లికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిని చూడాలని పక్కనే ఉన్న చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రామకృష్ణకు సూచించారు. అదేరోజు పట్టణంలోని ఎంఎంఆర్ ప్రైవేట్ ఆస్పత్రిలో మగశిశువును చేర్చుకుని పరీక్షించిన తర్వాత హైదరాబాద్‌లోని నిలోఫర్ కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మగశిశువు మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన బాధితులు సాయంత్రం ఇక్కడి ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి కొద్దిసేపు ఆందోళనకు దిగారు. శిశువు ఆరోగ్య పరిస్థితి తెలపకముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేశారని డాక్టర్ రామకృష్ణను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మంగళవారం ఎస్పీహెచ్ఓతో మాట్లాడి న్యాయం చేస్తామడంతో వారు శాంతించి వెనుదిరిగారు. ఈ విషయమై డాక్టర్ రామకృష్ణను వివరణ కోరగా మగశిశువును పరీక్షించిన వెంటనే మెరుగైన వైద్యంకోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించామన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం లేదన్నారు. -
బాల భీముడు!
మోతీనగర్: పురిటి నొప్పులు రాలేదని 41 వారాలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్న ఓ గర్భిణి ఎట్టకేలకు శనివారం సాధారణ ప్రసవంలోనే 5.7 కిలోల బరువున్న మగ శిశువు జన్మనిచ్చింది. పద్మప్రియ ఆసుపత్రిలో శనివారం ఈ అరుదైన ఘటన జరిగిం ది. ఆసుపత్రి గైనకాలజిస్ట్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌కు చెందిన రేష్మాబేగం ప్రసవ సమయం అయినప్పటికీ నొప్పులు రావడం లేదని 41 వారాల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. సాధారణంగా గర్భిణిలకు 37 నుంచి 39 వారాల మధ్య ప్రసవం అవుతుంది. 41 వారాలైనా పురిటి నొప్పులు రాకపోవడంతో రేష్మాబేగం శని వారం పద్మప్రియ హాస్పిటల్లో చేరింది. వైద్యురాలు పద్మావతి ఆమెకు పరీక్షలు నిర్వహించగా రేష్మా కడుపులో 5.7 కిలోల బరు వు ఉన్న బిడ్డ ఉన్నట్లు తెలిసింది. వెంటనే డెలవరీ కోసం ఏర్పాట్లు చేసి వైద్యురాలు సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకున్నారు. రేష్మాకు 5.7 కిలోల బరువు ఉన్న బాబు పుట్టాడు. దీంతో కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
మగశిశువు విక్రయం !
నెక్కొండ : రూ.10 వేలకు తొమ్మిది రోజుల మగశిశువును తల్లి విక్రయించిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నాగారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కడారి ఎల్లమ్మ కూతురు హైమకు పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన బిర్రు ఎలియాతో వివాహమైంది. భార్యభర్తల గొడవ కారణంగా కొద్దిరోజులుగా హైమ తల్లి వద్దనే ఉంటోంది. హైమ ఇటీవల నాలుగో సంతానంగా మగ శిశువుకు జన్మనిచ్చింది. భర్తకు దూరంగా జీవిస్తున్న తనకు నాలుగో బిడ్డను పెంచడం భారమవుతుందని భావించింది. ఈ క్రమంలో నాగారం గ్రామానికే చెందిన దంపతుల గమనించి.. బిడ్డను పర్వతగిరి మండలంలోని చౌటపల్లికి చెందిన పోతరాజు మహేందర్ దంపతులకు ఇవ్వమని కోరారు. హైమ అంగీకరించడంతో మహేందర్ రూ.10 వేలు ఇచ్చి శిశువును తీసుకెళ్లాడు. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో వారు 1098 చైల్డ్‌లైన్ సిబ్బందికి, పోలీసులకు సమాచారమివ్వడం.. వారు వచ్చి హైమకు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారికి, బిడ్డను తీసుకెళ్లిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!
వాళ్లు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. తమకు ఒక బిడ్డే ఉండటంతో సరొగసీ పద్ధతి ద్వారా మరోబిడ్డ కావాలనుకున్నారు. భారతదేశంలో అయితే చవగ్గా వీలవుతుందని భావించి.. ఇక్కడకు వచ్చారు. సరొగేట్ తల్లికి ఇద్దరు పండంటి బిడ్డలు పుట్టారు. వాళ్లలో ఒకళ్లు బాబు, మరొకళ్లు పాప. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం తమకు అమ్మాయి వద్దు, అబ్బాయి మాత్రమే కావాలని మంకుపట్టు పట్టారు. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలని భారతదేశంలో ఉన్న ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం అధికారులు వాళ్లకు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు. కేవలం లింగ వివక్ష కారణంగానే ఆ జంట తమ సరొగేట్ పాపను భారతదేశంలో వదిలిపెట్టేసినట్లు ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆ దేశంలోని ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది. పిల్లలిద్దరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని చెప్పి.. కొన్నాళ్లు వీసా ఇవ్వడం కూడా ఆలస్యం చేసినా ఫలితం దక్కలేదు. ఆ జంటకు అప్పటికే ఒక బిడ్డ ఉంది. మరో బిడ్డ కావాలని సరొగసీ కోసం వచ్చారు. కానీ పుట్టిన ఇద్దరు పిల్లల్లో కేవలం మగ పిల్లాడిని మాత్రమే తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఇలాంటి కేసులపై గట్టి విచారణ జరిపించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు నిర్ణయించింది. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం.. తాము ఒక బిడ్డ సరిపోతుందని అనుకున్నామని, కానీ కవలలు పుట్టడంతో తమకు ఒకళ్లు చాలనుకుని మగ పిల్లాడిని తీసుకెళ్లామని అంటున్నారు. అప్పటికే తమకు ఒక పాప ఉండటంతో బాబును తీసుకెళ్లామన్నారు. -
ఏతల్లి.. కన్నబిడ్డో!
ఘట్కేసర్: రైలులో ఓ మగశిశువు లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం ఘట్కేసర్లో వెలుగుచూసింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కాచిగూడ నుంచి తెనాలి-కాచిగూడ ప్యాసింజర్ తెనాలికి బయలుదేరింది. 11 గంటల సమయంలో ఓ బోగీలోని బాత్రూమ్ సమీపంలో సంచిలోంచి శిశువు రోదనలు వినిపించాయి. రైలు చర్లపల్లి దాటిన తర్వాత ప్రయాణికులు గమనించారు. సంచిలో చూడగా దుస్తువులో చుట్టి ఓ మగశిశువు ఉన్నాడు. అప్పటికే రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు రైలు చైన్ లాగి స్టేషన్ మాస్టర్‌కు విషయం తెలిపారు. స్టేషన్‌మాస్టర్ సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. శిశువును వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పసికందు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువు జన్మించి దాదాపు 15 రోజులు అవుతుండొచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. అనంతరం 108 సిబ్బంది ఈఎమ్‌టీ నాగరాజ్, పెలైట్ బద్రూలు పసికందును తీసుకెళ్లి యూసుఫ్‌గూలోని శిశువిహార్‌లో పసికందును అప్పగించారు. ఏతల్లి కన్న బిడ్డో.. ఇలా కర్కషంగా పడేసి వెళ్లారని ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా శిశువును రైలులో వదిలేసి వెళ్లిపోయారని స్థానికులు చెప్పారు.